వేసంగి సెలవులు - అచ్చంగా తెలుగు
సుబ్బుమామయ్య కబుర్లు!
వేసంగి సెలవులు

ఏవర్రా పిల్లలూ!
పరీక్షలు అయిపోయాయి. మీరు ఎంచక్కా రాసి మంచి మార్కులతో పాసయ్యారని నాకు తెలుసు. మీరందరూ వేసంగి సెలవుల్లో ఉన్నారు కదూ. సెలవులంటేనే ఆటవిడుపు. పైగా ఇన్నన్ని సెలవులు. ఎంత సంబరంగా ఉంటుంది.
ఎండలు మండి పోతున్నాయి. బయట ఎండలో ఆడుకోవద్దు..వడదెబ్బ కొడుతుంది. ఆరోగ్యం పాడైతే మన సెలవులన్నీ వృధానే కదా! అందుకని నీడ పట్టున ఉండి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
చాలామంది పిల్లలు వేసవి సెలవుల్ని సరదాగా ఆటపాటలతో అలా..అలా గడిపేస్తారు. మరి మీరేమో అచ్చంగాతెలుగు పిల్లలు కదా..అందుకని సెలవుల్ని సద్వినియోగం చేసుకోండి. ఎలాగంటారా? రాస్తాను శ్రద్ధగా చదవండి.
1. ఎలాగైనా పాత చందమామల్ని సంపాదించి (నెట్లో కూడా దొరుకుతాయి) కథల్ని చదవండి. ఎంత బావుంటాయో! మేము అవి చదివే పెద్దయ్యామర్రా.
2. పాత సినిమాలు బంగారం..అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారే..అలా అన్నమాట..అంచేత మంచి మంచి సినిమాలు పెద్దవాళ్లతో పెట్టించుకుని హాయిగా చూసేయండి.
3. వేమన, సుమతీ లాంటి శతకాలెన్ని ఉన్నాయో తెలుసుకుని అందులోని పద్యాల్ని టీకా తాత్పర్యాలతో సహా నేర్చుకోండి. వీలుంటే రాయడం కూడా.
4. మీకు మ్యాజిక్, మ్యూజిక్, డ్రాయింగ్, ఇన్ స్ట్రూమెంట్స్ నేర్చుకోవాలని ఉందా? మరెందుకాలస్యం అమ్మా, నాన్నలతో చెప్పి ఎక్కడైనా చేరండి..చక్కగా నేర్చుకోండి
5. మీరు లెక్కల్లాంటి సబ్జెక్టుల్లో వీకా? అయితే ఇదే మంచి సమయం..బాగా నేర్చుకుని పై తరగతుల్లో మీ సత్తా చాటండి
6. మీరు ఊళ్లకెళ్లారా? అయితే అక్కడి ప్రత్యేకతలు పెద్దవాళ్లని అడిగి తెలుసుకుని ఒక పుస్తకంలో రాసుకోండి.
7. పర్యాటక ప్రదేశాల్లో ఉన్నారా? ఆ ప్రదేశాల్లోని చూడతగ్గవి పుస్తకంలో పొందుపరచి స్కూళ్లు తెరిచాక మీ స్నేహితులతో పంచుకోండి.
8. చిన్న చిన్న కథలూ..కవితలు రాయడానికి ప్రయత్నించండి. అచ్చంగాతెలుగులాంటి అంతర్జాల పత్రికలతో సహా ఎన్నో పత్రికలు ప్రచురించి ప్రోత్సహిస్తున్నాయి. మీ ఫ్రెండ్స్ కి చూపించి ఆశ్చర్యపరచవచ్చు.
9. ఇవికాక ఆటల్లో, పాటల్లో మెళకువలు నేర్చుకుని నిత్య సాధనతో పట్టు సాధించవచ్చు.
చివరిగా ఒక్క విషయం. సమయం చాలా విలువైంది. దాన్ని వృధాగా గడిపేకన్నా, ఉపయోగించుకుని వృద్ధిలోకి రావడం జీవితానికెంతో ముఖ్యం. మరి మీరు పైన చెప్పినవి చేస్తారు కదూ..ఉంటాను మరి!
మీ మామయ్య
ప్రతాప వెంకట సుబ్బారాయుడు

No comments:

Post a Comment

Pages