కవిత్వమంటే... - అచ్చంగా తెలుగు

కవిత్వమంటే...

Share This

కవిత్వమంటే...


ఎన్నాళ్ళ  నుంచో  ఎదురుచూసిన పున్నమి ఎదురైనట్లు ఎప్పటినుంచో  వేచి  చూస్తుంటే  ఇన్నాళ్ళకు  'సిరివెన్నెల' గారి ఇంటర్వ్యూ దొరికింది. వారు కవిత్వం గురించి  చెప్పిన ఒక్కొక్కమాట, వేదవాక్కు ! అవే మళ్ళీ జతచేసి మీకు అందిస్తున్నాను.
"కవిత్వం అనేది మానవ జీవితంలో ఉన్న అన్ని కళలలోకి అత్యుత్తమమైన కళ. అందరిలో ఉన్న చైతన్యం ఒక్కటే , కాని ప్రయోజనం అన్నది, ఎవరికివారు వ్యక్తిగతంగా ఆలోచిస్తేనే చేకూరుతుంది. మీకు మీరే  తెలుసుకోవాలి, ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకుని, సమాధానం చెప్పుకోవాలి. గమనించడం, ఆలోచించడం, ప్రశ్నించుకోడం, ఆ జవాబుల్ని భావాలుగా ఆవిష్కరించుకోవడం, ఇలా "ఏం ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి" అనే ప్రశ్నలకు ఆలంబన ఇస్తే మనలోనుంచి ఉత్తమమైన సాహిత్యం వెలికి వస్తుంది.
కవిత్వం అనేక పొరల రూపంలో ఒస్తుంది. అది ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధమవుతుంది.కవిత్వానికి ఉన్న లక్షణం ఏమిటంటే అంతరంగాన్ని మీటి, అనేక రకాలైన ఆలోచనలకు, భావాలకు ప్రేరణ, ప్రచోదనం(ముందుకు కదిలేటట్టు) ఇస్తుంది. ఇస్తేనే అది కవిత్వం అవుతుంది. కొన్ని పదాల సమూహం కాని, కొంత ఆర్భాటం కాని కవిత్వం అనిపించుకోదు.
అందరికీ అర్ధం అయ్యేలా సాత్వికంగా, ఉదాత్తంగా రాయడం ముఖ్యం. కవిత్వం అనేది స్థలము, కాలము, అనేవాటికి అతీతంగా ఉండాలి. అంటే, స్థలము, కాలము అనేవాటికి అతీతంగా మనం ఉచ్చరించగలగాలి. ఆకలి, దాహం, సూర్యోదయం, సూర్యాస్తమం వంటివి క్రీస్తు శకం ఒకలాగా, క్రీస్తు పూర్వం ఒకలాగా ఉండదు కదా. ఇటువంటి లక్షణాలను కలిగి ఉండి రాస్తేనే అది కవిత్వం అవుతుంది.సార్వకాలీనము, సార్వ జనీనము, సార్వ దేశీయం అన్న ప్రయోజనాలు కలిగేలా రాయటమే కవిత్వం."
ప్రతి కవి, రచయత ఏం రాస్తున్నా, ఈ మాటల్ని మనసులో మననం చేసుకోవాలి. ముందు తరాలకు మంచి సాహిత్యాన్ని అందించే బాధ్యత నిశ్చయంగా మనపై ఉంది.
ఎప్పటిలాగే ఆరు ఋతువుల లాంటి ఆరు కధలు, సప్తవర్ణాల వంటి కవితలు, పంచె వన్నెల భావాలు కలబోసిన సీరియల్స్, వీటన్నిటితో మీ ముందుకు వచ్చేసింది మీ అభిమాన - "అచ్చంగా తెలుగు" మాస పత్రిక. కార్టూనిస్ట్ సుభాని గారి ఇంటర్వ్యూ, కూచిపూడి నాట్య మయూరి రేఖా సతీష్ గారి ఇంటర్వ్యూ ఈ సంచికలో ప్రత్యేకం. తప్పక చదివి, మీ అభిమానాన్ని అక్షరాల కామెంట్ల రూపంలో కురిపిస్తారు కదూ !
కృతజ్ఞతాభివందనలతో
భావరాజు పద్మిని
chinamyii02@gmail.com

No comments:

Post a Comment

Pages