శ్రీమద్భగవద్గీత -5
కర్మయోగము -  3 వ అధ్యాయము
   ఈ అధ్యాయము పేరు కర్మయోగము కర్మచేయక ఏ జీవియునుండలేదు వారికి నియమితములైన కర్మలను వారు నిష్కామ బుద్దితో నాచరించ వలెను. ఏ కర్మ, బంధమును కలిగించునో ఏ కర్మ ముక్తికి దారితీయునో కర్మకు సంబందించిన వివిధ విషయములు విపులముగా చర్చించినందువల్ల ఈ అధ్యాయమునకు కర్మయోగమని పేరు. ఫలాపేక్ష లేకుండా చేయబడు కర్మ యజ్ఞమేయని తెలియజేయుట, జ్ఞానియు, భగవంతుడు కూడా లోకోద్ధరణకు కర్మలు చేయుచునే యందురనివచించుట అజ్ఞాని జ్ఞాని యొక్క లక్షణములు పేర్కొనుట మొదలుగునవి చర్చించుటవలన ఈ అధ్యాయమునకు కర్మయోగమని పేరు పెట్టబడినది. కారణమేమి...? ఈ పరిణామ క్రమమునకు వెనుకనుండి క్రమశిక్షణతో ఎవరు నడిపిస్తున్నారు...? మొదలైనతత్వ విచారణ ద్వారా భగవంతునికి చేరువయ్యే మార్గమే జ్ఞానం.సర్వ మానవాళిని ప్రేమతో అక్కున జేర్చుకొనే విశ్వమాతగా గీత మనకు దర్శనమిస్తుంది.ప్రపంచములో భిన్న మతములున్నా దర్శించిన భగవంతుడొక్కడే.హిందువులు కృష్ణాయన్నా క్రైస్తవులు క్రీస్తుయన్నా ముస్లిములు అల్లాయన్నా బౌద్ధులు బుద్ధాయన్నా నీ గాఢమైన పిలుపుకు స్పందించిన భగవంతుడు ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలోనే దర్శనమిస్తాడు నిజానికి భగవంతునికి ఏ రూపము లేదు. ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్ గాఢమైన పెనుచీకటికావల కోటి సూర్యల సమానమై వెలుగొందుచున్నవాడే పరమాత్మయని గీతామాత మనకు తెలియజేసింది ఎవరి మనసు ఏ మార్గమునందు ప్రీతిగలదైయుండునో వారు ఆ మార్గమును శ్రద్ధా భక్తులతో అనుసరించి లక్ష్యమగు పరమాత్మను చేరవచ్చునని భగవానుడిచట తెలుపుచున్నాడు గీతయందనేక యోగములు చెప్పినప్పటికీ ప్రధానముగా జ్ఞాన కర్మయోగములుగనే విభజించవచ్చును
అన్నాద్భవంతి భూతాని
పర్జన్యా దన్న సంభవః
యజ్ఞాద్భవతి పర్జన్యో 
యజ్ఞ కర్మ సముద్భవః    -- 14 వ శ్లోకము
కర్మ బ్రహ్మోద్భవం విద్థి
బ్రహ్మాక్షర సముద్భవం
తస్మాత్సర్వ గతం బ్రహ్మ
నిత్యం యజ్ఞే ప్రతిష్టితమ్   -- 15 వ శ్లోకము
    ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి అన్నము మేఘము వలన కలుగుచున్నది. మేఘము యజ్ఞమువలన కలుగుచున్నది. యజ్ఞము సత్కర్మ వలన కలుగుచున్నది. సత్కర్మ  వేదము వలన కలుగుచున్నది. వేదము అక్షర పరబ్రహ్మము వలన కలుగుచున్నది. సర్వవ్యాపితమగు పరమాత్మ నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠించబడిన దానిగ నెరుగుము. జనుల సౌభాగ్యము కొరకు, ఆత్మశుద్ధి కొరకును సత్కర్మలను సదా ఆచరించవలయును.
    వేదములు భారతీయ సంస్కృతికి మూలము సమస్త విజ్ఞానము వేదము నుండీ వెలువడుతున్నది. ఆ పౌరుషేయమైన వేదవాగ్ఞ్మయము వలననే సనాతనమైన భారతావని ప్రపంచదేశాలకు తలమానికమై భాసిల్లుచున్నది.
నైవతస్య కృతేనార్థో
నా కృతేనే హకశ్చన
న చాస్య సర్వ భూతేషు
కశ్చితర్థ వ్యపాశ్రమః             -- 18 వ శ్లోకము
జీవన్ముక్తుడగు ఆత్మజ్ఞానికి కర్మ చేయుటచేగాని చేయకపోవుటచేగాని ప్రయోజనమేమియును లేదు. ఐనను లోకక్షేమము కొరకు అట్టి మహనీయులు సత్కర్మల నాచరించుచునేయుందురు.మహనీయులు సర్వజీవులయందు భగవంతుని దర్శించుకుందురు. అనంతమైన వారి ప్రేమ విశ్వమంతా వ్యాపించి దివ్యప్రేమ స్పందనలను ప్రసరింపజేస్తుంది.
యద్యదా చరతి శ్రేష్ఠ
స్తత్త దేవేత రోజనః
సయత్ప్రమాణం కురుతే
లోకస్త దనువర్తతే            -- 21 వ శ్లోకము
పెద్దలగువారు దేనిని ప్రమాణముగా గైకొందురో ఇతరులను దానినే ప్రమాణముగా తీసుకొందురు ఏ సిద్ధాంతమును, ఏ పద్దతిని, ఏ శాస్త్రమును నారాదింతురో తక్కిన వారును దానినే స్వీకరించియాదరింతురు.అర్జనుడు తన శౌర్య, ధైర్య పరాక్రమముల చేతను, సచ్ఛరిత చేతను లోకమున గొప్ప ఖ్యాతినార్జించెను. అంతటి గొప్పవాడు అకర్మణ్యుడు కాక తన విద్యుక్త ధర్మమును ఫలాపేక్ష రహితముగా అసక్తముగా ఆచరించినచో దానిని జూసి తక్కిన వారు అర్జనుడంతటి వాడే కర్మనాచరించినపుడు మనమేల చేయరాదని తలంచి నిష్కామ కర్మావులంబులై చిత్తశుద్ధిని బడసి పరమశ్రేయమునొందగలరు.
పాఠకమహాశయులందరకూ గీతాజయంతి శుభాకాంక్షలు గీతాజయంతి సందర్భంగా సత్యశోధకులకు,జిజ్ఞాసువులకూ మరియు నిరంతర సాధన ద్వారా భగవంతుణ్ణి తెలుసుకున్న జ్ఞానులకు నమస్కరిస్తూ వారి వారి సాధన ఇంకా ప్రగతి సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ  దైవాశీస్సులు మీకు కలగాలని ప్రార్ధిస్తూ ప్రేమతో
                                                                          మీ
                                                                     రెడ్లం రాజగోపాల రావు.
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment