సంగీత కళానిధి,సంగీత శిఖామణి - శ్రీచెంబై వైద్యనాథ్ భాగవతార్ - అచ్చంగా తెలుగు

సంగీత కళానిధి,సంగీత శిఖామణి - శ్రీచెంబై వైద్యనాథ్ భాగవతార్

Share This

సంగీత కళానిధి,సంగీత శిఖామణిశ్రీచెంబై వైద్యనాథ్ భాగవతార్

మధురిమ 


1750-1850 ఈ వంద సంవత్సరాల కాలాన్ని కర్ణాటక సంగీతానికి స్వర్ణ యుగం గా అభివర్ణిస్తారు.ఎందుకంటే ఈ కాలంలోనే సంగీత త్రిమూర్తులు శ్రీ త్యాగరాజస్వామి(1767-1847),శ్రీ ముత్తుస్వామి దీక్షితులు (1775-1835), శ్రీ శ్యామశాస్త్రుల వారు(1762-1827)ఈ కాలంలోనే జీవించి,ఎన్నో అద్భుతమైన కీర్తనలను రచించి ,వారుతరించడమేకాకుండా ఆ సాహిత్యాన్ని భావి తరాలకు అందించి  మనల్ని కూడా తరింపజేసారు.
సంగీత త్రిమూర్తుల కాలం తరువాత వారివలె ఆ సంగీతసరస్వతిని ప్రతినిత్యం తమ కీర్తనా కైంకర్యాలతో అర్చించి,తరించిన ఆధునిక  కాల సంగీత త్రిమూర్తులుగా కొనియాడబడిన వారు  శ్రీ అరియకుడి రామనుజ అయ్యంగార్(1890-1967) ,శ్రీ,మహారాజపురం విశ్వనాథ అయ్యంగార్(1896-1970), శ్రీ చెంబై వైద్యనాథ భాగవతార్(1896-1974).
ఈ ఆధునిక త్రిమూర్తులు ముగ్గురూ ఎవరికి వారే సాటి ,మేటి అయినా సంగీత శాస్త్రంలో లోతైన జ్ఞానాన్ని భగవత్ ప్రసాదంగా కలిగి ఒక ప్రత్యేకమైన,ముఖ్యంగా శక్తివంతమైన,కంచు ఘంటానాదంలాంటి గళాన్ని కలిగి, అటువంటి గళంతో మధురమైనగానం తోకచేరి వింటున్న శ్రోతలకు భగవత్ దర్శనం చేయించి,వారిని ఇలా సుమారు 70 సంవత్సరాలపాటు తన్మయులిని చేయగలిగిన పుంభావ సరస్వతీ స్వరూపులు...సంగీతాన్ని అభ్యసించే ప్రతీ విద్యార్ధికి,నేర్పించే ప్రతీ గురువుకీ కూడా ప్రాతఃస్మరణీయులు శ్రీ చెంబై వైద్యనాథ భాగవతార్ గారు.
1896వ సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తేదీన కేరళ రాష్ట్రంలో ని పాల్ఘాట్ జిల్లాలోని చెంబై(కొట్టై) గ్రామంలోని అనంత భాగవతార్,పార్వతి అమ్మాళ్ పుణ్య దంపతులకు కృష్ణాష్టమి పర్వదినాన జన్మించారు.సాంప్రదాయ సంగీతాన్ని తరతరాలకు అందించిన సంగీత కుటుంబంలో జన్మించారు కనుకనే సంగీతజ్ఞానం ఆయన రక్తంలోనే ఉంది.వీరి ముత్తాతగారు  చక్రతానం సుబ్బయ్య గారు మహానుభావులు సాక్షాత్తు త్యాగరాజస్వామి ,స్వాతి తిరుణాల్ మహారాజా వంటి వారి సమకాలీనులు.వీరు చక్రతానం అనే ప్రత్యేకమైన ,క్లిష్టమైన తానంలో (మనోధర్మ సంగీత అంశాలైనరాగం,తానం,పల్లవి లో ఒకటి) నిష్ణాతులు.ఎంత నిష్ణాతులంటే వీరికి చక్రతానం అన్న బిరుదు ఇంటిపేరు గా మారిపోయింది. తండ్రి అనంత భాగవతార్ గారు గాత్రం మరియు వయొలిన్ వాయిద్యాలలో నిష్ణాతులు.
మూడేళ్ళ వయసునుండే తండ్రి గారి వద్ద సంగీత విద్యాభ్యాసాన్ని ప్రారంభించి గురు-శిష్య పరంపరతో శాస్త్రీయసంగీతాన్నికఠోర సాధనతో ఔపాసన పట్టిన బాలమేధావి మన వైద్యనాథ్ భాగవతార్.అసలు  భాగవతార్ అన్న పేరు కి అర్థం ఏంటంటే భగవంతుడిని చేరుకోవాలనే ఒకే ఒక్క ఆలోచన తప్ప ఇంకే బంధాలు,కోరికలు ఆశలు లేనివాడని.
చెంబై గారి వంశస్తులు  సార్ధక నామధేయులు అందుకే తమ గానమృతం అనే నైవేద్యాన్ని తర తరాలుగా నిరంతరం ఆ సరస్వతికి అర్పించుకున్నారు.
9ఏళ్ళ వయసులో 1904 వ సంవత్సరంలో పాలక్కడ్ జిల్లాలో లో ఒట్టుపాళం గ్రామంలో శ్రీ కృష్ణుని  గుడిలో తన సంగీత మహాప్రస్థానాన్ని మొదలు పెట్టి ఎంతో సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించారు.
ఈ ప్రయాణంలో ముఖ్యంగా చెప్పుకోవలిసినవి, 1907లో గురువాయూర్ లోమొట్టమొదట గా ఆయన చేసిన కచేరి.ఆయనకి గురువాయురప్పన్ అంటే అమితమైనభక్తి,ఇష్టం కూడా....తనకు లభించినఈ సంగీత జ్ఞానమంతా ఆ గురువాయురప్ప ప్రసాదం అనేవారు.1909లోతంజావూరుకు చెందిన ప్రఖ్యాత హరికథా భాగవతారులైన కలియకుడి నటేసశాస్త్రి గారి ఎదుట కచేరి చేసి వారి మన్ననలు పొందటం, 1911లో పాల్ఘాట్ అనంతరామ భాగవతార్ గారి ఎదుట కచేరి చెయ్యడం..
ఒక మనిషి సాధించే విజయంలో  అతని బాల్యం చాలా ముఖ్యమైనది అనడానికి ఉదాహరణ మన చెంబైగారే.వారిది సనాతన సాంప్రదాయ కుటుంబం.ఆచార వ్యవహారాలన్నీ తూచా తప్పకుండా పాటించిన కుటుంబం.ప్రతి నిత్యం వారిఇంట్లో వేద పారాయణ,తండ్రి గారి సంగీత సాధన అలా వారి చెవిలో మ్రోగుతూనే ఉండేవట. ఈ సుశ్రవణం వల్లనే వారికి పరమ పవిత్రమైన సంగీతజ్ఞానం …వారి ఇష్టదైవమైన గురువాయురప్ప ప్రసాదం గా  చిన్నతనం నుండే లభించిందిమరి.
1913-1927 ఈ సమయంలో వారు ఎన్నో గాన సభల్లో ,సంగీత ఉత్సవాలలో మరియు మద్రాసు సంగీత ఎకాడమి లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు.
1932-46 ఈ కాలం లో భాగవతార్ గారు తన కచేరీలన్నీ ఫోనోగ్రాఫ్ అనే పరికరం ద్వారా రికార్డ్ చేసేవారట.ఫోనోగ్రాఫ్అంటేధ్వనిని రికార్డ్ చేసుకోవడానికి తిరిగి పునరుత్పత్తి చేసుకోవడానికి ఉపయోగించే పరికరం,అప్పటికి ఇంకా మైకులు కూడా వాడుకలో లేవు కనుక పెద్ద పెద్ద విద్వాంసుల కచేరీలన్నీ ఫోనోగ్రాఫ్ ద్వారానే జరిగేవి.
1920వ దశకానికే దక్షిణ భారతదేశం లో ఓ గొప్పకళాకారునిగా,ఓ గొప్ప విద్వాంసుని గా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించి..40వ దశకానికి వచ్చేసేరికి యావత్ భారతదేశం అంతటా ఆయన పేరు మారుమ్రోగింది.ఎంతోమంది ఉత్తర భారతదేశ  విద్వాంసులు ఆయనని,ఆయన సంగీతాన్ని కూడా చాలా గౌరవించేవారు.
ఒక గురువుగా శ్రీ చెంబై:భాగవతారు గారు ఓ విద్వాంసులుగా ఎంత పేరు సంపాదించుకున్నారో ఓ గురువుగా చాలా మంది విద్వాంసులైన శిష్య-ప్రశిష్యుల హృదయాలలో ఓ పుజ్యునిగా ఇప్పటికీ ఆరాధించబడుతున్నారంటే...దానికి కారణం ఒకటే ఆయన శిష్యులపైన చూపించిన వాత్సల్యం.
ఆయనకు సంగీతం బోధించడం అంటే చాలా ఇష్టమట.తనకి తెలిసిన ఈ పవిత్రమైన విద్య సాధ్యమైనంతవరకు ఎంత మందికి బోధించకలిగితే అంతమందికీ బోధించాలి అదికూడా ఉచితంగానే అనుకునేవారట.సంగీత ఉపాధ్యాయులుగా ఆయన మారడానికి ఒక కారణం ఉంది.తండ్రిగారు అనంత భాగవతార్ సంగీతోపాధ్యాయులే..అయితే చెంబై గారు అతని తమ్ముడు సుబ్రమణి 16 సంవత్సరాల వయస్సు వచ్చేసేరికే చక్కటి విద్వాంసుల్లాగా కచేరీలు కూడా చేస్తూ ఉండడం చూసి చాలా మంది వారి పిల్లలిని అనంత భాగవతార్ గారి దగ్గరకు సంగీతం నేర్పమని పంపేవారట...అలా విద్యార్ధుల సంఖ్య ఎంత పెరిగిపోయిందంటే..అందరి పిల్లలికీ ఒకేసారి పాఠం చెప్పలేక తండ్రి గారు చెంబై గారి చేత కొంత మంది పిల్లలకు పాఠం చెప్పించేవారట.ఇలా 16 సంవత్సరాలకే ఆయన గురువుగా ముందు తన తమ్ముడు సుబ్రమణ్యానికే పాఠాలు చెప్పారు.అనంత భాగవాతార్ గారు ఎంత ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వారంటే కేవలం ఉదరపోషణకే తప్ప పిల్లల దగ్గర ఎక్కువ డబ్బులు ఏనాడూ గురుదక్షిణగా స్వీకరించలేదు.చాల పేదరికం అనుభవించినా తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడే జీవితం సాగించారు.
తండ్రి గారి గుణాలనే వారసత్వం గా పొందిన మన చెంబై గారు కూడా పేదరికం లో పెరిగినా ఏనాడు డబ్బుసంపాదించాలి అని శిష్యులకు సంగీతం చెప్పలేదు..ఎవరైనా గురుదక్షిణగా ఏమైనా ఇస్తే ఆ మొత్తాన్ని గురువాయూర్ దేవస్థానానికో లేక ఎవరైనా ఆడ పిల్లల పెళ్ళిలకి వరకట్నంగానో ఇవ్వమని ఇచ్చేసేవారట.
అసలు ఈ ఉదార స్వభావం వారి రక్తంలో ఉంది అనడానికి ఓ ఉదాహరణ"చెంబై గారి ముత్తాత గారు చక్రతానం సుబ్బయ్యగారి ప్రతిభ కి పురస్కారం గా ఆ ఊరి రాజుగారు ఆయకు బంగారు కంకణం బహుకరించారు. కాని సుబ్బయ్యగారు దాన్ని ఆ ఊరిలో ఉంటున్న ఓపేదవానికి ఇచ్చివేసారట.ఈ విషయం తెలుసుకున్న రాజు గారు ఎందుకిలా చేసారని అడుగగా ఆ వస్తువుతో నాకన్నా ఆబీదవాడికే ఎక్కువ అవసరం ఉంది అని జవాబిచ్చారట.అప్పుడు రాజు గారు ఇంకో కంకణం పంపించారట."
సనాతన సాంప్రదాయ కుటుంబంలో జన్మించినప్పటికీ సంగీతాన్ని శ్రద్ధగా,త్రికరణసుద్ధితో నేర్చుకోవాలన్న ప్రతీ విద్యార్ధికి జాతి,కుల,మత,వర్ణ వివక్షత లేకుండా శిష్య వాత్సల్యంతోనే కాదు పుత్రవాత్సల్యం తో కూడా విద్యాదానం చేసేవారు.
“విద్యాదానం ఒక అద్భుత వరం అని ఒక విద్యార్ధికి నేర్పుతూ నాకున్న జ్ఞానంలో కొంత  అతనికి  నేనుపంచిపెడుతున్నాను.ఈ గుణం నా తండ్రి గారి వద్దనుండీ నాకు సంప్రాప్తించింది” అని  పదే పదే చెప్పేవారట.
తాను ఒక పెద్ద విద్వాంసులైనప్పటికీ అప్పుడే సంగీతాభ్యాసాన్ని మొదలుపెట్టే విద్యార్ధులకు కూడా సంగీతంచెప్పేవారట.రోజులో ఏ సమయంలో వచ్చినా పాఠం చెప్పేవారట.ఒక్కోసారి తన విద్యార్ధులు తనతో పాటుగాప్రయాణిస్తున్నప్పుడు... రైల్వే స్టేషన్ లో  రైలు గురించి వేచి ఉండే సమయాలలో  ఆ రైల్వే ప్లాట్ ఫారం  మీద కూడా పాఠం చేప్పేవారట. ఎంత మహానుభావులో...
తన స్వగ్రామం చెంబై లో ఓ గురుకుల పాఠశాల నిర్మించి అందులో ఎంతో మంది విద్యార్దులకు తన తమ్ముడు సుబ్రహ్మణ్యం సాయంతో  ఉచితంగా సంగీతం చెప్పేవారు.వారి శిష్యులందరూ గొప్ప గొప్ప విద్వాంసులై అందరి మన్ననలను పొందినవారే.వారి శిష్యుల్లో ప్రముఖులు శ్రీ పరమేశ్వరన్ నంబూద్రి,శ్రీ ఆర్.సుబ్బరాజుగారు(వీరు మండొలిన్ శ్రీనివాస్ గారి గురువులు కూడా),గురువాయూర్ పొన్నమ్మాళ్,శ్రీమతి సుకుమారి నరేంద్ర మీనన్ ,వయొలిన్ విద్వాన్ వి.వి.సుబ్రహ్మణ్యం,శ్రీ టి.వి.గోపాలకృష్ణన్,నేపధ్య గాయని పి.లీల ,శ్రీ కె.జె.యేసుదాస్గారు.యేసుదాస్ గారు కొన్ని సంవత్సరాలు చెంబై గారికి గాత్ర సహకారం కూడా అందించిన ధన్యులు.
చెంబై గారికి ఎంతోమంది శిష్యులు ఉన్నా ఆయన ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి యేసుదాస్ గారు.ఈ విషయాన్ని యేసుదాసు గారు ఎన్నో సందర్భాలలో గుర్తుచేసుకున్నారు.”ఒక సొంత కుమారుడి లా నన్ను చూసుకునేవారు మా గురువుగారు అంటూ కళ్ళనీళ్ళ పర్యంతం తన గురువుని స్మరించుకున్న సందర్భాలు ఎన్నో ఎన్నెనో...ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే అది కేవలం నా గురువు ఆశీర్వాదం వల్లనే అంటారు వారు.మనకి భగవంతుడెంత విద్యని, జ్ఞానాన్ని ప్రసాదించినా...గురువు ఆశీర్వచనం పొందలేనప్పుడు అవన్నీ వ్యర్ధం...నా గురువు సంపూర్ణ అనుగ్రహం నాపై ఉండడం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటారు వారు.నేను తన మతము వాడినీ,కులము వాడిని కాకపోయినా నా దగ్గర నుండీ ఏమీ ఆశించక తన పక్కనే నన్ను కూర్చోపెట్టుకుని మరీ నాకు సంగీతాన్ని నేర్పిన వారు.. నా దైవం” అంటారు.అందుకే గురువుగారిపై అభిమానంతో,గౌరవంతో ప్రతీసంవత్సరం చెంబై గారి పుట్టినరోజు (సెప్టెంబెర్ 1వ తేదిన)చెన్నై నగరం లో ఆయన పేరుమీద ఒక సంగీత ఉత్సవం మూడురోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు...ఇందులో భాగంగా ఎందరో సంగీతజ్ఞులని ఘనంగా సన్మానించి సత్కరిస్తారు కూడా.అలాగే ప్రతీ సంవత్సరం తిరువనంతపురంలో జరిగే చెంబై వైద్యనాథ్ భాగవతార్ ఉత్సవంలోనూ అలాగే ఆయన పుట్టిన ఊరు చెంబై లో జరిగే చెంబై ఏకాదశి ఉత్సవంలోనూ,గురువాయూరు దేవస్థానం నిర్వహించే చెంబై సంగీతోత్సవంలో ను కూడా తన గురుభక్తి కి నిదర్శనంగా  తప్పకుండా పాడతారు.
వాగ్గేయకారుల రచనలు గానంచెయ్యటమే కాదు...ఒక సంగీత స్వరకర్త గా కూడా చెంబై వైద్యనాథ్ భాగవతార్ కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవ చేసారు.అది కూడా ఎలా అంటే వారి మితృలైన టి.జి.కృష్ణన్ గారు లలితా దేవిపై(తెలుగు,సంస్కృత,తమిళ భాషలలో) రచించిన లలిత దాసర అన్న ముద్ర తో సుమారు 150 కీర్తనలను స్వయముగా స్వరపరిచి తన ప్రతీ కచేరీలోనీ పాడి వాటికి జనప్రాచుర్యం సంపాదించి పెట్టారు.తరువాత కాలంలో అవి బాగా ప్రాచుర్యం పొందిన తరువాత  లలిత దాసర కీర్తనగళ్ అన్న పుస్తకం కూడా వెలువడింది.
తన మొత్తం జీవిత కాలం 78సంవత్సరాలైతే అందులో సుమారు డెబ్భై సంవత్సరాలు కచేరిలలోనే గడిపి తరించిన ఈ మహానుభావునికి పక్క వాయిద్యాలు వాయించిన వారి జాబితా కూడా వందల్లో ఉంది.వారు కూడా ఒకరిని మించినవారు మరొకరు.తన జీవిత కాలం లో అయిదు తరాల  వయొలిన్ విద్వాంసులతో తాను కచేరీలు చేసానని ఓ సారి ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు వి.వి.సుబ్రహ్మణ్యం గారితో చెప్పారట.తనకి పక్కవాయిద్యం వాయించిన వారిలో మొదటి వ్యక్తి వారి నాన్నగారు అనంత భాగవతార్ గారే..కుమారుడికి పక్కన వయొలిన్ వాయిస్తూ పుత్రోత్సాహాంతో ఎంత పొంగిపోయి ఉంటారో వారు.ఆరోజుల్లో విద్వాంసులందరూ తమకు ధీటైన వారినే  తమకి సహకారవాయిద్యకులుగా వేసుకునేవారు.కాని చెంబై వైద్యనాథ్ భాగవతార్ గారు మాత్రం అప్పుడప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న చిన్న పిల్లలిని కూడా తనకి సహకార వాయిద్యాలు వాయించడానికి ఒప్పుకునేవారట.
ఓసారి చెంబై గారి కచేరికి ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు చౌడయ్య గారు రావలిసి ఉన్నదిట.కాని ఆయనసమయానికి రాలేకపోయేసేరికి అక్కడ అప్పుడే ఇంకా నేర్చుకుంటున్న ఓ 8ఏళ్ళ అబ్బాయి ఉన్నాడుట.అప్పుడు ఆ అబ్బాయినే  తనకి సహకార వాయిద్యంగా వయొలిన్ ని వాయించమన్నారుట.ఆ అబ్బాయి ఒక రాగం వాయించవలిసిన చోట ఇంకో రాగం వాయించినా ఏమి అనకుండా ఆ అబ్బాయి వాయిస్తున్న రాగాన్నే ఆలాపన చేసిన విశాల హృదయం కలవారు.ఆ అబ్బాయి ఎవరో కాదు ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు పద్మభూషన్ శ్రీ టి.ఎన్.కృష్ణన్ గారు.కొత్తవారికి అవకాశాలు ఇవ్వడంలో చెంబై గారు ఎప్పుడూ ముందుండేవారు.కొత్తగా నేర్చుకునే వారికే ఎక్కువ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పేవారు.
కాని చెంబై గారితో ఎక్కువ కచేరీలలో వయొలిన్ ను వాయించింది శ్రీ మలైకొటయ్ గోవిందస్వామి పిళ్ళై,అలాగే వారికి చాలా కచేరిలలో మృదంగ సహకారాన్నందించింది శ్రీ పుదుకోటై దక్షిణామూర్తి పిళ్ళై గారు.వీరు మృదంగం మరియు కంజీరా వాద్యాలలో నిష్ణాతులు.పెద్ద పెద్ద విద్వాంసులు కూడా చెంబై గారికి సంతోషంగా సహకార వాయిద్యంవాయించేవారు.70 సంవత్సరాల వారి సుదీర్ఘ సంగీత చరిత్రలో ఎంతోమంది సమకాలీన విద్వాంసులు,విద్యార్ధులు కూడా వారికి సహకార వాయిద్యాన్ని అందించారు.
వారిలో ప్రముఖులు శ్రీ టి.జి.కృష్ణ అయ్యర్,శ్రీ మైసూర్ చౌడయ్య గారు,శ్రీ ద్వారం వేంకటస్వామి నాయుడు గారు,కుంబక్కోణం రాజమాణిక్యం పిళ్ళై,సెమ్మంగూడి నారాయణస్వామి అయ్యర్,టి.ఎన్.కృష్ణన్,శ్రీ లాల్గుడి జయరామన్,శ్రీ ఎం.ఎస్ గోపాలకృష్ణన్,శ్రీ వి.వి సుబ్రహ్మణ్యం.ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు శ్రీ పాలక్కడ్ మణి అయ్యర్ ని కేవలం 13 సంవత్సరాల వయస్సులో నే తనకి సహకార మృదంగ వాయిద్యకుని గా తీసుకుని అతని బంగారు భవిష్యత్తు కి ఒక రాచ మార్గాన్ని వేసారు.చెంబై గారు గాత్రమే కాకుండా వయొలిన్ వాయించడంలో కూడా నిష్ణాతులు.తాను తొలిరోజుల్లో కచేరీలు చేసేటప్పుడు కొందరు మితృలకి వాయించారు కూడా.
ఎప్పుడైనా ఎవరైనా కొత్తవారు అరంగేటం చేస్తున్నప్పుడు వారు తన శిష్యులైనా ,ఎవరైనా కానీ వెళ్ళి మొదటివరుస లో కూర్చుని వారిని ఉత్సాహ పరిచేలా "శభాష్" “భేష్” అనడం...నవ్వుతూ వారిని ఉత్తేజ పరచడం కూడాచేసేవారట,పూర్వం ఏ.ఐ.ఆర్. వారు సంగీతజ్ణులని ఆడిషన్ చేసేటప్పుడు వారికి నచ్చిన రాగాలు,కృతులను పాడమని అడిగేవారు.ఇలా చేసేకన్నా విద్యార్ధి ఎంచుకున్న రాగామో,కృతినో పాడే అవకాశం ఇస్తే వారు ఇంకా బాగా ప్రదర్శించగలరని,మరియుఒక్కో విద్యార్ధి ఒక్కో రాగంలో బాగా వాయించగలుగుతాడు లేదా పాడ గలుగుతాడు. కాబట్టి ఎంపిక విషయంలో విద్యార్ధికి స్వతంత్రం ఇవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ఓ సారి రేడియో వారికి ఈ విషయం పై సలహా చెప్పినట్లుగా ఓ ఉత్తరం కూడా రాసారు.ఈ సూచనని వారు ఆమోదించారు కూడా.
రసికులైన శ్రోతలు ఓ కచేరీకి ఎంత ముఖ్యమో వారు చెప్పేవారు.కచేరి చేసే కళాకారుడు ఎంత విద్వాంసుడైనా రసికుడైన శ్రోత ప్రోత్సాహంతోనే సంగీతానికి అర్థం,పరమార్థం అనేవారు.సంగీతం ఒకయోగం…. ఆ నిర్గుణబ్రహ్మాన్ని చేరుకునే ఒక సాధన సంగీతసాధన అని చెప్పుకున్న ఓ కర్మయోగి మన చెంబై వైద్యనాథ్ భాగవతార్ గారు.
సంగీతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం శాంతి స్థాపన అని అనేవారుట.ఏ విద్వాంసులైనా వారు పాడినా,వాయించినా.. విన్న శ్రోతకి భక్తి భావం కలగాలి...విన్నందుకు అతను ప్రశాంతత పొందాలి అనేవారు.
చెంబై గారు తన గానాన్ని, జీవితాన్ని కూడా ఆ గురువాయూర్ శ్రీకృష్ణుని పాదాలకే అంకితం చేసారు. ప్రతీ కార్తీక శుక్లపక్ష ఏకాదశి నాడు గురువాయూర్ ఆలయంలో శ్రీకృష్ణుని ఎదుట పాడడం వారికి అలవాటు. ఓసారి అదేరోజు వారు కలికోటై అన్న గ్రామంలో సంగీత కచేరి చెయ్యడానికి వెళ్ళారు.ఆ రోజు కార్తీక శుక్ల ఏకాదశి  అని వారికి జ్ఞాపకం లేదు.పాడడానికి కూర్చునేసేరికి గొంతు పట్టినట్లుగా అయ్యి అసలు మాటకూడా రాలేదుట.తంబురా శృతి మోగుతోంది కానీ ఆయన ఆ శృతి ని అందుకోలేక పోతున్నారు.అప్పటివరకూ ఏమిలేకుండా చక్కగా ఉన్న మనిషి ఇలా అయిపోయేరేంటా అని అందరూ ఆరాట పడుతుండగా ఆయన మాత్రం కళ్ళుమూసుకుని ఓసారి గురువాయూరప్పని ధ్యానించుకున్నారు.ఇంతలో వారికే ఎదో జ్ఞాపకం వచ్చినట్లుగా ఈరోజు తిధిఏంటి అని అడుగగా ఆరోజు కార్తీక శుక్ల ఏకాదశి అని చెప్పారట.వెంటనే ఆ కచేరీ పెట్టినవారిని క్షమించమని తాను ఇప్పటికిప్పుడు గురువాయూర్ వెళ్ళవలెనని అర్ధించగా వారు సరేనని ఓ కారు కూడా ఏర్పాటు చేసి వెంటనే గురువాయూర్ పంపించారట.గురువాయూర్ చేరుకోగానే ఆ శ్రీకృష్ణుని ఎదుట పాడడానికి కూర్చోగానే కంఠం మళ్ళీ మామూలుగానే వచ్చిందట.శ్రీ కృష్ణుని క్షమింపమని ఎన్నో కీర్తనలు పాడి తన మనసు కుదుటపడేవరకూ అలా కొన్ని గంటల పాటు పాడుతూనే ఉన్నారట.చివరికి కృష్ణుడు నన్ను క్షమించాడు అని అనిపించాక అప్పుడు విరమించారుట.
ఆ మర్నాడు తిరిగి కలికోటై వెళ్ళి కచేరీ చేసారు.ఆ శ్రీకృష్ణుడు కూడా చెంబై గారి గానామృతం కోసం అంత తపిస్తాడేమో...ఏకాదశి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాడేమో..ఏకాదశి వచ్చినా తన భక్తుడు రానందుకు ఈవిధంగా రప్పించుకున్నాడేమో...భగవంతునికి భక్తులు దాసులంటారు కానీ సర్వస్వ  శరణాగతిగా,త్రికరణశుద్ధి గా నమ్మిన భక్తులకి భగవంతుడు మాత్రం దాసుడు కాదా అని మనకి ఈ సంఘటన చదవగానే అనిపించదూ??
ఇలాంటి అద్భుతమైన అనుభవాలతో పరిపూర్ణమైన  78ఏళ్ళ ఆయన జీవితం అనే పుస్తకాన్ని  మనందరమూ ఓ గొప్ప పాఠం లాగా చదువుకుని తీరాలి.
నమ్ముకున్న సిద్ధాంతాలకి,విలువలకి,దైవభక్తికి జీవితం లో ప్రాధాన్యతనిస్తే తప్పకుండా ఉన్నత శిఖరాలకిచేరుకుంటాము అనడానికి ఇలాంటి మహానుభావుల జీవితానుభవాలే మనకి ఉదాహరణలు...వారి జీవితాల్లో జరిగిన వేరు వేరు సంఘటనలు మనం కూడా ఆ విలువలకి ప్రాధాన్యతనిచ్చేలా మనల్ని మార్చుతాయి..అలోచింపజేస్తాయి కూడా.
1937లో మైసూరు మహారాజా వారు శ్రీ కృష్ణరాజేంద్ర వొడయార్ గారు చెంబై వైద్యనాథ్ భాగవతార్ గారిని కచేరీని చెయ్యవలిసింది గా తమ ఆస్థానానికి ఆహ్వానించారు.వారి ఆహ్వానాన్ని మన్నించి మన చెంబై గారు మైసూరుఆస్థానంలో కచేరీ చేసి అటు రాజు గారిని మరియు మైసూరు ఆస్థాన విద్వాంసులైన శ్రీ ముత్తయ్య భాగవతార్ గారి మన్ననలు కూడా అందుకున్నారు.మహారాజా వారు మన చెంబై గారిని ఘనంగా సత్కరించాక..ముత్తై భాగవతార్ గారు కూడా చెంబై గారిని ఆత్మీయంగా సత్కరించారట. ఈ ఇద్దరు భాగవతార్లూ ఇలా కలిసిన ఆ మధుర క్షణం ఫోటోరూపంలో ఇప్పటికి మైసూరు కోటలో ఉంది.రాజా వారు చెంబై గారిని తమ ఆస్థాన విద్వాంసులుగా ఉండమని అభ్యర్దించారట.అది గొప్ప అవకాశమైనా చెంబై గారు సున్నితంగా తిరస్కరించారుట."మహారాజా నేను మీ ఆస్థాన విద్వాంసుని గా ఉంటే తరచూ ఇక్కడికి వస్తూ ఉండాలి..ముఖ్యంగా దశరా నవరాత్రులలో ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి..కాని దేవీ నవరాత్రులలో మా ఇంటిలో అమ్మవారిని  ఆంతరంగికంగా అర్చించడం నా ముఖ్యమైన కర్తవ్యం.  ఆ తొమ్మిది రోజులూ నేనుఎక్కడా కచేరి చెయ్యను కూడా.. కేవలం అమ్మవారి అర్చనలోనే కాలం గడుపుతాను అని చెప్పి సున్నితంగా రాజు గారి ఆహ్వానాన్ని తిరస్కరించినారు."
చెంబై గారి అపారమైన దైవభక్తి కి రాజు గారు,సభాసదులుకూడా  అమితాశ్చర్య  పడి..."దశరాలో వీలుపడకపోతే మిగిలిన సమయాల్లో వీలున్నప్పుడు  మీ గానామృతాన్ని వినే భాగ్యాన్ని మాకు కలిగించండి అనివిన్నవించుకున్నారుట" ఆ తరువాత చాలా సందర్భాలలో మహారాజావారి ఆహ్వానంపై మైసూరు వెళ్ళి ఎన్నో కచేరీలు కూడా చేసారు మన భాగవతారు గారు.
మనం నిర్ణయించుకున్న  ప్రాముఖ్యతలను పాటించడానికి మనం అవసరమైతే ఏదైనా త్యాగం చెయ్యగలగాలి అన్న విషయాన్ని ఈ సంఘటన నిరూపిస్తుంది.
ఈ విధంగా జీవించినంత కాలం ఆ సంగీతకైంకర్యంలోనే కాలంగడపగలిగిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు!
చరిత్ర చెప్తున్న నిజం ఏంటంటే మీరా బాయ్,సంగీత త్రిమూర్తులు వంటి  గొప్ప గొప్ప భాగవతోత్తములు గానం చేస్తూనే తమ తుదిశ్వాసని వదిలి ఆ పరమాత్మ లో విలీనమయ్యారు.చెంబై వైద్యనాథ్ భాగవతార్ గారు కూడా అంత గొప్ప భాగవతోత్తములు కాబట్టే వారు కూడా అలానే తన ఇష్టదైవమైన  ఆ గురువాయురప్పలో ఐక్యం అయ్యారు.
16 అక్టోబర్ 1974 చెంబై గారి జీవితంలో చివరి రోజు. ఆరోజు కూడా ఆయన సంగీత సాధనతో ,కచేరీతోనే సమయం గడిపారు.ఆరోజు ఆయన తాను మొట్టమొదటగా కచేరీ చేసిన ఒట్టుపాళం గ్రామంలోనే ఉన్నారు.ఆ గ్రామానికి వారు తరచుగా వస్తూనే ఉండేవారు.ఎందుకంటే ఆ ఊరిలో వారి శిష్యులు,ప్రాణమితృలు  అయిన శ్రీ వాసుదేవన్ నంబూద్రిగారు ఉండేవారు.ఇంకా అదేరోజు వారి ఇంకో శిష్యులు శూలపాణి గారి అరంగేటం, మరియూ ఆ ఊరి కృష్ణుడి గుడిలో తన కచేరీ కూడా ఉంది...ఆ ఊరిలోనే చెంబై గారి ప్రియశిష్యురాలు శ్రీమతి సుకుమారి నరేంద్రమీనన్ గారు కూడా ఉండేవారు.ఆ రోజు పొద్దున్నే సుకుమారి గారు సంగీత సాధన ముగించుకోగానే చెంబై గారు మధ్యాన్నం వారి ఇంటికి వస్తున్నారని వాసుదేవన్ గారి దగ్గరనుంచి  ఆమెకు ఫోన్ వచ్చింది.ఆమె ఎంతో సంతోషించి గురువు గారి గురించి ఎదురుచూస్తూ ఆయనకి ఇష్టమైన వంటకాలన్నీ కూడా చేసి సిద్ధంగా ఉందిట.వారి ఇంటికి వచ్చేముందు  ఆ ఊరి అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన గావించుకుని తరువాత శిష్యురాలి ఇంటికి  12 గంటల ప్రాంతంలో  వచ్చిన భాగవతారు గారు ఆమెతో ఎంతో సమయం సంగీతం గురించి మాట్లాడుతూనే గడిపారట.
ఆయన జీవితానికి సంబందించిన ఎన్నో అనుభవాలను,అనుభూతులను శిష్యురాలితో పంచుకున్నారుట.సుకుమారి గారి ఇంటిలో ఓఅందమైన పూలతోట ఉంది.ఆ తోటలోకి వెళ్ళి రకరకాల పూలను చూసిన వారు"సుకుమారి ఈ తోటలో  మల్లెపూలన్నీ ఓ తీయని గుబాళింపుతో,కొన్ని మందారాలు  ఎరుపురంగులోని  మెరుపువలే కొన్ని కలువలవలు సున్నితంగా ఇన్నిరకాలుగా ఉన్నా మన మనస్సులో ప్రేమ అనే  తత్వం ఉంటే  ఇవన్ని పువ్వులూ మనకు ఒకలానే కనిపిస్తాయి " అన్నారుట.
ఆతరువాత కాసేపు నిశ్శబ్దం గా ఉండి జీవించినప్పుడు ఏకోరికలు లేకపోయినా ఇప్పుడు మాత్రం ఆ గురువాయూరప్ప నాకు "అనాయాస మరణం" ప్రాసాదిస్తే బావుండును.ఇక నాకు అదొక్కటే కోరిక అన్నారుట.
సంధ్యా సమయంకాగానే ఇక బయలుదేరబోతూ శిష్యురాలు సుకుమారి మీనన్  గారి తల పైన తన చెయ్యివేసి ఒక్క క్షణం భగవంతుడిని ధ్యానించి"సౌభాగ్యవతి గా వర్ధిల్లు ప్రతీ ఏకాదశి నాడు ఆ గురువాయురప్ప దగ్గర గానం చెయ్యడం మరువకు" అని దీవించారు. గురువుగారి ఆశీస్సులు లభించినందుకు ఆమె ఎంతో సంతోషించారు కానీ అవే గురువుగారి ఆఖరి ఆశీస్సులు అని ఆమె ఊహించలేదు.
వెంటనే కృష్ణుడి గుడి చేరి ఆ స్వామి దర్శనం చేసుకుని తన శిష్యులు శూలపాణి గారి కచేరీ చూసి భేష్ అని శిష్యుడిని తనదైన పంథాలో ప్రోత్సహించి,ఆశీర్వదించి తన కచేరీకి సిద్ధం అయ్యారు.ఆరోజు ఆయన కచేరికి చాలా మంది వచ్చారుట.విరిబోణి భైరవి వర్ణం తో మొదలు పెట్టి,హంసధ్వనిలో వాతాపి గణపతిం ఆ తరువాత తనకిష్టమైన చాలా రాగాలలో ఎన్నో కీర్తనలు పాడి,కాంభోజి రాగాన్ని 74ఏళ్ళ వయస్సులో మొదటి కచేరీలో పాడినంత శృతి సుద్ధంగా,ఆ కంచు కంఠంతో ఆలాపన చేస్తూ ఉంటే శ్రోతలందరూ సమయం తెలీకుండా ముగ్ధమనోహరులై అలానే వింటున్నారట, అదేమిటో తెలియలేదు కానీ చాలా కాలంగా పాడని కొన్ని అపూర్వ రాగాలలో కృతులు కూడా ఆరోజు పాడారట.
కచేరీ చివరిలో ప్రఖ్యాత మళయాళ వాగ్గేయకారులురవి వర్మన్ థంపి గారి రచన కరుణ చేయ ఎందులకు తామసం కృష్ణా !! అన్న కృతి గానం చేస్తున్నప్పుడు ఆనంద భాష్పాలు కనులనుండీ కారగా భగవత్ దర్శనం అయ్యిందేమో అని చూసేవారికి అనిపించేలా చేతులు రెండూ పైకి ఎత్తి నమస్కరించి
 "వందే మాతరం అంబికాం భగవతీం వాణీ రమా సేవితాం
కల్యాణీం కమనీయకల్పలతికాం కైలాసనాథప్రియాం
వేదంత ప్రతిపాద్యమానవిభవాం విద్వన్మనోరంజనీం
శ్రీచక్రాంకిత రత్నపీఠనిలయాం శ్రీరాజరాజేశ్వరీం " అన్న శంకరాచార్యుల శ్లోకాన్ని తల్లి ఒడిలోకి చేరబోతున్న తనయుడు ఎంత ఆనందంగా అమ్మా అంటాడో అంత ఆనందగా పఠించి కచేరీ ముగించారు.
వేదిక దిగుతూనే తనని గర్భగుడిలోపలకి తీసుకు వెళ్ళమన్నారుట.లోపలకి ప్రవేశించగానే కళ్ళుమూసుకుని "కృష్ణా అన్నికోరికలు తీర్చావు ఇంకా ఈ ఎనభయ్యోపడిలో కూడా ఈ శరీరంతో నేను ఉండాలా?? నీ దగ్గరికి నన్ను ఎందుకు పిలువవు అన్ని అర్ధించారట"
ఆ తరువాత లేచి నిలబడి తీర్ధ ప్రసాదాలు తీసుకుంటున్నప్పుడు అర్చకులు అన్నారట"భాగవతార్ గారు మీరు 125సంవత్సరాలు జీవిస్తారు"అని.దానికి చెంబై గారు నవ్వి నేను ఆ గురువాయురప్ప ఈ  విషయము పై ఎప్పుడో ఓ నిర్ణయానికి వచ్చేసాము అంటూ తిరిగి  మితృలు వాసుదేవన్ గారి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారట. ఇంటికి వెళ్ళాక కాళ్ళు,చేతులు కడుక్కుని వరండా లో ప్రార్ధన చేస్తున్నట్లుగా కూర్చున్న మన చెంబై గారు కొన్ని క్షణాలకే నేల పై ఒదిగిపోయారు.
ఈ విధంగా మొట్టమొదట కచేరీ చేసిన ఒట్టుపాళం గ్రామంలోనే తన చివరి కచేరీ కూడా ముగించి తరువాత ఆ గురువాయూరప్ప సన్నిధికి చేరిపోయిన పుణ్యపురుషులు మన చెంబై వైద్యనాథ్ భాగవతార్ గారు.
పద్మభూషణ్,గాన గంధర్వ,సంగీత కళానిధి,సంగీత కళాశిఖామణి,సంగీత నాటక అవార్డ్ ఇవన్నీ ఆయనను వరించి సార్దకం పొందాయి. గురువాయురప్ప యందు ఆయనకు  గల  అపారమైన భక్తికి నిదర్శనంగా గురువాయూర్ దేవస్థానం వారు “చెంబై గురువాయురప్పన్ పురస్కారం అన్న ఓపురస్కారాన్ని ప్రవేశ పెట్టి ప్రతీ ఏటా ఆయన పేరు మీద ఓ విద్వాంసుణ్ణి  సత్కరిస్తున్నారు.
కదిరి గోపాల్నాథ్(శాక్సోఫోన్),మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వంటి ఎందరో మహానుభావులు ఈ పురస్కారాన్ని, చెంబై గారి ఆశీర్వాదాన్ని కూడా అందుకున్నారు కాబట్టే  వారు అంత ఉన్నత శిఖరాలను అధిరోహించారు అన్నది సత్యం.
ప్రతీ కార్తీక ఏకాదశి నాడు చెంబై గారు గురువాయూర్ లోనిర్వహించిన ఆ ఏకాదశి ఉత్సవాన్ని ఆయన మరణాంతరం  గురువాయూర్ దేవస్థానం వారు "చెంబై సంగీతోత్సవం " అని నిర్వహిస్తున్నారు.మూడురోజుల పాటు జరిగిన ఈ ఉత్సవం ఇప్పుడు 15 రోజుల వరకూ జరుగుతోంది.సుమారు 2500 మంది కళాకారులు,విద్వాంసులూ పాల్గునే ఈ ఉత్సవం ఏకాదశి నాడు ముగుస్తుంది. ఆ ఆఖరిరోజున చెంబై గారికి ఇష్టమైన 5 కృతులు అలాగే త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనలు కూడా ఆలపిస్తారు. ప్రతీ సంగీతాభిమానికీ ఈ ఉత్సవం  ఓ సంక్రాంతి పండగ. ..
అలాగే ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వారి స్వగ్రామం చెంబై లో వారు జీవించి ఉన్నప్పుడు వారు నిర్వహించిన సంగీతోత్సవాన్ని కూడా ఇప్పుడు వారి కుటుంబం వారు ఇంకా చెంబై గ్రామంలో ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తున్నారు.
1996లో వారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం వారి పై గౌరవానికి సూచకంగా ఓ తపాలాబిళ్ళ (స్టాంప్)ని కూడా విడుదల చేసింది.
ఆయన ఓ వ్యక్తి కాదు సంగీత ప్రపంచానికి ఓ అనంతమైన,అద్భుతమైన శక్తి..వారు అజరామరులు.ఆచంద్రతారార్కం వారి ఖ్యాతి దస దిశలా వారి శిష్య-ప్రశిష్యుల గానంలోనో,సంగీత ఉత్సవాలలోనో  మారుమ్రోగుతూనే ఉంటుంది.
వారి కీర్తనలను క్రింది లింక్ లో వినండి.

No comments:

Post a Comment

Pages