'అంతా విష్ణుమాయే !' - ప్రముఖ సినీనటులు సుదర్శన్ గారు - అచ్చంగా తెలుగు

'అంతా విష్ణుమాయే !' - ప్రముఖ సినీనటులు సుదర్శన్ గారు

Share This
 'అంతా విష్ణుమాయే !' - ప్రముఖ సినీనటులు సుదర్శన్ గారు 
భావరాజు పద్మినిపైకి చూస్తే ‘ఇంతేనా,ఉత్త నీరేగా !’ అనిపిస్తుంది సముద్రం. కాని గుండె లోతుల్లోకి తరచి చూస్తే, ఆ నీటిలోనే జలచరాలు, ఆణిముత్యాలు, పగడాలు... వెలకట్టలేని నిధులు ఉంటాయి.  సుడిగుండాలు, బడబానలాలు మౌనంగా దాచుకున్న దాఖలాలు కూడా ఉంటాయి ! అవన్నీ పరిశీలిస్తే సాగర గాంభీర్యం చూసి, ...‘ఔరా!’ అనిపిస్తుంది. అలాగే మనం సాధారణ హాస్య నటులేగా అనుకునే సుదర్శన్ గారు కూడా ! వారు నటులే కాదు, గతంలో విద్యార్ధులను తీర్చిదిద్దిన లెక్చరర్, స్పూర్తిదాయకమైన ప్రసంగాలు ఇచ్చే మంచి వక్త, అక్షరాలలో అద్భుతాలను ఆవిష్కరించే గొప్ప రచయత, ఇలా చెప్పుకుంటూ పొతే ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి లోని కళాసంపదలు ఎన్నో ! వీరితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీ కోసం...

“డాక్టర్ కాబోయి ఆక్టర్ అయ్యాను...” అంటూ ఉంటారు కదండీ. మరి మీరు చిన్నప్పుడు అసలు ఏమౌదామనుకున్నారు ?
‘అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి...’ అనే ఒక పాటుందండి. అలా అందరూ డాక్టర్ అవుదామని, కలక్టర్ అవుదామని అనుకున్నామని చెబుతూ ఉంటారు. కాని, అది యాధృచ్చికమోఏమో కాని, నేను మాత్రం సినిమా ఆక్టర్ అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. అది కేవలం దైవనిర్ణయం వలన అలా జరిగింది.
అయితే కళల పట్ల అభిరుచి, అభినివేశం అన్నీ ఉన్నాయి. ఎలిమెంటరీ, హై స్కూల్ లెవెల్లోనే నాటకాలు వెయ్యటం, నాటకాలు చూడడం వంటివి చేస్తూ ఉండేవాడిని. అదే కాలేజీలో కొనసాగింది. నిజ జీవితంలో ఎప్పుడూ డ్రామాలు వెయ్యలేదు కాని, చిన్నప్పటి నాటకాలు మాత్రం వేసాను. ఆ కళా బీజాలు చిన్నప్పటి నుంచి నా హృదయ క్షేత్రంలో ఉన్నాయి.
పదేళ్ళ వయసు నుంచి నాటకాల్లో నటించారు కదా ! అప్పుడు జరిగిన ఒక మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్పండి.
నేను చిన్నప్పుడు నాటకాలు వేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్లకి తెలియకుండా మా తాతగారి గదిలో రిహార్సెల్స్ చేసేవాళ్ళం. ఇంట్లో వాళ్లకి తెలియకుండా దుప్పట్లు, చిన్న చిన్న కర్టైన్లు వంటివి తెచ్చి, అక్కడ అడ్డంగా కట్టేసి, చార్కోల్ పొడి, కాటుక పొడి, తిలకం, కుంకుమ సీసాలు వంటివి పట్టుకొచ్చి మేక్ అప్ లు చేసుకుని, అక్కడ నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. మరి ఆ నాటకాలకు కంటెంట్ ఏమిటి అంటే, చిన్నప్పుడు మా అక్కావాళ్ళు చెప్పిన కధలు అవీ విని, వాటినే నాటకంగా మలిచేసి, వేసేవాళ్ళం.
ఉదాహరణకు ‘అంతా మన మంచికే ‘ అని ఒక కధ చెబితే, ఆ కధలో రాజుగారు, మంత్రి అడవికి వెళ్ళడం, అక్కడ మంత్రి ‘అంతా మన మంచికే ‘ అని మాటిమాటికీ అంటూ ఉండడం, ఇలా ఆ కధల్ని నాటకంగా మలిచి, సరదాగా ఇద్దరు ముగ్గురం కలిపి, ఆడేసేవాళ్ళం.
వేస్తాం సరే, మరి చూసేవారు ఎవరు? చిన్న చిన్న పిల్లలకు పటిక బెల్లాలు, పప్పు బెల్లాలు లంచం ఇచ్చి, కూర్చుని చూడమని లంచం ఇచ్చేవాళ్ళం. వాళ్ళే మాకు ఆడియన్స్. వీళ్ళలో ఎవడైనా ఇంట్లో ఈ సంగతి లీక్ చేసాడంటే, ఆ తర్వాత అసలు నాటకం క్లైమాక్స్ ఉండేది. తప్పట్లు బదులు దెబ్బలు వీపు మీద పడేవి. అందుకని, వాళ్ళని మచ్చిక చేసుకుని, వాళ్ళనే ఆడియన్స్ గా జారిపోకుండా మైంటైన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం.
అలాగే ఎలిమెంటరీ స్కూల్ లో మొట్టమొదటి సారి ఆరో క్లాసులో నాతో మా మాష్టారు ‘మొండి గురువు – బండ శిష్యుడు’ అన్న నాటకం వేయించారు. అందులో నేను బండ శిష్యుడి వేషం వేసాను. అది పబ్లిక్ షో. జనాలందరూ ఓ చప్పట్లు కొట్టసాగారు. అది మొట్టమొదటి థ్రిల్... ఆ చప్పట్లు ఎక్కడో నా మస్థిష్కంలో ఉండిపోయి, నేను అటువైపు నడవకపోయినా, నన్ను అటుగా నడిపించి తీసుకుని వెళ్లి ఉంటాయి.
‘మరపురానివి కాలేజి రోజులు’ అంటూ ఉంటారు కదా ! అందరికీ కాలేజి రోజులు ఒక్కసారే వస్తే లెక్చరర్ లకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అలా మీరు లెక్చరర్ గా ఉన్నప్పుడు జరిగిన మర్చిపోలేని అనుభూతులు ఏమైనా ఉన్నాయా?
కాలేజి లో నేను లెక్చరర్ గా ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ వైపు కన్నా, ఎక్కువ కళల వైపే ఉండేవాడిని. కధలు, కవితలు రాసేవాళ్ళను ప్రోత్సహించే వాడిని. అలాగే కాలేజి పత్రికకు ఎడిటర్ గా ఉండి, వాళ్ళ కధలు, కవితలు వేయించేవాడిని. ఆ తర్వాత వారంతా మంచి మంచి రచనలు కూడా చేసారు. అలాగే వార్షికోత్సవ వేడుకలకు వాళ్ళతో నాటకాలు, డాన్సులు వేయించేవాడిని. ఒక రకంగా నాలో ఉన్న ఆసక్తి ఉన్నవారిని గమనించి, దగ్గరికి తీసుకుని ప్రోత్సహించే వాడిని. మామూలుగా ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కాలేజీలలో ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టరు. ఎంత సేపూ రోడ్లు వెయ్యటం, కాలువలు తవ్వడం, మిషనరీ విషయాలు ఉంటాయి. అంత టైం, కళాహృదయం ఉన్నవారు కూడా తక్కువగా ఉండేవారు. అటువంటి పరిస్థితుల్లో నేనే చొరవ తీసుకుని, కళాకారుల్ని ప్రోత్సహిస్తూ ఉండేవాడిని. ఆ పిల్లలంతా నా చుట్టూనే ఉండేవారు. వాళ్ళతో రిహార్సెల్ చేయించడం, డైరెక్షన్ చెయ్యటం, ఆ తర్వాత వారిలో కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు గా, డైరెక్టర్లు గా సినీ ఫీల్డ్ కు రావడం  ఇవన్నీ గొప్ప మధురానుభూతులు.
బాపు-రమణలతో మీకున్న అనుబంధం గురించి చెప్పండి.
బాపురమణల గురించి చెప్పడం అంటే గోదావరి, కృష్ణా నదుల గురించి చెప్పడంలా ఉంటుంది. వాళ్ళు కళ ద్వారా తమ జీవితాల్ని సుసంపన్నం చేసుకున్నారు. ‘బాపురమణలు ఒక అందమైన ద్వంద్వ సమాసం ‘అన్నారెవరో. అంటే అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఇలా పెనవేసుకుపోయిన పేర్లలో ఒకరు అన్నారు. వాళ్ళలో చాలా వైవిధ్యాలు ఉన్నా, ఎవరి స్పేస్ లో వారు ఉండి స్పందిస్తూనే, జంటగా మధురమైన సంగీతాన్ని వారు ఉత్పత్తి చేసేవారు. ఆ సంగీతమే మనం చూసిన వారి సినిమాలు కాని, బాపుగారి గీతలు కాని, రమణ గారి రాతలు కాని... ఇలా వారు ఇద్దరూ కలిసి అద్భుతాలు సృష్టించారు. ఒక ఆర్కెస్ట్రా లో వివిధ సంగీత వాయిద్యాలు కలిస్తే ఒక అద్భుతమైన సంగీత కచేరీ ఎలా ఉద్భవిస్తుందో, అలా వారు కలిసి చేసిన కచేరీలే మనం చూసిన వారి సినిమాలు.
వారితో పనిచెయ్యడం మీకు ఎలా అనిపించింది?
నేను హై స్కూల్ నుంచే రమణ గారి సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. వారితో పరిచయం లేదు కాని, ఆ హాస్య ఒరవడి చాలా చక్కగా, థ్రిల్లింగ్ గా ఉండేది. బుడుగు, రాధాగోపాలం, జనతా ఎక్ష్ప్రెస్స్, ఇద్దరమ్మాయిలు ముగ్గురబ్బాయిలు, విక్రమార్కుడి మార్కు సింహాసనం కాని, ఇటువంటి రచనలన్నీ చాలా ఇష్టంగా చదివేవాడిని కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అలాగే బాపు గారి సినిమాలంటే ఆసక్తి ఉండేది. కాని, నాకు రచనలంటే ఎక్కువ ఇష్టం కనుక రమణ గారిని ఎక్కువగా ఇష్టపడేవాడిని. ఒకసారేప్పుడో బాపు గారు సారధి స్టూడియోస్ లో ‘పెళ్లీడు పిల్లలు’ అనే సినిమా తీస్తున్నప్పుడు వెళ్లి చూసాను, వారిని చూడడం అదే మొదటిసారి. ఆ రోజు అనుకోకుండా మహాశివరాత్రి రోజు. వాళ్ళిద్దరి చేత నా డైరీ లో ఆటోగ్రాఫ్ లు తీసుకున్నాను. అవి ఇప్పటికీ ఉన్నాయి.
తర్వాత నేను వాళ్ళ సినిమాల్లో ఆక్ట్ చేస్తానని, వారు నాకు అవకాశం ఇస్తారని అప్పుడు కనీసం ఊహించాను కూడా లేదు.
‘అంతా విష్ణుమాయ’ అంటారు.
కరెక్ట్. అంతా విష్ణుమాయ లాగానే జరిగిపోయింది. తర్వాత వాళ్ళు నన్ను సినిమాకి తీసుకోవడం, వాళ్ళ ఆఫీస్ లోనే నన్ను పెట్టుకోవడం జరిగింది. వారిని అతి దగ్గరగా చూడడం, ఇవన్నీ గొప్ప మర్చిపోలేని అనుభూతులు. నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నది, వీరి వద్దనేనా? ఇంత గొప్ప వ్యక్తిత్వాలను, అంత గొప్ప మనుషుల్ని దగ్గరగా చూడడం, వాళ్ళ అభిరుచులవీ తెలుసుకోవడం ఇదంతా గొప్ప థ్రిల్ అండి.
మీ దృష్టిలో హాస్యం అంటే ఏమిటండి? హాస్యం ఎలా ఉండాలని మీ అభిప్రాయం?
హాయిగా నవ్వుకునేలా ఉండాలి. నవ్వుకుని మర్చిపోయేలా ఉండకూడదు, మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకునేలా ఉండాలి. కేవలం గిలిగింతలు కాకుండా, ఒక చక్కటి భావనను కూడా తీసుకురావాలి. కరుణే గొప్ప రసం అని కొందరు అన్నారు కాని, నా దృష్టిలో హాస్యం, శృంగారం గొప్ప రసాలు. అలా ఒకరిని నొప్పించనిది, గాయపరచనిది అయి ఉండాలి. సెటైర్ కూడా హాస్యంలో భాగమే కాని, అది ఎలా ఉండాలంటే, మొగలిపువ్వు అలా విసిరినట్టు ఉండాలి. ఆ ముల్లు గుచ్చుకునే లోపు, పరిమళం మనల్ని కమ్మేస్తుంది. ఆ చురుకులో ఒక పరిమళం ఉంది. పరిమళమే ఒకపాలు ఎక్కువగా ఉంటుంది. కనుక, సెటైర్ లో అయినా కూడా ఇటువంటి హాస్యాన్ని పండించాలి. దాన్ని మనం తలచుకున్నప్పుడు, పంచుకున్నప్పుడు కూడా పరిమళం పెరగాలి. ఆనందం కలగాలి, హాయి కలగాలి, మనకు తెలియకుండానే పది మందిలో ఉన్నప్పుడు కూడా చిరునవ్వు పుట్టించాలి. ఎందుకు నవ్వుతున్నామో వాళ్ళు అడగాలి, మనం పంచుకుని, వాళ్ళనీ నవ్వించాలి... ఇదండీ !
మీరు చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? మీరు మర్చిపోలేని ప్రశంస ఏది?
నచ్చిన పాత్రలు చాలా ఉన్నాయండి. సాధారణంగా మనకు బాగా పేరొచ్చిన పాత్రే నచ్చింది అని చెప్తాము. నచ్చితేనే, బాగా చేస్తాం, బాగా చేస్తేనే పేరొస్తుంది కదా. ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. అలా నాకు నచ్చిన పాత్రలు మిష్టర్ పెళ్ళాం, ఎలా చెప్పను, ఆంధ్రుడు, మల్లేశ్వరి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం , ఇలాంటి పాత్రలన్నీ నాకు మంచి గుర్తింపు తెచ్చాయి. వీటిల్లో కంటెంట్ కూడా బాగుంటుంది. ఏ పాత్ర అయినా ఇష్టపడే చేస్తాం, కాని అందులోని కంటెంట్ బాగుంటే ఇంకా ఫీల్ తో చేస్తాము. చెయ్యాల్సినవి ఇంకా చాలా ఉన్నాయండి.
దుబాయ్ లో తనికెళ్ళ భరణి గారి అధ్వర్యంలో కామెడీ స్కిట్స్ చేసాము. అందులో నేను తెలుగు బామ్మ పాత్ర వేసాను. భరణి గారు ఆ పాత్రని డిసైన్ చేసారు. దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చి చప్పట్లు కొట్టడం ఒకెత్తు అయితే, భరణి గారు ఈవిడ మా బామ్మ, ప్రసంగించడానికి వచ్చింది అని సభకు నన్ను పరిచయం చేస్తే, నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ బామ్మ బాధలన్నీ నేను చెప్పుకుంటూ ఉంటే, ఒక ఐదు నిముషాల తర్వాత ఒక డాక్టర్ గారు లేచి, ‘ఏవండి, పెద్దావిడని కూర్చుని మాట్లాడమనండి, ఎంతసేపని నిల్చోగలరు ఆవిడ... ఓ కుర్చీ వెయ్యండి...’ అని అన్నారు. ఆ తర్వాత మేక్ అప్ తీసేసి నాకు ప్యాంటు షర్టు వేసి చూపిస్తే కాని, ఆయన నమ్మలేదు. ఇంతకన్నా గొప్ప ప్రశంస ఏముంటుందండి? సినిమాల్లో చాలా ప్రశంసలు వచ్చాయి కాని, అక్కడ లైవ్ లో ఇలా జరగడం గొప్ప సంగతి. ఇది వాళ్లకు గొప్ప అనుభూతి, మనకు ప్రశంస.
రచనల పట్ల, సాహిత్యం పట్ల మీకు మక్కువ ఎలా కలిగింది?
చిన్నప్పటి నుంచి నాలో ఆ బీజాలు ఉన్నాయి. మా కుటుంబంలో పెద్ద కళాకారులు ఎవరూ లేరు. తాతగారు అడ్వొకేట్, మా కుటుంబంలో టీచర్లు అలా ఉన్నారు. చదవటం అనేది చాలా విచిత్రంగా మొదలై, అది పెద్ద వ్యాపకంలా మారిపోవడం, జరిగింది. పుస్తకాల్లో కూడా వైవిధ్యభరితమైన రచయతల రచనల్ని ఎంచుకునే వాడిని. ఇటు చలం గారు, అటు ముళ్ళపూడి వారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, చండీదాసు, రావిశాస్త్రి గారు, ఇలాంటివి అన్నీ చదివేవాడిని. అలా నాకు తెలియకుండానే ఇది మహావృక్షం అయిపొయింది. ఇప్పటికీ బుక్ ఎక్సిబిషన్ కి వెళ్లి పుస్తకాలు కొంటూ ఉంటాను. వచనం రాసినా కవిత్వం లాగే రాస్తానన్న కామెంట్స్ చాలా సార్లు వచ్చినా. అదొక విధంగా అలవాటు అయిపొయింది.
వీలు దొరికినప్పుడల్లా మోటివేషనల్ స్పీచ్ లు ఇస్తారు కదా, వక్తగా మీకు ప్రేరణ కలిగించినవారు ఎవరు?
నన్ను నేను తెలుసుకుని, ఆవిష్కరించునే ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలో నేను డిజైన్ చేసుకున్న స్పీచ్ లు ఇవి. నాకు ఏది ఆనందాన్ని కలిగిస్తుంది, స్పూర్తిని కలిగిస్తుంది, నాకు నిరాశగా ఉన్నప్పుడు ఏది నాకు తిరిగి ఆశను కలిగిస్తుంది, ఉత్సాహంగా ఉన్నప్పుడు నాలో శక్తి ఎలా ద్విగుణీకృతం అవుతుంది, ఇలా నన్ను నేను అధ్యయనం చేసుకునే ప్రక్రియలో ఇటువైపు ఆసక్తి కలిగింది. ఇటువంటి ప్రసంగాలను ఇవ్వటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.
నన్ను ఈ దిశగా చాలా ప్రభావితుల్ని చేసిన వారిలో ప్రధానంగా ఓషో ఒకరు. జీవితం పట్ల ఆయన దృక్పధం, సూక్తులు, వంటివి అన్వయించి చూస్తే చక్కగా సరిపోయేవి. ఇక  స్వామి చిన్మయానంద, స్వామి సుఖ బోధానంద, సద్గురు జగ్గీ వాసుదేవ్ లాంటి వారు కూడా నాలో ఒక ఆధ్యాత్మిక కోణాన్ని సృష్టించడానికి ఉపయోగపడ్డాయి.
మనకున్నది ఒక్కటే జీవితం. ఒక్కసారే జీవించగలం, కాబట్టి మన జీవితం నుంచే మనం నేర్చుకోవడం మొదలుపెట్టాలంటే నేర్చుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. ‘learning is not the ultimate goal, living is the ultimate goal, out of learning there must be living.’ నేను నేర్చుకున్నది ఆచరిస్తేనే కదా ఫలాలు వచ్చేది. వీరందరి గొప్ప ఆలోచనలు, హృదయాలు నా జీవితాన్ని నేను రూపు దిద్దుకోడానికి ఉపయోగ పడ్డాయి.
సైకాలజి  అంటే మీకు ఇష్టం ఎలా కలిగింది?
ఈ ఇష్టం చాలా విచిత్రంగా ఏర్పడింది. నేను JNTU లో డాక్టరేట్ చదువుతూ ఉండగా, నా ఫ్రెండ్ ‘దివాకర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్’ వారు స్పీచ్ ఇస్తుంటే తీసుకు వెళ్ళాడు. ఇది చాలా బాగుంటుంది, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది, విందాం రమ్మన్నాడు. నాకేం ఆసక్తి లేదు అన్నాను. కాని, అతను బలవంతపెట్టి తీసుకు వెళ్ళాడు. విన్నాకా ... ఏవిటిది? సైకాలజీ అంటే మనల్ని మనం తెలుసుకోవడమా? యూనివర్సిటీ లో చెప్పే పాఠాలు కావా? అని ఆశ్చర్యపోయాను.
మనల్ని, మన జీవితాన్ని, మన ప్రపంచాన్ని తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది సైకాలజి అని తెలిసాకా దానిపట్ల చాలా ఆసక్తి కలిగింది. అక్కడి నుంచి ఎవరు సైకాలజి ప్రసంగాలు, వర్క్ షాప్స్ నిర్వహించినా వెళ్ళటం, చాలా ఉదృతంగా పుస్తకాలు చదవడం జరిగింది. ఈ విధంగా ప్రేరణ పొందాకా, నాలోని తృష్ణ జ్వలించింది. సైకాలజి అనే సబ్జెక్టు అకాడమిక్ పరంగా కాదు ఎక్స్పీరియన్స్ పరంగా ఉంటుందని తెలుసుకున్నాను. తర్వాత నా ఆలోచనలు, భావనలు, ఉద్వేగాలు, ప్రవర్తన, వీటిలో ఎంతో మార్పు వచ్చింది.
మన మాటలు, ప్రవర్తన ఎక్కడినుంచి పుడుతున్నాయి, వీటికి మూలాలు ఏమిటి, వీటిని మార్చుకోడం ద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చా? ఎమోషనల్ ఇంటలిజెన్స్ ను సంపాదించడం ఎలా? ఉద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి, ఇటువంటివి ముఖ్యంగా ఒక వ్యక్తి విజయానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక్కడ విజయం అంటే నా దృష్టిలో లౌకిక పరమైన విజయం కాదు. ఒక మనిషిగా పరిపూర్ణంగా తనను తాను ఆవిష్కరించుకుని, ఒక సంతృప్తికరమైన జీవనం గడిపేందుకు కావలసిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. నేను నేర్చుకున్న వాటినే నిరంతరం మధిస్తూ, సభలకు వెళ్ళినప్పుడు విద్యార్ధులకు ప్రసంగాల రూపంలో అందించడం జరుగుతోంది. ఒక క్లినిక్ లాగా మొదలుపెట్టాలనే ఒక కోరిక కూడా ఉంది. పరెంటింగ్, పిల్లల పెంపకం, యువత, దంపతులు ఇలా వివిధ తరగతుల వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నది నా కోరిక. ఇది ప్రణాళిక కాదు కాని, ఒక బలీయమైన కోరిక.
మళ్ళీ మొదటి నుంచి మీ జీవితాన్ని ఆరంభించే ఆవకాశం మీకు దక్కితే, మీరు మళ్ళీ ఏ రంగాన్ని ఎంచుకుంటారు?
ఇంజనీరింగ్ వైపైతే వెళ్ళే వాడిని కాదు. తల్లిదండ్రులు సాధారణంగా మన భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉంటారు. ఏ రంగంలో డబ్బు, గౌరవం, భద్రత బాగా దొరుకుతాయో వాటినే ఎంచుకోమని చెప్తూ ఉంటారు. చిన్నతనంలో ఇష్టాలను గుర్తించే సామర్ధ్యం కూడా పిల్లలకు ఉండదు కదా. వారి అభిమతాన్ని గౌరవిస్తూ నేను ఇంజనీరింగ్ చదివాను. అలా కాకుండా ఉంటే నాకు ఇష్టమైన సబ్జెక్టులు సాహిత్యం, సైకాలజి, లా. నాన్నగారు లాయర్, కాని నన్ను అటు పంపలేదు. బహుశా ఆయన చూసిన సాధక బాధకాల వల్ల ఆయన అటువైపు నన్ను వెళ్ళనివ్వలేదేమో!
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
ప్రణాళిక అనేదాన్ని నేను నమ్మను. ప్రతి క్షణం ఎలా వస్తే అలా సాగిపోతూ ఉంటాను. నేను అనుకుని సాధించిన వాటి కంటే, అనుకోకుండా సాధించినవే ఎక్కువగా ఉన్నాయి. అనుకుని ఫెయిల్ అయినవి ఉన్నాయి. దిశానిర్దేశం కోసం మనం ఒక ప్రణాళిక ఉండాలి కానీ, జీవితం అందించేవాటిని ఆస్వాదిస్తూ ఉండడమే నాకు అలవాటు. కాని ఇందాక చెప్పినట్టు క్లినిక్ తెరవాలన్న కోరిక మాత్రం బలీయంగా ఉంది.
శ్రీ సుదర్శన్ గారు తమ అసమాన ప్రతిభతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను, అఖండ కీర్తిని ఆర్జిస్తూ, విజయ శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటోంది – అచ్చంగా తెలుగు.
సుదర్శన్ గారితో నా ముఖాముఖిని క్రింది లింక్ లో వినండి.
https://www.youtube.com/watch?v=ihfQtTybHEU
****


No comments:

Post a Comment

Pages