పోడూరి శ్రీనివాసరావు
సుడిగుండాల్లా చుట్టుముట్టుతున్న
జ్ఞాపకాల వలయాల్లోంచి
బయటపడడం బ్రహ్మప్రళయమైంది
మధురమైన జ్ఞాపకాలుకొన్ని
భయంకరమైన జ్ఞాపకాలుకొన్ని
ఆందోళనకరమైన జ్ఞాపకాలుకొన్ని
మరచిపోలేని జ్ఞాపకాలుమరికొన్ని
ఊహ తెలిసిన నుంచీ తరచిచూస్తే
ఈ అరవై ఏళ్ల వయసు వరకూ
తారసపడిన జ్ఞాపకాలు అనంతమే
అయినా… గుర్తుంచుకోవాలనుకునే జ్ఞాపకాలు మాత్రం కొన్నే-
సీతను నే తొలిసారిగా కలుసుకున్నరోజు
ఆమెనే అర్ధాంగిగా నిర్ణయించుకున్నరోజు
తల్లిదండ్రులను ఒప్పించినరోజు
అంగరంగ వైభవంగా సీత నా సతి అయినరోజు
సిగ్గుమొగ్గలు తొడుగుతుండగా నేను
తండ్రినవుతున్నానని సీత తెలిపినరోజు
ప్రకాష్ కాలేజ్ టాపర్గా నిలిచినరోజు
ప్రకాష్ ఎమ్మెస్కై యూఎస్ వెళ్లినరోజు
అన్నీసంతోషాలే - మధురమైన జ్ఞాపకాలే
నాన్నగారు మరణించినరోజు
అమ్మ కనుమూసిన రోజు
నేను పదవీవిరమణ చేసినరోజు
నాకు మొదటిసారి హార్ట్ఎటాక్ వచ్చినరోజు
అన్నీవిషాదాలే - చేదు జ్ఞాపకాలే
ఇవన్నీ ఒకెత్తనుకుంటే, ఇప్పటికీ
నాకు కొరకుడుపడని విషయం
నా కుటుంబంతో నిమిత్తంలేకుండా
నన్ను జ్ఞాపకాల విషవలయంలో చుట్టుముట్టిన రోజు.
అత్యాచారాలకు అంతేలేని రోజు
ఏసిడ్ సీసాలు మొఖాన నర్తించినరోజు
ప్రత్యేక రాష్ట్రంపేరున అమాయకులు
అభాగ్యులు ఆత్మహత్యలకు పాల్పడ్డరోజు
గజిబిజి ఊహలతో, అర్థంకా(లే)నిజ్ఞాపకాలతో
మనసు మళ్లీ సుడిగుండంలోకి నెట్టబడుతోంది
ఈ జ్ఞాపకాలవలయాల్లోంచి బయటపడేదెప్పడో!!
No comments:
Post a Comment