పోటీ... - అచ్చంగా తెలుగు
పోటీ...
పి.వి.ఆర్. గోపీనాథ్.

"మధూ, లలితా..."
పొలికేకలు పెడుతూ వచ్చాడు సుధాకర్. మధుకర్ పలకలేదు గానీ ఏమైందో అనుకుంటూ పరుగున వచ్చారు లలితా, సీతా కూడా.
"ఏమయిందీ, ఎందుకట్టా గావుకేకలెట్టారూ ?" దాదాపు వణికి పోతున్నట్లుగా అడిగారిద్దరూ ఒక్కసారే.
"చెప్తా, ఏడీ వీడు?"
."ఇంకెక్కడుంటాడూ, తన గదిలోనే..."
గది వైపు దూసుకు పోతున్న భర్తను వెనకే అనుసరించింది సీత.
"ఏంటో మాతో చెప్పచ్చుగా. చెప్పదలచుకోకపోతే మమ్మల్నెందుకు పిలిచినట్లూ?" నవ్వుతూనే అన్నా కొంచెం నిష్టరమూ తొంగి చూసిందామె మాటల్లో...
ఇక తప్పదన్నట్లుగా అనౌన్స్ చేసేడు ఉద్వేగంతో....
"నీ మరిది గారికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందహో...."
వింటూనే అదిరిపడ్డారు తోడికోడళ్ళిద్దరూ..
" అంటే ...!?" ఇద్దరూ ఒక్కసారే అరిచారు, అర్థమయీ కానట్లుగా.
"య్యా. స్వచ్ఛా భారత్ ప్రచారం కోసం మనవాడు వ్రాసిన కవిత జాతీయ స్థాయిలో ప్రాంతీయ భాషల నుంచి ఎంపికైన వాటిలో ఒకటి. సరేనా..."
ఆనందం, దుఃఖం రెండూ ఒకేసారి తొంగి చూశాయి ముగ్గురి మొహాలలోనూ...
వెంటనే పంచదారో, బెల్లమ్ముక్కో తేవాలన్న మాట కూడా మరిచినట్లు అప్ప చెల్లెళ్ళిద్దరూ అతని వెంటే ఆ మాటకొస్తే అతని కన్నా ముందుగానే ఆ గదిలోకి దూసుకు పోయారు.
ఇంత సంచలనానికీ కారకుడైన అసలు కథానాయకుడు మధుకర్ మాత్రం..........
****
"ఒరే ఒరే. ఇప్పుడు చేయాల్సింది ఇది కాదేమో. మాకు పార్టీ గట్రా ఏం లేవా....?"
నవ్వుతూనే అన్నా సుధాకర్ గొంతులో విస్మయం, ఒకింత ఆవేదనా కూడా ధ్వనించాయనాలి. కారణం, మధుకర్ నిర్లిప్తంగా ఉండటమే గాక , తనకేమీ తెలియనట్లూ లేదా అసలేమీ జరగనట్లూ ఏదో పుస్తకం ముందేసుక్కూచున్నాడు మరి.
తొంగి చూసిన వారికి అందులో కనబడిన ఓ పద్య రత్నం...
"ఆ.వె. బహుమతైన నేమి, భంగపడిన నేమి
సానుభూతి, నుతియు సరకు లేదు
సమయ మందు తగిన సమయమేది యనగ
నిశ్చలత్వ మున్న నిర్వహణయె !!"
(నుతి ... పొగడ్త, సమయము ... పోరు, సమాధానము)
అప్పుడెప్పుడో వచన కవితలు మొదలు పెట్టక ముందు రాసుకున్న పద్యాలలో ఒకటిది.
వాస్తవానికి మధుకర్ కేవలం పద్య రచయిత మాత్రమే. ఎప్పుడైనా ఏమీ తోచనప్పుడు పేరడీ పాటలు రాసుకునేవాడు. కైతలంటే అతనికి అంతగా ఆసక్తి కూడా లేదు. కానీ ఓ సారి అన్నగారు
తన మిత్రులతో పందెం కట్టి తమ్ముడితో ఓ చిన్న కవిత అల్లించాడు. అది ఓ పత్రికలో ఉగాది సందర్భంగా ప్రచురితం కావడమే గాక ప్రోత్సాహకం అంటూ ఓ చిన్న పుస్తకం కూడా పంపారు నిర్వాహకులు. మొదటి ప్రయత్నమే ఇలా విజయవంతం కావడంతో ఆ వచ్చినది తిలక్ రచన కావడంతో ఇహ తనేమిటో మరిచిపోయాడు మదుకర్. అదే పనిగా వచన కవితలు రాయడం పేరు రావడం మామూలైపోయి, చివరకు తానొక పద్య రచయితననే విషయమే మరిచిపోయేలా చేసింది.
కానీ, రోజులెప్పుడూ ఒక్కలా ఉండవు కదా.జిల్లా స్థాయిలో జరిగిన ఓ పోటీలో హడావుడిగా పంపిన కవితలో ఓ రెండు పంక్తుల మద్య సమన్వయం కుదరక తన్నేసింది. దాంతో అతనిలోని అహము దెబ్బతిన్నట్లయింది. ఆలోచించడం మాని ఆవేశంతో కలం పక్కన పారేసేడు. తిరిగి పద్యాలు రాసుకోవాలని చూసేడు. కానీ, ఎందుకనో అవి కుదరలేదు. పైగా కాలం మారడంతో పద్యాలకు ఆదరణా తగ్గింది. పత్రికలు వేసుకోవడం మానేసేయి. తరచుగా అడిగి మరీ రాయించుకునే వారు కూడా వచన కవితలనే పంపమనసాగారు. దాంతో ఏం చేయాలో తోచక స్తబ్దుగా మారిపోయేడు. తనను కోరి చేసుకున్న లలిత మనసు గాయపడుతోందని తెలిసినా నిర్లిప్తంగానే ఉండిపోయాడు.
*****
ఇక్కడే ఓ మాట చెప్పుకోవాలి. సుధాకర్, మధుకర్ ఇద్దరూ అన్నదమ్ముల పిల్లలు. సుదాకర్ కథా రచయితగాను, మధుకర్ పద్య రచయితగాను పాఠక లోకానికి సుపరిచితులు. పండగలొస్తే చాలు వీరికి అక్షర పర్వమే. చెరో విదంగా బహుమతులు, ప్రశంసలతో ఇల్లూ, మనసులూ నింపుకునేవారు.
సీతా, లలితా కూడా అన్న దమ్ముల పిల్లలే. సుధాకర్ పెళ్ళిలో మధును చూసి మనసు పారేసుకుంది లలిత. అతని వర్చస్సే గాక మధుకర్ పెళ్ళిలో అతను చదివిన పద్యాలతో అతనూ పద్య రచయిత అని తెలియడమే అందుక్కారణం అంటే నవ్వుతారేమో గానీ అదే నిజం. లలిత తండ్రి రామనాథం గారు కూడా తెలుగు లెక్చరర్ కావడం ఆయనా అడపా దడపా పద్యాలు రాస్తూండడంతో లలితకూ ఆసక్తి ఏర్పడింది. తనూ అప్పుడప్పుడూ ఏవో రాస్తూ తండ్రితో దిద్దించుకుంటూ ఉండేది. కానీ మరీ అంతగా లీనమైపోలేదు.
సుదాకర్ జాతీయ బ్యాంకులో పెద్ద ఉద్యోగి. మధు మాత్రం ఓ గ్రామీణ బ్యాంకులో చిన్న ఉద్యోగి. కాకపోతే పిత్రార్జితం కాస్తో కూస్తో ఉండడం, తల్లి దండ్రులకు ఒక్కడే కొడుకు కావడం వల్ల ఫర్వాలేదన్నట్లుగా సాగిపోతుంది వారి జీవనం. అతని హోదా చూపించీ, పద్యాలతో పేరూ, సంపాదన ఎల్లకాలం ఇలాగే ఉండవనీ ఇలా ఎంత చెప్పినా లలిత మనసు మార్చలేకపోయారెవరూ. దీనికి తోడు ఆమెను కాలేజి రోజులలో కూడా విశ్వనాథవారి వచనం కన్నా పద్యాలే ఎక్కువగా ఆకర్షించాయి మరి. వారూ, వీరూ కూడా అన్నదమ్ముల పిల్లలే కావడం అన్నదమ్ములిద్దరిదీ ఒకే ఊరు(కావడానికి గ్రామీణ బ్యాంకే అయినా దానికీ ఓ నగరంలో శాఖ ఉంది మరి) కావడంతో పాతికేళ్ళుగా ఒకే బిల్డింగులో ఎదురెదురు ఫ్లాట్సులో ఉంటున్నారు.నలుగురూ వాళ్ళ అమ్మా నాన్నలకు ఏకైక సంతానాలే కావడంతో పెళ్ళిళ్ళకు ముందు వాళ్ళిద్దరూ, వీళ్ళిద్దరూ .... దరిమిలా నలుగురూ ఒకింటివారే అన్నట్లు కలసిపోయారు. తిండికీ, నిద్రకూ మినహా ఎవరు ఎప్పుడు ఏ ఫ్లాటులో ఉంటారో ఏది ఎవరిదో వారికే తెలీదంటే అతిశయోక్తి కూడా ఉండదేమో. ఇద్దరికీ చెరో కొడుకు. వారూ పెళ్ళిళ్ళయి చెరో నగరం వెళ్ళినా వీరు మాత్రం ఇక్కడే.
******
ఈ నేపథ్యంలోఓసారి ఏదో సందర్భంలో తోటి మిత్రులతో వాగ్వాదం వచ్చి సుదాకర్ వచన కవితలు అల్లడం తనకు రాకపోవచ్చుగానీ, కావాలంటే తన తమ్ముడు రాయగలడని వాదించాడు. మాటా మాటా పెరిగి వ్యవహారం పందెం దాకా పోయింది. సంగతి తెలిసి లలిత లబలబ లాడింది. మధు కూడా కొంత జంకాడు. సీత సరేసరి మొదలే భర్తను కోప్పడింది. సామెత చెప్పినట్లు "నన్నంటే అన్నావు నా తమ్ముడిని అను..." అన్నట్లు ఏమిటిదీ అని గద్దించింది కూడా.
"ఏం చేయమంటారూ, పద్యాలెందుకూ పనికి రావనీ మున్ముందు మీ తమ్ముడి సంగతేమిటనీ వారు దబాయిస్తుంటే...." అంటూ ఆయన సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. చివరకు అంతా సర్దుకున్నా లలిత మాత్రం తట్టుకోలేకపోయింది.
"మా ఆయన్ని చెడగొట్టావం"టూ బావగారితో దెబ్బలాడేది. ఇటు భర్తనూ సతాయించేది పద్యాలు మూలపడ్డాయంటూ. కానీ, ఏ రచయితకైనా ఒక ప్రక్రియలో కాస్తంత ప్రోత్సాహం ఆపైన గెలుపు కూడా తోడవుతే ఇక ఆపడం ఎవరి తరమూ కాదని అనుభవ పూర్వకంగా గ్రహించింది. వరుసపెట్టి బహుమతులూ, ప్రోత్సాహకాలూ, అడపా దడపా సన్మానాలూ కూడా వస్తూండడంతో తనూ ఆ లోకంలోకి ఫిరాయించక తప్పలేదు.
******
కాలం కరిగి రిటైరైనాక అన్నదమ్ములిద్దరూ కథలూ, కవితలతో హాయిగా గడపసాగారు. కానీ విధికే వీరి వ్యవహారం కన్ను కుట్టించినట్లయింది. వరుసగా మూడు అపజయాలు ఎదుర్కొన్న మధుకర్ చివరకు ఏదో జిల్లా స్థాయి పోటీలలో సైతం దెబ్బ తినడంతో అతనిలోని విశ్వాసం పూర్తిగా దిగిపోయి మనిషి జావగారిపోయాడు. ఎవరెన్ని చెప్పినా, లలిత విసిగి, అలిగి, కొడుకు దగ్గరకు వెళ్ళిపోతానని బెదరించినా నచ్చ జెప్పాలని చూశాడేగానీ కలం పట్టలేకపోయాడు.
అప్పుడు మొదలయింది అసలు కథ. కేంద్రంలో సర్కారు మారింది. నూతన ప్రభుత్వం "స్వచ్ఛ భారత్" పేరిట ఊరూ వాడా అన్ని రకాలుగానూ స్వచ్ఛంగా ఉంచాలనే నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చింది. దానికోసం రేడియో, దూరదర్శన్ లలో ప్రసారం చేయడం ప్రాంతీయ భాషలలో వచన కవితలను ఆహ్వానించింది. తమ్ముడిలో విశ్వాసం తిరిగి పురుడు పోసుకోవడానికి ఇదే మంచి తరుణం అనుకున్న సుధాకర్ వెంటనే రంగంలోకి దిగాడు. "ఉట్ట కెక్క లేనమ్మ మాదిరి జిల్లాలో నెగ్గలేకపోయాను, ఢిల్లీ స్థాయిలోనా... ఎందుకీ ఆకాశానికి నిచ్చెనలూ...?" అంటూ ఠలాయించాడు.
"నువ్వలాగంటే నే ఊరుకోను. ఇది వరకు పద్యాలు రాసేటపుడు ఇలా జరగలేదా.. అప్పుడూ ఇలాగే అయనావా.. అయినా ఆలోచించు. మాటి మాటికీ రాలేదు రాలేదు అంటూ వాపోతావే గానీ, ఎందుకు రాలేదో ఏనాడైనా ఆలోచించావా?నువ్వేం రాసేవో పంపేముందు గానీ, కనీసం ఫలితాలు వచ్చాకైనా గానీ చూసుకున్నావా? పద్యాలకు యతి ప్రాసలున్నట్లే వచన కవితలకూ పంక్తుల మధ్యా, పద జాలం మద్యా సమన్వయం ఉండాలని తెలీదా? అవేవీ జాగ్రత్తగా చూసుకోకుండా పంపించేస్తే ఎలాగని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా?
అసలు నీ చుట్టూ ఉన్న ఓ పది పదేను మందితో పాటీ పడటం ఏదైనా బహుమతి వస్తే చంకలెగరేయడం, పోతే ఇలా దిగాలు పడటం.... సిగ్గుగా అనిపించడం లేదా నీకు ?" భార్య ఆగమంటున్నా ఆగకుండా దులిపేసేడు.
తర్వాత తమ్ముడు ఆలోచిస్తున్నాడనుకుని శాంతంగా నచ్చ జెప్ప జూశాడు. పలితం కనబడక భార్యతోనూ చెప్పించాడు. చివరకు లలిత అదే పనిగా బ్రతిమలాడింది. ఇలాగైతే నీ ఆరోగ్యం ఏం కావాలని ఏడ్చింది. నిన్ను చేసుకున్నది ఎందుకో గుర్తు చేసుకోమన్నది. పద్యాలు కాకపోయినా కనీసం కవితలున్నాయని కదా ఏదో ఒక వ్యాపకం అనుకుంటే ఇదా అంటూ వాపోయింది. ఆఖరుకు కొడుకు దగ్గరకు వెళ్ళిపోతాననీ బెదరించి చూసింది. కొడుకులతోనూ చెప్పించి చూశారు. అయినా దిగిరాకపోవడంతో ఇంటిల్లిపాదీ విసిగి, అలిగి రెండు రోజులపాటు అతనితో మాట్లాడటమూ మానేసేరు.
ఇదంతా కేవలం అతనిలో రాగల మార్పు మానసిక ఆరోగ్యాన్ని కలిగించాలనే. మనిషి మానసికంగా కుంగిపోతే ఇక అతని ఆరోగ్యం ఎవరూ కాపాడలేరు మరి. సరే. కొన్నాళ్ళకు అందరూ ఆ మాటే మరిచినట్లు వ్యవహరించారు. కానీ, గదిలో అతను ఏదో చదువుకుంటూ కాలం గడుపుతూండడంతో పోనీలే, అతనే మారతాడనుకున్నారు. కానీ రెట్టించలేదు. ఆసక్తి చూపితే మళ్ళీ బిగుసుకుపోతాడేమోనని భయమాయె.
*******
క్యాలెండరులో మరో నాలుగైదు కాగితాలు చిరిగిపోయాయి. ఈలోగా మరో పోటీ లాంటిదేమీ లేకపోవడంతో అందరూ సరదాగా యాత్రలు పెట్టుకున్నారు. తిరిగి రాగానే ఇదీ కబురు. చూస్తే మధుకర్ అలాగా. పారితోషికం వచ్చిందన్న ఆనందం అతనిలో ఏ మాత్రం గోచరించకపోవడం చూసి అంతా ఖిన్నులైనారు. గట్టిగా అడిగితే వచ్చిన జవాబు....
"అవును. పంపాను. కానీ, వస్తుందనుకోలేదు. రావాలనీ కోరుకోలేదు. సమాజం పట్ల అభిమానమే నా చేత రాయించినట్లుంది. అంతే. ఈ మాత్రానికే పొంగిపోవడానికి. మనమేం పిల్లలమా ?
. అయినా ఆలోచిస్తే నేను రాయడమే తప్పనిపిస్తున్నది. సీనియర్లం అస్తమానూ మనమే రాస్తూ ఉంటే ఔత్సాహికులకు చోటేదీ... మరి వారు మాత్రం ముందుకు రావద్దా. పోటీ సమకాలికులతో అయితే బాగుంటుంది కానీ, జూనియర్లను నెట్టేసి తెచ్చుకుంటే గొప్పేముందీ...? అందుకే ఇక నేను స్పందించదలచుకోలేదు. అసలిక ఏ పోటీకీ పోదలచనూ లేదు. ఎలాగూ నాకూ అరవై దాటేశాయి కదా. తిరిగి శతకాలో ఏవో రాసుకుంటా గడిపేస్తా..."
ఋషిలా మాట్లాడుతున్న అతడిని అభినందించాలో, అభిశంసించాలో తేల్చుకోలేక అలాగే ఉండిపోయారంతా.
****

No comments:

Post a Comment

Pages