చాటు కవిత్వం - అచ్చంగా తెలుగు
చాటు కవిత్వం
రమణ బాలాంత్రపు 



తెలుగులో చాటుకవిత్వం ఒక విలక్షణమైన ప్రక్రియ. బహువిస్తృతమైనది, వైవిధ్యంతో కూడుకున్నది. చాటువులు ఆశుకవితా మార్గానికి చెందినవి కావడంవల్ల చాటుపద్యాలు సాధారణంగా  మౌఖికంగానే ప్రచారంలో ఉంటాయి
వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు, రావూరి దొరసామి శర్మ గారు, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు మొదలైన పండితులు చాలా చాటువులు సేకరించి ప్రచురించారు.   
ఆధునికుల్లో శ్రీమతి జీ. లలిత గారు తెలుగులో చాటు కవిత్వంపై విశేషమైన కృషి చేసి పుస్తకంగా ప్రచురించారుదీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి బహుమతి కూడా లభించింది. ఆవిడ తెలుగులోని వేలాది చాటువుల్ని పరిశీలించి, విషయాన్ని బట్టి స్థూలంగా చాటువుల్ని ఇలా వర్గీకరించారు.
స్తుతి చాటువులు, ధూషణ చాటువులు, వర్ణనాత్మక చాటువులు, పాండితీ ప్రదర్శక చాటువులు, సమస్యాపూరణ చాటువులు, చమత్కార, శృంగార, హాస్య చాటువులు, నీతి, తాత్త్విక చింతనతో కూడిన చాటువులు, స్మృతి చాటువులు, సాహితీ పొడుపు కథల చాటువులు, సంకీర్ణ చాటువులు మొదలైనవి
శ్రీనాథుడి చాటువుల్లో కూడా కావ్యాల్లో కనిపించే రచనా శిల్పం కనిపిస్తుందిడా. మురళి అహోబిల గారు   శ్రీనాథుని కొన్ని చాటుపద్య రత్నాలని పొందుపరిచారు. వాటికి తోడుగా  మరి కొన్ని కవిసార్వభౌముని చాటువులు.


దీనార టంకాల తీర్థమాడించితి


        దక్షిణాధీశు ముత్యాలశాల

పల్కుతోడై తాంధ్రభాషా మహాకావ్య
       నైషథగ్రంథ సందర్భమునను
పగలగొట్టించితుద్భట వివాదప్రౌఢి
       గౌడ డిండిమభట్టు కంచుఢక్క
చంద్రభూష క్రియాశక్తి రాయల యొద్ద
       పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు

నెటుల మెప్పించెదో నన్ను నింకమీద
రావు సింగన భూపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సరస సద్గుణ నికురంబ శారదాంబ !


సర్వఙ్ఞ సింగభూపాలుని ఆశ్రయించడానికి వెళుతూ శ్రీనాథ మహాకవి శారదాదేవిని స్మరించిన పద్యం ఇదిశ్రీనాథుడు గౌడ డిండిమభట్టును ఓడించి, ముత్యాల శాలలో స్వర్ణస్నానం చేసి, కవిసార్వభౌమ బిరుదాన్ని పొందినా కూడా ఎంతో వినయంగా, ఇకమీద సర్వజ్ఞడిగా పేరుపొందిన సింగభూపాలుని కొలువులో ఏవిధంగా నన్ను కరుణిస్తావో తల్లీఅని వేడుకున్నాడు
విజయనగర సామ్రాజ్యంలో రాజదర్శనానికి శ్రీనాథుడంతటివాడు కూడా  బాగా శ్రమపడవలసి వచ్చిందిరాజదర్శనానికి నిరీక్షిస్తూ అప్పటికి శాస్త్ర నిషిద్ధాలయిన పనులు చేసినట్టు తెలిపే చాటువు ఇది:

     కుల్లాయుంచితి కోకచుట్టితి మహాకూర్పాసముందొడ్గితిన్
     వెల్లుల్లిందిల పిష్ట మున్నెసవితిన్ విశ్వస్తవడ్డింపగా
    చల్లాయంబలి ద్రావితిన్ రుచులు దోసం బంచు బోనాడితిన్ తల్లీ!
     కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడన్!

ప్రౌఢదేవరాయల సభలో శ్రీనాథుని ఆత్మ ప్రత్యయాన్ని తిలకించవలసిందే:-
     డంబు సూపి భూతలంబుపై తిరుగాడు
           కవిమీద గాని నా కవచ మేయ
     దుష్ప్రయోగంబుల దొరకొని చెప్పెడు
           కవిశిరస్సున గాని కాలుచాప
     సంగీత సాహిత్య సరసవిద్యల నేర్చు
          కవుల రొమ్ముల గాని కాల్చి విడువ
     చదివి చెప్పగ నేర్చి సభయందు విలసిల్లు
         కవి నోరు గాని వ్రక్కలుగ తన్న 
      దంట కవులకు బలువైన యింటి మగడ
      కవుల వాదంబు వినవేడ్క గలిగె నేని
     నన్ను పిలిపుంపుమాస్థాన సన్నిధికిని
     లక్ష్మణోపేంద్రప్రౌఢరాయక్షితీంద్ర!
శ్రీనాథుడు తెలుగురాయని "కవీంద్రులకి కస్తూరీ భిక్షాదానం చెయ్యవయ్యా! ఎందుకంటే కస్తూరి సువాసనలతో దక్షారామ భీమేశ్వరుని సేవించే అప్సరసల వక్షోజాలు గుభాళించాలి! అన్నాడు క్రింది  పద్యంలో.

అక్షయంబుగ సాంపరాయని తెలుంగాధీశ! కస్తూరికా
భిక్షాదానము సేయరా సుకవిరాడ్బృందారక శ్రేణికిన్
దక్షారామపురీవిహార వర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయ కుంభి కుoభములపై వాసించు తద్వాసనల్

శ్రీనాథుడివి కాని కొన్ని పద్యాలు కూడా శ్రీనథుని చాటువులుగా ప్రచారంలో లేకపోలేదు.

సరే, శ్రీనాథుని ఆదరించిన రాజులు అంతరించారురాజభోగాలు అనుభవించిన శ్రీనాథుడు అష్టకష్టాలు అనుభవించాడుఅవసానదశలో భూమిని నమ్ముకున్నాడు, కానీ ప్రయోజనం లేకపోవటంవల్ల తన దైన్యాన్ని శ్రీనాథుడు కింది కమనీయమైన విషాద మాధుర్యమైన సీసపద్యంలో వర్ణించాడు.

కాశికా విశ్వేశు కలసె వీరా రెడ్డి
     రత్నాంబరంబులే రాయుడిచ్చు
రంభగూడె తెలుగు రాయరాహత్తుండు
     కస్తూరికే రాజు ప్రస్తుతింతు
స్వర్గస్తుడయ్యె విస్సనమంత్రి మఱి హేమ
     పాత్రాన్న మెవ్వరి పంక్తి గలదు
కైలాసగిరి పండె మైలార విభుడేగి
     దినవెచ్చ మే రాజు తీర్చగలడు

భాస్కరుడు మున్నె దేవుని పాలికరిగె
కలియుగంబున నికనుంట కష్టమనుచు
దివిజ కవివరు గుండియల్దిగ్గురనగ
అరుగు చున్నాడు శ్రీనాథు డమరపురికి

పద్యంలో కూడా రాజసాన్ని, కవిసార్వభౌమత్వాన్ని వదలని వ్యక్తిత్వం శ్రీనాథుడిది.   "ఇదిగో వస్తున్నాను స్వర్గానికి అక్కడుండే  కవిశ్రేష్ఠుల గుండెలు గుభేలనేలాగ!" అనగలిగిన ఆత్మస్థైర్యం, ఆత్మ ప్రత్యయం కలవాడు  కవిసార్వభౌముడు  శ్రీనాథుడు.  
తెనాలి రామలింగని చాటువులుగా చాలా పద్యాలు వ్యాప్తిలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల కీర్తిని స్తుతించే చిత్ర విచిత్రమైన చాటువు ప్రసిద్ధమైనదే -

     నరసింహ కృష్ణరాయని
     కరమరుదగు కీర్తి యొప్ప కరిభిద్గిరిభి
     త్కరి కరిభిద్గిరి గిరిభి
     త్కరి భిద్గిరి భిత్తురంగ కమనీయంబై 
కృష్ణదేవరాయల కీర్తి శివుని వంటి తెలుపు గలది, ఐరావతం వంటి తెల్లనిది, శివుని కైలాసం వంటి తెల్లనిది, వజ్రాయుధం, నందీశ్వరుని వంటి తెలుగు గలది, ఇంద్రుని వాహనమైన  ఉచ్చైశ్రవం అనే గుఱ్ఱం వంటి తెలుపుతో కమనీయమైన కీర్తితో నరసింహరాయుని కుమారుడైన కృష్ణదేవరాయలు ప్రకాశించెను అని అర్థం
రాయలవారు ఇచ్చిన
     "కలనాటి ధనము లక్కర
     గల నాటికి దాఁచఁ గమలగర్భుని వశమా?"
సమస్యని - పెద్దన ఇలా పూరించాడట:
     నెలనడిమి నాటి వెన్నెల
     యలవడునే గాదెఁ బోయ నమవస నిశికిన్
(ధనమున్ననాడు దానిని అవసరమయ్యే రోజుకోసం దాయడం విష్ణువుకు కూడా తరంకాదుఎలాగంటే నెలమధ్యలో వచ్చే పౌర్ణమినాటి వెన్నెలను అమావాస్యనాటి చీకటిని పారద్రోలడం కోసం గాదెలో పోసి నిల్వ చేయగలమా? అని దీని భావం.
తానెంతో గౌరవించే ఆంధ్రకవితాపితామహ అల్లసాని పెద్దన అమావాస్యా శబ్దతత్భవమైన ' అమవస ' అనే వికృత  శబ్దాన్ని ప్రయోగించాడని రామకృష్ణుడు ఆయన్ని ఎంత నిర్దాక్షిణ్యంగా అవహేళన చేశాడో చూడండి.
    ఎమితిని సెపితివి కపితము
    బెమపడి వెఱిపుచకాయ వడిఁదిని సెపితో
     ఉమతక్కయఁ దిని సెపితో
     అమవస నిశి అన్నమాట అలసని పెదనా!

రాజులను స్తుతించిన చాటువులలో ఎన్నో చమత్కారాలు కనిపిస్తాయి.
    సంగీత సాహిత్య సరస విద్యలకిచ్చు  
    బహురూపులకు నిచ్చుఁ బట్టుకిచ్చు
    పెండ్లిపేదలకిచ్చు పేదవిప్రులకిచ్చు
    బీద సాదులకెల్ల పిలిచి యిచ్చు
     తిట్ట వచ్చిన నిచ్చు దీవించగా నిచ్చు....
అనే చాటువులో మంత్రి రాయని భాస్కరుని దాన గుణాన్ని కీర్తించాడొక కవి.
వేములవాడ భీమకవి పద్యాలలో శపించిన చాటువులు వ్యాప్తిలో ఉన్నాయి.
తురగా రామకవి పెద్దాపుర ప్రభువైన వత్సవాయ తిమ్మ భూపతిని శపించిన పద్యం ఇది -
     అద్దిర! శ్రీ భూనీళలు
     ముద్దియలా హరికి గలరు ముగురమ్మలలో
     పెద్దమ్మ నాట్యమాడును
     దిద్దమ్మని వత్సవాయ తిమ్మని యింటన్  
కందుకూరి రుద్రకవి ఒకరాజు మీద గల కోపంతో దీర్ఘ సమాసాలతో చెప్పిన తిట్టు పద్యం ఇది -
     తిట్టుదునా మహాగ్రకర తీవ్రవచో వరగద్య పద్య సం
     ఘట్ట ఘరట్ట ఘట్ట వధగా విధిగాచిన నైన మానినీ
     పట్టణ వప్రసౌధమణి బంధుర సైంధవాఢ్యులన్
     బట్టపు రాజులన్ దొరల బండితులన్ దురహంకృతాద్రులన్ !
క్రింది సీసపద్యం చాలా ప్రసిద్ధి చెందినదిసహస్రఘంటకవి ప్రెగ్గడ నరసింహకవి చెప్పినట్టుగా తెనాలి రామకృష్ణ చిత్రంలో చూపించారుశ్రీనాథుడు చెప్పినట్టుగా కవిసార్వభౌమ శ్రీనథుడు చిత్రంలో చూపించారు. ఇంతకీ పద్యకర్త ఎవరో సరిగ్గ నిర్ధారించబడలేదుఇందులో క్రమాలంకారం ఉంది. చతుష్పాదయమకం ఉంది.
    రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలపనల్లయ వేమ ధరణిపతికి
     రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలపనల్లయ వేమ ధరణిపతికి
     రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలపనల్లయ వేమ ధరణిపతికి
     రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలపనల్లయ వేమ ధరణిపతికి
      భావ భవభోగ సత్కళా భావములను
      భావ భవభోగ సత్కళా భావములను
      భావ భవభోగ సత్కళా భావములను
      భావ భవభోగ సత్కళా భావములను
పద్యానికి చాలా గొప్ప, పొడుగైన  అర్థాలే వివరించారు పండితులు.  
అయితే రామలింగకవి "ఓస్! పద్యానికర్థం చెప్పడమో బ్రహ్మవిద్యా... లోపులో పద్యం అర్థం చెప్పండి - అని
"మేకకు తోక..." పద్యం చెప్పాడట.
"అప్పిచ్చువాడు..." పద్యానికి శ్రీ శ్రీ గారి పేరడీ  -
     ఎప్పుడు పడితే అప్పుడు
     కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
     చొప్పడిన యూరనుండుము
     చొప్పడ కున్నట్టి యూరు చొరకుము మువ్వా.
"మాటకున్న విలువ తూటాకి వుందా?" అన్నారు సినారెమాట ప్రాధాన్యం గురించి చెప్పబడిన చాటువును నిత్యం స్మరించు కోవాల్సిందే :

     మాటల చేత దేవతలు మన్నన జేసి వరంబులిచ్చెద
     ర్మాటల చేత భూపతులు మన్నన జేసి ధనంబులిచ్చెద
     ర్మాటల చేత కామినులు మన్నన జేసి సుఖంబులిచ్చెద
     ర్మాటల నేరకున్న నవమానము న్యూనము మాన భంగమున్!
 ***




No comments:

Post a Comment

Pages