"గుట్టు"రోగం - అచ్చంగా తెలుగు

"గుట్టు"రోగం

Share This
(జ)వరాలి కధలు - 18
"గుట్టు"రోగం
 గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి (సోమసుధ)

ఆరోజు ఆదివారం కావటాన ఆఫీసుకి సెలవు. వరాలు చేసిన ఇడ్లీలు దిట్టంగా లాగించి సావిట్లో కూర్చుని ఆరోజు దినపత్రిక అందుకొన్నాను. పేపరు తెరవగానే చేతులు జోడించిన నిలువెత్తు విగ్రహం కళ్ళబడింది. "మేము పాలించిన యీ సంవత్సరాలలో మేము చేసిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలివి" అంటూ ఒక పెద్ద జాబితా యివ్వబడింది. గతంలో ఎవరైనా కష్టకాలంలో ఆదుకొంటే "ఫలానా వాళ్ళు నాకు సాయపడ్డారు " అని సాయం పొందినవారు చెప్పుకొనేవారు. కానీ ప్రస్తుతం సాయపడ్డవాళ్ళే " నేను ఫలానావాడికి యీ సాయం చేశానోయి " అని డప్పుకొట్టుకొనే రోజులొచ్చాయి. నిజంగా సాయపడ్డాడో, లేదో తెలీదు గాని యీ డప్పు ద్వారా మాత్రం మంచి ప్రచారం జరుగుతోంది. ఆఖరికి ప్రజాప్రభుత్వాలు కూడా ప్రజలకు యిలా సేవ చేశామని ప్రచారం చేసుకొంటే తప్ప, ప్రజలకు తెలియని రోజులొచ్చాయి. ఈ కాలంలో ఏదైనా కార్యరూపంలో కన్నా కాగితరూపంలో చూపిస్తే తప్ప గుర్తింపు రావటం లేదు. అయినా నేను తీసుకొన్నది పత్రికేనా లేదా ఏదైనా ప్రకటనల పుస్తకమా అని పేజీ తిరగేశాను. అమ్మయ్య! ఈరోజు వార్తాపత్రికే! కాకుంటే పేపరుకు అదనంగా నాలుగు పేజీల కాగితం(షీట్) ఒకటి జోడించారన్నమాట. ఔను మరి! అన్నీ ఖరీదైపోయిన యీ రోజుల్లో, ఆదివారం అనుబంధపత్రిక అంటూ యీ వార్తాపత్రికతో బాటు మరో పది పేజీల పుస్తకం ఉత్తినే యిస్తున్నాడంటే, ఎలా యివ్వగలడు? ఇలా ప్రకటనలతో వచ్చిన ఆదాయం వల్లనే కదా! మరి ఆ ప్రకటనల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అంటే "అది మాకనవసరం, మాకు ఆదాయమే ముఖ్యం" అంటారు పత్రికలవాళ్ళు. ఈ పత్రికా ప్రకటనల్ని  నమ్మే ఎంతోమంది బోగస్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు, దొంగమందులు కొని ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. చట్టప్రకారం, ఆ దొంగలకు ప్రచారం కల్పించి ఆ మోసగాళ్ళకు సహకరించారని, ఈ పత్రికవాడిపై కేసు పెట్టి చర్య తీసుకోగలమా? ఈ పత్రికలకు వాటితో ఎలాంటి సంబంధం ఉండదని కేసుని చట్టం కొట్టిపారేస్తుంది.. ప్రజలు ప్రకటనల్ని  నమ్మి మోసపోతే పత్రికవాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళ  ఆదాయం కోసమే వాళ్ళు ప్రకటిస్తారు. దాన్ని నమ్మాలా, వద్దా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలంటారు. పేజీ తిరగేశాను. రెండవపేజీ నిండా యిళ్ళు అమ్ముకొంటున్న వాళ్ళ ప్రకటనలు, పెళ్ళి ప్రకటనలు, నగరంలో ఆడే సినిమాల ప్రకటనలు. . .చూసుకొంటూ వెళ్తున్న నేను త్రుళ్ళిపడ్డాను. 
" మీరు మీ భార్యతో ప్రేమగా ఉండలేకపోతున్నారా? మా డాక్టరు గారిని ఫలానా హోటల్లో కలవండి. మీ సమస్యకు మా గుప్తరోగ స్పెషలిస్ట్ సరైన సలహాలివ్వగలరు"  అని హోటల్  చిరునామా యివ్వబడింది. దంపతుల మధ్య సమస్యలుంటే తెలిసిన డాక్టరు దగ్గరికెళ్ళి, సమస్యను వివరించి ఆయన పర్యవేక్షణలో మందులు వాడితే పరిష్కారాలు దొరకొచ్చు గానీ, యిలా ముక్కూమొహం తెలీని డాక్టరును రహస్యంగా కలిసి, ఆయనిచ్చే డ్రగ్సో, స్టెరాయిడ్సో వాడాక, ఆ మందు వికటిస్తే? తరువాత చెప్పుకోవటానికి యీ మొబైల్ డాక్టరు దొరకడన్న యింగితాన్ని కూడా యువత మర్చిపోతోంది. కొంప ములిగాక తెలిసిన డాక్టర్ దగ్గరకెడితే ఫలితం ఉంటుందా? అయినా ఆరోగ్యవిషయంలో గుట్టును పాటిస్తే నష్టపోయేది వారు, వారి కుటుంబ సభ్యులు. ఎంత చదువుకొన్నా యీ యువత ఆ మాత్రం ఎందుకు ఆలోచించదో! ఇది అడ్డు పెట్టుకొనే దొంగ డాక్టర్లు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొంటున్నారు. చిరాకొచ్చి చదువుతున్న పేపరు బల్లపై పడేశాను. సరే! కాలక్షేపానికి టి.వి. చూద్దామని కూర్చున్నాను. అప్పటికే వరాలు దానిలో లీనమైపోయింది. 
అమ్మాయి మేడమీద బట్టలు ఆరవేయటానికి వచ్చింది. ప్రక్క డాబాలో "ఫలానా" సెంటు కొట్టుకొన్న కుర్రాడు తిరుగుతున్నాడు. అంతే! ఆ అమ్మాయి బట్టలారవేయటం  మానేసి గోడ గెంతేసింది. ఖర్మరా బాబూ! అనుకొంటూండగా మరొక ప్రకటన. అతను వాష్ బేసిను ముందు గడ్డం గీసుకొంటున్నాడు. ఏదో పనిమీద ప్రక్కింటి అమ్మాయి, "ఆంటీ" కోసమొచ్చింది. పెరట్లో పనిమనిషి అంట్లు తోముతోంది. ఇంటి గుమ్మంలో కూరలమ్మి కూరలున్న బుట్ట దించింది. అతను గడ్డం గీసుకొని నీటితో ముఖం కడుక్కొని తుండుతో తుడుచుకొన్నాడు. అంతే! పనిమనిషి, కూరలమ్మి, ప్రక్కింటి అమ్మాయి అతన్ని చుట్టేసి గడ్డాన్ని తమ చేతులతో నిమురుతుంటే, ఆ యింటి యిల్లాలు తెల్లబోయి చూస్తోంది. 
"నీకేం తక్కువమ్మా! హక్కున్నదానివి. నువ్వు కూడా వెళ్ళు" అనగానే టి.వి.లో లీనమైన వరాలు త్రుళ్ళిపడింది. 
వెంటనే లేచి " మిమ్మల్ని. . . " అంటూ కొట్టడానికి మీదకి వచ్చింది. 
" లేకపోతే ఏమిటోయి? దేశంలో ఆడవాళ్ళంతా మగాడి కోసమే అల్లల్లాడిపోతున్నట్లు ఆ ప్రకటనలేమిటి? గడ్డం గీసుకొంటేనో, సెంటు కొట్టుకొంటేనో తమ కుటుంబాలను, పరువుమర్యాదలని , పండంటి జీవితాన్ని వదులుకొని ఆడాళ్ళు వచ్చేసినట్లు చూపిస్తున్నారు. అసలా ఆడవాళ్ళలా ఎలా నటిస్తున్నారు? " అన్నాను.
" జీవనం కోసం. వాళ్ళకి తెలిసింది నటించటం ఒకటే! అదే చేస్తున్నారు. ఎంతసేపు ఆడవాళ్ళను ఆడిపోసుకోవటం తప్ప, ఈ ప్రకటన రూపొందించిన  స్క్రిప్ట్ రైటర్ని తప్పుపట్టరేం?  వాడికి తల్లి, పెళ్ళాం, అక్కచెల్లెళ్ళు లేరా? వాళ్ళిలా రూపొందించిన ఈ ప్రకటనల్ని  సెన్సారు చేయకుండానే ప్రజలమీదకి వదుల్తున్నారా? ఆ సెన్సారు వాళ్ళకు జ్ఞానం ఉండక్కరలేదా? చిన్నప్పుడు ఎనిమిదవ తరగతిలో మాకు యీ "ప్రకటనల" మీద ఒక పాఠం ఉండేది. మానవ సంబంధాలను అడ్డు పెట్టుకొని తయారు చేసే ప్రకటనలే సంఘానికి చెడు చేస్తాయని, అందుకే అలాంటివాటిని అనుమతించకూడదని. . .కానీ యీ రోజు "తల్లి పాలను తలదన్నే మా డబ్బాపాలను వాడండి. అమ్మ అవసరమే కనబడదు" అంటూ తల్లీ బిడ్డలమీద ప్రేమను కూడా వ్యాపారమయం చేస్తున్నారు కదండీ! వీటిని పర్యవేక్షించవలసిన ప్రభుత్వాలు గానీ, ప్రభుత్వసంస్థలు గానీ ఏం చేస్తున్నాయి? వాళ్ళు కూడా యీ ప్రకటనలతోటే తమ పరిపాలనపై డప్పు కొట్టుకొనే స్థితిలో పడిపోయారు. కొన్ని లక్షల ప్రజాధనాన్ని ప్రకటనల మీదే ఖర్చు చేస్తున్నారు. వాటితో ఏ ప్రజాసంక్షేమ కార్యక్రమాలో చేపట్టవచ్చు కదా! యధా రాజా! తధాప్రజా! మనమేం చేయగలం?" వరాలు చెబుతూంటే గుమ్మంలో అలికిడై అటువైపు చూశాం.
" ఏమ్మా బాగున్నావా?" అంటూ లోనికొస్తున్న శాల్తీని చూసి నా గుండె జారిపోయింది. ఒకప్పుడు అతిధిగా వచ్చి ఆసుపత్రి పాలై డాక్టర్ల చేత నాకు గడ్డి పెట్టించిన వ్యక్తి. . .
" రా బాబాయి! ఏమిటి విశేషం?" అంటూండగానే ఆ భారీకాయం వెనకనుంచి ఒక పిల్ల కాయం ముందుకొచ్చింది.
" ఏరా శంకరం? బాగున్నావా?" వరాలి ప్రశ్నకు సదరు శంకరం బాగున్నానన్నట్లు తలూపాడు.
"పిన్నిని తీసుకు రాలేదా?" వరాలి ప్రశ్న.
"లేదే! ఇదిగో. . . వీడికేదో యీ ఊళ్ళో పనుందంటే వచ్చాం" అన్నారాయన.
"ఏంట్రా పని? " వరాలి ప్రశ్నకు జవాబు యివ్వకుండా శంకరం లోనికెళ్ళిపోయాడు. వరాలు మనసు చివుక్కుమన్నా,  చిరునవ్వుతో కప్పేసింది.
" ఏమయ్యా! బాగున్నావా?"  ఆయన ముఖప్రీతికి నన్ను పలకరించాడు.
"ఏదో మీ దయ వల్ల యిలా ఉన్నామండీ" మనసులో కసిని మాటల్లో నింపాను. నేనింకా ఏం మాట్లాడి ఏం గొడవ తెస్తాననుకుందో! 
" నువ్వు రా బాబాయి" అంటూ అతన్ని వరాలు లోనికి తీసుకుపోయింది.
నేను మోగుతున్న టి.వి. కట్టేసి, టేబులుపై పడేసిన పేపరందుకొని వార్తలు చదువుతున్నాను. వచ్చిన శాల్తీలు స్నానం ముగించి, గబగబా టిఫిను లాగించి బయటకు పోయారు.
" ఎందుకొచ్చినట్లు?" వరాల్ని చిరాగ్గా  అడిగాను.
"భజగోవిందం బాబాయి సంగతి మీకు తెలియదా? అంతా గుట్టురోగం. పిల్లాడి పని మీద వచ్చానంటాడు. ఆ పనేంటో చెప్పలేదు. అలాగని పదిసార్లు అడగటం సంస్కారం కాదని నేను ఊరుకొన్నాను" అంది.
"సర్లే!" అని పేపర్లో తలదూర్చాను.
" నాలుగు నెలలక్రితం భజగోవిందం బాబాయి వచ్చి చేసిన గందరగోళం నాకు బాధనే కలిగించింది. అలాగని యింటికి వచ్చినవాళ్ళని పొమ్మని చెప్పలేను కదా! అందుకే గతాన్ని మనసులో పెట్టుకొని, ఆయన మీద చిరాకు పడకండి. ఏదో నాలుగురోజులు ఉండిపోతారు. నా మర్యాద నాకు దక్కనీయండి" 
"ఛఛ! ఆయన గురించి నిన్నెందుకు రోడ్డున పెడతాను. కాకపోతే నన్ను రోడ్డెక్కించే పనులు ఆయన చేయకుండా ఉంటే చాలు" అని నవ్వేశాను.
రాత్రి తొమ్మిదైనా భజగోవిందం గారు, అతని పుత్రరత్నం జాడలేదు. 
"ఈ రోజు ఆదివారం. దుకాణాల దగ్గరనుంచి అన్నీ సెలవు కదా!ఈ శాల్తీలు యింతవరకూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారంటావు?" వారి రాకకోసం ఎదురుచూస్తున్న వరాల్ని అడిగాను.
"నీకు నూరేళ్ళు బాబాయి" అంటూ వరాలు అప్పుడే లోనికొస్తున్న భజగోవిందం గారికెదురెళ్ళింది. 
" ఏంటి? అబ్బాయికి ఊరంతా చూపించి తీసుకొస్తున్నారా?" నా ప్రశ్నకు భజగోవిందంగారు జవాబిచ్చేలోపే వరాలు అందుకొంది.
"అదే అయి ఉంటుంది. శంకరం మన ఊరికొచ్చింది మొదటిసారి కదా!" అంటూ వాళ్ళని లోనికి లాక్కుపోయింది. 
ఆడపిల్లని "ఆడ"పిల్ల అంటారు గానీ, ఎంత అత్తవారింట్లో ఉంటున్నా, తనవారిపై యీగ వాలనీయకుండా చూసుకోవటంలో మాత్రం మగపిల్లలకన్నా చాలా నయం. 
లోనుంచి పిలుపు రావటంతో నేను వెళ్ళి భోజనానికి కూర్చున్నాను. భజగోవిందంగారు అలవాటు ప్రకారం ఉపన్యాసం దంచికొట్టేస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం తిండి మీద కాకుండా తలనొప్పులమీద తడుముకోకుండా దంచికొడుతున్నారు. భోజనాల దగ్గర తలనొప్పుల విషయం ఏమిటో అర్ధంగాక నాకు తలనొప్పి వచ్చినట్లైంది. 
"ఆ రోజుల్లో గుడ్డిదీపాల వెలుతురిలో చదువుకొనేవాళ్ళం. కళ్ళెప్పుడైనా మసకేసాయా? ఏభయ్యవ పడిలో పడినా, వార్తాపత్రికను కళ్ళు చిట్లించకుండా చదివి పారేస్తున్నాం. ఈనాడో? వంద ఓల్టుల బల్బు క్రింద, ఒక్కరాత్రంటే ఒక్కరాత్రి, పరీక్ష కోసం నాలుగు ప్రశ్నలు చదివితే చాలు, ఎడంచేతి చూపుడు వేలుతో ముఖంకేసి నొక్కుకుందుకు కళ్ళజోడు సిద్ధమవుతోంది. పోలియో డ్రాపులు వేయించమని రోజూ టి.వి.లో పోరే! ఏ డ్రాపులేయించారని మేమిలా ఉన్నాం?" 
"నిజమేనండీ! అందుకే పుట్టిన ఏడుగురు బిడ్డల్లో నలుగురే మిగిలేవారు. అఫ్ కోర్స్!తిండిలో కల్తీ లేకపోవటం వల్ల వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండేవారనుకోండి. ఇప్పుడలా కాదే! ఈ మందులవల్ల చావలేక బ్రతుకుతున్నా, ఆ ఏడుగురు బిడ్డలు బ్రతికే ఉంటున్నారు కదా! నెలలు నిండని పిల్లాడి కళ్ళని " అటు  చూడరా" అని   టి.వి.రేడియేషనుకి లోను చేస్తుంటే అయిదేళ్ళకే కళ్ళజోళ్ళు వస్తున్నాయి. మరణశయ్య మీద ఉన్న తల్లి విదేశాల్లో ఉన్న బిడ్డని కళ్ళారా చూడలేకపోయినా, సెల్ ఫోన్లవల్ల అతని మాట విని తృప్తిగా కన్నుమూస్తోంది. అభివృద్ధి ఉన్నచోట మంచీ ఉంటుంది, చెడూ ఉంటుంది. దాన్ని మనం ఉపయోగించే పద్ధతిని బట్టే, ఫలితం ఉంటుంది" అంటున్న నన్ను తేరిపార చూసి మౌనంగా భోజనం చేయసాగారు.
"ఏరా శంకరం? ఊరంతా చూశావా?" వరాలు ప్రశ్నకు తలూపాడు శంకరం. తండ్రికి తగ్గ తనయుడే! వాడు ఏదో గుట్టును దాస్తున్నట్లు నాకు అనిపించింది.
"ఏం బాబాయి? శంకరానికి ఏమన్నా మొక్కుందా? జుట్టు అలా పెంచాడు" భజగోవిందంగారు బదులిచ్చేలోపే వాడు అందుకొన్నాడు.
" ఇది మొక్కు కాదక్కాయ్! లేటెస్ట్ ఫాషను. స్టెప్ కట్టింగ్ అంటారు. ఈ రోజుల్లో ఎంత ఎక్కువ జుట్టు ఉంటే అంత గొప్ప!"  శంకరం కళ్ళు పెద్దవి చేస్తూ హుషారుగా చెప్పాడు. పెళ్ళయ్యాక వరాలికి బొత్తిగా ప్రపంచజ్ఞానమే పోయిందన్నట్లు చూశాడామె వైపు. 
"ఏం చేస్తామమ్మా! ఆ రోజుల్లో అర్ధరూపాయికి అంటకత్తెరేసేవారు. ఈరోజు వందరూపాయిలిచ్చినా అంగుళం మించి కత్తిరించటం లేదు" భజగోవిందంగారి దారి మంగళ్ళ మీదకి మళ్ళింది.
"మీ వాడింకా నయమేనండి. గడ్డం పెంచట్లేదు. టి.వి.ప్రకటనలో చూపినట్లు, ఆడపిల్లలు వచ్చి చెంపలు నిమురుతారని భయపడ్డారేమో, ఈ కాలం కుర్రాళ్ళు గడ్డాలు కూడా గీయటంలేదు"  అని,  ఆయన ప్రతిస్పందనకి చూడకుండా చేయి కడుక్కొని అక్కడనుంచి బయటపడ్డాను.
"అబ్బాయేంటి అలా ఉన్నాడు?" భజగోవిందం వరాల్ని అడుగుతున్నారు.
" ఏం లేదు బాబాయ్! అప్పుడప్పుడు ఆయనలా పరిహాసాలాడతారు. నువ్వేం అనుకోకు" వరాలు సర్దిచెబుతోంది.
వారం రోజుల్నుంచి వారు వచ్చిన పనేంటో మాకు అర్ధం కాలేదు. ఉదయాన్నే ఉప్మా తిని పోతున్నారు. రాత్రి పొద్దుపోయాక యింటికొస్తున్నారు. వరాలు అడిగితే చెప్పటం లేదు. అసలే నగరంలో మాఫియా గొడవలు ఎక్కువగా ఉన్నాయి. భూ కుంభకోణం, ఖరీదైన నగల చోరీలు, సెటిల్మెంట్లు, దొంగనోట్ల మార్పిడి, మాదకద్రవాల అమ్మకాలు . . .యిలా ఎన్నో . . .వీళ్ళు యిలాంటి పనుల్లో ఏజెంట్లుగా చేరలేదు కదా! ఒకవేళ యిలాంటి గొడవల్లో జేరి వాళ్ళూ పట్టుబడితే, వాళ్ళకి ఆతిధ్యమిచ్చినందుకు. . ప్రభుత్వోద్యోగిని. . . ఉద్యోగం పోగొట్టుకోవలసి వస్తుందేమో!
ఆ రోజు రాత్రి బాత్రూంకెళ్ళి వస్తూంటే, వాళ్ళు పడుకొన్న గదిలోంచి శబ్దం వినిపిస్తోంది. వాళ్ళకి తెలియకుండా రహస్యంగా తొంగిచూశాను. తండ్రీకొడుకులు రహస్యంగా ఏవో మంతనాలు ఆడుతున్నారు. అలవాటు ప్రకారం గోడచాటున ఎంత పొంచి విందామన్నా, వినబడి చావటంలేదు. నా అలికిడి విని గబుక్కున పడుకొని దుప్పటి కప్పేసుకున్నారిద్దరూ! 
వరాల్ని నిద్రలేపి విషయం చెప్పాను.
"తండ్రీకొడుకులు ఏదో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రక్కన ఉన్న నాకు వినపడకుండా ఆ రహస్యమంతనాలు, గదిలోకెళ్ళగానే కంగారుగా ముసుగేసుకొని నిద్ర నటించటం చూస్తూంటే నాకేదో అనుమానంగా ఉంది" అన్నాను.
" మా బాబయ్యకు అంత ధైర్యం లేదండి. ఆయనకి మొదటినుంచి గుట్టు ఎక్కువ. కుడిచేత్తో చేసే పని ఎడమచేతికి కూడా తెలీకుండా జాగ్రత్తపడే రకం. వాళ్ళ యింటిగొడవలు మనకు చెప్పటమెందుకని చెప్పటం లేదేమో!"
"మీ బాబయ్య గనుక అలా వెనుకేసుకొస్తున్నావు గానీ కట్టుకొన్నవాణ్ణి నా భయం గురించి ఆలోచించవేంటి? మనం యిలాగే ఊరుకొంటే, ఏ అర్ధరాత్రో నన్ను ఓ దెబ్బేసి యీ అద్దెయిల్లు వాళ్ళపేర వ్రాయించుకొన్నా ఆశ్చర్యపోనక్కరలేదు! చెప్పలేని భయంతో  నాకు నిద్ర కూడా పట్టటం లేదు" అన్నాను. 
"సరె! ఆదివారం వరకూ చూసి నిలదీసి అడిగేస్తాను గానీ బెంగతో మీరు మంచాన పడకండి" వరాలి భరోసాతో నా మనసు నెమ్మదించింది. మీరే చెప్పండి! నగరంలో పని ఉందని బంధువులు యింటికొస్తే, మర్యాదకోసం వాళ్ళకి ఆశ్రయం యిస్తాం. కానీ వచ్చిన పనేమిటో మనకి చెప్పకుండా వారాల తరబడి తిష్టవేసి, అర్ధరాత్రి రహస్యమంతనాలు చేస్తూంటే మనకి భయముంటుందా లేదా?
మరునాడు రాత్రి భోజనాల దగ్గర -
" బాబూ! మెదడువాపు వ్యాధిట! అంటే ఏంటి?" అకస్మాత్తుగా భజగోవిందం వేసిన ప్రశ్నకు నా చేతిలో ముద్ద జారిపోయింది.
"విపులంగా తెలీదు గానీ, విపరీతమైన తలనొప్పి, జ్వరం ఉంటాయి. కొన్నిచోట్ల స్పృహ కూడా కోల్పోవచ్చు. నలభై ఎనిమిదో, డెబ్భైరెండు గంటలో వ్యవధి. . .తరువాత మనిషి పోతాట్ట" ఫరవాలేదు. మిగిలిన ఆడవాళ్ళ మాదిరి, టి.వి.లో కేవలం సీరియల్స్ మాత్రమేగాక అప్పుడప్పుడు వార్తలు, వైద్యకార్యక్రమాలు చూడటం వల్ల, వరాలికి లోకజ్ఞానం బాగానే పెరిగింది.
వరాలి మాటలికి యిద్దరి ముఖాల్లోను కళ తప్పింది. 
"మా రోజుల్లో యిన్ని రోగాలు లేవు. ఈ మధ్య రోజుకొక్క రోగం పుట్టుకొస్తోంది. ఏం కాలమో?" 
"రోగాలప్పుడూ ఉన్నాయి బాబాయి! కానీ వాటి పేర్లు తెలిసేవి కాదు. ప్రతిరోగానికి అమ్మవారనో, దేవతనో పేర్లు పెట్టి నాటువైద్యాలు చేసేవారు. రోగికి ఆయువుంటే బ్రతికేవాడు. పోతే, అమ్మవారు ఆగ్రహించి తీసుకుపోయిందనుకొనేవారు. ఇప్పుడలాక్కాదు. సరియైన కారణం కనుక్కొని వైద్యం చేసే స్పెషలిస్టులున్నారు"
ఉన్నట్లుండి భజగోవిందంగారు భోరుమన్నారు. 
"ఏమిటిది బాబాయ్! ఊరుకో! మెదడువాపేమిటి? మీరిలా కంగారు పడటమేమిటి? అసలేం జరిగింది?"
"శంకరానికి ఆ జబ్బు ఉందేమోనని అనుమానంగా ఉందమ్మా?" ఆయన మాటలకిద్దరం త్రుళ్ళిపడ్డాం.
"పరిహాసాలాడకు బాబాయి! శుభ్రంగా తిని తిరిగే వాడికి ఆ రోగం వచ్చిందంటే ఎవరైనా నవ్విపోతారు"
"అదే నిజమైతే మంచిదమ్మా! కానీ మియాపూర్ లోని ఏకాక్షి అనే డాక్టర్ శంకరానికి ఆ రోగం ఉందని చెప్పాడు"
"ఏకాక్షా? ఆయనెవరు?" అడిగాను.
"దీర్ఘరోగాలకు శాశ్వత నివారణ కల్పిస్తామని పేపర్లో ప్రకటనలిస్తాడూ! ఆయన" 
"ఇంత గొప్పవారు. అన్ని విషయాలు కూలంకషంగా తెలిసినవారు. మీ ఊర్లో డాక్టర్లే లేనట్లు అక్కడినుంచి. . ." వరాలు మధ్యలో అడ్డు తగిలింది.
"మీరుండండి" భార్యామణి ఆజ్ఞతో నోరు మూసేశాను.
"బాబాయి! మీ ఊళ్ళో చింతామణిగారు ఉన్నారుగా! హస్తవాసి మంచిదని చెప్పుకొంటారు. ఆయన దగ్గకి వెళ్ళక, పేపరు ప్రకటన చూసి యిక్కడకొచ్చారా? అసలింతకీ వాడి బాధేమిటి?" 
"రెండునెలలనుంచి తరచుగా తలనొప్పి వస్తోందమ్మా! అక్కడ డాక్టరుకి చూపించాం. భయపడాల్సిన పని లేదని ఏవో మాత్రలు యిచ్చారు. అయినా  తగ్గలేదంటాడు. తనకి భూమ్మీద నూకలు చెల్లిపోతున్నాయని వీడంటూంటే కంగారు పుడుతోంది. ఆ సమయంలో ఈ ఏకాక్షి ప్రకటన చూశాం. రక్తం, యితరాలు పరీక్షించాడు. బి.పి. , సుగర్ చూశాడు. బ్రెయిను స్కానింగు కూడా చేశాడు. అన్నీ చూసి, మీరన్నారే . . .మెదడు వాపు వ్యాధి. . .అది ఉన్నట్లు అనుమానంగా ఉందన్నాడు"
"ఇంతవరకూ ఎంత లాగాడు?"
"తన ఫీజుక్రింద పెద్దగా తీసుకోలేదు. కానీ తనకు తెలిసిన లాబ్ లో పరీక్షలు చేయించమన్నాడు, అయిదువేల వరకూ ఖర్చయింది"
"కమీషను బాగానే లాగుంటాడు వాళ్ళ దగ్గర" అంటున్న నన్ను వరాలు కోపంగా చూడటంతో ఆగిపోయాను.
"అర్ధమైంది బాబాయి! మీ ఆదుర్దాను బాగానే సొమ్ము చేసుకొన్నాడు. అయినా వైద్యం కోసం వచ్చి ఎలాగూ మా యింట్లోనే ఉంటున్నారు కదా! సంగతి మాతో చెబితే,  ఆయనకి బాగా పరిచయం ఉన్న డాక్టరుకి చూపించి విషయం తెలుసుకొనేవారు కదా! సరే! మీరు చేయించుకున్న పరీక్షల రిపోర్టులున్నాయా?" వరాలు అడిగింది.
" లేదమ్మా! రిపోర్టులన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. మనకి యివ్వరట" 
"నీ కూతురులాంటిదాన్ని. నా దగ్గర కూడా నామర్దాయేనా బాబాయి? రోగాన్ని గుట్టుగా దాచి, యిలా మనకు పరిచయం లేని డాక్టర్ల చేతిలో జీవితాలు పెడితే ఎలా? సత్తా ఉన్న డాక్టరెప్పుడూ యిలా పేపరు ప్రకటనలిచ్చి  ప్రజల ముందుకి రాడు. రోగం ఒకటి, వైద్యం మరొకటి అయితే శంకరం ఏమైపోతాడో ఆలోచించావా?"
" అక్కా" అంటూ శంకరం బావురుమన్నాడు. 
"నాన్నకంటే గుట్టు. కనీసం నువ్వయినా చెప్పలేదేరా?" 
"నాన్నే చెప్పొద్దన్నాడు"
"మనలో చాలా మందికి యిదే వరస. రోగాన్ని గుట్టుగా దాచటమే పెద్ద రోగం. అది అంటురోగమైతే రోగే కాదు. . . సమాజం కూడా పోతుంది. సరెలే! ఏమండీ! మీరు వెళ్ళి ఆ ఏకాక్షిని విషయం కనుక్కోండి. ఆ రిపోర్టులు కూడా తెండి. సాయినాధపురంలో డాక్టరు శ్రావణికి చూపించి సెకండ్ ఒపీనియను తీసుకొందాం"  వరాలి మాటలకు చిత్తమన్నట్లు తలాడించాను. 
మరునాడు ముగ్గురం ఏకాక్షి దగ్గరకు బయల్దేరుతున్నాం. 
"ఏంట్రా ఆ వాలకం? శుభ్రంగా తలకి నూనె రాసుకో!" చెబుతున్న వరాల్ని అదోలా చూశాడు శంకరం.
"నాకలాంటి అలవాట్లు లేవే" దువ్వెనతో నుదుటిపైకి ముంగురులను నిర్లక్ష్యంగా లాక్కుంటూ చెప్పాడు శంకరం.
" ఓహో! యిదీ ఫాషనేనా? అదిసరె! తలంటుకొని ఎన్నాళ్ళు అయిందిరా?" అడిగింది.
" తలంటు పెద్ద బోరక్కా! ఏడాదికి అయిదు సార్లు. . .అదీ క్షవరం చేయించుకొన్నప్పుడు తప్పదు గనుక" హుషారుగా చెప్పాడు.
" అంటే రెండున్నర నెలలకోసారి క్షవరం . . .అదీ. . .చేయించామా? లేదా? అన్నట్లు. . .అదే బాబాయి వీడి రోగం. . .శుభ్రంగా అంటకత్తెరేసి, రోజూ తలకి నూనె పట్టించి, వారానికోసారి తలంటితే ఏ తలనొప్పీ రాదు"  
" ఊరుకో అక్కా! తలంటనంత మాత్రానే తలనొప్పి వస్తుందా?" అన్నాడు.
" చూడు శంకరం! గాలికోసం మనం ఫాను వాడతాం. మొదట్లో అది బాగానే పని చేస్తుంది. కానీ ఎల్లకాలం అలాగే పని చేస్తుందా? అందుకే దానికి అప్పుడప్పుడు ఓవర్ హాలింగ్ చేస్తామా లేదా? మెదడు కూడా ఒక యంత్రమే! ఇది రోజూ విరామం లేకుండా పని చేసే యంత్రం. దీనికి ప్రతిరోజూ ఉదయం నూనె రాయటం ద్వారా ఆయిలింగ్ చేయాలి. లేకుంటే బుర్రలో నరాలు మొండికేసి యిలాంటి తలనొప్పులు వస్తుంటాయి" 
" పద నాన్నా! అక్క అలాగే చెబుతుంది" అంటూ వాడు వీధిలోకి వెళ్ళిపోయాడు..
ఏకాక్షి డాక్టరు ఒంటికంటితో నన్ను చదువుతూ, శంకరాన్ని పరీక్ష చేస్తున్నాడు(అలా నటించాడని అంటే బాగుంటుందేమో!) . అది ఒక చిన్న గది. భజగోవిందం గారి లాగే ఒకరిద్దరు ఆశావాదులైన రోగులు, అతనికి సాయపడేందుకు ఒక అమ్మాయి తప్ప మరెవరూ లేరు. 
"భజగోవిందంగారూ! మీరు అనవసరంగా భయపడుతున్నారు. మీ వాడికి ఏ రోగం లేదు" అన్నాడతను. 
" మరి. . .మెదడువాపు. . . "
"అబ్బెబ్బే! అంతా మీ భయమే! మీరే చెప్పండి. ఆ రోగం వచ్చిన వ్యక్తికి జ్వరం కూడా ఉంటుందిగా?" ఏకాక్షి సూటిప్రశ్నకు ఏమనలేకపోయాను. ఆయన అలా అంటే గానీ భజగోవిందంగారి మనసు శాంతించలేదు.
ఈ లోపుగా నేను ముందే చెప్పినట్లు వరాలు నా సెల్ కి ఫోను చేసి డిస్ కనెక్ట్ చేసింది.  వెంటనే నేను  ఎవరితోనో మాట్లాడుతున్నట్లు నటించాను. 
" ఏరా మూర్తీ? బాగున్నావా? నువ్వు ఈ ఊరికి మెడికల్ డైరెక్టరుగా వచ్చినట్లు శేషు చెప్పాడురా! . . .అలాగే. . . ఎల్లుండి ఆఫీసుకి వెళ్ళేప్పుడు కలుస్తాను. ఎక్కడికీ వెళ్ళవుగా! వెడితే నాకు ఫోను చేసి ముందే చెప్పు. ఒకసారి యింటికి ఫామిలీతో రారా!. . . .ఆ! నేను బయట  పనిమీద ఉన్నాను. ఉంటాను.. . ఒరే! ఒక చిన్న విషయం. మా చుట్టాలొకరికి ఒంట్లో బాగు లేదు. చాలాకాలంగా తలనొప్పిట! . . . ఆ! యిక్కడ. . .మీ పేరేమిటండి?. . . అదే! . . .ఏకాక్షి అని ప్రముఖ వైద్యులు ఉన్నారు. ఇక్కడేరా!. . మియాపూర్ లో. . .ఎల్.ఐ.సి. బిల్డింగ్ లేదా? దాంట్లోనే! ఆయనకి చూపించామనుకో! . . మంచి పేరున్న డాక్టరే! రోగికి చాలా టెస్టులు చేశారు. ఏవో మూడు నెలలకి మందులు వ్రాశారనుకో. . .అంతే కదండీ!. . . ఏమంటావు?. . . సెకండు ఒపీనియనుకి రిపోర్టులు తెమ్మంటావా? అలాగే! సరే ఉంటా" అని సెల్ డిస్ కనెక్ట్ చేసినట్లు నటించాను. 
"సారీ! మీ అనుమతి లేకుండా యిక్కడే వాడితో మాట్లాడాను. ఏమనుకోకండి" అన్నాను.
డాక్టరు నా క్షమాపణకు అదోలా నవ్వి " మీ స్నేహితుడు మెడికల్ డైరెక్టరా?" అని అడిగాడు.
" అవునండీ! తరువాత మీకు పరిచయం చేస్తాలెండి. సరె! మందులు వ్రాసిస్తారా?" వినయంగా అడిగాను.
" మీరేదో సెకండ్ ఒపీనియను తీసుకొంటానన్నారుగా! అది తీసుకొన్నాక వ్రాస్తాను లెండి" అన్నాడు. 
"సరె! అదండీ విషయం. పదండి" అని వాళ్ళను తీసుకొని బయటకు వచ్చి ఏదో గుర్తు వచ్చినట్లు మళ్ళీ లోపలికి వెళ్ళాను.
" మరిచిపోయాను. మావాడి రిపోర్టులు యిస్తారా? మళ్ళీ తిరిగి తెచ్చేస్తాను" అనగానే తన బల్ల మీద రిపోర్టులు మారుమాట్లాడకుండా యిచ్చేశాడు.
వాటిని తీసుకొని యింటికొచ్చే దారిలో మరో డాక్టరుకి చూపించాను.
" చిన్న విషయానికి యిన్ని పరీక్షలా?" అంటూ శంకరాన్ని చూసి నెల్లాళ్ళకి మందులు వ్రాశాడు.
" ఇవి వాడితే తగ్గిపోతుంది. కొద్దిగా నరాల బలహీనత. కొంతకాలం ఫ్రిజ్ లోంచి తీసిన పదార్ధాలు వెంటనే వాడకండి" అని ఆయన భరోసా యివ్వగానే యింటికి చేరుకొన్నాం. మరునాడే వాళ్ళిద్దరినీ వాళ్ళ ఊరికి పంపించాం.
"ఏమోయి! నీ కన్న చిన్నవాడు నిన్ను చిన్నబుచ్చాడని బాధపడ్డావా? " వాళ్ళు వెళ్ళాక వరాల్ని సముదాయిస్తున్నట్లు అడిగాను.
"ఈరోజుల్లో ప్రతివాడూ చదువుకొన్నవాడే! ఎదుటివాడేమన్నా చెబితే నామోషీ, నయాపైస అడక్కుండా నాయనమ్మ నలుగు పెడితే పనికి రాదు. కానీ వందలు తగలేసి బ్యూటీపార్లర్లో ఆడ్డమైన చెత్తా ఒంటికి పూయించుకొంటారు. ఆ రసాయనాలు పడక ముఖమంతా మచ్చలు పడినా ఫరవాలేదు. కుంకుడు పులుసుతో తలంటు అంటే వెగటు, షాంపూలు వాడతారు. దానివల్ల జుట్టు తెల్లబడుతుంది, రాలిపోతుంటూంది. దానికోసం మళ్ళీ వేరే రసాయనాలు వాడటం, మన సంప్రదాయాలను చులకన చేయటం. మన దేశంలో నూటికి తొంభై రోగాలు స్వయంకల్పితాలేనండీ! చెప్పుకోవాలంటే నామర్దా, రోగం ముదిరిపోతుందని ఆదుర్దా. చదువుకొన్నామని ఎవరూ హేతువాదంతో ఆలోచించరు. ఎదుటివాళ్ళను గుడ్డిగా అనుసరించే రోగం పురాతనకాలం నుంచి మనజాతిలో జీర్ణించుకొనిపోయింది. కానీ ఆ విషయాన్ని ఒప్పుకోవటానికి మనస్కరించక, యిది ఫాషను అనేస్తారు. ఈ జాతిని భగవంతుడే కాపాడాలి"
  " ఇది నీతులు చెబితే వినే కాలం కాదోయి! మాటలకీ, చేతలకీ మధ్య పెద్ద అగాధం ఉందిప్పుడు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే!" అని అక్కడనుంచి తప్పుకొన్నాను.  
నిజమే! వాషింగ్ మెషీన్లొచ్చి చాకలోళ్ళ పని పోయింది, రేజర్లు వచ్చి మంగళ్ళ పొట్టకొట్టాయి. అలాగని అభివృద్ధిని అడ్డుకోలేం కదా! కాలంతో పాటు మనమూ మారాలి. కానీ అలా మారేటప్పుడు విజ్ఞత చూపాలి. కనీసం పేపర్లలోనూ, టి.వి.ల్లోనూ వచ్చే ప్రకటనలను చూసి వేలంవెర్రిగా వాటివైపు మరలటం మానుకోవాలి. శీతలపానీయాలలో పురుగులమందులు కలుస్తున్నాయని తెలిసినా,  వాటి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. " అదేదో తాగి అద్భుతాలు సృష్టించండి" అని ఒక సినిమానటుడో, క్రికెట్ ఆటగాడో చెబితే, ఎంతమంది ఎన్ని చెప్పినా ఆ విషాన్నే తాగుతున్నారు. గుట్టురోగాలతో మరణాల పాలవుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలోనయినా యువతరం వివేకంతో ఆలోచించి ఆరోగ్యప్రదమైన సమాజాన్ని నిర్మిస్తారా? చెప్పటం కష్టమే!  
***

No comments:

Post a Comment

Pages