పుష్యమిత్ర - 8 - అచ్చంగా తెలుగు

పుష్యమిత్ర - 8

 టేకుమళ్ళ వెంకటప్పయ్య 


జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ " అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మించడానికి అనువైన ప్రదేశం కోసం హిమాలయాలపైన  ఇస్రో వారు హెలికాప్టర్ల ద్వారా అన్వేషణ జరుపుతూ టవర్ నిర్మాణం లో ఎదురైన మంచును తొలగించే దశలో బయటపడ్డ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు బృహద్ధ్రదుని వద్దకు సైన్యాధికారి పదవి కోసం వెళ్ళిన సమయంలో సింహకేతనుడు తారసపడతాడు. సింహకేతనుడు, పుష్యమిత్రుని జయించేందుకు అఘోరా సాయం పొందాలని వెళ్ళి విఫలం అవుతాడు. మూడు దశల్లో జరిగే మహాసైన్యాధిపతి ఎంపికలో పాల్గొన్న పుష్యమిత్రుడిని జయించడానికి సింహకేతనుడు మొండిగుర్రాన్నిపంపినా సునాయాసంగా లొంగదీసుకుంటాడు. తొలిదశలో విజయం పొందిన పుష్యమిత్రుడు అష్టసేనానులనూ ఓడించి తర్వాత సింహకేతనునితో తలపడి అతన్ని ఓడిస్తాడు. మహారాజు సింహకేతనుని పుష్యమిత్రుని సహాయకుడుగా ఉండమని ఆదేశించగా కోపించి శ్వేతాస్వునికి ఏదో సైగల ద్వారా సందేశమిచ్చి నగరం వదలివెళ్తాడు. మహారాజు పుష్యమిత్రుని గత చరిత్ర తెలుసుకోవాలనుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తాడు.   (ఇక చదవండి)
పాడ్యమి నాడు ఉదయం మహారాజు గారు ఇచ్చిన విడిదిలో పచార్లు చేస్తున్నాడు పుష్యమిత్రుడు.  ఆరోజు కొలువు లేదనీ అందరూ విశ్రాంతి తీసుకోవలసిందిగా ప్రకటింపబడింది. సాయంత్రం రాజుగారి ఆహ్వానం మేరకు అంత:పురానికి వెళ్ళవలసిన పని ఉంది అంతవరకూ ఏమి చెయ్యాలా అని యోచనలో ఉన్న పుష్యమిత్రునికి    ఏవో గుర్రం గిట్టల సవ్వడి వినిపించగా బయటికి వచ్చి చూడగా అష్టసేనానులు వచ్చారు. లోపలికి పిలుచుకుని వెళ్ళి వారిని ఆశీనులను జేసి మంచి నీరు అందజేసి "నిన్నటి అస్త్ర ప్రదర్శనలో నావల్ల కొంత మంది గాయపడ్డారు.  నాకు ఎవరిమీదా వ్యక్తిగత శతృత్వం లేదు. ప్రత్యర్ధులుగా వచ్చిన వారితో పోరాడక తప్పదు. ఈ విషయంలో మీరు నన్ను క్షమిస్తారని ఆశిస్తాను" అనగానే.  వారిలో ముఖ్యసేనాని లేచి  "మహా సేనానీ!  ధన్యవాదములు అదేమీ లేదు. మీ శక్తి సామర్ధ్యాలు మా తాత ముత్తాతలు చెప్పుకునే యవన సామ్రాట్ అలెగ్జాండర్ కు మించి వున్నాయి. మేము గర్వించదగ్గ వ్యక్తి మాకు మహాసేనానిగా లభించాడు. ఇక ఏ దేశం దండెచ్చి వచ్చినా భయం అనేది లేదు కానీ.." అని ముగించాడు. "కానీ... చెప్పండి మీరు నా విషయంలో భయపడవలసినదేమీ లేదు. ధర్మబద్ధమైన విషయాలకు నేను ప్రధమస్థానం ఇస్తాను" అని పుష్యమిత్రుడు అనగానే..   "మన సామ్రాజ్యం లో జరిగే విషయాలే మమ్మల్ను  అతిగా బాధిస్తున్నాయి" అనగానే.. పుష్యమిత్రుడు దానికి “సందేహమేల చెప్పండి” అన్నాడు. సేనాని చెప్పసాగాడు "మనoదరం రాజభక్తులం రాజు మాటే మనకు శాసనం కానీ .. గత కొద్ది కాలంగా సింహకేతనుడూ.. అతనితో బాటూ శ్వేతాస్వుడూ ఆడింది ఆటా పాడింది పాటగా సాగింది. రాజ్యం అల్లకల్లోలమయింది. లంచగొండులు దేశంలో పెరిగిపోయారు. అదేమిటంటే సింహకేతనునికి చెప్తాం అని బెదిరిస్తున్నారు.” “అతని వ్యవహారం ప్రస్తుతం సద్దుమణిగినట్టే కదా.. నిశ్చింతగా ఉండండి” పుష్యమిత్రుడు అనగానే.."చెప్పలంటే ఈ రాజ్యంలో చాలా సమస్యలున్నాయి. ముందు ముందు మీకే అవగతం అవుతుంది. మహాసేనాని అయ్యాక మిమ్మల్ని కలవడం మా కర్తవ్యం. అనగానే "మీరు నన్ను ఏ సమయంలోనైనా.. అర్ధరాత్రైనా నిరభ్యంతరంగా కలవవచ్చు" అని చెప్పిన పుష్యమిత్రునికి ధన్యవాదాలు తెలిపి మాకు సెలవు ఇప్పించండి" అని వెళ్ళిపోయారు.
విడిదిలోకి పంచబక్ష్య పరమాన్నాలతో పరిచారికలు వచ్చారు. భోజనం వడ్డించడానికి వారు ఉపక్రమించబోతూ ఉండంగా.. బయట ఏవో అలజడి వినపడింది. ఏమిటా అని బయటికి వచ్చి చూడగా ఓ పల్లకీని బోయీలు మోసుకుని తీసుకొని వెళ్తున్నారు. దానిలో ఓ కన్య ఉంది. చుట్టూ సైనిక బృందం. వెనుక కొంతమంది ఆడా మొగా జనం.. ఒక యువకుడు ఆవేదనగా..దు:ఖిత మదితో దయచేసి వదలండి.. అని ఏడుస్తూ నడుస్తున్నాడు. అర్ధం కాని పుష్యమిత్రుడు తనకు తోడుగా ఉన్న సైనికుడిని "ఏమిటా వ్యవహారం?" అడిగాడు. రాజాజ్ఞ మహాసేనానీ! చక్రవర్తి తనకు నచ్చిన అమ్మాయిని ఇంటికి పల్లకీ పంపించి తెప్పించుకుంటారు ఏకాంత మందిరానికి. ఆమెతో గడిపిన అనంతరం ఆమెకు ధన కనక వస్తువాహనాలు ఇచ్చి పంపిస్తారు. ఈ అందగత్తెల ఆచూకి తెలిపిన వారికి కూడా మంచి పారితోషికం ఉంటుంది. "మరి ఆ యువకుడెవరు? ఎందుకు ఏడుస్తూ పల్లకీ వెంట నడుస్తున్నాడు?" అని పుష్యమిత్రుడు అడగ్గా.."అతను ఆ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుంటున్నాడు. వచ్చే వారమే వివాహం. ఈ లోపు మహారాజుగారు ఇలా పల్లకీ పంపించే సరికి ఆ అబ్బాయి పాపం..." అనే సరికి విషయం అర్ధం అయింది. ఒక విధమైన క్రోధంతో, ఆవేశంతో నరాలు పొంగాయి. పిడికిళ్ళు బిగిశాయి. "రాజాజ్ఞ కదా ఎవరూ ధిక్కరించరాదు" అని వారు ముగించే సరికి మామూలు స్థితిలోకి వచ్చాడు. పరిచారికలు భోజనం పెట్టి వెళ్ళిపోయారు. చక్రవర్తి ఎందుకు ఇంత నీతి బాహ్యమైన పనులు చేస్తున్నాడు? అతన్ని సక్రమమైన మార్గంలో ఎలా పెట్టాలి అన్న అలోచనలు అతనిని వేధించసాగాయి.
*  *  *
సంధ్యాసమయం అవుతోంది. పుష్యమిత్రుడు సంధ్యాదికాలు ముగించాడు. పల్లకీ రాగానే దానిలో ఎక్కి చక్రవర్తి ఆజ్ఞ మేరకు అంత:పురానికి బయలుదేరాడు. పల్లకీలో మూలగా ఏదో చిన్న పింగాణీ మరమూత ఉన్న జాడీ లాంటి వస్తువు వుంది. మూత తీసి వాసన చూసాడు. అది ఖాళీగానే ఉన్నా అది విషం నింపినదని అర్ధమయింది.  ఇది ఇక్కడికి ఎలా వచ్చిందని అలోచనలో ఉండగా పల్లకీ కోటలోపలికి చేరింది. కోటలోనుండి పెద్దగా ఏడుపులు అమ్మాయి శవాన్ని యువకుడు భుజాన వేసుకుని ఏడుస్తూ నడుస్తున్నాడు. వెనుక ఆమె తల్లిదండ్రులు ఏడుస్తూ నడుస్తున్నారు. విషయం అర్ధమయి ఎంతో ఆవేశాన్ని బలవంతం మీద అణుచుకున్నాడు పుష్యమిత్రుడు.
*  *  *
"పుష్యమిత్రా.....స్వాగతం! సుస్వాగతం!" అన్న బృహద్ధ్రధుని మాటలకు లేచి నిల్చున్నాడు. "రండి మనం నా ఆంతరంగిక మందిరానికి వెళ్ళి మాట్లాడుకుందాం" అని చక్రవర్తి అనగానే ఆయన్ను అనుసరించాడు. మందిరానికి వెళ్ళగానే అందించబడ్డ మధువును మర్యాద పూర్వకంగానే తిరస్కరించాడు.  "క్షమించండి. నేను సామవేదీయ బ్రాహ్మణుణ్ణి. మధ్య మాంసాలను ముట్టను"  అనగానే మహారాజు కేవలం పండ్లు పాలు ఉపాహారంగా సరఫరా చేయమని అనుజ్ఞ ఇచ్చాడు. అది సాగుతుండగా అడిగాడు మహారాజు "పుష్యమిత్రా... నాకు ఆశ్చర్యం ఏమిటంటే.. మీరు శతృవులను క్షత్రియులకంటే గొప్పగా చీల్చి చెండాడగలిగారు.  ఎలా సాధ్యం?   మీదు మిక్కిలి               సింహబలుడైన సింహకేతనుడు అధర్మ యుద్ధానికి ఒడిగట్టినా ఒంటిచేత్తో మట్టిగరిపించారు. ఎలా సాధ్యమైంది? మీ చరిత్ర చెప్పండి. మీ వంశం ఏమిటి? ఎక్కడి వారు? మీ తల్లిదండ్రులెవరు?  తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది అనగానే.. పుష్యమిత్రుడు చిన్న నిట్టూర్పు విడిచి.. చక్రవర్తి వేపు చూసి చిన్నగా నవ్వాడు. మనసు తన చిన్న తనంలోకి వెళ్ళింది.
*  *  *
"చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభంభవతు కాశ్యప, అవత్సర, వశిష్ట త్రయార్షేయ ప్రవరాన్విత  ద్వైముష్యాయన గోత్రః అపస్తంబ సూత్రః  కౌతుంబ సామవేద  శాఖాధ్యాయి పుష్యమిత్ర శర్మ అహంభో అభివాదయే" అని ఐదేళ్ళ పుష్యమిత్రుడు సుదర్శన వేదాంత భట్టు ముందు సాష్టాంగ నమస్కారం చేయగానే.. ఆ బాలుని చూసి సంతసించి "నాయనా దీర్ఘాయుష్మాన్ భవ! అభీష్ట ఫలసిద్ధిరస్తు! ఎవరు నాయనా!" అనగానే.. పుష్యమిత్రుని గుర్రం మీద తీసుకుని వచ్చిన వ్యక్తి నమస్కరించి "ఆచార్య దేవా! వీరి తండ్రిగారు జ్ఞానమిత్రుడు. సౌరాష్ట్ర దేశానికి మహామంత్రి. వీరు గిరినగర వాసులు. తమకు భరతఖండంలో గల ఖ్యాతి విని తమవద్దనే పుష్యమిత్రుడు వేద వేదాంగాలు అభ్యసించాలని వారి అభిలాష. ఇవిగో వారు పంపిన పదివేల సువర్ణ నాణెములు, ఇరువదివేల  వెండి నాణెములు మరియూ సుగంధ ద్రవ్యములు, సంభారములు దయతో స్వీకరించండి. చెప్ప మరచాను. ఇది పుష్యమిత్రుని జాతక చక్రం అని ఓ చర్మం పై రాసి ఉన్న రాశి, నవాంశ చక్రాలు, దశలు తదితర వివరాలను అందించాడు ఆ వ్యక్తి.   సుదర్శన వేదాంత భట్టు ఓ సారి పరికించి చూసి.." ఆహా! మంచి జాతకం. నాల్గింట శని ఉచ్చస్థితి వలన మంచి ధార్మికమైన మనసు, నీతినియమ పూర్వకమైన గుణగణాలు కలవాడు అవుతాడు"  అంటూ.. "ఇంకా తొమ్మిదింట ఉచ్చ శుక్రుని వలన ఆయన మీద లగ్న గురుని దృష్టి వల్ల ధర్మ రక్షణతో గూడిన జీవితం గడిపేవాడు అవుతాడు" అన్నాడు. "ఏడింట ఉచ్చ యోగకారక కుజుని వల్ల బలవంతులైన శతృవులు ఉన్నా చివరకు వారిని జయించే నైపుణ్యం భగవంతుడు అనుగ్రహిస్తాడు.. పతివ్రత యగు మహాసాధ్వి భార్యగ లభిస్తుంది" అని ముగించాడు. పుష్యమిత్రునికి విద్య నేర్పడం నాకు సమ్మతమే" అనగానే.. అతను ఆచార్యుని పక్కకు పిలిచి "పుష్యమిత్రుడు ఏకసంధాగ్రాహి అన్న విషయం ఆ అబ్బాయి వినకుండా మీకు చెప్పమన్నాడు గురువర్యా! సకలవిద్యలూ నేర్పమన్నారు. " సెలవు తీసుకుంటూ, ప్రతి సంవత్సరం మీకు అవసరమైన ధనాన్నీ.. సంభారాలనూ పంపిస్తామని చెప్పమన్నారు మంత్రి గారు" అని వెళ్ళిపోయాడు.
భట్టు పుష్యమిత్రుని దగ్గరకు తీసుకుని నాయనా పుష్యమిత్రా! నీ మొహంలో వేద కళ ఉట్టిపడుతోంది. నీకు కొన్ని ముఖ్య విషాలు చెప్పాలి అని చెప్పసాగాడు. స్వరయుక్తంగా నేర్చుకునే వేదపఠనం వలన శతాయువు సిద్ధిస్తుంది. వేదాలు సకల కళాసారాలు. అందుకే నాలాంటి వారు ఎంతోమంది వేదపాఠశాలలు స్థాపించి వటువుల చేత వేద పఠనాన్ని అభ్యసింపచేస్తున్నారు. హిందూ సంప్రదాయంలో వేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. భగవంతుని పూజించే విధానం నుంచి మనం నిర్వహించే ప్రతి శుభకార్యానికీ జరపవలసిన తంతు వేదాల్లోనే ప్రతిపాదించబడింది. అర్చకులు వేదాలు నేర్చుకోకపోతే సత్కర్మలు, సత్కార్యాలు జరిపించలేరు. సకల మంత్ర బాఢాగారం వేదమే. దాని నుంచే మానవుని చర్యలు, జీవనం ఆధారపడి నేటికీ వేద ప్రామాణికంగానే నడుస్తున్నాం అన్నది వాస్తవం. అపరకర్మైనా, శుభకార్యమైనా, మంత్రమైనా, తంత్రమైనా, రాజకీయమైనా, కళాపోషణైనా, పరిపాలనైనా, జన్మరాహిత్యమైనా అన్నీ వేదాల్లో మనకి లభించే పరిజ్ఞానమే. అన్ని వేదాలు అపోసన పట్టినవాడికి ఎందులోనూ ఎదురుండదు. వేదం వల్ల మనకి లభించేదే అసలైన జ్ఞానం. అదే జీవనానికైనా, జీవరాహిత్యానికైనా మార్గదర్శకం. కొన్ని నియమ నిబంధనలు పాఠిస్తే వేదాన్ని నువ్వు సులభంగా అభ్యసించవచ్చు. ఏ వేదం దేనిని  ప్రతిపాదిస్తోందో తెలుసుకోవడం  మానవునికి కనీసధర్మం.  బౌద్ధ జైన మతబోధనల వల్ల వేద విద్యార్ధులంటే ఒక నేడు రకమైన చులకన భావంతో చూడటం  పరిపాటి అయిపోయింది. వేద బ్రాహ్మణుల్ని కించపరచడం కూడా ఒక జాఢ్యంగా పరిణమించింది. వేదం నిర్వేదంగా మారుతోంది. ఈ విధానాన్ని నువ్వు రూపుమాపాలి. వేదాలను పునరుద్ధరించాలి. యజ్ఞ యాగాదుల విశిష్టత  దేశం నలుమూలలా చాటి చెప్పాలి. ఆ బాధ్యత నీకు అప్పగించాలని అనుకుంటున్నాను. అనగానే.. పుష్యమిత్రుడు నమస్కరించి.. "అలాగే గురువు గారు!" అనగానే భట్టు పరమానంద భరితుడై "తధాస్తు! అని అశీర్వదించాడు.
“ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా...” కావల్సిన వాటి అక్కరను  తీర్చి అక్కర్లేని వాటిని అడ్డుకునేట్టు చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం. వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకునేవారు అధ్యయనం చేయాలంటే మొత్తం వేదరాశిని అధ్యయనము చేయాల్సిందే. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టమని భావించి  ఉత్సాహము చూపించే వారు కాదు. అయితే కలగాపులగంగా ఉన్న  వేదరాశిని వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడు. ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వ మంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేసాడు. అలా కలియుగం నాటికి మనకు నాలుగు వేదాలు  లభించాయి. అవే ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలు. వ్యాసుడు అలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనేవారికి ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. మళ్ళీ ఒక్కొక్క వేదంలోను నాలుగు ఉపవిభాగాలున్నాయి. అవి మంత్ర సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు. ఈ విభాగాలలో మొదటి రెండింటిని "కర్మకాండ" అనీ, తరువాతి రెండింటిని "జ్ఞానకాండ" అనీ అంటారు.
వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు.  వీటినే వేదాంగాలు అని అంటారు. అవి ఆరు. శిక్ష,  వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము. శిక్షలో..వేద శబ్దాల మూలాలు, ధాతువులని బట్టి ఆయా శబ్దాల ఉచ్చారణ, స్వరములని చెప్పేది. వేదాన్ని ఎట్లా పలకాలో తెలుపుతుంది. వ్యాకరణం లో శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది, అవి ఎలాగో చెప్పేది వ్యాకరణం. ఎన్నో ధాతువుల నుండి అర్థాన్ని చెబుతాయి. కల్పకంలో వేద యజ్ఞంకోసం చేయాల్సిన యాగ శాల, వేదిక ఎట్లా ఉండాలి అనే విషయాలను తెలిపేది.  నిరుక్తం అనగా పదాలు ఎట్లా తయారు అయ్యాయో తెలుపుతుంది. ఇక ఛందస్సు అనేది వేద మంత్రాలలోని అక్షరాలను కొలిచేది, శబ్దాల అర్థాలను వివరిస్తుంది. చివరిగా జ్యోతిషం ల్లో..మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు, ఏమి, ఎట్లా చేయాలో తెలిపేది. చంద్రుడిని బట్టి, సూర్యుడిని బట్టి, ఋతువులని బట్టి కాలాన్ని చెబుతుంది. వీటినే షడంగాలు అని చెబుతారు. ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి. ఇవన్నీ నీకు అచిర కాలంలో క్షుణ్ణంగా నేర్పుతాను. నేర్చుకుని హిందూ మతం సకల మతాలకూ తల్లియనీ.. ఆదర్శవంతమైనదనీ ప్రపంచానికి చాటి చెప్పు.  నీకు ఇలాంటి ఉపయుక్తమైన జన్మలు ఎన్నో రావాలని, లోకకళ్యాణానికి ఉపయోగపడాలనీ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! " అని అశీర్వదించాడు. ఆ ఆశీర్వాదబలం  వూరకే పోతుందా!  (సశేషం)
*  *  *

No comments:

Post a Comment

Pages