శ్రీమద్భగవద్గీత -6 - అచ్చంగా తెలుగు

శ్రీమద్భగవద్గీత -6

రెడ్లం రాజగోపాలరావు, పలమనేరు.

Ph : 09482013801మయిసర్వాణికర్మాణి
సన్య్నస్యాద్యాత్మ చేతసా
నిరాశీర్నిర్మమోభూత్వా
యుధ్యస్వవిగతజ్వరః 30 వ శ్లోకం
సమస్త కర్మలను నాయందు సమచిత్తములో సమర్పించి ఆశగాని , మమకారముగాని లేనివాడవై నిశ్చింతగా యధ్ధము చేయుము.ఇక్కడ అర్జునుని భావముతో చేయుమని కృష్ణ పరమాత్మ చెప్పుచున్నాడు మనుజులు వారి వారి సంప్రదాయోచిత కర్మలన్నియు ఈశ్వరార్పణ బుద్ధితో,ఆధ్యాత్మిక గుణములతో కూడి యాచరించవలయును.దీనిని బట్టి గృహస్థాశ్రమములో నున్నవారు కూడా తరించుటకు అవకాశమేర్పడుచున్నది. 
ధూమేనావ్రియతే వహ్ని
ర్యధా దర్మో మలేనచ
యధోల్భేనావృగర్భ
స్తధాతేనేదమావృతమ్ 38 వ శ్లోకం
పొగచేత అగ్ని, మురికి చేత అద్దము మావి చేత గర్భమందలి శిశువు కప్పబడియున్నట్లు కామము చేత (బాహ్యమైన కోరికిలు) ఆత్మజ్ఞానమును కప్పబడియుండును ప్రతిజీవి యొక్క హృదయమందును ఆత్మదేదీప్యమానముగా ప్రకాశించు చున్నది, అది ప్రాపంచికమైన విషయాదులచే ఆవరించబడియండుట వలన అనుభూతము కాకయున్నది. భక్తి జ్ఞాన వైరాగ్యములచే కామమును హృదయమునుండీ పాలద్రోలినచో ఆత్మ ప్రత్యక్షముగా అనుభూతముకాగలదు. ఇక్కడ చక్కని ఉదాహరణల ద్వారా భగవానుడు ఆత్మతత్వమును తెలియజేయుచున్నాడు. అగ్ని పొగచే కప్పబడినట్లు అద్దము మురికిచే కప్పబడినట్లు గర్భస్థ శిశువుమావిచే కప్పబడినట్లు స్వయం ప్రకాశమైన ఆత్మప్రాపంచిక(స్వార్ధ) చింతలచేత కప్పబడియున్నది.
బ్రహ్మమనగ వేరు పరదేశమునలేదు
బ్రహ్మమనగ తానె బట్ట బయలు
తన్ను తానెరిగిన తానెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమ
భగవంతుడు ఎక్కడో దూరతీరాల్లో లేడు తనలోనే భగవంతుడు నిబిడీ కృతమైయున్నాడు. పాలలో నేతిలా , కట్టెలో అగ్నిలా మానవుని ప్రతియణువులోనూ,భగవంతుడు నిండి నిబిడీ కృతమైయున్నాడు. తనను తానెరిగిన తానే భగవంతుడని వేమనగారి ఉవాచ భగవంతుని ప్రతిరూపమే నేను అన్న ఎరుక వలన మానవుడు చీకటి నుండి వెలుగువైపు ప్రయాణించ గలడు. ప్రపంచములో గల దుఃఖమంతటికిని కారణము జీవుడు తన నిజస్వరూపమును తెలిసికొనకుండుటయే.అభ్యాసవైరాగ్యముల ద్వారా స్వస్వరూప జ్ఞానాన్ని బడసిన మహాత్ములు బంధరహితులు, వారు గృహస్తులైనను,సన్యాసులైనను మానవశ్రేష్ఠులే.
శరీరమమకారమున్నంత వరకూ ధనేషణ, ధారేషణ మరియు పుత్రేషన కలుగుతుంది. తద్వారా కలిగిన దుఃఖానికి చింతతప్పదు. నేను శరీరము కాదు, నేను ఆత్మ స్వరూపుడను అనే భావన వలన శరీరక కర్మల ద్వారా ఏర్పడిన సుఖదుఃఖాదులు మనలను ఏ మాత్రము చలింపజేయలేవు. మోహము పూర్తిగా నశించినస్థితియే మోక్షము. ప్రేమస్వరూపుడైన భగవంతుడు ప్రసాదించిన ఈశరీర దేవాలయాన్ని నిష్కామ సేవద్వారా, స్మరణ ద్వారా పునీత మొనర్చుకొనుటయే మానవజీవిత పరమార్ధము. కొంతమందికి సందేహము కలుగవచ్చు. నేను పేదవాణ్ణి కనుక మానవులకు ఏ విధంగా సేవ చేయగలను ? అన్ని విషయాలకు డబ్బుతో ప్రమేయంలేదు. బాధలో నున్న మనిషికి స్వాంతన కలిగించే మాట కూడా వున్నతమైన సేవయే సాటి జీవులకు సాటి మానవాళికి మరియు ప్రకృతికి హాని జరగకుండా జీవించుటయు పవిత్రమైన సేవయే ధర్మబద్దమైన జీవన విధానము వలన జరుపబడిన కర్మలు ఎన్నటికీ దుఃఖాన్ని కలిగించవు.

నాల్గవ అధ్యాయము

జ్ఞాన యోగము

జ్ఞానమే మనుజుని సర్వ ప్రాణికోటిలో శ్రేష్ఠునిగా నిలుపుచున్నది. భగవంతుని తెలుసుకోవడమే జ్ఞానం ఇట్టి విషయాలను ప్రస్తావించినందు వలన ఈ అధ్యాయమునకు జ్ఞానయోగమని పేరు. బాహ్య జీవనానికి అవసరమైన తెలివితేటలు ఎన్నియున్నా భగవంతుని తెలుసుకునే తెలివిలేనపుడు ఆ తెలివి నిరర్థకము. మానవజన్మకు పరమార్ధాన్ని తెలుసుకుని ప్రశాంతతను నిలిపుకున్న వాడే జ్ఞాని.
శ్రీ భగవానువాచ:
ఇమం వివస్వతేయోగం
ప్రోక్తవానహమవ్యయమ్
విపస్వాన్ మనవే ప్రాహ
మనురిక్ష్యాకవేహ్రవీత్ 1 వ శ్లోకం
నాశ రహితమగు ఈ నిష్కామ కర్మయోగమును పూర్వము నేను సూర్యునకు జెప్పితిని. సూర్యుడు వైవస్వత మనువునకుపదేశించెను. మనువు ఇక్ష్వాకునకు బోధించెను. చిత్తశుద్ధి ద్వారా నాశ రహితమగు మోక్షమను ఫలమొసంగుట వలన నిష్కామ కర్మయోగాది ఆధ్యాత్మ విద్య అవ్యయమని చెప్పబడినది. సత్యము ఏ కాలమందును నశింపదు కనుక, ఆ సత్యమునకు పొందింపజేయు మార్గమునకును ఏ కాలమందును నాశముండదు. ఒక వేళ దానిని ఆచరించుటలో దేశకాల పరిస్థితులచే లోకమున హెచ్చుతగ్గులున్నను అది పూర్తిగా అంతరించదు భగవంతుడే అవతారమెత్తి దానినుద్దరించుచుండును.
సనాతన భారతీయ సంసృతిని రూపుమాపనెంచి ఎన్నియో శక్తులు శతాబ్ధాలుగా ప్రయత్నించు చుండిరి. భారతీయ సంస్కృతి మర్రి వృక్షము వంటిది దాని వేళ్ళు చాలా లోతుగా వ్యాపించి యున్నది ఎంత క్షామము సంభవించినా ఆ వృక్షము ఉనికికేమాత్రము భంగము వాటిల్లదు.మానవజీవన, పరిణామ వికాశమునకు కావలసినంత శాస్త్ర జ్ఞానము మన గ్రంధాలలో పొందుపరిచబడి యున్నది. దురదృష్టవశాత్తు నేటి తరము శ్రద్ధ చూపకున్నది. ప్రపంచ దేశముల వారంతా మన యోగ శాస్త్రాన్ని శ్రద్ధగా అభ్యాసము చేస్తూవుంటే, మనము చోద్యము చూస్తున్నాము. ఇది అత్యంత బాధాకరము.
 ****

No comments:

Post a Comment

Pages