గంగా సాగర్ యాత్ర - అచ్చంగా తెలుగు
గంగా సాగర్ యాత్ర
అంబడిపూడి శ్యామసుందర రావు


పర్వత శ్రేణుల పుట్టిన నదులు మైదాన ప్రాంతాలలో ప్రవేశించి కొన్ని వేల ఎకరాల భూములను సస్యశ్యామలం చేసి జీవనదులుగా పేరుపొంది మన నాగరికతలకు, సంస్కృతులకు నిదర్శనాలుగా ఈ నదులు నిలుస్తాయి. హిందూ ధర్మములో నదులలో స్నానము అందునా నది సంగమాలలో అంటే నది సముద్రములో కలిసే చోట స్నానమాచరించటం పుణ్యము అని నమ్మకము.
 మనకు కృష్ణా నది బంగాళాఖాతములో  చోటు కృష్ణా జిల్లా లోని హంసల దీవి,గోదావరి బంగాళాఖాతములో కలిసే చోటు పశ్చిమగోదావరి జిల్లాలోని అంతర్వేది ల గురించి తెలుసు .ప్రస్తుతము పరమ పవిత్రమైన గంగా నది సముద్రములో కలిసే చోటు "గంగాసాగరము" గురించి తెలుసుకుందాము.
ఒకప్పుడు రాయల్ బెంగాల్ టైగర్లకు,సుందర్బన్ మడ(మాన్ గ్రూవ్)  అడవులకు ప్రసిద్దిగాంచిన వెస్ట్ బెంగాల్ లోని పూర్తి దక్షిణాన ఉన్నదీవి ఈ గంగాసాగర్.  అంటే సుందర్బన్ ప్రాంతములో హుగ్లీ నది  సాగర సంగమములో ఉండే
దీవియే గంగాసాగర్. ముందు గంగాసాగర్ చేరుకోవటం  తెలుసుకుందాము. కలకత్తా నుండి బస్సులో డైమండ్ హార్బర్ మీదుగా 90 కిలోమీటర్ల దూరములో ఉన్నహార్వుడ్ పాయింట్ దగ్గర గల కాక్ దీప్ చేరుకోవాలి అక్కడ పంచాయితివారు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశములో బస్సులను అపి అక్కడినుండి పెర్రీ వరకు బేటరీ ఆటోలలో
వెళ్ళాలి  ఫెర్రీలో( పెద్దలాంచి) దీవికి ఉత్తరాన ఉన్నకఛుబేరియా అనే ప్రాంతానికి హుగ్లీ నదిలో 3.5km ప్రయాణించి చేరుకోవాలి ఈ ఫెర్రీ ప్రయాణము చాలా ఆహ్లాదకరంగా చుట్టూ పక్షుల కిలకిలా రావలతో హాయిగా సాగుతుంది ఫెర్రీ దిగినాక ప్రయివేట్ జీపులలో 32 km ప్రయాణించి యాత్ర స్థలమైన గంగా సాగర్ ను చేరుకోవచ్చు ఇక్కడినుండి సముద్రతీరమువరకు నడవలేనివారికోసము రిక్షాలు ఉంటాయి.
 ఈ విధముగా రకరకాల ప్రయాణ సాధనలలో ప్రయాణించి గంగా సాగర్ చేరుకోవటము ఒక మంచి అనుభూతి . ఈ ప్రదేశములోనే హిమాలయాల్లో పుట్టిన పవిత్ర గంగ బంగాళా ఖాతములో కలుస్తుంది కాబట్టి ఈ ప్రదేశము హిందువులకు పవిత్రమైన క్షేత్రముగా ప్రసిద్ధిచెందినది. దేవర్షి నారదుడు మహాభారతములో ధర్మరాజుకు గంగాసాగర్ ప్రాముఖ్యతను వివరిస్తూ గంగా సాగర స్నానము పది అశ్వమేధ యాగాల వల్ల వచ్చేపుణ్యానికి సమానమని చెబుతాడు అలాగే స్కంద పురాణములో కూడా గంగా సాగర్ విశిష్టతను వివరిస్తారు.ఏ ప్రాంతములో చనిపోయిన వ్యక్తి ఎముకను గంగాసాగరములో స్నానము ఆచరింప జేస్తే ఆ వ్యక్తికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రజల విశ్వాసము.
ఇక స్థల పురాణము విషయానికి వస్తే దీని చరిత్ర రామాయణ కాలము నాటిది.కర్ధమ మునికి విష్ణు అంశాన జన్మించిన వాడు మహర్షి కపిలుడు  తన తపస్సుకు ఆనాడు పాతాళపురిగా పేర్కొనబడే నేటి గంగాసాగర్ దీవి(కాకులు దూరని చిట్టడవి) ఎన్నుకొని ఆశ్రమాన్నినిర్మించుకొని తపస్సుచేసుకొనేవాడు. ఆనాడు అయోధ్యను ఏలే భరత వంశపు రాజైన సాగరుడు రాజ్య విస్తరణలో భాగముగా అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తూ తన రెండవ భార్య60,000 కుమారులను యాగ ఆశ్వానికి రక్షణగా పంపాడు ఈ ఆశ్వమేద యాగము వల్ల తన ఇంద్ర పదవికి ముప్పుకలగవచ్చు అని భయముతో ఇంద్రుడు యాగ  అశ్వన్ని దొంగిలించి కపిలముని ఆశ్రమములో దాస్తాడు ఈ విషయము తెలియని సాగరుని కుమారులు తపస్సు చేసుకుంటున్న  కపిల మహా మునిని అవమానించి హింసిస్తారు తపోభంగమైన కపిల మహాముని ఆగ్రహించి 60,000 మంది రాకుమారులను  భస్మము చేసి తిరిగి తపోధ్యానము లోకి వెళతాడు. అక్కడ సాగరుడు తనకుమారుల జాడ అశ్వము జాడ తెలియక జాడ తెలుసుకోవటానికి తన మనుమడైన అంశుమానుడిని పంపిస్తాడు. 
అంశుమానుడు ఈ అన్వేషణలో కపిలమహాముని ఆశ్రమము వద్ద యాగ అశ్వాన్ని,తపస్సు చేసుకుంటున్న మునిని చూస్తాడు కానీ రాకుమారులవలె కోపగించుకోకుండా కపిలమహామునిని ప్రార్ధించి ప్రసన్నము చేసుకుంటాడు ప్రసన్నుడైన ముని జరిగిన వృత్తాంతాన్ని తెలియజేసి  చనిపోయిన 60,000మందికి మోక్షప్రాప్తి కలగాలంటే పవిత్ర గంగ  వారి భస్మాలమీదుగా ప్రవహించాలని చెప్పి అంశుమానుడిని అయోధ్య యాగ అశ్వముతో వెళ్లి అశ్వ మేద యాగము పూర్తిచేయమని చెపుతాడు.
కపిల మహాముని సలహామేరకు సాగరుడు యాగాన్ని పూర్తిచేసి గంగకోసము తపస్సు ప్రారంభిస్తాడు కానీ సఫలీకృతుడు కాలేకపోతాడు అదేవిధముగా అంశుమానుడు అయన కొడుకు దిలీపుడు కూడా గంగకోసము తపస్సుచేస్తారు కానీ ఫలితము  ఉండదు. 
చివరకు దిలీపునికి అష్టావక్ర ముని వరము వలన జన్మించిన కుమారుడు భగీరధుడు తన పూర్వీకుల విషయము తెలుసు కొని వారిమోక్ష ప్రాప్తికి  బ్రహ్మ గురించి ఘోర తపస్సు ప్రారంభిస్తాడు బ్రహ్మ భగీరథుని తపస్సుకు సంతోషించి ప్రత్యక్ష మవుతాడు.శ్రీ మహావిష్ణు పాదాలనుండి వెలువడే గంగను మృత్యుభూమికి తీసుకొని వెళ్ళమని చెపుతాడు శంఖము ను ఇచ్చి దానిని ఊదుకుంటూ వెళుతుంటే గంగ నిన్నుఅనుసరిస్తుంది అని బ్రహ్మ  చెబుతాడు.
భగీరధుడు ముందు నడుస్తుండగా గంగ అనుసరిస్తుంది కానీ మధ్యలో పర్వతాలు అడ్డు వచ్చి గంగ ఆగిపోతుంది . ఈ అడ్డంకిని అధిగమించటానికి భగీరధుడు ఇంద్రుడిని ప్రార్ధిస్తాడు ఇంద్రుడు కరుణించి  ఐరావతాన్ని పంపగా ఐరావతము కొండలను బద్దలుకొట్టి గంగ ప్రయాణించటానికి వీలుగా దారి కలుగజేస్తుంది. భగీరధుడికి మరో సమస్య ఎదురవుతుంది భూమి గంగ  వేగానికి తట్టుకోలేదు కాబట్టి బ్రహ్మ సూచన మేరకు పరమశివుడిని ప్రార్ధించగా శివుడు గంగ ను తన జఠ జూటములో బంధించి నేలమీదికి వదులుతాడు. శివుడు సప్త ఋషుల ప్రార్ధన మేరకు గంగను ఏడు  పాయలుగా వదులుతాడు  ఏడోపాయా మాత్రమే భగీరథుని వెంబడి ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణములో గంగా జాహ్నముని ఆశ్రమము ప్రక్కగా ప్రయాణించేటప్పుడు ముని ఆశ్రమాన్ని ముంచెత్తుతుంది ఇది చుసిన జాహ్నముని ఆగ్రహించి గంగను ఔపోసన పట్టి త్రాగేస్తాడు. 

భగీరధునికి అనుకోని అవాంతరం ఏర్పడుతుంది పట్టువదలని భగీరధుడు జాహ్న ముని ప్రార్ధించి ప్రసన్నము చేసుకొనగా ముని కరుణించి గంగను తన మోకాలు నుండి వదులుతాడు అందుకే గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది.
ఈవిధముగా గంగ భగీరధుని సంకల్ప బలము దృఢ దీక్ష ల తో కపిలమహాముని ఆశ్రమము రుతుంది కపిల ముని ప్రార్ధించగా గంగ సాగరుని 60,000 కుమారుల భస్మాలపై నుండి ప్రవహించి వారికి స్వర్గ లోక ప్రాప్తిని కలుగజేసి బంగాళా ఖాతములో కలుస్తుంది కాబట్టి కపిల ముని ఆశ్రమము ఉన్న ప్రాంతాన్ని గంగాసాగర్ అంటారు ఆ విధముగా భగీరథుని విశేషమైన శ్రమ కష్టాల వల్ల పరమపావనమైన గంగ  తన ప్రయాణాన్ని ఇక్కడ పూర్తిచేస్తుంది కాబట్టి ఈ ప్రదేశము హిందువులకు పవిత్రమైన యాత్రాస్థలముగా ప్రఖ్యాతి చెందింది. ఈ ప్రాంతములోనే కపిలముని
గుడి కూడా నిర్మించబడింది 434 A .D  ప్రాంతములో కపిల ముని పాత ఆశ్రమము ఉండేది అది సముద్రగర్భములో కలిసి పోగా ఆప్రాంతములోనే నూతన  ఆలయమును నిర్మించారు ఈ ఆలయములో కపిలముని యోగ ముద్ర లో ఉన్న విగ్రహము ఉంటుంది అయన ఎడమచేతిలో కమండలము తలపై అయిదు తలల నాగేంద్రుడు గొడుగు ఆకారములో ఉంటాడు ఈ గుడిలో కపిలముని విగ్రహముతో పాటు కుడివైపు గంగామాత విగ్రహము, హనుమంతుడి విగ్రహము, ఎడమవైపు సింహారూడురాలైన విశాలాక్షి అమ్మవారు ఉంటారు  . ఇక్కడి సముద్ర తీరంలోని ఇసుక వెండిలా నీలి  రంగు సముద్రము ముందు ఉంటుంది ఇదొక పకృతి రమణీయ దృశ్యము ప్రతి ఏటా మకర సంక్రమణము (మకర సంక్రాంతి)నాడు జరిగే మేళాలో దేశము లోని వివిధ ప్రాంతాలనుండి కొన్ని వేల  మంది యాత్రికులు వచ్చి పితృకార్యాలు నిర్వహించి పెద్దలకు మోక్ష ప్రాప్తికి ప్రార్ధిస్తారు ఈ మేళా గంగానదికి జరిగే కుంభమేళాతో  సమానము.

No comments:

Post a Comment

Pages