సామ్రాజ్ఞి – 5 - అచ్చంగా తెలుగు

సామ్రాజ్ఞి – 5

భావరాజు పద్మిని


(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె  ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. తమతో అనవసరంగా వైరం పెట్టుకున్న కుంతల రాజు విజయవర్మతో మల్లయుద్ద్హంలో గెలిచి, అతని రాజ్యం అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తమ రాజ్యానికి తీసుకువస్తుంది ప్రమీల. రాజ నియమాల ప్రకారం అతను విలాసపురుషుడిగా మార్చబడతాడు. పరిణామ, వ్యాఘ్ర  సరోవరాలలో మునిగిన యాగాశ్వం పులిగా మారిపోవడంతో, దిక్కుతోచక శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటాడు అర్జునుడు. కృష్ణుడు ప్రత్యక్షమై యాగాశ్వానికి పూర్వపు రూపును తెప్పించి, ఆర్జునుడిని దీవించి, మాయమౌతాడు. పంపా నదీ తీరాన సీమంతినీ నగరాన్ని కావలి కాస్తుంటారు కమలిని, ఉత్కళ. నదీ తీరంలో ఏదో కదులుతున్న జాడ కనిపించడంతో అటుగా వెళ్తారు ఇద్దరూ.)
‘ఏమే నాలుగు కాళ్ళు, ఒక పెద్ద తోక, సింహమేమో... భయమేస్తోందే ! దేవుడా, ఈ ఆపద గట్టెక్కితే, ఈ కమలినికి గుండు కొట్టిస్తాను.’ కళ్ళుమూసుకుని, దణ్ణాలు పెట్టుకుంటూ అంది ఉత్కళ.
‘ఏవిటీ, నాకు గుండా ? సరిపోయింది. నీ దిక్కుమాలిన మొక్కులాపి, గుడ్లు తెరుచుకుని, చీకట్లో కళ్ళు నిక్కబొడుచుకుని, పద... అదేదో దగ్గరాగా వెళ్తూ చూస్తుంటే నాకు గాడిదలానో, గుర్రంలానో ఆనుతోంది.’ కమలిని అంటుండగానే గుర్రం సకిలింత వినిపించింది.
‘ఓహో, పంచకళ్యాణి గుర్రం మీద నా కలల రాకుమారుడు ఒచ్చినట్టు, నిన్ననే పగటికల ఒచ్చిందే. పగటికలలు నిజమౌతాయని అంటారు. గుర్రం వచ్చిందంటే, రాకుమారుడూ ఇక్కడే ఉండి ఉంటాడు, చూద్దాం పద.’ అంది హుషారుగా ఉత్కళ.
‘చల్చాల్లేవమ్మా... ఈ ఉడత మొహానికి రాకుమారుడు ఒక్కడే తక్కువ. రాత్రి కాపలా కాసే మనకి పగటి కలలు కాక, ఇంకేమొస్తాయిలే. పద, ముందు గుర్రం సంగతి చూద్దాం... తెల్లారాకా, నీ రాకుమారుడ్ని వెతుక్కో.’ అంది కమలిని ముందుకు ఉరుకుతూ. తప్పించుకు పోవాలని ప్రయత్నించిన గుర్రానికి ఉచ్చు బిగించి, తమ దండనాయకి వీరవల్లి వద్దకు తీసుకుని వెళ్ళారు ఇద్దరూ. ఆమె ఆజ్ఞతో గుర్రం అక్కడే కట్టెయ్యబడింది.
***
“జయముజయము సామ్రాజ్ఞీ ! పంపా నదీ తీరంలో కావలికాసే మన సైన్యానికి నిన్న ఈ శ్వేతాశ్వం దొరికింది. తలకున్న స్వర్ణ మకుటం, కాళ్ళకు రత్నఖచిత కంకాణాలు, మెళ్ళో మణిమయ శోభితమైన ఆభరణాలు, నడుముపై పట్టు వస్త్రం, బంగారు మువ్వల అలంకారం చూస్తుంటే, ఇదేదో రాచకొలువుకు సంబంధించిన అశ్వంలా ఉంది. అంతేకాదు, దీని మెడలో ఏదో లేఖ కూడా ఉన్నట్లుంది. ఏలిక వారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకురావాలని, వచ్చాను. “  వినమ్రంగా వంగి దండాలు పెడుతూ అంది దండనాయకి వీరవల్లి.
“అశ్వాన్ని ప్రవేశపెట్టండి. సేనానాయకి, అశ్వాన్ని పరిశీలించండి....” ఆజ్ఞాపించింది సామ్రాజ్ఞి.
వెంటనే అశ్వం కొలువులోనికి తేబడింది. సేనానాయకి సింహనందిని అశ్వం మెడలో కట్టి ఉన్న లేఖను తీసి, బిగ్గరగా చదవసాగింది.
“దయామూర్తి, అజాతశత్రువు అయిన ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఆ యాగాశ్వం ఇది. ఈ గుఱ్ఱానికి రక్షగా సవ్యసాచి, మహావీరుడైన అర్జునుడు  గాండీవధారియై మందీమార్బలంతో సహా అనుసరిస్తూ వస్తున్నాడు. అర్జునుడి శౌర్యానికి ఎదురు నిలువగల ధీరుడు ఎవరైనా ఈ భూమ్మీద ఉంటే, ఈ యాగాశ్వాన్ని నిలువరించి, తమ బలాబలాలను పరీక్షించుకోవచ్చు. “
ఈ సందేశం వినగానే లోలోపలే పట్టరాని ఆనందం కలిగింది సామ్రాజ్ఞికి. అది నిలువరించుకుంటూ...
“ఓహో, ధర్మరాజు యాగాశ్వమా ? కావలిగా సవ్యసాచి పరివారంతో అనుసరిస్తున్నాడా ? అంటే, వారు మన రాజ్యం చుట్టుప్రక్కలే ఎక్కడో ఉండి ఉండాలి. అర్జునుడి విలువిద్యా నైపుణ్యం గురించి చాలా విని ఉన్నాము.  ఇన్నాళ్ళకు అదంతా కళ్ళజూసే అదృష్టం కలిగింది.” ఉత్సాహం అతిశయిస్తూ ఉండగా సింహాసనం నుంచి లేచి నిలబడి అంది సామ్రాజ్ఞి.
“ముఖ్యమైన అంశం మరిచారు సామ్రాజ్ఞి !” ఆమె వంకే తదేకంగా చూస్తూ అంది గుర్విణి శక్తిసేన.
“మన్నించాలి గుర్విణీ ! అదేమిటో సెలవిమ్మని మనవి,” వినమ్రంగా అర్ధించింది ప్రమీల.
“అర్జునుడికి సమంగా నిలబడగల ధీరుడు – అన్నారే తప్ప, ‘ధీర’ అనలేదు. అంటే, అతనికి సాటి నిలువగల స్త్రీలు లేరనేగా వారి అభిప్రాయం ! కురుక్షేత్ర సంగ్రామంలో విజయులు అయ్యారే కాని, పాండవులు ఇంతవరకు నా ప్రమీల వంటి స్త్రీల శౌర్యపరాక్రమాల దెబ్బను చవిచూసి ఉండరు. వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీలు ఉండాలి. అటువంటి వారితో తలపడినప్పుడే  లోకానికి మన సత్తా ఏమిటో తెలుస్తుంది. ప్రమీలా !ఇదే మంచి అవకాశం, ఈ యాగాశ్వాన్ని వదలకండి. దీన్ని వెతుక్కుంటూ ఆర్జునుడిని ఇక్కడకు రానివ్వండి. అతనితో తలపడి, గెలిచి, స్త్రీ సామ్రాజ్య విజయకేతనం ఎగురవేద్దాం. పురుషులకంటే స్త్రీలు ఎంతమాత్రం తక్కువ కారని నిరూపిద్దాం. తక్షణమే అర్జునుడితో యుద్ధానికి సన్నద్ధంకండి. ఇది నా ఆజ్ఞ !” ఆవేశంగా అంది శక్తిసేన.
“మహత్తరమైన ఉపాయం సెలవిచ్చారు గుర్విణీ ! తమరి ఆజ్ఞ మాకు శిరోధార్యం. సింహనందినీ ! తక్షణమే మన గజ, తురగ, అశ్వ, సేనా బలాలను సిద్ధం చేయించండి. యుద్ధ సమయంలో కావలసిన ధనాన్ని, ఆయుధాల్ని, తిండి గింజలను సేకరించండి. యుద్ధ శిబిరాలు, అందులో నిపుణులైన వైద్యులను ఏర్పాటు చేయించండి. అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కునే ఏర్పాట్లు చేయించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ అవకాశం వదులుకోకూడదు.” ఉచ్ఛ స్వరంతో ఆజ్ఞాపించింది ప్రమీల.
“ఆజ్ఞ, సామ్రాజ్ఞి.” అంటూ ఆమెకు వంగి నమస్కరించి వెళ్ళిపోయింది సింహనందిని.
***
అంతఃపురం... సామ్రాజ్ఞి ఏకాంత మందిరం...
ఆ మందిరంలోకి ప్రవేశం ఉన్నది కేవలం ప్రమీలకు అత్యంత ఆప్తులైన కొందరు చెలికత్తెలకు మాత్రమే. మబ్బు చాటున దాగున్న చంద్రుడి వెన్నెల, మబ్బుల అంచులతో ఆటలాడుతూ, వాటికి వెండి మెరుగులద్దుతోంది. గగన తలంలోని ఆ మనోజ్ఞ దృశ్యం సామ్రాజ్ఞి మందిరం ఎదురుగా ఉన్న కొలనులో ప్రతిబింబిస్తూ ఉంది. తాము పగలంతా కన్నులు కాయలు కాచేలా ఎదురుచూసిన తమ వలపురేడు, నెలరాజు ప్రతిబింబాన్ని ఆ విధంగానైనా తాకగలుగుతున్నామనేమో, కొలనులోని తెల్ల, నల్ల, ఎర్ర కలువలు ఆరోజున మరీ మిడిసిపడుతున్నట్లు విరగబూసాయి. చల్లటి పిల్లతెమ్మెరలకు అంతఃపుర గవాక్షాలకు కట్టిన జలతారు పరదాలు కదులుతున్నాయి. సామ్రాజ్ఞి ఆంతరంగిక మందిరంలో అలదిన కస్తూరి, జవ్వాది పరిమళాలు ఆ చల్లటి గాలితో కలిసి, మైమరపించే సువాసనను అక్కడ వ్యాపింపచేస్తున్నాయి. ఆ చల్లని ఏకాంత వేళ...
కిరీటాలు, ఆభరణాలు లేకుండా, నుదుట కుంకుమ, చందన తిలకం ధరించి, వత్తుగా ఉన్న కురులను వదులుగా విడిచి, మెత్తటి పట్టు వస్త్రాలలో దేవకన్యలా మెరిసిపోతోంది సామ్రాజ్ఞి.  ఒక ఉన్నతాసనం మీద కూర్చుని, మల్లెపూల మాల కడుతోంది సామ్రాజ్ఞి. గోరింటతో పండిన ఎర్రని వేళ్ళ వెలుగు వెండి వెన్నెల్లో తెల్లని మల్లెలపై పడి, వాటికి కొత్త వర్ణాన్ని సంతరిస్తోంది. ఆమె దారాన్ని గట్టిగా లాగితే పూలెక్కడ తునిగిపోతాయోనన్న భయం కొద్దీ, అతి నాజూగ్గా, కావలసినంత బిగువుతో పూలను దారంతో  బంధిస్తోంది.
“హలా ! ఏమి ముగ్దమనోహర సౌందర్యం ! ఆడది మెచ్చిందే అసలైన అందం అంటారే ! సామ్రాజ్ఞి, ముత్యానికి ముస్తాబెందుకన్నట్లు సహజమైన మీ నిరుపమాన సౌందర్యం చిన్నప్పటి నుంచి చూస్తున్న నన్నే వివశను చేస్తోందే ! ఇక పురుషులు ఎవరైనా ఈ సమయంలో మిమ్మల్ని చూస్తేనో... హమ్మయ్యో !” దిష్టి తీస్తున్నట్లు చేతులు తిప్పుకుంటూ, తలకు ఆన్చి, దిష్టి తీస్తున్నట్లు మెటికలు విరుస్తూ అంది సామ్రాజ్ఞి చిన్ననాటి చెలికత్తె సౌగంధిక.
“ఏవిటే? చిన్నప్పటి నుంచి రోజూ చూసే ప్రమీలేగా. ఇవాళ కొత్తగా చూస్తున్నట్లు ఏవేవో వర్ణనలు చేస్తున్నావు ? ఏమైందే ఇవాళ నీకు ? మాటలాపి, ఇలా కూర్చుని, రెండు రెండు మల్లెలు దొంతరేసి ఇవ్వు, మాల త్వరగా పూర్తవుతుంది. “ చనువుగా మందలించింది ప్రమీల.
“ఆజ్ఞ సామ్రాజ్ఞి!” అంటూ, ఆమెను ఆటపట్టిస్తూ కూర్చుంది సౌగంధిక. సామ్రాజ్ఞి మాల కడుతున్న తీరు తేరిపారా చూడసాగింది.
“ఏవిటే, చీకట్లో ఏ మాయదారి తాయత్తునో తొక్కావా ? లేక గాలి ధూళి కాని సోకిందా ? గుడ్లు మిటకరిస్తూ ఆ చూపేంటే ? మింగేస్తావా ?” భయం నటిస్తూ అంది సామ్రాజ్ఞి.
“శత్రువులను కర్కశంగా తెగనరికే సామ్రాజ్ఞి అంతరంగంలో పూలనైనా గట్టిగా బంధించి తెంపకూడదన్న భావన లోని సున్నితత్వం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని ఉద్వేగాలను నింపి చేసాడోనమ్మా విధాత స్త్రీలను. ఏమైనా, ఇవాళ మా ప్రమీల కొత్తగా ఉంది. పూలను వలవేసి దారంలో బంధించినట్లే, సామ్రాజ్ఞి పువ్వంటి మనసులో ఏ మనోహరుడినో బంధించాలని చూస్తున్నట్లుగా ఉంది. ఎందుకో ఇవాళ మీ చూపులో, నవ్వులో, వదనంలో కొత్త కళ కనిపిస్తోంది. ఆ కళ ఎవరి ప్రభావమో కాని, ఇంత అందాన్ని ఈనాడు కొత్తగా నాకు చూపినందుకు అతనికి వంగి దండం పెట్టచ్చు. “ ఏదో మాయలో ఉన్నట్లు చెప్పుకుపోతోంది సౌగంధిక.
“సందేహం లేదే ! నీకేదో కవితాభూతం పట్టింది. శాకిని, డాకిని గురించి విన్నామే కాని, ఈ కవయిత్రి భూతాల గురించి విని ఉండలేదే !”ఆశ్చర్యం నటిస్తూ అంది సామ్రాజ్ఞి.
“అద్దం ముందు అబద్ధం ఆడలేరు చెలీ ! చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. మీకు అత్యంత ఆప్తురాలను, నాతో కూడా చెప్పరా ? ఇంతకీ సంగతేంటి సామ్రాజ్ఞి?” ఆమె చుబుకాన్ని పైకెత్తి, కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది సౌగంధిక.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages