సుబ్బుమామయ్య కబుర్లు! - అచ్చంగా తెలుగు

సుబ్బుమామయ్య కబుర్లు!

Share This

సుబ్బుమామయ్య కబుర్లు!

ప్రతాప వెంకట సుబ్బారాయుడు


పిల్లలూ! ఇప్పుడంటే నేను పెద్దవాడినయిపోయాను కాని నాకు పిల్లలంటే చాలా ఇష్టమర్రా! ఎందుకంటే నేను బాల్యావస్థ దాటాకేగా ఇలా పెద్దవాడ్నయ్యాను. మీలా చిన్నపిల్లల్లా ఉండడమంటే నాకెంత ఇష్టమో! అమ్మేమో మనల్ని ఎప్పుడూ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది. మనకు కావలసింది చేసి కడుపునిండా పెడుతుంది. ఎప్పుడన్నా చిరాకొచ్చి తినం, పొమ్మని మారాం చేస్తే, చందమామను రమ్మని పిలుస్తూ మాయచేసి పెడుతుంది. అయినా మనం వినకపోతే బూచిని పిలుస్తానని భయపెట్టి నాలుగు ముద్దలు తినిపిస్తుంది. మన అల్లరి ఎక్కువయితే పిర్రమీదో, వీపు మీదో ఒక్క చరుపు చరిచి తను ఏడుస్తుంది. కాస్త మనకు పక్కలు వెచ్చబడినా, జలుబు చేసినా అమ్మ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. డాక్టరు ఇంజక్షన్ చేస్తున్నప్పుడు, చేదు మందులు మింగలేక మనం సతమతమవుతున్నప్పుడు అమ్మ తల్లడిల్లిపోతూ మనను ఎంతగా సముదాయిస్తుందో.. ముద్దుచేస్తుందో కదా!
మనకి తినాలనిపించినవన్నీ అలా ఆర్డరేస్తే ఇలా చేసి పెడుతుంది, అందుకే అమ్మను మాతృదేవత అన్నారు. అమ్మను మించినది ఈ జగతిలో లేదర్రా. చిన్ని కృష్ణుడయినా, బాల రాముడయినా అమ్మ అభిమానాన్ని చవి చూసినవారే! పిల్లల అల్లరి అంటే బాలకృష్ణుడే గుర్తొస్తాడర్రా! గోపబాలుర్ని కలుపుకుని ఊరంతా కలయదిరుగుతూ రేపల్లెలో ఎంతల్లరి చేశాడనీ. వెన్న దొంగలించేవాడు. గోవర్ధన గిరినెత్తాడు. కాళిందిలో పాముపై నృత్యం కూడా చేశాడు. మన్ను తింటే, నోరు తెరిచి చూపించమన్న అమ్మకు తన నోటిలో ఏకంగా బ్రహ్మాండాన్నే చూపించాడు. కృష్ణుని అల్లరి భరించలేక ఊళ్లోని తల్లులందరూ యశోదమ్మ ఇంటికి వచ్చి గొడవచేస్తే, కోపమొచ్చి కన్నయ్యని రోటికి కట్టేస్తుంది. తర్వాత బాధ పడుతూ కట్టు విప్పుతుందనుకోండి. మనలో మనమాట ఎవరికీ చెప్పకండేం..అమ్మ ప్రేమను పొందడానికే బహుశా దేవుళ్లు అవతారాలెత్తారేమో.. రాక్షసులను చంపడమన్నది ఒక నెపం అయి ఉంటుంది కదూ. ఇహ నాన్నారయితే మనకు కావలసినవి కొనిస్తూ, మనని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళుతూ, మనం మంచి పేరు తెచ్చుకుంటుంటే పొంగి పోతూ, అప్పుడప్పుడూ ఆప్యాయంగా కసురుకుంటూ..కొండకచో భయపెడుతూ మనని చక్కని దారిలో పెడతారు. మనం గౌరవించే మొట్టమొదటి వ్యక్తి నాన్నే!
ఆయన పెద్దరికానికి మనం చెడ్డపేరు తేకూడదు. శ్రీరాముడ్ని చూశారు కదా, తండ్రి దశరథుడు రామచంద్రుణ్ని అరణ్యవాసం కోసం అడవులకు వెళ్లమంటే మారు మాట్లాడకుండా వెళ్లాడా, లేదా? రాముడు అడవులకు వెళ్లాక ఆయన రాముడి కోసం ఎంతగా కుమిలిపోయాడో తెలుసు కదా, ఒకవేళ తెలియకపోతే అమ్మను రామాయణం లోని ఆ భాగం చెప్పమని అడగండి. ధృవుడు, మార్కండేయుడు, వినాయకుడు తల్లిదండ్రుల దగ్గర ఎంతగా గారాలు పోయారో మనకు తెలుసు! అందుచేత మనకైనా, దేవుళ్లకైనా పసితనం దేవుడిచ్చిన వరం. అమ్మానాన్నల్ని విసిగించకుండా, బాధపెట్టకుండా మనం వాళ్లు చెప్పినట్టు వినాలి. అప్పుడే మంచిపిల్లలం అనిపించుకుంటాం. వచ్చే మాసం తోడబుట్టిన వాళ్లగురించి మాట్లాడుకుందాం సరేనా? ఉంటాను మరి!
మీ మామయ్య
ప్రతాప వెంకట సుబ్బారాయుడు

No comments:

Post a Comment

Pages