కూచిపూడి నాట్యయోగి - వేదాంతం రాధేశ్యాం - అచ్చంగా తెలుగు

కూచిపూడి నాట్యయోగి - వేదాంతం రాధేశ్యాం

Share This
కూచిపూడి నాట్యయోగి - వేదాంతం రాధేశ్యాం
భావరాజు పద్మిని

అరవైలలో ఇరవైలా పసి పిల్లలకు ఆడుతూ పాడుతూ, నాట్యం నేర్పిస్తూ మామూలు వ్యక్తిలా కనబడే ఆయన, ఒక నాట్య దిగ్గజం ! కూచిపూడి భాగవతుల కుటుంబంలో పుట్టి, ఈ నాట్యంతో మమేకమైపోయి, ఎన్నో ప్రతిష్టాత్మకమైన బహుమతులు పొంది, నాట్య యోగిలా జీవనం గడుపుతున్న గొప్ప కళాకారులు. వీరితో ప్రత్యేక పరిచయం ఈ నెల మీకోసం...

నమస్కారమండి. మీకు నాట్యం పట్ల అనురక్తి చిన్నప్పటి నుంచే ఉండేదా?
నమస్కారం. అవునండి, ఎందుకంటే మా ఊరు కూచిపూడి నాట్య క్షేత్రం. మాది సంప్రదాయ కూచిపూడి భాగవతుల కుటుంబం. తాత ముత్తాతల కాలం నుంచి ఆనవాయితీగా ఈ నాట్యం నాకు అందింది. మా ముత్తాతగారు వేదాంతం జనార్ధన్ గారు, మా తాతగారు వేదాంతం వేంకటాచలపతి గారని ఈ నాట్యంలో చాలా పేరున్నవారు. అలాగే వేదాంతం సత్యనారాయణ శాస్త్రి గారు, రామకృష్ణయ్య గారు, వీరందరూ మా పెద్దలు. ఈ నాట్యమే మాకు భుక్తి, ముక్తి, రక్తి, అనురక్తి.

లలితకళల్లో ఎన్నోరకాల కళారూపాలు ఉన్నాయి కదా ! వాటిలో నాట్యం యొక్క విశిష్టత ఏమిటి ?
నాట్యం యొక్క విశిష్టత ఏమిటంటే పూర్వీకుల యొక్క కధలను, పురాణ విశేషాలను, మహానుభావుల గొప్పతనాన్ని, త్యాగాన్ని గురించిన విశేషాల్ని
తెలియజెయ్యడానికి నాట్యం పుట్టింది. అలాగే నాటకం అంటే, మా కూచిపూడి పద్ధతిలో యక్షగానాలు, భామాకలాపం, గొల్ల కలాపం వంటి కలాపాలు, కేళికలు, శివలీలలు, వ్యస్త నృత్యాంశాలు, తరంగాలు, అష్టపదులు వంటివి చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ ప్రదర్శించడం ద్వారా ప్రజల్ని సన్మార్గంలో నడిపించడానికి దోహదపడుతుంది నాట్యం. కూచిపూడిలో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. చతుర్విధ ఆహార్యాలు అని ఉంటాయి. "ఆంగికో వాచికాహార్యౌ సాత్త్వికశ్చేత్యసౌ పునః" అని. ఈ నాట్యం వల్ల యశస్సు కలుగుతుంది అంటారు. ఇది భావ, రాగ, తాళ యుక్తమైనది. భక్తి, రక్తి, తన్మయత్వాన్ని కలిగించేది. నిజంగా భగవంతుడి మీద భక్తిని కలిగించి, ఆయన అనుగ్రహం పొందడం ద్వారా మన ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇది పెంపొందిస్తుంది.
నాట్యంలో సాహిత్యం ఉంటుంది, గానం ఉంటుంది, నృత్యం ఉంటుంది... అసలు మన దేశమే భారత దేశం... అంటే భావ, రాగ, తాళములతో కూడుకున్నది ఈ దేశం. ఈ దేశంలో పుట్టడమే ఒక అదృష్టం, అందునా ఇటువంటి నాట్య పరంపరలో పుట్టడం మహాదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను.

నాట్యంలో మీ తొలి గురువులు ఎవరు?
ఎవరికైనా తొలిగురువులు తల్లిదండ్రులే, ముందుగా వారినీ మా గురువులను స్మరించుకువడం అదృష్టంగా భావిస్తాను. మా అమ్మగారి పేరు సత్యవతమ్మ, నాన్నగారు సూర్నారాయణ గారు. అలాగే మా చిన్నాన్న గారు వేదాంతం పార్వతీశం గారు, వారిని నిత్య వాచస్పతి అంటారు. ఆ మహానుభావుడి దయవల్ల ప్రవేశం జరిగింది. అలాగే మా చుట్టాలు వెంపటి పెదసత్యం గారు, వేదాంతం సీతారామ శాస్త్రి గారు , పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ గారు, ఇలా చిన్నప్పటి నుంచి మా గురువులు నన్ను కూడా తిప్పుకునేవారు. ఆ మాటకొస్తే మా ఊళ్ళో ఉన్న పెద్దలందరూ నా గురువులే. ‘నాన్నా, బాబూ’ అని ప్రేమగా పిలుస్తూ అన్నీ నేర్పుతూ ఉండేవారు, ధర్మంగా ఉండాలి అంటూ అసలు మనిషి ఎలా జీవించాలో చెబుతూ ఉండేవారు, వాళ్ళ దయవల్లే ఈనాడు నేను ఈ స్థానం సంపాదించుకోగలిగాను. సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చినా, రాష్ట్రపతి అవార్డు కాని , హంస అవార్డు కాని వచ్చాయంటే, అంతా వారి దయేనమ్మా, నాదేమీ లేదు. గురువుల రూపంలో భగవంతుడు నాకిచ్చిన వరాలే ఇవన్నీ. అందుకే ఈ విద్యను మరింత మందికి నేర్పుతూ, అందులోనే తరించాలని నా కోరిక. భగవంతుడి దయవల్ల ఆరోగ్యం కూడా బాగానే ఉంది కనుక, వచ్చినవారికి నేర్పుతున్నాను.

చిన్నతనంలో మీరు మొట్టమొదటి ప్రదర్శన ఎప్పుడు ఇచ్చారు?
చిన్నతనంలో మొట్టమొదట నాతో గణపతి వేషం వేయించారు వేదాంతం సీతారామ శాస్త్రి గారు. ఆ 1960 ప్రాంతంలో, సిద్ధేంద్ర కళా క్షేత్రంలో, తర్వాత నాతో మా గురువుగారు వేణుగోపాల కృష్ణశర్మ గారు ప్రహ్లాదుడిగా వేషం వేయించారు. తర్వాత మా అమ్మగారు నాతో కృష్ణుడి వేషం వేయించారు. ఆపై సత్యనారాయణ శర్మ గారి దయవల్ల గొల్లభామ, సత్యభామ, రాజనర్తకి వేషం వంటి స్త్రీ పాత్రలు వెయ్యడం, యక్షగానాలు వచ్చాయి. అలాగే వెంపటి చిన సత్యం గారి దయవల్ల రసం, తాళం వంటి నాట్యశాస్త్రంలోని మెళకువలు తెలుసుకోవడం జరిగింది.

కూచిపూడి నాటకానికి అత్యంత ప్రధానమైన ‘సూత్రధారి’ ఎలా ఉండాలని మీ పెద్దలు చెప్పారు?
కూచిపూడి నాట్యంలో ‘సూత్రధారి’ ది ముఖ్య పాత్ర. ఆడుతూ, పాడుతూ, ఒక నాటకంలో ఉన్న కళాకారులు అందరినీ ఒక సూత్రంతో పట్టుకుని, నాటకాన్ని నడిపించే నాయకుడిని సూత్రధారి/భరతుడు/ఆంగీదారుడు అంటారు. ఆ పాత్ర నేను బాగా పండించగలనని మా గురువులు నాకు ఆ పీఠం ఇవ్వడం జరిగింది. పెద్దలందరి దయవల్ల నేను రాక్షస రాజు దగ్గరనుండి, నారదుడి దాకా, అన్ని ట్రూపుల లోనూ చిన్న పాత్ర దగ్గరినుంచి పెద్ద పాత్ర వరకు అన్ని పాత్రలు వేసుకుంటూ వచ్చాను.
ఒక సూత్రధారికి నాటకంలో అన్ని పాత్రలు తెలిసి ఉండాలి, అన్నింటినీ చక్కగా ప్రయోగించగల సమర్ధత ఉండాలి, అత్యవసర స్థితి వచ్చినప్పుడు, ఎవరైనా ఆ పాత్ర వెయ్యలేనప్పుడు తానే ఆ పాత్ర వేసి నడిపించే సత్తా ఉండాలి, అని మా పెద్దలు చెప్పారు.

ప్రస్తుతం కూచిపూడి నృత్యానికి ఆదరణ ఎలా ఉంది ? మీ కుటుంబంలోని వారు ఈ పరంపరను కొనసాగిస్తున్నారా ?
మేము ఆరుగురు అన్నదమ్ములం. మా అన్నదమ్ములం అందరం, వారి పిల్లలు అందరం ఇదే కళను నమ్ముకుని, జీవితం గడుపుతున్నాము. నాకిద్దరు అబ్బాయిలు సిద్ధేంద్ర వరప్రసాద్, సత్య నరసింహ శాస్త్రి. వీరు కూడా నాట్యాన్నే వృత్తిగా స్వీకరించారు.
ఇప్పుడు మా ఆఖరి తమ్ముడు వేదాంతం రామలింగ శాస్త్రి , సిద్ధేంద్ర కళాక్షేత్రానికి ప్రిన్సిపాల్ గా ఉన్నాడు. అందులో ఉన్నటువంటి కుర్రాళ్ళు అంతా నా దగ్గర నేర్చుకున్న వారే. నేను అక్కడే 84- 2013 దాకా పనిచేసి రిటైర్ అయ్యాను. మూడేళ్ళ పాటు హైదరాబాద్ లోని సెంట్రల్ విశ్వవిద్యాలయంలో మా గురువుగారి ప్రోద్భలంతో పనిచెయ్యడం జరిగింది, ఎం.ఎ డాన్సు వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో తయారైన ఉత్తమ విద్యార్ధుల్లో ప్రస్తుతం అక్కడే డీన్ గా పనిచేస్తున్న అనురాధ అనే ఆవిడ కూడా ఉన్నారు. అలా అక్కడ కూచిపూడి డిపార్ట్మెంట్ ను నిలిపి, మళ్ళీ కూచిపూడిలో నా స్థానానికి నేను వచ్చాను. ఇక్కడే ఉండి వేదాంతం వారి యొక్క మేళాన్ని నడుపుకుంటూ వస్తున్నాను.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది పిల్లలు వచ్చి ఇక్కడ నేర్చుకుని, మన నాట్యం యొక్క విజయ పతాకాన్ని దశ దిశలా ఎగురవేస్తున్నారు. ఇదంతా నటరాజు యొక్క కృపమ్మా.

నాట్యం చేసేవారికి కేవలం నాట్యం మీదే కాక సంగీతసాహిత్యాల మీద కూడా అవగాహన ఉండాలి కదండీ. మరి మీరు రూపొందించే నృత్య రూపకాలకు ఇవన్నీ ఎవరు సమకూరుస్తారు?
పరంపరాగతంగా దీన్ని కూడా మా పెద్దవాళ్ళు అందించారండి. అయితే దీంట్లో కూడా మా తమ్ముడు, శిష్యులలో కొంతమంది రాయగల సమర్ధులు ఉన్నారు. అవసరమైతే నేనూ రాయగలను. గోదావరి పుష్కరాల మీద, కృష్ణా పుష్కరాల మీద నేను నాటకాల్ని రాయడం జరిగింది. ఇలా సందర్భాన్ని బట్టి రాయడం , సంగీతం సమకూర్చుకోడం పెద్దలిచ్చిన అనుభవాన్ని బట్టి వచ్చింది. దాన్ని బట్టి మళ్ళీ నృత్యాన్ని సమకూర్చుకుని, రసానుగుణంగా రాగాలు తీసుకోవడం, పాత్రలు తీసుకుని పాత్రధారులని నడిపించడం పెద్దలిచ్చిన వారసత్వం. కాని, ఇవన్నీ పొందాలంటే చాలా సమర్ధత ఉండాలి, ధ్యాస పెట్టాలి.

అసలు మీ దృష్టిలో నాట్యం అంటే ఏమిటి ?
నాట్యమంటే నాటకమే. లోక వృత్తాంతరం నాట్యం. లోకంలో ఉన్న విషయాల్ని అనుకరించుకుంటూ, ప్రజలకి మంచి చెడుల్ని ఒక అద్దంలో చూపించేదే నాట్యమని, ‘అభినయ వేదంగా’ పిలవబడే అభినయ దర్పణం అనే గ్రంధంలో చెప్పబడింది. దీన్ని మనకు బ్రహ్మదేవుడు ఇచ్చాడు. త్రేతాయుగం ఆరంభంలో ఈ నాట్యం పుట్టింది. ప్రజలందరినీ అరిషడ్వర్గాలకు లోనై తప్పుదోవ పడుతున్నప్పుడు, లోకపాలకులు బ్రహ్మ దేవుడిని వేడుకుంటే, అప్పుడు బ్రహ్మ వేదాలని పిలిచి, అందరు జనులకి యోగ్యమైనది, వినదగినది, చూడదగినది, ఉత్సాహాన్ని కలిగించేది, ఆరోగ్యాన్ని కలిగించేది, ఐశ్వర్యాన్ని కలిగించేది, జ్ఞానాన్ని కలిగించేది అయిన ఈ నాట్య వేదాన్ని సృష్టించి మనకు ఇచ్చాడు. నాట్యం అంటే నటన, దేవుడి యొక్క నటన. పరంపరాగతమైన ఈ నృత్యాన్ని ఎవరైతే సొంత మార్పులు లేకుండా నటిస్తూ జీవితం గడుపుతారో, వాళ్ళను ఆ దేవతలు ధర్మ మార్గంలో నడిపిస్తారట. శృతి, లయ, సంగీతం , అభినయం అన్నీ కలిస్తేనే ఈ నాట్యమయ్యింది. ఇది పరమేశ్వరుడు భరతాదులకు అందిస్తే, ఆ పరంపరలో మాకు అందింది.

ఇన్నాళ్ళ మీ నాట్య జీవితంలో మీరు మర్చిపోలేని అనుభూతులు ఏవైనా ఉన్నాయా?
మొదటినుంచి చాలా చాలా సంఘటనలు ఉన్నాయమ్మా. అమెరికాలోని న్యూ జెర్సీ లో మా అన్నగారు, గురువుగారైన వెంపటి చినసత్యం గారు ఒక ప్రదర్శన కోసం 84 లో ఒక నాలుగు నెలల పాటు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో రుక్మిణీ కళ్యాణం, హరవిలాసం, భామాకలాపం, అలాగే కొన్ని సోలో డాన్స్ లు కూడా నాతో వేయించడం జరిగింది. ఈ మధ్యలో మేము ‘శ్రీకృష్ణ పారిజాతం’ అనే నాటకం వెయ్యాల్సి వచ్చింది. కొంతమంది పాత్రధారులను ముందే ప్రణాళిక ప్రకారం తీసుకుని వచ్చారుకాని, ఆ నాటకం అడుగుతారని వాళ్ళు అనుకోలేదు, అప్పటికప్పుడు అడిగారు. కృష్ణుడు, సత్యభామ, రుక్మిణి పాత్రధారులు ఉన్నారు. ఇక నారదుడి పాత్ర ఎలాగా అన్న సందిగ్ధం మొదలైంది. నేను గురువుగారి దగ్గర ఉన్నది చాలా తక్కువ, మొత్తం కలిపి, సుమారు ఏడాదిన్నరే ఉన్నాను. ఆయన నాకు ద్రోణాచార్యుల వంటివారు. ఆయనకు నేనంటే మహా ఇష్టం. మద్రాస్ లో నాటకాలు చేస్తున్నప్పుడు, ఆయన నా ఉత్సాహం చూసి, ‘ఒరేయ్, టకాటకా చేసేస్తున్నావురా నీ దుంప దెగ, ‘ అని మెచ్చుకునేవారు.
అయితే నారదుడి వేషం అప్పటికప్పుడు నన్ను వెయ్యమన్నారు. ఆ నాటకం కూడా నేనెప్పుడూ చూడలేదు. ఆ కధ తెలుసు నాకు అంతే. రిహార్సిల్ లేకుండా అప్పటికప్పుడు చెయ్యటం అంటే చాలా కష్టం. వారేం పాడతారో, నేనేం చేస్తానో తెలీదు. అయితే కూచిపూడి భాగవతుల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఆశువుగా చెయ్యటం అనేది మా పెద్దలు నాకు అనుభవమయ్యేలా నేర్పారు. పెద్దాయన్ను కాదనలేను. ఎలాగా అని నేను ఆలోచిస్తుంటే, చుట్టూ రకరకాల పరిస్థితులు, ఇతర శిష్యుల అసూయ, ఇవన్నీ పరీక్షలలా ఎదురయ్యాయి. సరిగ్గా చెయ్యకపోతే గురువుగారికి అప్రదిష్ట వస్తుందని నా బెంగ. అయితే అదృష్టవంతుడిని ఎవరూ చెడపలేరు కదండీ. ఆ గురుకృప ఎక్కడుందో, అక్కడ మార్గం దొరుకుతుంది అన్నట్లు, సత్యభామ పాత్ర వేస్తున్న ఆవిడ, ‘బాబాయ్, మీకేం ఇబ్బంది లేదండీ, అంటూ సన్నివేశాల్ని ఒకటి తర్వాత ఒకటి తెలియజేసింది. నేను అల్లుకుపోయాను. ఆ రోజున అందరికంటే నాదే హై లైట్ అయిపొయింది. అంతా నిలబడి చప్పట్లు కొట్టారు. ఇది ఓర్వలేని కొందరు శిష్యులు, స్టేజి మీద నా పేరు చెప్పకుండా దాటేసారు. అప్పుడు ప్రేక్షకుల్లో కొందరు లేచి, అదేవిటండీ, ఆ నారదుడి పాత్రధారి బ్రహ్మాండంగా నటిస్తే, ఆయన పేరు కూడా చెప్పలేదు, ‘ అని అడగ్గానే, గురువుగారు వెంటనే ఆనందపడిపోయి, నా గురించి ‘మా పినతల్లి గారి కుమారుడు, రాధేశ్యాం’ అంటూ ఆశీర్వాద పూరవకంగా నా గురించి చాలా గొప్పగా మాట్లాడడం నేను ఎప్పటికీ మరువలేను. ఇటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయండి.
అలాగే ఒకసారి హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం నాకు హిరణ్యకశిపుడి నాటకం వేసే అవకాశం వచ్చింది. హిరణ్యకశిపుడి పాత్ర చెయ్యాల్సిన మా తమ్ముడు, కొన్ని చెప్పుడు మాటలు విని రాలేదు. అలాగే చలీలావతి పాత్రధారి వంటివారు కూడా రాకుండా ఆపారు. నాకు ఒక్క వ్యక్తిని అనేక పాత్రల్లో ఊహించుకోవడం అలవాటు. అలా అప్పటికప్పుడు అన్ని పాత్రలనూ సర్దేసాను. కాని, సూత్రధారి ఎవరుంటారు? వెంటనే నా పెద్ద కొడుకును అందులో ఏర్పాటు చేసాను. ఇక అసలు రాక్షస రాజు పాత్ర లేకుండా నాటకం ఎలా పండుతుంది? వెంటనే నేను పీలగా ఉన్నా, ప్రేక్షకులకి ముందుగానే క్షమాపణలు చెప్పుకుని, ఆ పాత్రను వేసి, అద్భుతంగా పండించడం జరిగింది. అది చాలా గొప్పగా హైలైట్ అయింది. ఆ రోజు నాకు చాలా గొప్ప రోజండి, అనుకున్న దానికంటే ఎక్కువ కీర్తి, బహుమతులు వచ్చి, ఆ రూపంగా భగవంతుడు నన్ను పేదరికం అన్న గీత నుంచి పక్కకు లాగేశారు.
అలాగే అమెరికాలో 2008 లో భక్తప్రహ్లాద నాటకం వేసాము. అప్పుడు సిలికాన్ ఆంధ్రా వారు నన్ను ఆహ్వానించారు. వెనుకబడ్డ కళాకారులను ప్రోత్సహించాలనే సహృదయంతో వారు ఇలా పిలిచారు. ఆ రోజున అర్ధరాత్రి 12 గంటలకు మాకు టైం ఇచ్చారు. ముందంతా పెద్దపెద్ద వారు, హేమాహేమీలు ఉన్నారు. మూడు గంటల పాటు ఆ నాటకం సాగాల్సి ఉంది, కాని అప్పటికే మిగతావారి ప్రదర్శనలతో సమయం మించిపోతూ ఉండడంతో, మా నాటకం గడువును తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ , తోటి సభ్యులకు ధైర్యం చెప్తూ, వర్క్ చేస్తూ, కంగారు పడద్దని చెప్తూ మొత్తానికి ఒకప్పుడు 8 గంటలు ఆడిన నాటకాన్ని కేవలం 25 నిముషాల్లో ముగించడం జరిగింది. అదే హైలైట్ అయిపోయిందండి. ప్రేక్షకులు అంతా నన్ను ఎంతగా ఆశీర్వదించారో ! ప్రహ్లాద నాటకాన్ని ఏ ముహూర్తాన మా పెద్దలు అందించారో కాని, అది ముట్టుకున్నప్పుడల్లా, ఆ పెద్దల దీవెనలు నాకు అందుతూనే ఉంటాయి. ఆ రోజున నాకు ‘కూచిపూడి నాట్య మెగా స్టార్’ అన్న పేరు పెట్టేసారు. ఇదంతా భగవంతుడి దయ, ఆయన ప్రసాదించిన అదృష్టం.
ఇది భగవత్ కళ. మేము భాగవతులం, భగవంతుడి చరిత్రనే ప్రచారం చేస్తూ గడిపే వాళ్ళం. నేను దీన్ని నమ్ముకుని ఉన్నాము. అందుకే మాకు దైవం, గురువులు అన్నివిధాలుగా అండగా ఉన్నారు. ఈ కళ ద్వారానే నేను భగవత్ సాక్షాత్కారాన్ని కూడా పొందాను.

చివరగా ఒక చిన్న ప్రశ్నండి. ఇవాళ రేపు రెండు మూడు ప్రోగ్రామ్స్ ఇచ్చేసరికే కళాకారుల్లో ఒక అభిజాత్యం వచ్చేస్తోంది. మరి ఇంతటి సుసంపన్నమైన కళాజీవితం గడిపిన మీరు చిన్న పిల్లలకు ఇంకా నాట్యం నేర్పిస్తూ, వారితో కలిసిమెలిసి నిరాడంబరంగా ఉండడం అనేది ఎలా సాధ్యం?
కళాకారులు నిత్య విద్యార్ధుల లాగా ఉండాలి. ఎప్పుడూ సాధన చేస్తూనే ఉండాలి. ఉపాధ్యాయుడు అంటారు, అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ అధ్యయనం చేస్తూ ఉండేవారు అని అర్ధం. గురువులు అంటే మనం కాదు నటరాజు, దత్తాత్రేయుడు వంటి దైవాలు. ఆ గర్వం ఉంటే దేనికీ ఉపయోగం లేదు, ఎదుగుదల ఆగిపోతుంది. మా గురువుగారు నాకు ‘బాలానందుడు’ అన్న పేరు పెట్టారు. నేను ఎక్కువగా పిల్లలతోనే ఉంటాను. ఎందుకంటే పిల్లల్లో దేవుడు ఉంటాడు. వారు పరంధాముడి స్వరూపాలు. ఇక రాజకీయాలు అవీ నాకు ఏమీ ఉండదు. నాకు అచ్చతెలుగు నాట్యం తప్ప మరేమీ తెలీదమ్మా. అందుకే సాధన చేస్తూ ఉంటాను, అలా చేస్తూ ఉంటేనే విద్య పెరుగుతుంది, లేకపోతే ఏముంది, పొట్ట పెరుగుతుంది, అంతే.
శ్రీ రాధేశ్యాం గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవిస్తూ, మరింత మందికి నాట్యంలో మార్గదర్శకులుగా నిలిచి, మరెన్నో విజయాలు చవిచుడాలని మనసారా ఆశిస్తోంది –అచ్చంగా తెలుగు.

రాధేశ్యాం గారి నాట్యాన్ని క్రింది లింక్స్ లో చూడండి...

No comments:

Post a Comment

Pages