శ్రీ దత్తాత్రేయ వైభవం - 5 - అచ్చంగా తెలుగు

శ్రీ దత్తాత్రేయ వైభవం - 5

Share This
శ్రీ దత్తాత్రేయ వైభవం - 5
శ్రీరామభట్ల ఆదిత్య 

1. మొదటి గురువు - భూమి :
దత్తాత్రేయుడు తాను భూదేవి నుండి ఓర్పు వహించడం, కర్తవ్య నిర్వహణా ధర్మం, కార్య నిర్వహణలో ఎన్ని కష్టానష్టాలు వచ్చిన ఓర్చుకోని నిలబడడం, తన ధర్మం తాను తప్పకపోవడం లాంటి ఎన్ని విషయాలనో తాను గ్రహించానంటాడు జగద్గురువైన దత్తాత్రేయుడు.
భూదేవి కన్నా ఓర్పు ఈ విశ్వంలో ఎవరికి ఉంటుంది. మానవుడు దుర్మార్గుడు ఎన్ని అకృత్యాలకు పాల్పడినా ఓర్పు వహించి భరించేదే భూమాత.
మనం ఎన్నో తప్పులు చేసి భూదేవిలో భాగమైన ఈ ప్రకృతి నడిచే సక్రమమైన వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసి ఉత్పాతాలు సృష్టించినా ఉపేక్షించి, కొడుకు ఎన్ని తప్పులు చేసినా కన్నతల్లి తన కడుపులో దాచుకున్నట్టు, ఓర్పుతో మనని ఉద్ధిరించే ప్రయత్నం చేస్తుంది తల్లి భూదేవి. ఇంకా భూదేవి నుండి నేర్చుకోవాల్సిన గుణం క్షమా గుణం భూమిపై ఉండే పర్వతాలు మరియు వృక్షాల లాగా ఇతరులకు ఎలా ఉపయోగపడాలో నేర్చుకోవలంటాడు దత్తాత్రేయుడు.
2. రెండవ గురువు - వాయువు:
గాలి మనకు ప్రవిత్రత, వాసన లేని గుణం అంటే ఎలాంటి విపరీత భావాలూ లేకపోవడం మరియు అందరిలో తొందరగా కలిసిపోవడం లాంటి ఎన్నో గుణాలు నేర్పుతుంది. గాలి అన్నిటితో కలిసినా తన సహజలక్షణాన్ని ఎలాగైతం కోల్పోదో మనిషి కూడా అలాగే మనం కూడా ఎంతమందితో కలిసినా మన సహజ లక్షణాన్ని కోల్పోకూడదు.
ఎలాగైతే గాలి అదుపు తప్పి అతివేగంతో వీచి ప్రకృతిలో మహా విధ్వంసం సృష్టిస్తుందో అలాగే అదుపు లేని మనస్సు కూడా అలాగే ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తుంది, అలాంటి మనస్సుని పరమాత్మ వైపు మరల్చడం చాలా కష్టం. అందుకే మన మనస్సుని సాధ్యమైనంత వరకు మన అదుపులో పెట్టుకొని పరమాత్మ వైపు నడిపించే ప్రయత్నం చేయాలి....
3. మూడవ గురువు - ఆకాశం:
విశ్వమునంతా కప్పి ఉంచే ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. కొన్నిసార్లు ఆకాశాన్ని మబ్బులు కమ్మి దాన్ని కనబడకుండా చేస్తాయి. అయినా ఆకాశం ఆ మబ్బుల చేత ప్రభావంఏ కాదు. తన స్థితిని తాను విడచిపెట్టదు. అలాగే ఆత్మకూడా ఈ ప్రాపంచిక విషయాల చేత కప్పబడినా తన అసలు స్థితిని మరవకూడదని దత్తాత్రేయ స్వామి అంటారు.
ఆకాశం విశ్వంలో ప్రతి చోట వ్యాపించి ఉంది. దానికి కనపడని వస్తువూ, విషయమూ లేదు. అలాగే పరమాత్మ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఆయన చూడని విషయమూ, ఆయనకు తెలియని విషయమంటూ లేదు.
ఆకాశం మనకు నీలి రంగులో కనిపించినా, అసలు ఆకాశానికి రంగేలేదు. అలాగే పరమాత్మ ఒక రూపంలో మనకు కనబడ్డా రూపరహితుడు ఆ పరమాత్మ. ఎలాగైతే ఆకాశంలో ఎలాంటి పదార్థం ఉండకుండా పూర్తి ఖాళీగా ఉంటుందో, అలాగే ఒక ఙ్ఞాని తన ప్రవచనాలలో కూడా ఎలాంటి భావాలను ఉంచుకోకూడదని అంటాడు దత్తుడు.
4. నాలుగవ గురువు - జలము:
ఋషి లేదా ఙ్ఞాని జలము లాంటి వాడు. ఙ్ఞాని నీరుగా స్వచ్ఛమైన మనసు కలవాడు. నీరులాగా కోమలమైన గుణం కలిగి, ఎలాగైతే నీరు సరిగా ప్రవహిస్తున్నప్పుడు మంచి మంచి శబ్దాలు చేస్తుందో అలాగే ఙ్ఞాని కూడా తన నోటి ఎన్నో మంచి మాటల ధారలను ప్రవహింపజేస్తాడు.
ఎలాగైతే నీటిలోని మురికి బట్టలు కాసేపటికి శుభ్రమవుతాయో అలాగే మలినమైన మనస్సు గల మనం మహాత్ముల ( ఙ్ఞానుల ) సాంగత్యం కలగగానే మన మనసులు నిర్మలమవుతాయి....
ఎలాగైతే నీరు ఎలాంటి అహం భావము లేకుండా జాతి, కుల, మత బేధాలు లేకుండా అందరి దాహార్తిని తీరుస్తుందో అలాగే ఙ్ఞాని కూడా కుల, మత, జాతి, వర్ణ బేధాలు విడిచిపెట్టి అందరికీ సమానంగా ఙ్ఞానాన్ని పంచాలి. అందుకే ఙ్ఞాని సమత్వ బుద్ధి కలిగి అందరిలో ఙ్ఞాన దీపాలను వెలిగించాలి.
5. ఐదవ గురువు - అగ్ని:
అగ్ని సమస్తాన్ని కబళించి ఆహారంగా స్వీకరిస్తుంది. అపవిత్ర పదార్థాలను స్వీకరించినా కానీ తాను మాత్రం పవిత్రంగానే ఉంటుంది. అలాగే మనం కూడా సమస్తమైన ఙ్ఞానాన్ని నేర్చుకోవాలి కానీ మనం అపవిత్రులం కాకూడదు. అగ్ని నుండి ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలంటాడు దత్తాత్రేయుడు.
ఙ్ఞాని కూడా అగ్నిలా పవిత్రుడు. ఎలాంటి కల్మషమూ లేని వాడు. ఙ్ఞాని అరిషడ్వర్గాలకు అతీతుడు.
6. ఆరవ గురువు - చంద్రుడు:
చంద్రుడు కృష్ణ పక్షంలో తన కళలు క్షీణిస్తున్నా చల్లటి వెన్నెల వెలుగును ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఙ్ఞాని కూడా తనకు ఏం జరిగుతున్నా ఇతరులకు మంచి చేసే ప్రయత్నమే చేస్తాడు. మహాత్ములు కూడా గుణంలో చాలా చల్లనివారు.
చంద్రుడు శుక్ల పక్ష, కృష్ణ పక్షాల్లో పెరిగుతూ , క్షీణిస్తున్నా తన అసలు గుణ స్వరూపాలలో మార్పు చెందడు. అలాగే మహాత్ములు కూడా వారు పుట్టినప్పటి నుండి మరణించే వరకు వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా వారి యొక్క సహజ గుణంలో, స్వభావంలో మార్పును రానివ్వరు... ( ఇంకా వుంది )

No comments:

Post a Comment

Pages