ఆసరా - అచ్చంగా తెలుగు

ఆసరా 

వై.శ్రీ రంగ లక్ష్మి"మరొక్కసారి ఆలోచించు కన్నా!"అని ప్రాధేయపూర్వకంగా అడిగింది అరుణ.
     "లేదమ్మా!నానిర్ణయాన్ని మార్చుకోను.నేచెప్పేది పూర్తిగా వింటే నువ్వు కూడా నా నిర్ణయం సరైనదేనని అంగీకరిస్తావు."అన్నాడు కన్నా అని పిలవబడే సురేంద్ర.
     తల్లీ కొడుకుల మధ్య ఈ వాదనకు కారణం మాధవయ్యగారు .
            శేషగిరి, అరుణల ఏకైక సంతానం సురేంద్ర.ప్రాణాలన్నీ అతని మీదే పెట్టుకొని పెంచారు.శేషగిరి గవర్నమెంటు ఉద్యోగం చేసి ఇటీవలే రిటైరు అయ్యాడు.అరుణ గృహిణి.సొంత ఊళ్ళో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు. సురేంద్ర కూడా తల్లిదండ్రుల ఆశలకు అనుగుణం గా ఇంజనీరింగు చేసి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు.వారి దూరపు బంధువుల అమ్మాయి నీరజ నిచ్చి వివాహం జరిపించారు.ఆమె కూడ పెళ్ళి నాటికి హైదరాబాదు ఇంఫోసిస్  లో జాబు చేస్తోంది.పెళ్ళి తరువాత బెంగుళూరు మార్పించుకొని అక్కడ కాపురం పెట్టారు. రెండు సంవత్సరాలు ఆనందంగా గడిపారు.పిల్లల కొసం పెద్దల పోరు మొదలైంది.వారు కూడా పిల్లల కోసం ఆలోచించడం మొదలుపెట్టారు. అలా రెండు,మూడు సంవత్సరాలు గడిచిపోయాయి.ఇక లాభం లేదని ఇద్దరూ డాక్టర్లను కన్సల్ట్ చేసి వారి చుట్టూ తిరగసాగారు. ఆ తిరిగే క్రమం లోనే మాధవయ్యగారి పరిచయం జరిగింది.
             ఒక రోజు సురేంద్ర నీరజను హాస్పటల్ దగ్గర దించి అన్యమనస్కం గా కారు నడుపుతూ వెళుతుండగా కారు తగిలి మాధవయ్యగారు కిందపడ్డారు .వాస్తవం లోకి వచ్చిన సురేంద్ర వెంటనే కారు దిగి ఆయనను లేపి సారీ చెప్పాడు.సురేంద్ర నిదానం గా వెళుతుండడం వలన పెద్దగా దెబ్బలు తగలలేదు కానీ కాళ్ళు,చేతులు కొట్టుకు పోయాయి.ఆయన ఇంటి అడ్రసు అడిగి అక్కడకు దగ్గరే అవడం తో దింపడానికి వెళ్ళాడు.వీరు లోపలకు అడుగు  పెట్టడం ఆలస్యం 15,20 మంది పిల్లలు గోలగా అరుస్తూ చుట్టూ మూగారు.'ఏమైందిరా"అంటూ లోపల్నుంచి ఒకావిడ బయటకు వచ్చారు.కొత్తగా కనిపించిన సురేంద్రను చూసి 'ఎవరు కావాలనీఅడగబోయేదల్ల పక్కనే దుమ్ముకొట్టుకొని ఉన్న మాధవయ్య గార్ని చూసి కంగారుపడి ,"ఏమైంది?ఇతను ఎవరు?"అని అడిగింది."నా పేరు సురేంద్ర.నా పొరపాటు వల్ల ఇలా జరిగింది.క్షమించండి" అన్నాడు.
    "కంగారుపడకు.కింద పడటం తో కొంచెం కాళ్ళు,చేతులు డోక్కుపోయాయి అంతే.ఇందులో నీ తప్పేమీ లేదు.నేనే రోడ్డు మీద కొంచెం జాగ్రత్తగా నడవవలసింది.సమయానికి ఈ అబ్బాయి ఉండి ఇంటికి తీసుకు వచ్చాడు.ముందు నువ్వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా!పిల్లలూ అంకుల్ కి నమస్తే చెప్పి మీరు వెళ్ళి ఆడుకోండి."అన్నారు మాధవయ్య గారు.ఆయన సంస్కారానికి సురేంద్ర కళ్ళు చెమర్చాయి.అదే ఇంకొకరు అయితే ఈపాటికి గొడవగొడవ చేసేవారు అనుకొని మనసు స్థిమిత పడటం తో చుట్టూ గమనించ సాగాడు.ఇల్లు పెద్దదే! వారసత్వంగా వచ్చి ఉండవచ్చు.చుట్టూ కాంపౌండ్ వాల్,ఇంటి ముందు అన్నీ చెట్ల తో ఆహ్లాదకరం గా ఉన్నది.ఇంట్లో  ఇంతమంది పిల్లలు ఉన్నారేమిటి?ఈ దంపతులు ఇద్దరికీ 60-65 మధ్య వయసు ఉండవచ్చు.బంధువుల పిల్లలు అనుకోవడానికి ఆస్కారం లేదు.వీరంతా ఇక్కడే ఉంటున్నట్లు చనువుగా ఉన్నారు.సురేంద్ర ముఖం లోని ఆశ్చర్యాన్ని గమనించిన మాధవయ్య గారు ,"వీరంతా మాకు దేముడిచ్చిన పిల్లలు బాబూ!"అన్నారు.
 అప్పుడే మంచినీళ్ళ గ్లాసులతో అక్కడకు అడుగుబెట్టిన జానికమ్మ గారు,"అవును బాబూ!ఇప్పుడు వాళ్ళే మాకు కాలక్షేపం.మేము ఒంటరివారము అనే ఆలోచనే రాదు. సమయమంతా వారితోనే గడిచిపోతుంది."అన్నారు.
   "అలా ఎందుకు ?"అని అడిగాడు సురేంద్ర.అతని ముఖం లోని ప్రశ్నలను గమనించిన మాధవయ్య గారు ఇలా చెప్పరు."మాకు ఒక్కటే అమ్మాయి.పెళ్ళి చేసాము.భర్త తో అమెరికా లో స్థిరపడింది.ఎప్పుడో రెండు,మూడేళ్ళకొకసారి వచ్చి రెండు వారాలు ఉండి వెళుతుంది.మేమిద్దరమూ ఇక్కడ.మాకు వచిపోయే బంధువులు కూడా పెద్దగా లేరు.మా దూరపు చుట్టం వాళ్ళ కొడుకు,కోడలు యాక్సిడెంట్ లో చనిపోతే చూడటానికి వెళ్ళాము.వాళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు.రేపట్నించీ తమకు అమ్మా నాన్న లేరు అన్న విషయం తెలియని పసివారు.అమాయకం గా ఆడుకుంటున్నారు.ఇంటికి వచ్చినా ఆ పసివారి రూపాలే కళ్ళ లో కదలసాగాయి.ఒక నెల గడిచినాక పిల్లలు ఎలా ఉన్నారని వాకబు చేస్తే 'వారిని అనాధశరణాలయం లో చేర్చాలనుకుంటున్నామని .'చెప్పారు.అమ్మాయి తల్లిదండ్రులకు వారిని పెంచి పెద్ద చేసే అంత స్థోమత లేదనీ,అబ్బాయి తల్లిదండ్రులేమో చెట్టంత కొడుకే లేనప్పుడు వీళ్ళు మాకెందుకని వారూ చివరకు పిల్లల్ని అనాధల్ని చేసారు.ఈ విషయం విన్న దగ్గర్నుంచి నా మనసు మనసు లో లేదు.వార్ని మేము తెచ్చు కుంటే వారికి ఆధారం దొరుకుతుంది.మాకూ ఆసరా అవుతారు అనిపించింది.నా భార్య తో సంప్రదించాను.ఆమె ఒప్పుకుంది.మా అమ్మాయికి చెప్పను.'మీ ఇష్టం నాన్నగారూ.మీ సంతోషం ముఖ్యం.మీరు ఏదైన ఆలోచించి చేస్తారని తెలుసు.ఒంటరిగా లేకుండా పిల్లలతో మీరు ఆనందం గా ఉన్నారని నాకూ నిశ్చింతా అన్నది.దాంతో అవసరమైన తతంగం ముగించి పిల్లల్ని తెచ్చ్చుకున్నాము.కొద్ది రోజులకు మా స్నేహితుడి అల్లుడు కాన్సర్ తో చనిపోయాడు.పిల్లకు మళ్ళీ పెళ్ళి చేయాలంటే బిడ్డ అడ్డమయ్యాడు.వాడికి భార్య లేదు.సరే ఒక్క పిల్లాడు మనకు ఎక్కువ అవుతాడా! ఈ ఇద్దరితో వాడూ పెరుగుతాడు అని తీసుకు వచ్చాము.అలా ఎంత వద్దనుకున్నా వివిధ కారణాల తో 20 మంది పిల్లలు అయ్యారు.ఇంక ఇంతటి తో ఆపేద్దామను కుంటున్నాము.పిల్లల సంఖ్య పెరిగితే న్యాయం చేయలేమని భయం."
       "మీరు పెద్ద వారు.ఇంతమందికి ఆలనాపాలనా ఎలా చేయగలుగుతున్నారు?"
     "ఇల్లు సొంతమే.కొద్దోగొప్పో ఆస్తిపాస్తులున్నాయి.ఇక్కడ ఆస్తిని మా అమ్మాయి ఆశించదు. అవసరమైతే తనే ఆర్ధిక సహాయం చేస్తానంది.ఇప్పటివరకు ఆ అవసరం రాలేదనుకో.వంట మా ఆవిడకు తోడు ధనమ్మ ఉంటుంది.పనమ్మాయి మిగతా పనులు చేస్తుంది.కొంచెం పెద్ద పిల్లలు చిన్న వాళ్ళను ఆడించడం,స్నానం చేయించడం చేస్తుంటారు."అన్నారు.
   సురేంద్ర తన గురించి చెప్పాడు.దంపతులిద్దరూ అధైర్యపడవద్దని చెప్పి అతన్ని పంపడానికి గేట్ దాకా వచ్చి 'నీకు వీలున్నప్పుడు వస్తూ ఉండామని చెప్పారు.
    సురేంద్ర మొదట్లో ఎప్పుడన్నా వెళ్ళేవాడు.పిల్లలు అలవాటైనాక ఏ కొంచం సమయం దొరికినా అక్కడకు వెళ్ళి గడపటం అలవాటు చేసుకున్నాడు.మొదట నీరజ ఉదాశీనం గా ఉన్నా తరువత తను కూడా అతనితో వెళ్ళడం మొదలుపెట్టింది.వెళ్ళినప్పుడల్లా పిల్లలకు పుస్తకాలు,బిస్కట్లు,బొమ్మలు తీసుకువెళుతుండేవారు.ఈ మధ్యలోనే డాక్టర్లు అన్ని పరీక్షలూఊ చేసి వారికి సంతానం కలిగే అవకాశం లేదని తేల్చిచెప్పారు.
                ఈ విషయం తెలిసి శేషగిరి ఏమీ బయటపడలేదు కాని అరుణ మాత్రం ఎవర్నన్నా దత్తత తీసుకోమని పోరుపెడుతోంది.అందుకు సురేంద్ర ససేమిరా అంటున్నాడు.దీనికంతటికీ మాధవయ్య గారే కారణమని అరుణ అభిప్రాయం.ఇప్పుడు తల్లికొడుకుల వాదన దాని గురించే. "అమ్మా!నేను చెప్పేది పూర్తిగా విను.నేను,నీరజ సంవత్సరం నుంచి అక్కడకు వెళుతున్నాము.మేము వెళ్ళగానే పిల్లలందరూ సంతోషం గా మాచుట్టూ జేరతారు.మాధవయ్య గారు వారి ఆలనాపాలనా చూడగలుగుతున్నారు కాని వారితో ఆడిపాడె వయసు కాదు ఆయనిది.వారి కబుర్లను షేర్ చేసుకోలేరు.మేము వాళ్ళతో కలిసిపోయి ఆడుతున్నాము కాబట్టే వారంతా మాకు బాగా దగ్గరయ్యారు.ఇప్పుడు వారిలోంచి ఒకరిని తెచ్చి పెంచుకున్నామనుకో వాడొక్కడే మా వాడు మిగతా వారంతా పరాయి వారు అన్న స్వార్ధం ప్రవేశిస్తుంది.ఒక్కరి కోసం అంతమంది ముఖాలలోని నవ్వును మాయం చేయడం న్యాయం కాదు.ప్రేమ పదిమందికీ పెంచినప్పుడే కదమ్మా పెరిగేది.మాధవయ్య గారు కూడా పెద్ద వారు అవుతున్నారు .అందుకే వారికి ఆసరాగా నిలవాలనుకుంటున్నాను.నీరజ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుక్కుంది."అన్నాడు. "అది కాదురా!ఇప్పుడాంటే పిల్లలు చిన్నవారు.రేపు పెరిగే కొద్దీ అనేక ఖర్చులు పెరుగుతాయి.అందరికీ చదువులు ,మంచీచెడూ చూడటం అంటే మాటలు కాదు.అవన్నీ తట్టుకోవడం కష్టం."అంటూ మరొక అడ్డుపుల్ల వెయ్యబోయింది అరుణ.
       తల్లి మాటలను మధ్య లోనే ఖండించి," పిల్లలందరూ గవర్నమెంటు బడి లోనే చదువుతారు.10 వరకు ఢోకా లేదు.మా ఇద్దరి సంపాదనా వారికే కదా!ఉండటానికి మాధవయ్యగారి ఇల్లు ఉండనే ఉంది.వారంతా బాగా చదివి పై చదువుల కొస్తే అప్పటి సంగతి చూద్దాము.ఎవరో మహానుభావులు పుణ్యం కట్టుకోకబోరు.నిస్వార్ధం గా చేసే మంచి పనికి ఎవరైనా సహాయం చేస్తారు.అంతేగాని ఆ పిల్లల్ని అనాధల్ని చేసే ప్రసక్తే లేదు.వారికి మేము తల్లిదండ్రులము అవుతాము."అన్నడు దృద్ఢం గా సురేంద్ర.
    కొడుకు నిర్ణయం లో మార్పు ఉండదని తెలిసి చేసేదేమీ లేక,"సరేరా మీ ఇష్టం.మీరు అంత గొప్ప పని చేస్తుంటే మేమూ ఎంతో కొంత సహాయ పడతాములే."అన్నది.
   ఆనందం తో కళ్ళు తుడుచుకున్నాడు సురేంద్ర.
******

No comments:

Post a Comment

Pages