అష్టదళ సేవాపద్మము - అచ్చంగా తెలుగు

అష్టదళ సేవాపద్మము

Share This

అష్టదళ సేవాపద్మము

నండూరి సుందరీ నాగమణి


 ౧. ఆ.వె.
హరిని తలపు దెచ్చి మరపించు వేదన,
బాధ తొలగజేసి, భయము బాపు
వరదుడతడు నిజము, వైద్యుడే మనలకు
ప్రాణ దానమొసగు పరమ విభుడు!

౨. ఆ.వె.
శత్రుబారి నుండి సకలవేళలయందు
కాపలాను మనల కాచుకొనును,
సైనికులకు చేయి చక్కగాను సలాము
హద్దుయందు నిలిచె హరుని వోలె!

౩. ఆ.వె.
రక్త సేకరణను రాత్రి దివమనక
దాతలను పిలచియు దైవ రీతి
వ్యాధి బారి నుండి వైదొలగగ జేయు
వారి సేవ మనకు భాగ్యమిటుల!

౪. ఆ.వె.
చోరభయము లేక సుప్తమందు మనము
సేద దీరగాను సేవ సేయ
కోరి తిరుగుచుండు గూర్ఖాల పహరాలు
ఎచట పొందగలము ఇట్టి సేవ!

౫. ఆ.వె.
దొంగ నుండి కాచు దొమ్మీల నిలచుగా
రాత్రి పగలుయనక రక్ష సేయ
దోషులెల్ల వణికి తోకముడవజేయు
రక్షకభటుడిలను రాముడతడు!

౬. ఆ.వె.
నిదుర మాని వారు నిశిరాత్రి యంతను
వీధులూడ్చి మనకు వేగిరముగ,
వెతలు బాపుచుండు వెలదుల తలవగా
త్యాగధనులు సుమ్మి తీరు నందు!

౭. ఆ.వె.

వీధి శునకములను వేల పక్షుల యొక్క
బాధలన్ని వీరు బాపగాను
అభయమొసగి మరియు యార్త రక్షణ చేసి
వాసికెక్కినారు వసుధనందు!

౮. ఉత్పలమాల:
సేవలు ఎట్టివో తెలుప చిన్నది యౌనుగ లేఖినన్నదే
భావన కల్గుటే నిజము; బాగుగ యోచన చేసిదెల్పగా
తావుల నిండెలే మధుర తావులు; సేవను చేయునట్టి యా
సేవక మానసమ్ములవి చేరును దేవుని దృష్టినే కనన్!

****

No comments:

Post a Comment

Pages