ప్రకృతి సేవ - అచ్చంగా తెలుగు
ప్రకృతి సేవ 
రావి కిరణ్ కుమార్ 
సేవ చేయును చెట్టు చల్లని నీడ నిచ్చి మధుర ఫలంబుల నిచ్చి 
మన గూటికై గుండెనిచ్చి మన కదలికకాధారమైన ప్రాణ వాయువు
నిచ్చి అలసిన నయనంబులకు ఆహ్లాదమిచ్చి తారతమ్యములెంచక 
 సేవచేయు చెట్టు ప్రతిగా మనిషి  చేయు సేవ ప్రాణహరణమని తెలిసీ  

సేవ చేయు జలము దాహార్తి తీర్చి దేహము పరిశుభ్రపరచి 
కడుపు పండించు పంటకు ప్రాణాధారమై నిలిచి సేవ చేయు 
జలము ఎదురు తానేమాశించకయే జీవులనెల్ల ఒక్కటిగా
చూసి ప్రతిఫలమిచ్చు మానవుడు కలుషితములతో   


సేవ చేయును ధరణి ప్రకృతి నెల్ల తనపై దాల్చి సకల 
జీవులకు ఆవాసమై సత్తువ నిచ్చు ఆహారమొసగి ప్రతి 
సేవ చేయు మనిషి గుండెలు పగుల గొట్టి సారమునెల్ల 
యంత్రములకిచ్చి జీవుల నీరసింప చేసి నిస్సారముగా మార్చి 


సేవ చేయును వాయువు  ఊపిరిగా మారి ప్రాణములు నిలిపి 
పూల  సుగంధము తోడ్కొని చల్లని పరిమళముల ప్రసరించి
చక్కని ఆలోచనలకు ఆలంబనగా నిలిచి ప్రతి సేవ చేయు  మనిషి
విషవాయువుల తోడ ప్రాణ వాయువును నింపి  

తానై సేవ చేయ నొచ్చిన ప్రకృతి మాత ఘోష పెడచెవిన పెట్టి కర్మ ఫలముల
ననుభవించు తోటి మనుజుల సేవ చేతు మనుతూ దీనుల ఉద్దరింతుమంటూ
దీనత్వము నొంద బోవు  తమ భావిజనుల భవితవ్యము మరచి పరుగులు 
పెట్టుచుంటిరి మాధవా ఇది ఏమి మా నవ సేవయో నీకైనా యెరుకయా  !

No comments:

Post a Comment

Pages