'వేదిక' - పుస్తక పరిచయం - అచ్చంగా తెలుగు

'వేదిక' - పుస్తక పరిచయం 

భావరాజు పద్మిని 


కళామతల్లి ముద్దుబిడ్డ అయిన ప్రతి కళాకారుడు ఆశించేది చిన్న ప్రోత్సాహం కోసం, ప్రేక్షకుల చప్పట్ల కోసం, అన్నిటికన్నా ముఖ్యంగా తన కళను ప్రదర్శించే చిన్న ‘వేదిక’ కోసం. అన్నాళ్ళూ నిండు మేఘంలా తనలో నింపుకున్న కళకు ప్రదర్శించే వేదిక దొరికి, వేదికపై తాదాత్మ్య స్థితిలో అది అమృతవర్షంలా కురిసి,  ప్రేక్షకుల మనసుల్ని రంజింపచేసి, చప్పట్లు, ఈలల రూపంలో నెమలి నాత్యంలా పురివిప్పుకుని,  కళాకారుడిని పులకింపచేస్తే, వారికి కొన్నేళ్ళ పాటు కడుపు నిండినట్టే. మనిషి ఆకలికి మందు భోజనం అయితే, కళాకారుడి తృష్ణకు మందు ప్రోత్సాహం.
కళలు దైవదత్తమైనవని, నేర్చుకుంటే అందరికీ అబ్బవని అంటారు. శ్రావ్యమైన పాట వింటే చాలు, చంద్రకళ చిట్టి పాదాలు నర్తించడం మొదలుపెడతాయి. లయ ఆమె రక్తంలో ఉంది. నాట్యం ఆమె నరాల్లో ఉంది. అభినయం ఆమె ఆత్మలో ఉంది. వెరసి, పూర్వజన్మ సంస్కారం వల్ల నాట్యం ఆమెకు దైవదత్తమైన వరంగా లభించింది. ఆమెలో నాట్యం పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లదండ్రులైన మేజర్ సత్యదేవ్, శారాదలు , ‘ఆడపిల్లవు, అలా ఆడకూడదు, ఆనక పెళ్ళి కాదు’ అన్న తరతరాల జాడ్యంతో వ్యవహరించకుండా ఆమెను అన్ని విధాలా ప్రోత్సహించారు. సంగీత పాఠాలు చెప్పే తల్లి తనకున్న జీవితానుభవం, దార్శనిక దృష్టితో ఏ పాట ఎంచుకోవాలో, దానికి ఎటువంటి దుస్తులు ధరించాలో ఆలోచించి, స్వయంగా కుట్టించి, వాటికి మెరుగులు దిద్దేది. తండ్రి ఆమె నోరు విప్పకుండానే ఆమె మనసు తెలుసుకుని, ఆమెకు ఇష్టమైనవన్నీ జరిపించేవారు. క్రమంగా ఆమెకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇప్పిస్తుంటారు వారు.
ఆ కుటుంబానికి ఆప్తులైన భూషణ్, నీరజల ముద్దులపట్టి రాణి, శారద వద్ద సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది. స్టూడియో అధినేత, మంచి ఆస్తిపరుడు అయిన భూషణ్ రాణి పాట, చంద్రకళ నాట్యాన్ని కలిపి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. పిల్లల వృద్ధిని దృష్టిలో పెట్టుకుని, ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలు వేస్తూ ఉంటారు. తండ్రి తనతో పాటు చంద్రకళను ప్రోత్సహించడం, ఆమెకు ఎక్కువ పేరు రావడంతో రాణి మనసులోనే ఆమె పట్ల అసూయను పెంచుకుంటుంది.  చంద్రకళ బావ అయిన జగదీష్ పై చిన్నతనం నుంచే మక్కువ పెంచుకుంటుంది రాణి. చంద్రకళకూ బావంటే ఇష్టమున్నా ఆమె అది వెలిబుచ్చకుండా కళపైనే దృష్టి పెడుతుంది. క్రమంగా రాణి జగదీష్ తో సన్నిహితంగా ఉండడం ఆమెకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అతి గారాబం చెయ్యడంవల్ల  రాణి తెంపరితనతో, ఐశ్వర్యంలో పెరగడంతో అందరికీ అనేక సమస్యలు తెచ్చి పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో పెరిగి పెద్దై, రాణి సినీ గాయనిగా, చంద్రకళ నర్తకిగా స్థిరపడతారు. కాని, ఇద్దరికీ జగదీష్ అంటే ఉన్న ఇష్టం అలాగే ఉంటుంది. మరి జగదీష్ ఇద్దరిలో ఎవరిని వరిస్తాడు అనేది నవల చదివి తెలుసుకోవాల్సిందే !
రచయత/రచయిత్రి తన అక్షరాల్లో కనిపిస్తారని అంటారు. ఉమాభారతి గారు స్వయంగా పేరుప్రఖ్యాతులు ఉన్న నర్తకి కావడంతో ఒక నర్తకి జీవితం నేపధ్యంగా సాగే ఈ నవలను అద్భుతంగా పండించారు. రాణి పాత్రలో కళ పట్ల ప్రేమ, అంకితభావం, ఇతరుల మనస్తత్వాలకు అనుగుణంగా నడచుకునే నైజం, అందరినీ అర్ధం చేసుకునే తత్త్వం, నిరుపమానమైన ప్రతిభా పాటవాలు, బాధ్యతాయుతంగా వ్యవహరించే విధానం, ఇలా అన్ని అంశాల్ని మేళవించారు రచయిత్రి ఉమాభారతి గారు. ముఖ్యంగా తండ్రికి ఆరోగ్యం బాగోలేనప్పుడు, దిగులుపడిపోకుండా ‘ఏమైనా, నేను వారిని సరిగ్గా చూసుకుంటాను,’ అని చిన్నపిల్లైన చంద్రకళ అనుకోవడం ఆమెలోని పరిణితిని తెలియజేస్తుంది. టీవీ సీరియల్స్ లో లాగా, ఏ పాత్రలోనూ అతి క్రూరత్వాన్ని చూపకుండా, వేటికవే, ‘అవునుకదా ! నేను ఈ స్థానంలో ఉంటే ఇలాగే చేసేదాన్నేమో !’ అని అందరం అనుకునే విధంగా సున్నితమైన భావోద్వేగాలతో మలచారు రచయిత్రి. ఆద్యంతం హృద్యంగా సాగిపోయే ‘వంగూరి ఫౌండేషన్’ వారి 62వ ప్రచురణ అయిన ఈ ‘వేదిక’ నవలను చదవండి, చదివించండి, మీ ఆప్తులకు కొని బహుమతిగా ఇవ్వండి.
ప్రతులకు సంప్రదించాల్సిన చిరునామా :
jv

No comments:

Post a Comment

Pages