మధుర గాయకులు 'నేమాని పార్ధసారధి' గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

మధుర గాయకులు 'నేమాని పార్ధసారధి' గారితో ముఖాముఖి

Share This
మధుర గాయకులు 'నేమాని పార్ధసారధి' గారితో ముఖాముఖి
భావరాజు పద్మిని 


జీవితం అనేక అనుభూతుల సమాహారం. చిన్న వయసులోనే తన బహుముఖ ప్రజ్ఞతో అనేక రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుని, పలువురు ప్రముఖుల, తెలుగు ప్రజల మనసు గెలుచుకున్న స్నేహశీలి, ప్రముఖ గాయకులు ‘నేమాని పార్ధసారధి’ గారితో ప్రత్యేక ముఖాముఖి, ఈ నెల మీ కోసం...

చిన్నతనంలో మీ సంగీత కుటుంబంలో, సంగీతంపై మీకు మక్కువ కలిగేలా ప్రేరణ అందించిన వ్యక్తి ఎవరు?
సంగీతం మా కుటుంబంలోనే ఉందండి. మా చిన్నాన్న గారు సాలూరి పెండ్యాల గార్ల వద్ద పనిచేసారు. నేమాని సూర్యప్రకాశ్ గారు వారి పేరు. వీరే కాక, మా మేనత్తలు అందరూ పాడతారు, తాతగారు వీణ వాయిస్తారు, నాన్నగారికి సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువ ఇలా సంగీత వాతావరణం మా ఇంట్లోనే ఉందండి. ఆ తర్వాత శంకరాభరణం సినిమా రిలీస్ అయినప్పుడు నాకు 4,5 సం. రాలు ఉంటాయేమో, నేను ఆ పాటలన్నీ విని పాడుతుంటే నా ఆసక్తిని గమనించి, మా న్నాన్నగారు నన్ను గురువుగారి దగ్గర చేర్పించారు.

మొట్టమొదటిసారిగా బాలు గారి ముందు పాడుతా తీయగా కార్యక్రమం లో పాడుతున్నప్పుడు ఎలా అనుభూతి చెందారు?
నిజానికి నేను పాడుతా తీయగా కార్యక్రమానికి బాలు గారిని చూడడానికే వెళ్లాను. నాకు పోటీల మీద పెద్దగా ఆసక్తి లేదు, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి దాదాపు అన్ని లెవెల్స్ లోనూ ఒక నాలుగైదు వందల పోటీల్లో పాల్గొన్నాను, దాదాపు అన్నింట్లోనూ ప్రైజెస్ వచ్చాయి. అప్పటికే నాకు AIR నేషనల్ లెవెల్ లలిత సంగీత పోటీల్లో ఫస్ట్ వచ్చింది. ఒస్మానియా యూనివర్సిటీ తరపున జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. ఇలా ఎన్నో ఉన్నాయి. అప్పుడు పాడుతా తీయగా కొత్తగా వచ్చింది కాని, దానికంటే ముందు జీ సారిగామా లో హిందీలో ఫైనల్స్ వరకూ వెళ్లాను. కనుక, పోటీలో పాల్గొనే ఆసక్తి కన్నా, మనం చిన్నప్పటి నుంచి ఏ గాయకుడినైతే ఆరాధనగా చూస్తూ పెరిగామో, వారిని ఒక్కసారి చూడాలన్న తపనతోనే ఆ పోటీలకు అప్లై చేసాను. గురువుల ఆశీర్వాదం, అదృష్టం కలిసి రావడంతో ఆ పోటీల్లో నెగ్గాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలు గారితో కలిపి చాలా షోస్ లో పాడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలు గారితో మంచి అనుబంధం ఉంది.

ఆ తర్వాత ప్రైవేట్ ఆల్బమ్స్ కు స్వరకల్పన చేస్తూ, బాలు గారిచేత పాట పాడిస్తున్నప్పుడు ఎటువంటి భావోద్వేగానికి గురయ్యారు?
కొన్ని వందల సందర్భాల్లో బాలు గారితో పని చేసినా, ఆయన ‘పార్థు మా అబ్బాయ్’ అని ఆత్మీయంగా చెబుతూఉన్నా, ‘ఇదంతా నిజమేనా’ అని ఇప్పటికీ అనిపిస్తుంది. నేను ప్రొఫెషనల్ కెరీర్ లో నేను ఎంతోమంది సెలబ్రిటీ లతో కలిసి పనిచేసాను. కాని ఎవర్నీ రెండోసారి, మూడోసారి చూడాలని నాకు అంత ఎక్సైటింగ్ గా అనిపించలేదు. కాని బాలు గారిని ఎన్ని సార్లు కలిసినా, మళ్ళీ ఎప్పుడు కలుస్తామా, ఎప్పుడు కలుస్తామా, అనిపిస్తుంది. నాకు ఆయన్ను చూడడం, చాలా ఇష్టం. పితృభావం కలిగి నేను ఆరాధించే వ్యక్తి ఆయన. ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే వారే కారణం.
మొట్టమొదటి సారి, కోదండపాణి ఆడియో లాబ్స్ లో సత్యదేవ్ గారని, వారి ప్రోద్బలంతో నేను ‘షిర్డీ సాయిబాబా’ అనే ఆల్బం చేసాను. అందులో మూడు పాటల్ని బాలు గారితో పాడించే అవకాశం దక్కింది. ఆ తర్వాత సుమారు ఓ 70- 80 పాటలు ఆయనతో పాడించాను, నా మొట్టమొదటి సినిమాలో పాడారు, అలాగే నేను విశ్వనాథ్ గారితో చేసిన స్వరాభిషేకం సినిమాలో ‘కుడి కన్ను అదిరెనే’ అన్న పాట కూడా ఆయనే పాడారు. ఇవన్నీ నా జీవితంలో గొప్ప వరాలుగా నేను భావిస్తాను.

మీరు పాడడానికి బాగా ఇబ్బంది పడ్డ పాట ఏదైనా ఉందా ?
చాలానే ఉంటాయండి, ఎందుకంటే రకరకాల కంపోసెర్స్ ని తృప్తి పరుస్తూ, అన్ని రసాలు మేళవిస్తూ, నాలుగైదు నిముషాల్లో పాడి వెళ్ళిపోతూ ఉండాలి. కొన్నిసార్లు చాలాబాగా పాడాము అనుకున్న పాటలు ఆ సినిమా నుంచి తీసెయ్యడం జరుగుతుంది. అలాగే ఓ మోస్తరుగా పాడిన పాటను వింటే, ఇంకా బాగా పాడి ఉండాల్సింది అనిపిస్తుంది. అలాగే చాలా బాగా పాడిన పాటలు వింటే సంతోషంగా అనిపిస్తుంది. అన్నీ ఉంటాయండి, ఒక కళాకారుడి జీవితంలో ప్రతి రోజూ ఎన్నో మలుపులు ఉంటాయి.

మీ అభిమాన గాయకులు, సంగీత దర్శకులు ఎవరు?
గాయకుల్లో బాలు గారేనండి. నామటుకు, సినిమాపరంగా అన్ని భావాల్ని పాటల్లో అలవోకగా పలికించగలిగింది బాలు గారే. సినిమా పాట అనేది ఒక మూడ్ కో, భావానికో సంబంధించిన వ్యవహారం కాదు. నవరసాల్ని చిత్రీకరించే ముందు ఆ గాయకుడు , నాలుగు గోడల మధ్య ఆ ఉద్వేగంలో ఒదిగిపోయి, గొంతులో దాన్ని పలికించగలగాలి. ఇందులో ఆయన మాస్టర్, ఒక సమున్నత నిఘంటువు అని భావిస్తాను.
రెండోది సంగీత దర్శకుడిగా ఇళయరాజా గారంటే ఇష్టం. అదొక ప్రక్కనైతే, ఘంటసాల మాష్టారుగారు గొప్ప సంగీత దర్శకులని నేను భావిస్తాను. ఇది ఇళయరాజా గారే చెప్పిన మాట. పెద్ద హిట్ సినిమాలలో పాపులర్ అయిన పాటలన్నీ ఆయనే కంపోస్ చేసారు. మాయాబజార్, గుండమ్మ కధ, లవకుశలు, వంటి సినిమాలు తీసుకుంటే శాస్త్రీయ సంగీతం నుంచి,  ‘భళి భళి భళి భళి దేవా’ అన్న మామూలు తత్త్వం వరకు, అలాగే ‘వివాహ భోజనంబు’ అన్న వినోదాత్మకమైన పాట  వరకు, ఒక కంపోసెర్ గా ఆయన స్పాన్ కి లిమిట్ లేదని నాకు అనిపిస్తుంది.

‘మణిశర్మ’ గారి అసోసియేట్ గా చేస్తున్నప్పుడు మీరు హిందీ గాయకులకు డిక్షన్ నేర్పించడం, మహామహులతో పని చెయ్యడం వంటి మధురానుభూతుల్ని సొంతం చేసుకున్నారు కదా ! వాటిలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంటే చెప్తారా ?
చాలా ఉన్నాయండి. అది నా జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజులు. మామూలుగా మనం సంగీతం నేర్చుకోవడం, పాడడం వేరు, సినిమా పరిశ్రమలో ఏమేమి ఆశిస్తారు, మనం ఏ స్థాయిలో పని చెయ్యాలి అన్నది నాకు నేర్పించింది మణిశర్మ గారు. ఒక ఇన్స్ట్రుమెంట్ ఎలా వాడాలి, మనం ఒక పాటని సినిమాకు తగ్గట్టుగా ఎలా పాడాలి, ఇటువంటి అమూల్యమైన విషయాలన్నీ ఆయనవద్ద తెలుసుకున్నాను. మహామహులతో పనిచేస్తూ, ట్రాక్స్ నేను పాడడం, ఎలా పాడాలో వాళ్లకు నేర్పించడం, నేనెలా పాడాను, వాళ్ళెలా మెరుగులు దిద్ది పాడారు అన్నది చాలా దగ్గరనుంచి పరిశీలించడం, ఇటువంటి అదృష్టాలు నాకు దక్కాయి. అలాగే వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు చెప్పిన పాటల్ని కూర్చుని రాసుకునేవాడిని. శాస్త్రి గారితో ఇప్పటికీ నా ప్రయాణం కొనసాగుతోంది. ఇలా ఒకటీ రెండూ కాదండి, అదొక గొప్ప అనుభవపూర్వకమైన ప్రయాణం.

‘విశ్వనాథ్’ గారితో మాట్లాడాలంటేనే చాలా మంది వణికిపోతారు. అటువంటిది వారితో ‘విశ్వనాదామృతం’ అనే సిరీస్ చేసారు కదా. ఆ అనుభూతుల్ని మాతో పంచుకుంటారా ?
నావంటి వ్యక్తికి ‘విశ్వనాదామృతం’ అనేది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. శంకరాభరణం సినిమా పాటలు పాడుతుంటే, ‘వీడు పాడతాడు’ అనుకుని మా నాన్నగారు సంగీతం నేర్పిస్తే, ఇక అలాంటి దర్శకుడితో పరిచయ భాగ్యం కలగడం, ఆయనతో కలిసి స్వరాభిషేకం సినిమాలో పనిచెయ్యడం, తర్వాత ఆయన జీవితానుభావాలన్నీ క్రోడీకరించి ఇటువంటి కార్యక్రమం చెయ్యడం ఒక గొప్ప వరం. విశ్వనాథ్ గారితో చాలామంది ఇంటర్వ్యూ లు చేసారు కాని, ఆయనతో పాటు పనిచేసిన కళాకారులను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించి, ఆయన సమక్షంలోనే మాట్లాడి, వారి అనుభవాలను తెలుసుకోగలగడం ఒక అదృష్టం.
మీరన్నట్టుగా ఆయనతో మాట్లాడడం కొంచెం కష్టమే అయినా, ఆయన తీసిన 60 – 70 సినిమాల్లో హిట్ అయినవి కేవలం 15 , 20 సినిమాలే అయినా కూడా, జాతీయ స్థాయిలో ఆయన ఖ్యాతిని ఎందుకు గడించారు, అన్నది నేను తెలుసుకోగలిగాను. ఒక సీన్ చెయ్యడం వెనకాల ఆయన పడే తాపత్రయం, పర్ఫెక్షన్ కోసం ఆయన చేసే కృషి, ఇటువంటి ఎన్నో విషయాలు ఆయన ద్వారా తెలుసుకోవడం ఒక గొప్ప అనుభూతి. ఆయన దొరికిన ప్రతి సందర్భంలోనూ మన సాహిత్యం, సంగీతం, నాట్యం వంటి కళలను సహజంగా జోడించి మనకు అందించి, మెప్పించగలిగారు. అందుకే ఆయన ‘కళా తపస్వి’ అయ్యారు. శుభలేఖ సినిమాలో చిరంజీవి కాలేజి సీట్ కోసం వెళ్తే, ఇవ్వనందుకు ఆయన నిరసన ప్రకటించే సందర్భాన్ని, ప్రతిఘటించే ఫైట్ల ద్వారా కాక, ‘నెయ్యములల్లో నేరేళ్లో’  వంటి అన్నమాచర్య కీర్తనతో తెలియజేసేందుకు, చేసి యువతను కన్విన్స్ చేసేందుకు,  ఎంత ధైర్యం కావాలి చెప్పండి. అదే అడిగినప్పుడు ఆయన ‘ ఏంటో అలాగ అనిపించింది తీసేసాను’ అన్నారు. ఆలోచనా విధానాన్ని ఆచరణలో పెట్టగలిగిన ధైర్యం ఆయనకు ఉంది. ఆయనకు లభించిన నిర్మాతలు కూడా గొప్పవారే. ఇటువంటివి ఎన్నో నేను చెప్తూ పోగలను.

‘సుస్వన’ గురించి చెప్పండి.
నేను, మల్లిఖార్జున్ నాకు చిన్నప్పుడు ఐదారేళ్ళు ఉన్నప్పటి నుంచి, అంటే దాదాపు ఒక పాతికేళ్ళ నుంచి మంచి మిత్రులం. రాజమండ్రిలో ఇద్దరం పాటల పోటీలకు వెళ్తే, నేను ఫస్ట్ అతను సెకండ్, లేకపోతే అతను ఫస్ట్, నేను సెకండ్ ఇలా వచ్చేవాళ్ళం. మళ్ళీ పాడుతా తీయగాలో కలిసాం, గుర్తింపు వచ్చింది. అతని భార్య గోపికా పూర్ణిమ కూడా మంచి గాయని, ఆమె కూడా పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొంది. సరే, దేవుడి దయవల్ల మేమంతా సినిమాల్లో మంచి పాటలు పాడి, గుర్తింపు తెచ్చుకున్నాము. ఇవన్నీ జరుగుతున్నా కూడా, ఎక్కడో ఒక చోట కళాకారులుగా మాలో మాకు కావలసినట్టుగా పాడే అవకాశాలు అంతగా దొరకట్లేదేమో అన్న ఒక చిన్న అసంతృప్తి కలుగుతోంది. అందుకే మనకు కావలసిన పాటలు పాడేందుకు ఒక వేదిక కల్పించుకోవాలని నిర్ణయించుకుని, ‘స్వనము’ అంటే చెవులకు ఇంపైన శబ్దము కనుక, ‘సుస్వన’ అనే ఒక గ్రూప్ ను స్థాపించడం జరిగింది. గత ఏడాది ఇదే సమయానికి దీన్ని స్థాపించి ఇండియా లో రెండు, యు.ఎస్ లో రెండు షోస్ చెయ్యడం జరిగింది. మున్ముందు మరిన్ని మంచి షోస్ చెయ్యగలమని భావిస్తున్నాము.

పార్ధసారధి గారు... అతి చిన్న వయసులోనే గాయకులుగా, సంగీత దర్శకులుగా, కార్యక్రమ నిర్వాహకులుగా 12 దేశాల్లో వెయ్యికి పైగా స్టేజి షో లు చేసిన వారిగా, ఇలా అనేక విజయాలు సాధించారు కదా. ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు మీ ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది?
భగవంతుడి అనుగ్రహం, గురువుల ఆశీర్వాదంతోనే ఇవన్నీ చెయ్యగలిగాను. లాంగ్ వే టు గో. కొంత చెయ్యగలిగాను, ఇంకా చెయ్యల్సింది చాలా ఉంది. దానిక్కూడా మీ అందరి ఆదరాభిమానాలు ఉంటే ముందుకు సాగగలనని ఆశిస్తున్నాను.

పార్ధసారధి గారు మరిన్ని విజయాలు సాధించి, తెలుగువారు గర్వించదగ్గ కళాకారులుగా విశ్వవిఖ్యాతిని ఆర్జించాలని మనసారా ఆకాంక్షిస్తోంది –అచ్చంగా తెలుగు.


  

No comments:

Post a Comment

Pages