శ్రీ రామకర్ణామృతం - 16 - అచ్చంగా తెలుగు

శ్రీ రామకర్ణామృతం - 16

Share This

శ్రీ రామకర్ణామృతం - 16

                                  డా.బల్లూరి ఉమాదేవి

                                      కామవరం51.శ్లో: సాకేతే ధవళే సురద్రుమతలే సౌధే విమానాంతరే
  చాదిక్షాంత సమస్తవర్ణకమలే దివ్యే మృగేంద్రాసనే 
ఓంకారోజ్జ్వల కర్ణికే సురసరిన్మధ్యే సదేవాంతరే
వ్యాసాద్యాది మునీశ్వరాద్యభినుతం రామం భజేతారకం.

తెలుగు అనువాదపద్యము:

మ:స్థిరమై నిర్మలమౌ మనస్సరసి నాదిక్షాంత వర్ణాబ్జ వి
స్ఫురితోంకార విశుద్ధకర్ణిక సురేశుల్ గొల్వ సాకేతమన్
పురమధ్యంబున గల్పమూలమున భానుస్ఫూర్తి సౌధంబునన్
జిరమా పుష్పక మధ్యపీఠ లసితున్ శ్రీరాము గీర్తించెదన్.

భావము:అయోధ్యయందు తెల్లని కల్పవృక్ష వాటికయందు గల మేడలయందు పై యంతస్థునందు అకారము మొదలు క్షకారము వరకు సమస్తాక్షర రూపపద్మమందు ప్రకాశించుచున్న సింహాసనమునందు ఓంకారముచే ప్రకాశించు పద్మ మధ్యమందు దేవతలతో కూడినమధ్యభాగము గల గంగా మధ్యమంద వ్యాసాదిమునులచే స్తోత్రము చేయబడుచున్న తారకరామును సేవించుచున్నాను.

52.శ్లో:కోదండ దీక్షాగురు మాదిమూలం
గుణాశ్రయం చందనకుంకుమాంకం
సలక్ష్మణం సర్వజనాంతరస్థం
పరాత్పరం రామ మహం నమామి.

తెలుగు అనువాద పద్యము:
మ:ధరణిజా కుచ చర్చ చందన లసత్కాశ్మీర జన్మాంకిత
స్ఫురదత్యున్నత వక్షు సర్వగు జగన్మూలానుకూలున్ బరా
త్పరు సౌమిత్రీయుతున్ గుణాశ్రయు హరిన్ భక్తారి సంహారకున్
గురుకారుణ్య పయోధిరాము కొలుతున్ గోదండ దీక్షాగురున్.

భావము:ధనుర్వివిద్యాగురువైనట్టి కారణమునకు కారణమైనట్టి సద్గుణములకాధారమైనట్టి ,గంధము కుంకుమముచిహ్నముగా గలిగినట్టి,లక్ష్మణునితో గూడినట్టి ఎల్రవారి యంతరంగమందున్నట్టి పరునికంటె పరుడైన రాముని నేను నమస్కరిం చుచున్నాను.

53.శ్లో:మూలాధార సరోరుహే హతవహస్థానే త్రికోణాంతరే 
కందే కుండలికా సుషుప్తి పటలీ వాసాంత వర్ణాశ్రయే
బాలార్క ప్రతిమం వరాభయకరం పాశాంకుశాలంకృతం
భూతాన్వాశ్రయ మాది పూరుష మజం రామం భజే తారకమ్.

తెలుగు అనువాద పద్యము:

మ:అరయన్ గంధ సుషుప్తి కాలహిత వాసాంతాక్షర వ్యాప్త భా
సురమౌ కంద త్రికోణ మధ్యమమునన్ శుక్రస్థలిన్ బాల భా
స్కర సందీపితు భూతసంశ్రయు విరాజత్పాశ ముఖ్యాస్త్రు సు
స్థిరు విద్వేషిహరున్ బరాత్పరు నజున్ శ్రీరాము సేవించెదన్.

భావము:అంతకును దుంపయైన మూలాధార
చక్రమందు కుండలి రూపముగా సుషుప్తి చేత నొప్పుచున్న వకారము మొదలు సకాలపర్యంతాక్షరముల కాశ్రయమైనటటు లేత సూర్యునితో సమానుడైనట్టి వరము,అభయము గల హస్తములు కలిగినట్టి పాశాంకుశములచేత నలంకరించబడినట్టి భూతములకు ముఖ్యాశ్రయమైనట్టి మొదటి పురుషుడైనట్టి పుట్టుక లేని తారక రాముని సేవించుచున్నాను.

54.శ్లో:స్వాధిష్ఠాన సరోరుహే ప్రవిలసద్బాలాంత వర్ణాశ్రయం
బ్రహ్మగ్రంథి మహోన్నతే కరతలే శ్రీకుండికామాలికామ్
పీఠే రత్ననిభం వరాభయకరం వాణీయుతం బిభ్రతం
సాక్షాద్బోధ మనన్యమంగళకరం రామం భజే తారకమ్.

తెలుగు అనువాద పద్యము:
మ:స్థిరమైనట్టి బలాంత వర్ణదళ స్వాధిష్ఠానక గ్రంథికా
కరు సత్కుండికమాలికున్ సుజనతా కల్యాణ ముద్రోజ్జ్వలున్
వరతామ్రాకృతి వైరిసాధ్వసకరున్ వణీయుతున్ దారకున్
బరు శ్రీరాము గుణాభిరాము మదిసంభావించి సేవించెదన్.

భావము:స్వాధిష్ఠాన చక్రమందు ప్రకాశించుచున్న బకారము మొదలు లకారము వరకు గల యక్షరములకాశ్రయమైనట్టి బ్రహ్మగ్రంథిచే నున్నతమైన హస్తమునందు  కమండలువును మాలికను దాల్చినట్టి,పీఠమునందున్నట్టియు,రత్నములతో సమానుడైనట్టి గొప్ప యభయమును చేయునట్టియు సాధువాక్యములతో కూడినట్టియు కేవల బోధ స్వరూపుడైనట్టియు అసాధఅరణ శుభము చేయు తారక రాముని సేవించుచున్నాను.

55.శ్లో:డాపాంతాక్షరపంకజే దశదళే మాణిక్య సంపూరితే
విష్ణుగ్రంథిమయే వరాభయకరంశ్రీశంఖ చక్రాన్వితమ్
మార్తాండద్యుతు మంజులాభ మతులం పీతాంబరం కౌస్తుభం
సర్వం సర్వగ మిందిరాసహచరం రామం భజే తారకమ్.

తెలుగు అనువాద పద్యము:
మ:ఘనమైనట్టి డపాంత వర్ణదళయుక్తంబై హరిగ్రంథితం
బన జెల్వౌ మణిపూర చక్రమున నబ్జాతోజ్జ్వలున్ రాము గాం
చన చేలున్ రిపుజైత్రు దారకు బరున్ సర్వాత్ము చక్రాబ్జ హ
స్తుని లక్ష్మీయుతు బద్మనాభు భజియింతున్ గౌస్తుభోద్భాసితున్.

భావము:పదిరేకులు గలిగినట్టి మణులచే నిండింప బడినట్టి విష్ణుగ్రంథి స్వరూపమైన డకారాది పకార పర్యంతాక్షర రూపమైన చక్రమందున్నట్టి మిక్కిలి యభయమును చేయునట్టి శంఖచక్రములతో కూడినట్టి సూర్యమండలము యొక్క కాంతి వలె
మనోహరమైన కాంతి కలిగినట్టి సామ్యము లేనట్టి పచ్చని వస్త్రము కల్గినట్టి కౌస్తుభమణి కల్గినట్టి సర్వస్వరూపుడైనట్టి సమస్తమును పొందినట్టి లక్ష్మీసహాయుడైనట్టి తారకరాముని సేవించుచున్నాను.

56.శ్లో:హృత్పద్మే విలయార్కకోటి సదృశం కాఠాంత వర్ణోజ్జ్వలే 
ప్రాణాంత ప్రణవాంతరే ప్రవిలసద్దోర్బాణపీఠాంతరే
సూర్యం హంసమయం సదాశివపదం కోదండ దీక్షాగురుం
వాసంమోక్షరమాసమేత మనిశం రామం భజే తారకమ్.

తెలుగు అనువాద పద్యము:
మ:పరగన్ భవ్య కఠాంత వర్ణసహితున్ బ్రాణానిలోంకార సు
స్థిరు ఛాయాధిప హంసరూపు నిలయాదిత్యాయతోద్భాసి వి
స్ఫురితోద్బాణవసత్సదాశివసురూపున్ మోక్షలక్ష్మీయుతున్
గురుభక్తిన్ భజియింతు దారకు మహా కోదండ దీక్షాచురున్.

భావము:కకారాది ఠకారాంత వర్ణరూపమైన ప్రాణవాయువులందొప్పుచున్న ఓంకారమధ్యమందు గలయట్టి ప్రకాశించుచున్న భుజముల యందలి బాణపీఠముగల హృదయ పద్మమందున్నట్టి ప్రళయ సూర్యులతో తుల్యమైన రూపము గలయట్టి సూర్యరూపుడు హంసరూపుడైనట్టి యీశ్వరస్థానమైనట్టి ధనుర్విద్యా గురువైనట్టి మోక్షలక్ష్మితో కూడినట్టి తారకరాము నెల్లపుడు సేవించుచున్నాను.

57.శ్లో:సాక్షాత్ షోడశ దివ్యపత్రకమలే జీవాత్మ సంస్థాపితే 
రుద్రగ్రంథి మయే మనోన్మనిపథే జాలంధ్ర పీఠాంతరే
శుభ్రజ్యోతిమయం శరీర సహితం సుస్థం సుధా శీతలం
శబ్దబ్రహ్మ నివాస భూతవదనం రామం భజే తారకం.

తెలుగు అనువాద పద్యము:
మ:తనరన్ షోడశ పద్మపత్రమున రుద్రగ్రంథితంబై మనో
న్మనిమార్గంబున జీవసంస్థలిని మాన్యంబైన జాలంధ్రపీ
ఠిని శబ్దాహ్వయబ్రహ్మకూటమున దాటిజ్జ్యోతి రూపంబునన్ 
ఘనతం జెన్నగు రాము దారకు సమగ్రానుగ్రహున్ గొల్చెదన్.

భావము:జీవాత్మస్థానమైనట్టియు,రుద్రగ్రంథిస్వరూపమైనట్టియు,మనోన్మనీ మార్గమైనట్టియు, జాలంధరపీఠము మధ్యమందు గలిగినట్టియు, షోడశదళపద్మమందున్నట్టియు, పరిశుభ్ర జ్యోతిస్స్వరూపమైనట్టియు, దేహముతో గూడినట్టియు నమృతమువలె చల్లనైనట్టియు శబ్దబ్రహ్మకు నివాసమగు ముఖము గల తారక రాముని సేవించుచున్నాను.

58.శ్లో:భ్రూమధ్యే నిగమాగమోజ్జ్వల పదే చంద్రత్రి మార్గాంతరే
నిర్ద్వంద్వే నిఖిలార్థ తత్త్వ విలసత్సూక్ష్మే సుషున్మోన్ముఖే
ఆసీనం ప్రళయార్క భాసుర పరంజ్యోతిస్స్వరూపాత్మకం
వర్ణాభ్యంచిత మోక్షలక్ష్మి సహితం రామంభజే తారకమ్.

తెలుగు అనువాద పద్యము:
మ:శ్రుతి మార్గంబున ద్రైపదాంతరమునన్ భ్రూమధ్యమందున్  సము
న్నత భాస్వత్సకలార్థతత్త్వగ సుషుమ్నాస్థాన  సంస్థాను శో
భిత కల్పారుణ తేజు మోక్షకమలా ప్రేమాన్వితున్ దారకున్ 
ద్యుతిమంతున్ భయ వర్జితున్ హరి పరంజ్యోతిన్ భజింతున్ మదిన్.

భావము:వేదశాస్త్రములచే ప్రకాశించుచున్న స్థానమైన చంద్రస్వరూపమైన మూడు మార్గముల మధ్యప్రదేశమైన కనుబొమ్మల మధ్యమందు సుఖదుఃఖాది ద్వంద్వములు లేనట్టి సమస్త తత్త్వములచే నొప్పుచున్న  సూక్ష్మమైన సుషమ్నాభిముఖమైన్థానమందు కూర్చునట్టి ప్రళయసూర్యునివలె ప్రకాశించు తేజోరూపుడైన కకారాది వర్ణములచే నొప్పుచున్నట్టి మోక్షలక్ష్మితో కూడినట్టి తారకరాముని సేవించుచున్నాను.

59.శ్లో:శీర్షాంభోరుహకర్ణికే నిరుపమే శ్రీ షోడశారే శశి
ప్రఖ్యాతామృత వార్ధి వీచి లహరీనిర్వాణ పీఠాంతరే
శబ్దబ్రహ్మపరం చరాచరగురుం తేజఃపరం శాశ్వతం
సత్యాసత్య మగోచరం హృది సదా సీతాసమేతమ్ భజే.

తెలుగు అనువాద పద్యము:

మ:అల శీర్షాంబుజ కర్ణికాస్థు బరిపూర్ణాబ్జామృతాంభోధి వీ
చిలసన్మోక్ష మహాసనాంతరమునం జెల్వొందు సీతా సము
జ్జ్వలుదేజఃపరునిం జరాచర గురున్ సత్యానృతున్ శాశ్వతున్
బలభిన్నీలు నగోచరుం దలతు శబ్దబ్రహ్మ వాచ్యాధికున్.

భావము:సామ్యములేని పదియారురేకులుగల శిరస్సునందలి పద్మము యొక్క కర్ణిక యందు ప్రసిద్ధమైన అమృతసముద్ర తరంగములు గల ప్రవాహముతో గూడిన మోక్ష పీఠమునందు శబ్దబ్రహ్మ ప్రధానము కలిగినట్టి,స్థావర జంగమములకు గురువైనట్టి శాశ్వతమైన ఉత్కృష్ట తేజస్సైనట్టి ఈశ్వర ప్రపంచ  రూపుడైనట్టి నేత్రములకు గోచరించనట్టి సీతతో గూడినట్టి రాముని సేవించుచున్నాను.

60.శ్లో:సాకేతే రవికోటి సన్నిభ మహాహర్మ్యే సుసింహాసనే
 నానారత్న వినిర్మితే మునిజనాకీర్ణే సదానందనే
దేవాధీశ్వర సంయుతే నివసితం వామాంక శీతోజ్జ్వలం
దేవేంద్రోపల నీలకోమలతనుం రామం భజే తారకమ్.

తెలుగు అనువాద పద్యము:
మ:తనప్రోలం గమలాప్తకోటి విలసత్సౌధాంతరానంద ధా
మనవీనోజ్జ్వల రత్నపీఠమున నామ్నాయేశ్వరాభ్ఱంతరం
బున జెల్వొందెడు శక్ర నీలనిభురామం జానకీ యుక్తు గాం
చన మంజీర కిరీట కుండల విరాజద్భూషణుం గొల్చెదన్.

భావము:అయోధ్యయందు కోటి సూర్యులతో తుల్యమైన మేడ యందు శ్రేష్ఠ సింహాసనమునందు అనేక రత్నములచే నిర్మింపబడినట్టి మునీశ్వరులచే వ్యాప్తమైనట్టి యెల్లప్పుడు నానందమును కలిగించునట్టి  దేవతాశ్రేష్ఠులతో కూడిన పద్మమందు నివసించినట్టి నెడమతొడయందు సీతచే ప్రకాశించుచున్నట్టి నింద్రనీలమణులతో సమానుడైనట్టి తారకరాముని సేవించుచున్నాను.
(ఇంకా ఉన్నాయి ... జై శ్రీరాం !)

No comments:

Post a Comment

Pages