కొంపెల్ల జనార్ధనరావు - అచ్చంగా తెలుగు

కొంపెల్ల జనార్ధనరావు

Share This
కొంపెల్ల జనార్దనరావు (15-4-1906 – 23-7-1937) 

వ్యాసకర్త: కొంపెల్ల శర్మ

కొంపెల్ల
మన తెలుగుజాతికి వరం – మహాప్రస్థాన సమరం ఎలిజీ, అంకితాలతో – కొం.జ.రావు అమరం. (శ్రీశ్రీ)
కాలాన్ని జయించిన కవిత్వం శ్రీశ్రీ దైతే, ఆధునిక సాహిత్యాన్ని మలుపు తిప్పిన మహాకావ్యం ‘మహాప్రస్థానం’.  ఆ కావ్యాన్ని అంకితం పొందిన శ్రీశ్రీ ప్రాణమిత్రుడు, ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు, ‘ఉదయిని’ పత్రికా సంపాదకుడు అకాలమరణంవాడు పొందిన ‘కొంపెల్ల జనార్దనరావు.

కొంపెల్ల 1906 లో ఏప్రిల్ 15 న తూర్పు గోదావరి జిల్లా, మోడేకుర్రు గ్రామంలో జన్మించారు. తనను పట్టి పీడించిన క్షయవ్యాధికి వైద్యం చాలక, డబ్బులేక 1937 లో జూలై  23 న తుది శ్వాస విడిచారు.   
కొంపెల్ల జనార్దనరావు గోదావరీమండలవాసి. సంస్కృతాంధ్రములయందు ప్రవేశం. ఉదయని పత్రికాసంపాదకత్వం. రచనలు – గ్రంథంరూపం దాల్చని లఘుకృతులు.
జనార్దన రథ చక్రాలు
“శైలియందు సార్థకత కంటె సమాస తత్పరత ఎక్కువ గోచరించుచున్నది.”  “తెనుగు వాడకము చాలా తక్కువగా ఉన్నది.” “భావములకును భాషకును సామరస్యము సంధించుట ఇంకను ప్రయత్నింపదగును.” – అంటూ మహాకవి శ్రీశ్రీ తొలి ఖండకావ్యం ‘ప్రభ’ను సమీక్షించి, అది సరియైనదేనని శ్రీశ్రీయే అంగీకరించిన గొప్ప సాహిత్య విమర్శకుడు కొంపెల్ల జనార్ధనరావు కవి, పండితుడు, కథకుడు, నాటక రచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, పత్రికా సంపాదకుడు.
కొంపెల్ల జనార్ధనరావు అకాల మరణానికి అతి తీవ్రంగా చలించిపోయిన శ్రీశ్రీ ఓ గొప్ప సంచలనాత్మకమైన ‘ఎలిజీ’ వ్రాసి, మరనమేలేని తన ఆధునిక తెలుగు మహాకావ్యమ్ ‘మహాప్రస్థానం’ అంకితమిచ్చి తన ప్రాణమిత్రుడికి ప్రాణం పోశారు. కొంపెల్లను తెలుగు సాహిత్యంలో అమరున్ని చేశారు. ప్రపంచ సాహిత్యంలో ఎన్నయినా ఎలిజీ పర్వతాలుండవచ్చు గాక, కాని ఎవరెస్టు శిఖరం మాత్రం శ్రీశ్రీ ఎలిజీ అన్నది సాహిత్య చరిత్ర తెలిపిన సత్యం. 
‘భారతి’ మాస పత్రికకు 1926-1934 మధ్య కాలంలో సంపాదకునిగా పనిచేశారు. ‘ఉదయిని’ పేర సాహిత్య ద్వైమాస పత్రికను 1934 నుంచి 1936 ఆగష్టు దాకా నడిపారు. వివిధ సాహిత్య అంశాలపై విపులంగానూ, నిష్కర్శగానూ ‘కిరణాలు’ పేరున కొంపెల్ల రాసిన సంపాదకీయాలు పేరు పొందాయి. గొప్ప సాహిత్య పత్రికగా పేరొందిన ఈ పత్రికలోనే శ్రీశ్రీ మహాప్రస్థానగీతాలలోని మొదటిగేయం ‘నేను సైతం’ (జయభేరి) గీతం అచ్చయింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆరు సంచికలతో ఉదయిని ఆగిపోయి ఎందఱో సాహితీవేత్తలను నిరుత్సాహపరచింది.

“నేటి తెలుగుభాషలో నేటి భూలోకము ప్రతిఫలించేటట్టు చేయగల తెలుగు రేఖకులున్ను, తెలుగు కవులున్ను అన్యదేశీయులతో తులదూగాగాలవారు తయారవుతున్నారని ఈ పత్రికలు విశదము చేస్తూ ఉన్నవి.” అంటూ ‘ఉదయిని’ పత్రికకు భాషాశాస్త్రవేత్త గిడుగు ఆశీస్సులందించారు.
కొంపెల్ల ఎన్నో పద్యాలు రాశారు. ‘మల్లికపెళ్లి’(నాటకం), ‘స్వర్ణయోగి’, ‘వెలుగు’ ఏకాంకి నాటికలు రాశారు. అన్నిసాహిత్య ప్రక్రియలలోనూ ప్రతిభావంతుడైన కొంపెల్ల, సాహిత్య విమర్శలో దిట్టగా పేరు పొందారు. విరివిగా గ్రంథ సమీక్షలు రాశారు.
శ్రీశ్రీ స్మారక సంస్థ తరఫున ఏటుకూరి ప్రసాద్ సంపాదకత్వంలో వెలువడిన ‘కొంపెల్ల జనార్ధనరావు జీవితం – సాహిత్యం’ (1987) గ్రంథాన్ని మహాకవి శ్రీశ్రీకి అంకితమిచ్చారు.
 “ఎప్పటి కప్పుడు జ్ఞానసంపద హెచ్చించుకుంటూ అతడు సారస్వత రంగంలో అనన్య సామాన్యమైన స్థాయికి చేయి చాచాడు.” “విమర్శకునిగా జనార్దానరావుది మహోన్నతమైన స్థానం”.  “ఆధునిక వాంగ్మయం సరిగా అర్థంచేసుకున్న కొద్దిమందిలో ముఖ్యుడు.” నవీన సాహిత్య రీతులకు రుచివంతమైన అధ్యయనాలను చూపించడానికి సమర్థుడు” అంటూ మహాకవి శ్రీశ్రీ ప్రశంసలు పొందాడు.

ప్రకృతి లాస్యము
సతతనూతనమృదువిలాసప్రభూత / తావక మనోజ్ఞలాస్యసందర్శనమున
నాదు భావాలు మధురగానమ్ముసలిపె / బ్రకృతి! ఆనందతన్మయత్వమున మునిగి.
క్షణములో దు:ఖచయ మెల్ల సమసిపోయె / నెన్నియో లాలసలు హరియించిపోయె
స్మృతులు మెల్ల మెల్లన సొమ్మసిల్లిపోయె . నేయెదుట నిశ్చలత నేన నిలిచిపోతి.
 ఆదయాశీక రాసార, మాపవిత్ర / విశ్వమోహనమైత్రి, ఆప్రేమమధుర
 మంగళాకార, మాతపోమహితముద్ర - / అహహ ఎంతేసి కానుక లబ్బె నాకు!
 నీ జగన్మోహనంబైన నృత్యమందు - / మెప్పు లలసిపో, నేత్రనిమీలనమున
దవ్వులను వినవచ్చె నెంతయు బునీత / విశ్వసందేశతతుల గంభీరరుతులు.
ఎవరికొరకు నీ నాట్యంబు, లీ ప్రపూత / గానసంచారఫణితు లేకాంత కాంత
నృత్యవైదగ్ధ్యమును బ్రసాదించె నీకు? / అనుచు ధ్యానించినా నప్రయత్నముగను.
            ధ్యాన మది గానమైపోయె; దావకీన / ప్రణయసౌభాగ్యమహిమ, నా ప్రశ్నములకు
            నేను చూపట్టితిని సమాధానమునయి / నీవలన నాయనంతత నేర్చికొంటి. (భారతి నుండి)
(తెలుగు కావ్యమాల - సంకలనం : కాటూరి వెంకటేశ్వర రావు; (మూడవ భాగం) సాహిత్య అకాడమీ 1959)
అభ్యుదయ కవిత్వం - పరివర్తన దశ
ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అన్న పరిశోధనా గ్రంథంలోని - అభ్యుదయ కవిత్వం - పరివర్తన దశ అన్న అధ్యాయంలో
డా. సి.నారాయణ రెడ్డి కొంపెల్ల జనార్దనరావు ప్రస్తావన తేవడం జరిగింది.
1928 లో శ్రీశ్రీ కి కొంపెల్ల జనార్దన రావు సహవాస మేర్పడినది. జనార్దనరావు సాహచర్య ఫలితముగా వెనుక తాను వ్రాసిన ’ప్రభవ’లోని పద్యములన్నియు రెండవశ్రేణికి చెందిన ప్రతిధ్వనులని శ్రీశ్రీ నిర్ణయించుకొన్నాడు. అప్పటినుండి క్రొత్తదనముకొరకు కోరిక యీరికలెత్తసాగినది. దాని ఫలితముగా 1929లో ’సుప్తాస్థికలు’ అను కవితాఖండిక వెలువడినది.
"అవి ధరాగర్భమున మానవాస్థిరాపరంపరలు, సుప్తనిశ్శబ్ద సంపుటములు ... అని చలించును తను చర్మకవచమెపుడొ బ్రతికినదినాల తలపోతబరువుతోడ". ఈ పద్యములు శ్రీశ్రీ వ్రాసిన భావకవితా శాఖలో చివరివి. వీనిలో దీర్ఘయామిని, అగమ్యతమో రహస్యాంగణము, నిశాశ్మశానశయ్య నీరనాహ్వానము అను పదచిత్రములు కృష్ణశాస్త్రిగారిని స్ఫురింపజేయును.
కొమర్రాజు వారి సహచరులు - మల్లంపల్లి సోమశేఖర శర్మ (1891 - 1963)
ఆరుద్ర - సమగ్రాంధ్ర సాహిత్యం (నాల్గవ సంపుటి) - కొమర్రాజు వారి సహచరుల్లో పేర్కొనబడినవారిలో - మల్లంపల్లి సోమశేఖర శర్మగారు ఒకరు. కాశీనాథుని నాగేశ్వరరావుగారు శర్మగారి ప్రావీణ్యాన్ని ఎరిగినవారు కాబట్టి వెంటనే తమ భారతి పత్రికలో సంపాదకీయ బాధ్యతలను అప్పచెప్పారు. అవి భావకవిత్వపు ముమ్మరపు రోజులు. మద్రాసులో శర్మగారి నివాసగృహం ఒక అకాడమీలాగ ఉండేది.  అడవి బాపిరాజు, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వేలాల సుబ్బారావు, చావలి బంగారమ్మ, ప్రతివాద భయంకర రంగాచార్యులు, కోలవెన్ను రామకోటేశ్వరరావు, ఖాసా సుబ్బారావు, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, టి.యస్. రామచంద్రన్ , కొంపెల్ల జనార్ధన రావు/  కవులు, చారిత్ర్రక పరిశోధకులూ అక్కడ సమావేశమయ్యేవారు.
నవ్యసాహిత్య పరిషత్తు
తెలుగు సాహితీపరులందరికీ ఒకే ఒక సంస్థ ప్రాతినిథ్యం వహిస్తూ ఉండేది. దాని పేరు ఆంధ్ర సాహిత్య పరిషత్తు. దీనిని జయంతి రామయ్య పంతులుగారు పిఠాపురం మహారాజావారి ఆదరాభిమానాలతో 1911 లో సంస్థాపించారు. ఫ్యూడలు విలువలనూ,  గ్రాంథికాంధ్రాన్నీ సంరక్షించడమే దీని ఆశయం. ఇందులో కరుడుగట్టిన గ్రాంథికవాదులే కాక గురజాడ, గిడుగు మొదలైన వ్యావహారికభాషావాదులు కూడా సభ్యులే. ఉన్న ఒకే ఒక సాహిత్య వేదికను ఉపయోగించుకొని వాడుకభాషను ఆమోదింపజేయాలన్న పట్టుదల ఒక్కటే గురజాడ, గిడుగులను ఆంధ్రసాహిత్య పరిషత్తు సభ్యులను చేసింది. శిష్ట వ్యావహారానికి గుర్తింపు రానివ్వకూడదన్న జయంతి రామయ్యగారి ధోరణి వల్లనూ, వాడుకభాషకు ఆధారం చేయడమే పరిషత్తువారు చాలా పెద్ద ఘనకార్యంగా భావిస్తున్నప్పుడు నవసాహితీపరులకు ఆ పరిషత్తు వల్ల ప్రయోజనం లేదు అన్న భావనతో 1933 లో అభినవాంధ్ర కవిపండితులు - "ఆంధ్రవాంగ్మయాభివృద్ధికోసము ఆంధ్రదేశమున మంచి సంస్థ ఒక్కటి అయిననూ లేదు; ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఉండిననూ పరిమిత ప్రయోజనకారిఅయిపోయినది". అందుకే నవసాహితీపరులకోసం ఒక వేదికను తయారుచేసుకోవాలన్న తలంపుతో, అభినవాంధ్ర కవిపండిత సభ బరంపురంలో చిలుకూరు నారాయణరావు గారి అధ్యక్షతన జగిరింది. బరంపురం సాహితీ సభల్లో శివశంకరశాస్త్రి, చింతా దీక్షితులులాంటి సాహితీసమితి పెద్దలేకాక్, శ్రీశ్రీ, కొంపెల్ల జనార్దనరావు వంటి యువకులు కూడా పాల్గొన్నారు. చింతా వారు ’వచ్చేసింది కొత్త తరం, వచ్చేసింది కొత్త కవిత్వం’ అని మహదానందం చెందారు. బరంపురం సభల వార్తలు చదివి దేశంలోని యువకవులు ఉత్తేజితులయ్యారు. వాళ్ళకు ప్రాణం లేచివచ్చినట్లయింది.  కొంపెల్ల జనార్దనరావు 1936 లో సభ్యులు.
అభ్యుదయం సాహిత్యం - ఉద్యమ చరిత్ర
ఏ దేశంలోనైనా ఏకాలంలోనైనా రచయితలు చేయవలసిన పని చాలా ఉంటుంది.
గతించిన విషయాలను బోధిస్తారు - నిర్దాక్షిణ్యంగా; ప్రస్తుతాన్ని అర్థం చేసుకుంటూరు - నిష్పక్షపాతంగా; భావికి కాగడాపట్టి దారి చూపుతారు  - నిరాటంకంగా - అని ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం తొలిసారిగా 1943 లో తెనాలిలో ఫిబ్రవరి 13 న జరిగిన సభకు అధ్యక్షోపన్యాసంలో తాపీ ధర్మారావు గారన్నారు.
ముద్దుకృష్ణ - జ్వాల - 1933
రష్యాలోని విప్లవ విజయాలవల్ల ప్రభావితులై, సామినేని ముద్దుకృష్ణ జ్వాల పత్రికను స్థాపించాడు. తొలి సంచికలో "జ్వాల ఎందుకంటే?" అని ప్రశ్నార్థకపు శీర్షికకింద సంపాదకీయం రాశాడు. ఇదే జ్వాల సంచికలో నారాయణబాబు, శ్రీశ్రీ చెరొక గేయం రాశారు. ఫలితంగా తెలుగు నవకవిత్వంలో రుథిరజ్యోతి వెలిగింది. విప్లవగీతి మ్రోగింది. ఈ చారిత్రకదినంనాడే శ్రీశ్రీ నినదించిన ’మహాప్రస్థానం’ గీతం తొలిసారిగా తెలుగులోకంలో శంఖారావం చేసింది. అప్పటికి శ్రీశ్రీ పాతికేళ్ళ నవ యువకుడు.  అంతకుముందు భావకవిత్వపు ప్రభావంలో పడి కవిత ఎక్కడో దూరంగా వినుదారులలో విహరించే అందని అందంగా భావించి, "గాలి యొసగెడు కొత్తరెక్కలు ధరించి ఎరుక పడరాని ఎచటికో ఎగిరిపోతూ" వుండేవాడు. అది గమ్యం లేని ప్రయాణం; అయినా సోషలిస్టు ఉద్యమ ప్రభావం వల్ల తన గమ్యం ’మరో ప్రపంచ"మని తెలుసుకున్నాడు. ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులను చావమని శపించి,నెత్తురుమండే శక్తులు నిండే సైనికులను రారమ్మని పిలిచి, పదండి ముందుకని ప్రబోధించి, మరో ప్రపంచంలోని ఎర్రబావుటాను భూమినుంచి చూసి, లోకానికి చూపించాడు. అయితే ఈ నూతన ప్రపంచ స్వభావాన్ని అవగాహన చేసుకుందుకే కొన్నేళ్ళు పట్టింది. అందుకు కారణం శ్రీశ్రీ అన్యుల భావాల కోలాహలంలో మునిగి తేలుతూ, ఆ ప్రభావంలోనే  దశాబ్దంపాటు ఉండడం.
1936 లో ఇంకా చాలా ముఖ్యమైన సాహిత్య సంఘటనలు జరిగాయి. లండన్ లోని భారత ప్రోగ్రసివ్ రచయితల మానిఫెస్టో ఇండియాకు కూడ చేరడం, అబ్బూరి రామకృష్ణారావు, వారి ద్వారా శ్రీశ్రీ చదివారు. కొంపెల్ల జనార్దనరావు తన ఉదయిని పత్రిక అయిదవ సంచికలో ఈ సంఘ పేరు ప్రస్తావించాడు.
:ఒక వేళ ఇతర దేశాలవారికి ఇది భారతీయ వాంగ్మయమని ఒక్కచోట కనబరచగలమంటే తిరిగి అది ఏ ఆంగ్లములోనికో అనువదించవలసి ఉన్నప్పుడు, ఒకసారి హిందీలో పరివర్తితమైన దానికంటె మంచి ఆధారమైన మాత్రుక నుండే అనువదించడం చెల్లుతుంది. ఇందుకు ’త్రివేణి’ వంటి పత్రికలు, ఇటీవల లండన్ లో ఏర్పడ్డ "The Indian Progressive Writers Association"  భారతదేశపు P.E.N. Association వంటి సంస్థలు ఎక్కువ ఉపకరిస్తవి."
ఆంధ్ర వర్థమాన లేఖక సంఘం - పణాళిక
ప్రజల వాంగ్మయం అభివృద్ధి చేయడం ఈ సంఘ ముఖ్యోద్దేశం. వర్థమాన సాహిత్యం సృష్టించినవారూ,అట్టి ప్రజ్ఞ కలవారూ సభ్యత్వానికి అర్హులు; సాహిత్య వాసన లేకుండా రాజకీయాందోళనకు యత్నించదలచినవారికి ఈ సంస్థలో చోటులేదు. తెలుగులో వర్థమాన సాహిత్యాన్ని సృష్టించడానికి తగిన అవకాశాలు కలిగించడం, ఇతర భాషల్లోంచి అట్టి సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించడం,సభ్యుల స్వతంత్ర రచనలు ప్రకటించడం, ఈ విధంగా ప్రతికూల శక్తులను నిర్మూలించి సాంఘిక పునరుజ్జీవనానికి దారితీయడం లక్ష్యాలుగా నిర్థారించుకోవడం ముఖ్యాంశాలు. (1934)
1936లో ఇంకా చెప్పుకోదగ్గ కృషి జరిగింది. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రేసు సోషలిస్టు పార్టీ ద్వితీయ మహాసభ రాజమండ్రిలో జరగడం, ప్రతినిథులుగా కవులు, అనువాదకౌలు, రచయితలు, సంపాదకులు చాలామఆంది ఉన్నారు. అందులో, నారాయణబాబు, కొంపెల్ల కామేశ్వరరావు, మహీధర జగన్మోహనరావు, పుచ్చలపల్లి సుందరయ్య, దర్శి చెంచయ్య, దర్భా కృష్ణమూర్తి వంటి సుప్రసిద్ధులున్నారు.
1936 లోనే, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి ’ప్రబుద్ధాంధ్ర’ ఆగిపోవడం, నవ్యసాహిత్య పరిషత్తు వారి పత్రిక ’ప్రతిభ’ ప్రారంభమైంది.  ప్రతిభ తొలి సంచికలోనే పంచాగ్నుల శాస్త్రిగారు సంస్థ నాల్గవ సమావేశంలో చేసిన అధ్యక్షోపన్యాసాన్ని ప్రచురించారు. అందులోనే ఆయన ఒక సంగతి స్పష్టం చేశారు.
"ఎప్పుడో పాతిక శతాబ్దాల క్రింద ఏర్పడ్డ లక్షణశాస్త్రాలు,  వ్యాకరణ శాస్త్రాలు విధించిన కట్టుబాట్లనూ,ధర్మశాస్త్ర్రాలూ, సంఘశాస్త్రాలూ నియమించిన నిబంధనలున్నూ, కులాలూ, మతాలూ, వ్యక్తులూ ఇత్యాదులలో భేద భావాలున్నూ మన అభ్యున్నతికి అడ్డుపడునట్లుండే వాటిఒని కోసివేస్తున్నాము. ప్రయోజనకారులుగా ఉన్నవాటిని శిరసావహిస్తున్నాము. ఇది సరియైన సాంఘిక చైతన్యం."
ఉదయిని ద్వైమాసపత్రిక
1933 డిసంబర్, మద్రాసు నుంచి కొంపెల్ల జనార్దనరావు సారధ్యంలో ’ఉదయిని’ ద్వైమాసపత్రిక ప్రారంభమైంది.
ఉదయిని చివరి సంచిక - 1936
1936 లోనే ఉదయిని చివరి సంచికలో కొంపెల్ల జనార్దనరావు అంతర్జాతీయ సాహిత్య రంగంలో పరిస్థితులను గమనించి వ్యాఖ్యానం చేశాడు.
"ఇటీవల లండన్ నగరమున జరిగిన "International Association of Writers for the defence of Culture" అనే ప్రపంచ గ్రంథకర్తల సమావేశమున్ను ... ఉన్నత లక్ష్యమును కనబరుస్తున్నది.... ఇన్ని భాషల్లో సారస్వతములు, ఇంచుమించు అన్నిచోట్లనూ అభ్యుదయ సంరంభంతోనే జీవిస్తున్నవి."
1936 లోనే, పంచాగ్నులవారు, కొంపెల్ల జనార్దన రావూ తమ రచనల్లో ’ప్రోగ్రెసివ్’ అనే అర్థంలో అభ్యున్నతి, అభ్యుదయ... అనే ప్రయోగాలు చేశారు.
సామినేనిముద్దుకృష్ణ
1935 జూన్ నెలలో వెలువడిన ఉదయిని సంచికలో కొంపెల్ల జనార్దన రావు ’వైతాళికులు’ మీద సుదీర్ఘమైన విమర్శనం రాస్తూ "ముద్దుకృష్ణగారు కొందరు కవులను ప్రధానముగా మనసులో  ఉంచుకొని ఈ సంకలనం చేసి ఉండకపోతే ఇంకా చాలా కావ్యాలు ఇందులో ఔచిత్యంతో ప్రవేశం పొందగలిగి ఉండేవి. అయితే మీరు ముఖ్యమైన వైతాళికులను మాత్రమే ఎన్నుకున్నారు." జనార్దనరావు ఇంకా ఇలా వ్రాశారు. "నవ్య కవితకు మానిషాదప్రాయమైన గురజాడ వారి తొలి ముత్యాలసరం కావ్యం ఇలాంటి సంకలనానికి మొదట నిలవవలసినది చెప్పవచ్చు. కానీ,కథనాత్మకమైన  కావ్యాలు సంపాదకులు ఎంచకపోవడం వల్ల ఆ కావ్యమందలి కథనచ్చాయ దానికి ప్రవేశము ఇచ్చి ఉండకపోవచ్చును. నవ్యకవితపట్ల వచ్చే విమర్శనలెన్నోదూసుకుపోసాగినవి. కానీ అది సజీవమని చూపడానికి ఈ సంపుటం నిలుస్తున్నది. కాని మరికొందరి కవులు కావ్యాలు ఇందు ప్రవేశం పొందవలసినది" అని స్పష్టం చేశారు.
ముద్దుకృష్ణ - వైతాళికులు (కవితల సంపుటి) – కొంపెల్ల జనార్దన రావు ప్రశంస
చివరకు ముద్దుకృష్ణ గారు ఆధునిక  కావ్యరత్న భండారం వెలువరించారు. నేటి కవుల బండారం దీనిలో తెలుస్తుందట.  పెద్ద కావ్యాలు విరివిగా రచించే యుగాల తాలూకు సాముదాయిక కళాసత్త్వం తెలియవలెనంటే అనేక గ్రంథాలు చదవాల్సి ఉంటుంది కాని, యుగ ధోరణి సాధారణంగా ఏ ఒకటి రెండు కావ్యాలు చదివినా తెలుస్తుంది. జనుల్అ ఆదర్శాలూ, అవి కవితలో ప్రతిబింబించిన రీతి తెలియవస్తుంది. ఒక కావ్యం తత్కవి తాలూకు సామర్థ్యాన్ని చాలా వరకు ప్రకటించగలదు. నేటి ఒక కవి సంగతి తెలియవలెనంటే అనేక ఖండ కావ్యాలు పోగు చేసుకోవలసి ఉంటుంది తరుచు. యుగ లక్షణాలు ఆనాటి అనేక కవుల రచనలు సేకరించుకుంటే కాని సుబోధములు కావు. ఖండ కావ్యాలకు ఈలాటి సంకలనాలు అవసరమూ, వీలూ కూడాను...
...’ప్రాచీనంలోనే యుగపరంపరగా విస్పష్టమైన మార్పులు కలుగుతూ వచ్చినపుడు, ఈనాడు ప్రతిదేశంలోని విజ్ఞానమూ, ఏదేశంలో ఏ వ్యక్తికైనా ఇంత  సులభంగా అందుబాటులోనికి వచ్చినప్పుడు, ఆధునిక సారస్వతంలో కలిగిన మార్పు కన్న రాదగినదే ఎక్కువ ఉన్నదేమో అనిపిస్తుంది” అని ఊహించి సంపాదకులు దీనికి ‘వైతాళికులు’ అని పేరు పెట్టినారు.  నిజంగా ఇది సంధి సమయమే. అదే అయితే, ఇది సంధి సమయమే. అదే అయితే, ఇది భావ సౌభాగ్యానికి ఎంతమంచి ప్రారంభం ఇస్తున్నాడో అని ఆశ కలుగక మానదు – ఈ సంపుటం తిలకిస్తే, మరికొందరు వైతాలికులున్ను ఇందు చేరవలసినవారు లేకపోలేదు.
...నవ్య కవితలపట్ల  వచ్చే విమర్శలు ఎన్నో దూసుకుసాగినవి. కాని అది సజీవమని చూపడానికి ఈ సంపుటము నిలుస్తున్నది.
... ఇంచుమించు నవ్య కవులన్దరితోనూ చనువైన నెయ్యముగల ముద్దుక్రుష్ణగారు వారివారి కవితలను సాంగోపాంగముగా తరిచి ఒప్పిదమైన సంకలనం చేయడానికి తమకుగల అవకాశాన్ని భాగా వినియుక్తం చేశారు.  ఆయా కవులను గురించి వీరుగ్రన్తము చివర ఇచ్చిన వివరణలు విమర్శ దృష్టీ, రసికతా  నిండినవై చదువారికి చాలావరకు సరియైన బోధనా ఈయగలిగి ఈ సంపుటానికి మంచి ప్రయోజనం సంపాదిస్తున్నవి. (1935 జూన్, ఉదయిని, 3 వ సంచిక)        
శ్రీరంగం శ్రీనివాసరావు
మహానగరంలో ఒంటరిగా ఉండటం శ్రీనివాసరావుకు అదే మొదటి అనుభవం. అప్పటికి అతని వయసు 18 సంవత్సరాలు. ఒక గ్రంథం ప్రచురించిన కవిగా చెప్పుకోవడానికి ఒక అర్హత ఉన్నా అతనికి స్నేహితులు, కావలసిన మిత్రబృందం వెంటనే లభించలేదు. హాస్టలు ఉన్న తంబుచెట్టి వీధిలోనే ఆంధ్రపత్రిక కార్యాలయం ఉంది. అందులోనే భారతి కూడా ప్రచురితమయ్యేది. దానికి గన్నవరపు సుబ్బరామయ్యగారు సంపాదకత్వ బాధ్యతలు ఆనాడు వహించేవారు. వారిని చూడడానికి తనపద్యాలు కొన్ని కొత్తకు అచ్చుకు ఇవ్వడానికి శ్రీనివాసరావు భారతి ఆఫీసుకు వెళ్ళారు. సుబ్బరామయ్యగారి ప్రక్కనే మరో టేబుల్ వద్ద ఒక యువకుడు కూర్చొని వున్నాడు.  శ్రీనివాసరావు అతణ్ణి చూసి కూడా చూడనట్టే ఊరుకొన్నాడు. సుబ్బరామయ్యగారితో మాట్లాడి బయటకు వెళ్ళిపోయాడు. తంబుచెట్టివీధిలోంచి చైనాబజారులోకి అడుగుపెట్టాక భారతి ఆఫీసులోని యువకుడు శ్రీనివాసరావు వెనుకనుంచి భుజం తట్టి "మీ పరిచయం చేసుకోవాలి" అన్నాడు. అతడు కొంపెల్ల జనార్దనరావు. ఇద్దరూ రమారమి సమవయస్కులు. జనార్దనరావు కొద్దిగా పెద్దవాడు. ఇద్దరికీ ఇంతకుపూర్వం ముఖపరిచయం లేదు. కాని ఒకరి రచనలు ఇంకొకరు చదివారు.  జనార్దనరావును చూడగానే శ్రీనివాసరావు మనసులో "గానము విపంచికను మీటె" అని పద్యపాదం జ్ఞాపకానికొచ్చింది. ఇద్దరికీ మైత్రి ఏర్పడింది. శ్రీనివాసరావు మద్రాసులో చదువుకొన్న రెండేళ్ళూ ఎన్నోసార్లు జనార్దనరావుతో కలిసి సంచరించాడు. జనార్దనరావు ద్వారానే శ్రీశ్రీ మద్రాసులో తొలిసారిగా ఎందరో వాంగ్మయ వ్యక్తులను కలుసుకొన్నారు. బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ సాహిత్యమూర్తులు పరిచయం అప్పుడే లభించింది. సోమశేఖరశర్మగారి ఇంట్లోనే జనార్దనరావు ఉండేవాడు. అక్కడే మొదటిసాఇ నండూరి సుబ్బారావుగారి ముఖతా ’ఎంకి పాటల’ను శ్రీశ్రీ న్నాడు. విశ్వనాథ సత్యనారాయణగారి ’కిన్నెరసాని’ వింటూ మైమరచిపోయాడు.
శ్రీనివాసరావు తో స్నేహం ఏర్పడినా సాహిత్యవిమర్శలో కొంపెల్ల జనార్దనరావు తమ స్నేహాన్ని అడ్డురానివ్వలేదు. 1928 ఆగష్టు నెల భారతిలో శ్రీనివాసరావు రచించిన ’ప్రభవ’ను జనార్దనరావు సమీక్షించాడు. అందులోని కొంతభాగం చూడండి.
"శైలియందు సార్థకత కంటె సమాసతత్పరత యెక్కువ గోచరించుచున్నది. ఇంకను విషయానుగుణ్యముగ శైలియందు మార్పులు కన్పడవలెను. తెనుగువాడకము చాలా తక్కువగా యున్నది. ఒక్కొక్కచో బడలించు సమాస భూయిష్టత యున్నను మొత్తము మీద శైలి బాగుగున్నది. భావములందును గాంభీర్యమున్నది. భావములకును, భాషకును సామరస్యము సంధించుటకీ కవి ఇంకను ప్రయత్నింపదగును. ఇది చదివిన వారికి కాలక్రమమున ఈ కవి కవిత యింకను సంపన్నము కాగలదను ఆశపొడమును."
జనార్దనరావు సమీక్షలో సత్యమే ఉంది. కృష్ణశాస్త్రి ప్రభావంలోనూ, విశ్వనాథ పథంలోనూ పయనిస్తున్న శీనివాసరావులో సమాసతత్పరత అధికమే. అయితే జనార్దనరావు మెత్తని చివాట్లు పెట్టడానికి ముందే తన లోపాన్ని శ్రీనివాసరావు గుర్తించాడు. ప్రభవను తన సవతి తల్లికి అంకితమిస్తూ అతడు రచించిన ఆరు ముత్యాల సరాలు భావకవుల ముత్యాలసరాలే గాని గురజాడ ధోరణిలో కావు. వాటిని చూడండి.
శ్రీనివాసరావూ, జనార్దనరావూ, మల్లవరపు విశ్వేశ్వరరావూ కలిసి మద్రాసు హైకోర్టులోనో, పరశువాకం,ఎగ్మూరు వగైరా వీధుల్లోనూ విశ్వసాహిత్యపు సరిగమపదనిసలు సవరించారు.
1933 లో మార్చి నెల 10,11,12 తేదీల్లో బరంపురంలో ’అభినవాంధ్ర కవిపండిత సభ’ ను పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారు ఏర్పాటు చేశారు. దేశంలోని సాహితీపరులు చాలామంది ఆ సభకు వెళ్ళారు. శ్రీశ్రీ, కొంపెల్ల జనార్దనరావు అందులో పాల్గొన్నారు.
 వచన కవిత : ప్రారంభం - పరిణామం
 1933 మార్చి నెలలోనే కొంపెల్ల జనార్దనరావుకూడా తన కవిత్వాన్ని గ్రాంథికభాషలోంచి వాడుకభాషలోకి మళ్ళించాడు. గణబద్ధఛందస్సులు వదలి మాత్రాఛందస్సులలోనికి వచన రీతులలోనికి తిప్పాడు. అతడు రాసిన కవితలలో ’అనుకో - తధాస్తు" ఒక నూతన ప్రయోగం.
అనుకో - తథాస్తు, నా / అనుభూతిలో ఒక్క / లోటు తెచ్చేవు నీ / లో తత్తరిలు పోక -
అనుకో ప్రకృతి బట్టి / అదలాడి, బెదరి, నా
ఈ నొప్పి తడవులా / డేటి మైకాలలో / పోనీను సుమ సుధల / పుట్టిల్లు నావట్టు -
అనుకో - తధాస్తు - / నే నిల్వ ద్రొక్కే ను / నే చిక్కబట్టే ను / కన్నీటి గుడుల, పు / ల్కల లోతు మొత్తాలు
అశ్రువొలికితె ఏమి / చిరు నవ్వు వెలుగులో / అరవీసమేని చ్ / క్కనవో మొగిలి రాదు -
కదలికే లేని నా / కంఠార్థ నియతిబడి / తన నీడ మెలకువే / దారియిట నీ మదికి =
నీ రక్తములు వ్రీలు / నదుల అనుగీతాలు / వేదాలు మునుపు నిం / పిన గాలి మలిపంట -
చూతాములే పాదు / చుమ్మవోకలె నవ్వ / నీగుండె పరవశ / మ్మయి కాలబడకుంటె
చూతాములే... / కాకపోతే పోయె / గాకన్న యీ వంక / కాకపోతే పోయె / గాని ... చూతాములే".
ఈ కవితను 1933 మార్చి 24 వ తేదే నాడు రాజమండ్రి నుండి మద్రాసు వెళ్తూ మెయిల్లో రాసిందట. జనార్దనరావు తన కవితలకు ’అబద్ధాలు’ అని పేరు పెట్టదలిచాడు. అబద్ధం అంటే అసత్యం అని కాదు అర్థం. అనిబద్ధం అని తెలుసుకోవాలి. ఫ్రేవెర్స్ అనే మాటకు ఇది అతని నిర్వచనం. శిష్ట్లా ’ప్రహ్లాద కవిత్వం’ లాగా కొంపెల్ల ’అబద్ధాలు’ కూడా పాపులర్ కాలేదు.
జ్వాలలో వచన పద్యాలు రాసిన కొంపెల్ల సూర్యారావుగారి పేరు ఈనాడు ఎవరికీ తెలియదు. ఈయన కొంపెల్ల జనార్దనరావుగారి అన్నగారు. ఈయన దేవుడిమీద ధ్వజమెత్తిన కవి "పాపం" అనే పది లైన్ల వచన పద్యం - (జనులు అందరూ తెలివిమీరితే ... దేవుడి బతు కేంకావాలి?). ఇది నాస్తికత్వాన్ని ధ్వనిగా ప్రబోధిస్తుంది. ఈ కొంపెల్లవారే "ప్రపంచమంతా పాడడిపోదూ" అనే మరొక వచనపద్యం రాశారు. ఇందులోనూ అధికార్లతో పాటు దేవుడిని ఎద్దేవా చేశారు. భజనలు చేస్తాం, బహుమతులిస్తాం ... దేవుడిలాగే తేలికపడితే, ప్రపంచమంతా పాడడి పోదూ!". ఎంత వ్యంగ్యం? ఏం ధ్వని!
1937 మే లో ’చేదుపాట’ ఆగష్టులో ’నవకవిత శ్రీశ్రా రాశాడు. 1937 శ్రీశ్రీకి చాలా విషాదకరమైన సంవత్సరం. ఆ యేడు జూలై 23 వ తారీఖున క్షయవాధివల్ల కొంపెల్ల జనార్దనరావు చనిపోయాడు. ఉన్నతాశాయలతో అతడు నడుపుతున్న ’ఉదయిని’ పత్రిక అస్తమించింది. అతనితోపాటు అతడూ,అతని స్నేహితులు కన్నకలలు కల్లలయ్యాయి. శ్రీశ్రీ విచారం చెప్పలేనిది ఉత్తరోత్తరా ఒక గీతంలో దానిని వ్యక్తం చేశాడు.
1938లో శ్రీశ్రీ వయస్సు ఇరవై ఎనిమిదేళ్ళు. ఆ సంవత్సరాంతానికి అతడు ముప్ఫయి గీతాలు రచించాడు. వీటన్నింటినీ సంకలనం ’మహాప్రస్థానం’ అనే పేరుతో గ్రంథరూపంలో తేవాలనుకొన్నాడు. దీనిని కొంపెల్ల జనార్దనరావుకు అంకితమిస్తూ, ’తలవంచుకు వెళిపోయావా నేస్తం! సెలవంటూ ఈ లోకం వదలి..." అనే ఎత్తుగడతో గీతం రాశాడు.
శ్రీశ్రీ  సాహిత్య సర్వస్వం విరసం వారు ఇరవై సంపుటాలలో ప్రచురించదానికి పూనుకొన్నారు.  శ్రీశ్రీ ఇన్ని సంపుటాలలో ప్రచురించతగ్గ రచనలు చేసినా మిగతావన్నీ ఒక యెత్తూ, అతని మహాప్రస్థానం ఒక యెత్తు. 1933 నుంచి 1947 దాకా రచించిన మహాప్రస్థానం గీతాలు మళ్ళా అతడు కూడా రాయలేనంత గొప్ప రచనలు. ’అనర్ఘళం అనితరసాధ్యం నా మార్గం’ అని ఆతడు ఈ కవితల గురించి చెప్పుకొన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. అందుకే ’భావివేదముల జీవనాదాలు’ ధ్వనించే కొన్ని గీతాలు జాతి జనులు పాడుకొనే మంత్రాలయ్యాయి.
మహాప్రస్థానం - శ్రీశ్రీ - కొంపెల్ల జనార్దనరావు కోసం - అంకితం.
 ***

1 comment:

  1. చాలా చక్కని వ్యాసం.శ్రీ శ్రీని గురించి ఆయనవ్రాసిన మహాప్రస్థానం గురించి తెలియని వారుండరు.కాని ఆమహాకావ్యాన్ని అంకితంగా పొందిన మహనీయుని గురించి చాలా మందికి తెలియదు.స్నేహితుడంటే ఎలా వుండాలో సూచిస్తుందీ వ్యాసం.ముఖ్యంగా "ప్రభవకు"వ్రాసిన సమీక్ష చదివితే ఈ అంశం చక్కగా తెలుస్తుంది.ఎంత చెత్తగా వ్రాసినా ఆహా ఓహో అంటూ మెచ్చుకొనే ఈ రోజులకు కొంపెల్ల వారు శ్రీశ్రీ గారికి ప్రాణమిత్రులైనా నిష్పక్షపాతంగా చేసిన ఆరోజులకు హస్తిమశకాంతర భేదం.సహేతుకవిమర్శలద్వారా నాటికవుల మనోభావాలిందులో చక్కగా ప్రస్ఫుటమయ్యాయి.ఉదయిని పత్రిక గురించి అపురూపమైన కవిద్వయాన్ని గురించి తెలుసుకొనే వీలు కల్పించినరచయిత కొంపెల్లగారికి అచ్చంగా తెలుగు నిర్వాహకురాలు పద్మిని గారికి అభినందనలు.

    ReplyDelete

Pages