బంగారు మురుగు- శ్రీ రమణ - అచ్చంగా తెలుగు

బంగారు మురుగు- శ్రీ రమణ

Share This

నాకు నచ్చిన కథ- బంగారు మురుగు- శ్రీ రమణ

టీవీయస్.శాస్త్రి (శారదాప్రసాద్) ​


ఆ బామ్మకి మనవడంటే పంచ ప్రాణాలు,మనవడే ఆమెకు లోకం.మనవడికీ అంతే! బాల్యం అంతా బామ్మ వీపుమీదే సాగింది. తల్లి, పూజలూ, పునస్కారాలతో,మడి కట్టుకొని--దూరం,దూరం--అంటుంటే,ఈ చాదస్తాలు ఏమీ లేని బామ్మ కౌగిలింతలలో,ముద్దులతో పెరిగాడు,మనవడు.బాదం చెట్టుకింద బామ్మ చెప్పిన కథలు,తనకోసం దాచివుంచి రాగానే పెట్టే తాయిలాలూ,బామ్మ తియ్యని ముద్దులతో,గారాబంగా పెరిగి పెద్దవాడయ్యాడు.చెట్టుకు చెంబెడు నీళ్ళుపోయటం,పక్షికి గుప్పెడు గింజలు చల్లటం,పశువికి నాలుగు పరకలు వెయ్యటం,ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టటం--
​ఇవీ బామ్మకు తెలిసినవి.అవే మనవడికీ నేర్పింది.ప్రాణంతో సమానంగా చూసుకున్న మనవడి పెళ్లి చూసి ప్రాణాలు వదలటానికి
​ఉగ్గబట్టుకుని ​ఉంది బామ్మ. మనవడి​కి పెళ్లి వయసు వచ్చింది.పెళ్లి చూపులకు బామ్మను కూడా తీసుకొని వెళ్ళారు.అమ్మాయి కుందనపు బొమ్మ లాగుంది.కళ్ళు కజ్జికాయలు లాగ ​ఉన్నాయి.పెద్దపెద్ద  ముగ్గులు వేయటం కూడా వచ్చట!అంటే చాలా ఓర్పుగల పిల్ల.వీటన్నిటినీ మించి ఆవపెట్టి అరటిదూట కూర రుచిగా వండిపెడుతుందట.అలాంటి అమ్మాయిని చేసుకుంటే మనవడు సుఖపడుతాడని బామ్మ ఆశ. పిల్ల బామ్మకు,మనవడికీ నచ్చింది.
నాలుగు కాసుల బంగారం వద్ద పెళ్లి నిశ్చయం వాయిదా పడింది.ఆడపెళ్ళి వారు ఇవ్వనూలేరు,మగపెళ్ళివారు పట్టువిడవరు.అదీ పరిస్థితి.బామ్మ మనవడిని చాటుకు పిలిచి 'నాలుగు కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు' అని మనవడిని ​ఊరించిది.పౌరుషం వచ్చి తండ్రిని ఒప్పించి ఆ పిల్లనే చేసుకుంటాడని  బామ్మ ఆశ.బామ్మ చేతికి ఎప్పుడూ ఒక బంగారు మురుగు ​ఉండేది.దానికి హక్కుదారుడు మనవడే అని అందరికీ చెబుతుంది.ఎన్నిసార్లు అడిగినా కూతురికి కూడా ఇవ్వనంది.భజంత్రీవాడు తనకూ,మనవడికీ తలపని చేయటానికి వచ్చినపుడు--తన వంతు రాగానే ఆమురుగును తీసి మనవడికి ఇచ్చేది.స్నానం చేసేటప్పుడు,దాన్ని కుంకుడురసంతో మెరుగుపెట్టి మళ్ళీ చేతికి వేసుకునేది.బామ్మ ఆ పిల్లనే చేసుకోమని మనవడిని రెచ్చకొట్టింది.అతను తండ్రిని ఒప్పించే లోపలే, ఆడపెళ్ళివారు రాజీకి వచ్చారు.
​ అడ్డం తొలిగింది వళ్ళంతా కళ్ళు చేసుకొని బామ్మ మనవడి పెళ్లి చూసింది.ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే ​,​ "నీకాళ్లు పండాలి. నువ్వు ఆకువక్క వేసుకుంటే ఆ అమ్మడు నోరు పండాలి.అదీఇదీ అయ్యి ఆనక మీ కడుపు పండాలి. నేను మళ్ళీ నీ ఇంటికి రావాలి " అని బామ్మ మనవడిని ఆశీర్వదించింది.బామ్మ ఆశీర్వాదంతో మనవడి కాపురం పండింది.ఆ కాపురాన్ని తృప్తిగా చూసి బామ్మ కన్నుమూసింది.కర్మకాండలు ముగిశాక,బామ్మ వేసుకున్న మురుగును తూకానికి పెడితే,అది గిల్టుదని తేలింది.సంబంధం నిశ్చయం కావటం కోసం,తనే ఆడపెళ్లి వారింటికి వెళ్లి,తన మురుగును చూపించి,"​ఇది నా తర్వాత వాడిదే!దీని హక్కుదారుడు వాడే,నాలుగు కాసుల బంగారం నా మనవడి ముందు ఏపాటి? బంగారం లాంటి వాడిని వదులుకోవద్దు"అని చెప్పి వప్పించింది.బామ్మ బంగారు మురుగు చూసి,ముచ్చటపడి వాళ్ళు ఒప్పుకున్నారట!అలా చెప్పి,వాళ్ళ చేత నాలుగు కాసుల బంగారం కూడా ఇప్పించినట్లు తెలిసింది.మనవడి హృదయం కృతజ్ఞతతో  బరువు ఎక్కింది..అమ్మడి కడుపు పండి,తన ఇంట మళ్ళీ బామ్మ పుడితే,ఆమె బంగారు మురుగు ఆమెకే చేయిస్తానని,చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ అనుకున్నాడు మనవడు!
*****
(ఈ కథ మొదటిసారిగా 1993 లో'స్వాతి'లో వచ్చింది.ఆ రోజుల్లో చదువరులను విశేషంగా ఆకట్టుకుంది.నేటికి కూడా కొత్తదనంతో మనల్ని ఆకట్టుకుంటుంది.శ్రీ రమణ ఈ కథా రచనతో కథాలోకంలోఒక కొత్త వరవడిని తీసుకువచ్చారు.ఈ కథను కుదించి వ్రాయటం చాలా కష్టం! ప్రతి అక్షరం మనలను మళ్ళీ మళ్ళీ చదివిస్తుంది.ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక కొత్త కోణం కనపడుతుంది. ఈ కథలో శ్రీ రమణ మనం మరచిపోతున్న అనురాగ ఆప్యాయతలను 'బామ్మ,మనవడి..' ద్వారా అన్ని తరాలవారికీ మళ్ళీ ఒక తీపి గుర్తుగా తెలియచేశారు.శ్రీ రమణ కథల గొప్పతనం--ఆయన ఇచ్చే ముగింపులో తెలుస్తుంది.వారి కథలు చదివేటప్పుడు కొన్ని సార్లు నవ్వుకుంటాం,మరికొన్ని సార్లు ఆలోచిస్తాం,ఇంకొన్ని సార్లు మనకు తెలియకుండానే మన కళ్ళు చెమ్మగిల్లుతాయి.ముగింపే కాదు,కథ మొదలు పెట్టే విధానమే వైవిధ్యంగా
​ఉంటుంది.ఒక్క మాటలో చెప్పాలంటే  వారి కథలన్నీ ఆసాంతం మనల్ని కట్టిపడేసి చదివిస్తాయి.అంత విశేష ప్రతిభ కలవాడు కనుకనే,బాపూ రమణల అభిమానాన్ని ​అనతి కాలంలో సంపాదించుకున్నాడు.ఒక సాహితీ పిపాసకుడు తన జీవితంలో అంతకన్నా సంపాదించుకునే గొప్ప సంపద ఇంకేముంటుంది?శ్రీ రమణ పారడీలకు పెట్టింది పేరు.చక్కని వ్యంగ్య రచయిత. ​అచిరకాలంలోనే ముళ్ళపూడి వెంకట రమణ గారిలాంటి రచయితల పక్కన చోటు సంపాదించుకున్నారు.)
శ్రీ రమణ గారికి కృతజ్ఞలు.
***

No comments:

Post a Comment

Pages