వర్షం - అచ్చంగా తెలుగు

వర్షం

బి.ఎన్.వి.పార్ధసారధి 


ఉదయం ఆరు గంటలకే వర్షం మొదలైంది. తగ్గుముఖం పట్టే సూచనలేవీ లేకపోగా ఉధృతంగా కురవ సాగింది. సమయం ఉదయం ఏడు గంటలు దాటింది. సూర్యుడు మబ్బు దుప్పటిని ముసుగు తన్ని మరీ పడుకున్నాడు.  అది చూసి వరుణదేవుడు ఇంకా విజ్రుంభించాడు.
“అమ్మా నేను ఇవాళ కాలేజికి వెళ్ళనే” అని మళ్ళీ ముసుగు తన్ని పడుకుంది బద్దకంగా భారతి.
‘నీకంటే చెల్లింది కానీ నాకు తప్పదుకదా’ అని మనసులో అనుకుంది భారతి తల్లి త్రిపురసుందరి. త్రిపుర సుందరి బాంక్ లో కాషీయర్ గా పనిచేస్తోంది. ఆమె దగ్గర కాష్ కీస్ ( తాళం చెవులు) వున్నాయి. కాబట్టి ఆమె బ్యాంకు కి వెళ్ళక తప్పదు.
త్రిపుర సుందరి భర్త శంకర్ రావు గవర్నమెంట్ కాలేజీ లో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. ఇవాళ బహుశ కాలేజీ కి శలవు ప్రకటిస్తారు అని శంకర్ రావు మనసులో అనుకుంటుండగానే వాళ్ళ కాలేజీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసాడు. “ ఇవాళ కాలేజీ శలవు “ శుభవార్త చెప్పాడు శంకర్ రావు కి.
“ ఏమండీ ! ఇవాళ మీకు శలవే కదా , కాస్త అంట్ల గిన్నెలు  కడిగి పెట్టండి. మన పని అమ్మాయి లక్ష్మి రావట్లేదని ఇప్పుడే ఫోన్ చేసింది. వాళ్ళ ఇంటిదగ్గర భారీగా వర్షం పడుతోందట. పాపం ఒక్క రోజు  కూడా మానకుండా వస్తుంది ఇంటి పని చేయడానికి. ” అంది త్రిపుర సుందరి భర్త శంకర్ రావు తో పని పిల్ల లక్ష్మి పై సానుభూతి ఒలకబోస్తూ.
‘ ఖర్మ. శలవు నాడైనా ప్రశాంతంగా న్యూస్ పేపర్ చదవడానికి లేదు.’ అని మనసులో పని అమ్మాయి లక్ష్మి ని తిట్టుకుంటూ అంట్ల గిన్నెలు కడగ టానికి వంటింట్లోకి వెళ్ళాడు శంకర్ రావు.
వాస్తవానికి వర్షం పడినా లక్ష్మి పనిలోకి వెళ్లేదే కానీ ఆవేళ మాత్రం పాపం లక్ష్మి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా వుంది. పనిలోకి వెడితే వచ్చేటప్పుడు డబ్బులు తెమ్మనమని లక్ష్మి భర్త అప్పల కొండ ఉదయం నించీ సతాయిస్తున్నాడు. అప్పలకొండ బిల్డింగ్ కాంట్రాక్టర్ దగ్గర కూలీ గా పని చేస్తాడు. వారానికి ఆరు రోజులు పని చేస్తే పన్నెండు సార్లు సారా తాగుతాడు. ఒకప్పుడు రోజుకి ఒక్కసారే ( సాయంత్రం ) తాగేవాడు. ఇప్పుడు రోజుకి రెండు సార్లు ( ఉదయం, సాయంత్రం ) తాగడం మొదలు పెట్టాడు. ఇక ఆదివారం వస్తే రోజంతా తప్ప తాగి తొంగుంటాడు. ఇవాళ ఉదయం నుంచీ బాగా వాన పడుతూ ఉండటంతో కూలీ పని ఎలాగూవుండదు కాబట్టి సారా తాగి ఇంట్లోనే పడుకోవాలని డిసైడ్ అయిపోయాడు అప్పలకొండ. కానీ చేతిలో పైసా లేదు. అందుకే లక్ష్మి ని ఉదయం నుంచీ సతాయించటం మొదలెట్టాడు అప్పలకొండ ఎలాగైనా పనిలోకి వెళ్లి డబ్బులు ( అడ్వాన్సు ) అడిగి తీసుకుని రమ్మని . ఇది గ్రహించి లక్ష్మి తెలివిగా వర్షం సాకుతో ఏకంగా పనిలోకి వెళ్ళకుండా  ఎక్కొట్టింది.
బిల్డింగ్ కాంట్రాక్టర్ బాబు నిరుత్సాహంగా వున్నాడు. వర్షం భారీగా పడుతూవుండటంతో ఇవాళ ఉదయం భూమి పూజ చేయాల్సిన స్థలం లో బాగా నీళ్ళు నిలిచిపోయాయి. స్థలం యజమాని భూమి పూజ ని వాయిదా వేసుకున్నాడు. అతను మళ్ళా భూమి పూజకి ముహూర్తం నిర్ణయించుకుని పూజ చేసిన తరవాత కానీ ఆ స్థలంలో బోరు వేయడానికి లేదు. బోరు వేసిన తరవాత ఇల్లు కట్టడం మొదలు పెట్టాలి. ఈ వాయిదాల మూలంగా కాంట్రాక్టర్ బాబుకి రావలసిన అడ్వాన్సు డబ్బు కూడా ఆలస్యం అవుతుంది.
స్థలం యజమాని సత్యనారాయణ సంతోషంగా వున్నాడు. దానికి కారణం ఇవాల్టి న్యూస్ పేపర్ లో వచ్చిన స్టాక్ మార్కెట్ విశ్లేషణ. రాబోయే నెల రోజులలో కొన్ని ప్రధానమైన కంపెనీల షేర్ ల ధరలు బాగా పెరిగే అవకాశం వుందని , ఈసారి వర్షాలు బాగా పడే సూచనలు వుండటం వలన వ్యవసాయ ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుందని ,మొత్తం మీద దేశ ఆర్దిక అభివృద్ధి గణనీయంగా ఉంటుందని ఇవాల్టి న్యూస్ పేపర్ స్టాక్ మార్కెట్ విశ్లేషణ లో రాసారు. వర్షం వల్ల ఇవాళ భూమి పూజ వాయిదా పడటంతో మొదట సత్యనారాయణ దిగాలుగానే  వున్నాడు. మళ్ళీ నెల వరకు ముహూర్తాలు లేవు. అప్పటివరకు గృహ నిర్మాణం మొదలు పెట్టక పొతే తనదగ్గర వున్న డబ్బుని బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యాలి. దాని మీద నెల రోజులకు  వచ్చే వడ్డీ చాలా తక్కువ. న్యూస్ పేపర్ లో స్టాక్ మార్కెట్ విశ్లేషణ చదివాక వర్షానికి మనసులోనే థాంక్స్ చెప్పాడు సత్యనారాయణ. సత్యనారాయణ ఒక ప్రైవేటు కంపెనీ లో మార్కెటింగ్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇవాళ ఎలాగూ భారీ గా వర్షం పడుతోంది కాబట్టి కస్టమర్లని పర్సనల్ గా వెళ్లి కలిసే అవకాశం లేదు. హ్యాపీ గా ఈ రోజంతా  స్టాక్ మార్కెట్ మీద స్టడీ చేసి ఏ కంపెనీ షేర్ ల మీద పెట్టుబడి పెట్టాలో ఆలోచించి నిర్ణయం      తీసుకోవచ్చు.  ఇదీ సత్యనారాయణ సంతోషానికి కారణం. న్యూస్ పేపర్ బాయ్ కి మనసు లోనే కృతజ్ఞతలు చెప్పాడు సత్యనారాయణ మంచి వార్తని మోసుకొచ్చినందుకు. “ఏమోయ్. ఇవాళ మనం వర్క్ ఫ్రం హోం చేస్తున్నాం. అన్నాడు సత్యనారాయణ తన భార్య తన్మయి తో గర్వం తో కూడిన స్వరానికి కించిత్ వ్యంగ్యం జోడించి. సత్యనారాయణ తన స్వరంలో వ్యంగ్యం ధ్వనిస్తూ మాట్లాడటానికి కారణం ఉంది. తన్మయి అప్పుడప్పుడు తన భర్త సత్యనారాయణ ని దెప్పుతూ ఉంటుంది “ మీరు మార్కెటింగ్, మార్కెటింగ్ అంటూ ఊర్లన్నీ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. మా చెల్లెలు చంద్రిక భర్త శశాంక్ ని చూడండి ఎంచక్కా వర్క్ ఫ్రం హోం అంటూ ఇంటిపట్టున వుండి ఇంటిపనులన్నీ చక్కబెట్టుకుంటున్నాడు”.
చంద్రిక , శశాంక్ లకి పెళ్ళయి దాదాపు ఏడాది అవుతోంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ . శశాంక్ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడన్న మాటే కాని పాపం అతనికి క్షణం తీరిక ఉండదు. చంద్రిక కూడా తన కంపెనీ లో ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తోంది. దాంతో తను  అటు ఆఫీస్ పని, ఇటు ఇంటి పని ఈ రెండింటి మధ్య బాగా నలిగిపోతోంది. కొత్తగా పెళ్ళైన దంపతులన్న పేరే గాని అచ్చట్లూ ముచ్చట్లూ  శూన్యం.  ఈ నేపధ్యంలో ఇవాళ వాన కుండపోతగా కురవటం ఈ దంపతులకి ఒక విధంగా వరమనే చెప్పాలి. బాగా వాన పడుతుండటంతో ఉదయం నించే చంద్రిక , శశాంక్ ల ఇంటిదగ్గర కరెంటు పోయింది, వై ఫై కూడా పని చేయటం లేదు. బాటరీ ఛార్జింగ్ అయిపోవడంతో శశాంక్ లాప్ టాప్ కూడా మొరాయించింది. ఇద్దరూ వాళ్ళ మొబైల్స్ ని రోజూ ఉదయం ఛార్జింగ్ లో పెడతారు. ఇవాళ కరెంటు పోవడంతో ఇద్దరి మొబైల్స్ కూడా ముగ బోయాయి. ఒక విధంగా దేముడు, ప్రకృతి రెండూ ఇవాళ ఈ ఇద్దరికీ అనుకులించాయనే చెప్పాలి. చంద్రిక ఆఫీస్ కి వెళ్ళలేదు. మొబైల్స్ , టీ వీ , లాప్ టాప్ , ఈ మూడు మూగ బోవటంతో రోజంతా ఈ దంపతులకి మనసు విప్పి మాటలాడుకునే అవకాశం కలిగింది.
సత్యనారాయణ ఇంట్లో న్యూస్ పేపర్ వేసాక న్యూస్ పేపర్ బాయ్ కుమార్ ఊపిరి పీల్చుకున్నాడు. రోజూ సత్యనారాయణ ఇంట్లో ఆఖరి న్యూస్ పేపర్ వేస్తాడు కుమార్. న్యూస్ పేపర్ బాయ్ కుమార్ చాలా చిన్న వయసులోనే ఎన్నో బరువు బాధ్యతలు నెత్తిన వేసుకున్నాడు. అతని తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లి కాన్సర్ పేషెంట్. చెల్లెలు పదో క్లాసు చదువుతోంది. కుమార్ ఉదయాన్నే ఆరు గంటలకల్లా పాల పాకెట్లు కస్టమర్ ఇళ్ళకి వెళ్లి ఇస్తాడు. తరువాత న్యూస్ పేపర్లు కస్టమర్ ఇళ్ళలో వేసి వెంటనే గంట సేపు కంప్యూటర్ కోచింగ్ క్లాసులకి వెడతాడు. క్లాసు అయిన తర్వాత ఇంటికి వచ్చి నాలుగు మెతుకులు తిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కి వెడతాడు. సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇంటర్నెట్ కేఫ్ లో పని చేస్తాడు.
ఇవాళ వర్షం పడే సూచనలు ఉదయాన్నే గమనించిన కుమార్ రోజు కన్నా ఇంకా ముందుగానే బయలుదేరి వర్షం పడే సరికి పాలు, న్యూస్ పేపర్ పంపిణీ ముగించాడు. ఒక్కరోజు పనిలోకి వెళ్లకపోయినా యజమాని ఆరోజు జీతం కట్ చేస్తాడు. ‘ఇవాళ కాలేజీ ఎలాగూ లేదు కాబట్టి కంప్యూటర్ క్లాసు ఎగ్గొట్టినా పరవాలేదు  కానీ సాయంత్రం ఐదు గంటలకల్లా ఇంటర్నెట్ కేఫ్ కి వెళ్ళాలి , లేకపోతే ఒకరోజు జీతం రాదు. సాయంత్రానికి వర్షం తగ్గు ముఖం పడితే బావుణ్ణు.’ అని మనసులో వరుణ దేవుడిని ప్రార్దిస్తున్నాడు కుమార్.
‘ వాతావరణం మాములుగా వున్నా , లేదా వర్షం పడ్డా నా కొడుక్కి మాత్రం చిన్న వయసులోనే  కష్టాలు తప్పటం లేదు’ మనసులో నిట్టూర్చింది మంచాన పడ్డ కుమార్ తల్లి.
***

No comments:

Post a Comment

Pages