పుష్కరములు వచ్చె పుణ్య నదికి
రెడ్లం చంద్రమౌళి
ఆ.వె ఆట వెలది లోన యమ్మ కృష్ణమ్మకు
అచ్చ తెలుగు పద్య మమరి నాది
తప్పులెన్ని యున్న తనయుని మన్నింపుమా
జనుల గాచు నట్టి జలధి కృష్ణ
ఆ.వె రత్న గిరిని బుట్టి రాష్టాలు కలుపుతూ
జీవ నదిగ మాకు జీవ మిచ్చే
రత్న సిరులు గన్న మాయమ్మ కృష్ణమ్మ
అందుకొనుము నాంధ్ర స్వాగతములు
ఆ.వె వేద భూమి నుండి వుదయించి ప్రవహించి
వూరు వాడ లన్ని ఒండ్రు జేర్చె
రైతు రాజ్య మేలు తెలుగు నాటనునేడు
పుష్కరములు వచ్చె పుణ్య నదికి
ఆ.వె పొద్దు పొడుచు వేళ పుణ్య నదిని జూడ
పుణ్యమొ యిది యేదొ జన్మ వరమొ
పురము పురము నందు పులకించె జనులెల్ల
పుష్కరముల వార్త చెవిని పడగ
ఆ.వె కృష్ణ కృష్ణ యన్న కష్టము దీర్చేవు
కోరు కున్న వరము కలుగ జేసి
కోరి వచ్చు వారి కోర్కెలు తీర్చంగ
పుష్కరములు వచ్చె పుణ్య నదికి
ఆ.వె శివుని పదము చెంత శ్రీశైల మందున
కనక దుర్గ ఒడిని యమరె కృష్ణ
ఎన్ని క్షేత్రములో యెన్ని తీర్థములో
పదము చెంత జేరి పరవసించె
***
No comments:
Post a Comment