గోదావరి నుంచి సబర్మతి వరకు -4 - అచ్చంగా తెలుగు

గోదావరి నుంచి సబర్మతి వరకు -4

Share This

గోదావరి నుంచి సబర్మతి వరకు -4

 -అవని

 
ఆ లేఖని చదువుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంది ప్రణవి.అంతులేని అనురాగం,అనిర్వచనీయమైన ఆత్మానుబంధం తనని చూస్తే మేను పులకించి ఈ లోకాన్ని మరిచిపోయేంత ఆనందం..ఆ ఆనందాన్ని చేరుకోడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి వుందన్న సంతోషం..ఎంత వేగంగా ఆ క్షణాల్ని తన సొంతం చేసుకోవాలన్న ఆరాటం..ఇవన్నీ కలిసి ప్రణవిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
***
కృష్ణమోహన్‌ అభినందనల వర్షంలో తడుస్తున్నాడు.వేదిక మీద అందరూ తన గురించే గొప్పగా మాట్లాడుతున్నా..అవేవీ పెద్దగా వినే స్తితిలో లేడు.తన ఆరాటం వేరు,తన ఆతృత వేరు.నెమ్మదిగా ఆ సెషన్‌ ముగించుకొని బయటపడాలనే తపన తనలో కనిపిస్తోంది.తన చేతికున్న గడియారం వైపు ఓసారి చూసుకున్నాడు.
ఆ సెషన్‌ ముగిసింది..సభా నిర్వాహకులు తమ సాదర సత్కారంతో ఆయన్ని గౌరవించడం తో ఓ అధ్యాయం ముగిసినట్టయింది కృష్ణమోహన్‌ కి.
వెంటనే వడి,వడి గా అడుగులు వేసుకుంటూ ఆడిటోరియం బయటకు నడిచాడు.ఇంతలో తన మొబైల్‌ లో వున్న పదహారు మిస్‌ కాల్స్‌, ని ఒక్క సారి చూసుకున్నాడు.అక్కడ వున్న కారులో బయలుదేరాడు.
ఫోన్‌ చేసాడు..
" బంగారం..వచ్చావా..ఎక్కడున్నావు.." అనునయంగా అడిగాడు.
అంతే ఆ గొంతులోని తీయదనం విన్న ప్రణవి మకరందపు జల్లులో తడిసినట్టయిపోయింది.
" పది నిమషాల్లో అహమ్మదాబాద్‌ స్టేషన్‌ లో దిగుతాను.." చెప్పింది ప్రణవి.
హరిప్రసాద్‌ చౌరాసియా వేణుగానం విన్నంత హాయిగా ఉప్పొంగిపోయాడు కృష్ణ.
ఆ పది నిమషాలు పది యుగాల్లా వుంది ఇద్దరికి.
స్టేషన్‌ లో కారు పార్క్‌, చేసి ఫ్లాట్ఫారం మీదకి వస్తున్నాడు కృష్ణ...అంతే ఒక్క ఉదుటున వచ్చి అమాంతం తనని హత్తుకుపోయిన తన మేలిమి బంగారాన్ని చూసి స్తాణువైపోయాడు.అచేతనంగా చూస్తూ వుండిపోయాడు.నోట మాట రాలేదు..
ఆ ఘాడ ఆలింగనంలో కోరికలేదు..తొట్రుపాటు లేదు..నా మనిషి..నా ప్రాణం..నా ఊపిరి..అంతులేని నమ్మకం..అనిర్వచనీయమైన ఆనందం మాత్రమే కనిపించాయి.
సుతారంగా తల మీద నిమురుతూ అడిగాడు కృష్ణ.." ఎలా ..వున్నావు..బంగారం.."
" బాగున్నాను.." శ్రుతి బద్దంగా చెప్పింది ప్రణవి.
నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకు వెళ్ళాడు కృష్ణ.తనతో నడుస్తున్నప్పుడు తెలియని ఓ నమ్మకం..ఓ భరోసా ప్రణవి కళ్ళల్లో తెలియకనే కనబడ్డాయి తనకి.
ఒకరికొకరుగా,ఒకరికోసం ఒకరుగా,ఒకరికోసం ఒకరు ఉన్నట్టుగా మదిలోని తియ్యని భావాలు వాళ్ళని తెలియని లోకాల్లో విహరించేలా చేస్తున్నాయి.ఆ భావాలు మాటల కందనివి,అనుభవించిన వాళ్ళకే ఆ అనుభూతి సొంతమవుతుంది.
నెమ్మదిగా వచ్చి కారు వెనక సీట్లో కృష్ణ పక్కన కూర్చొంది.డ్రయివర్‌ ఆమె బ్యాగును డిక్కీలో పెట్టాడు.
" చెప్పు..ఏంటి సంగతులు..ఎలా వున్నావు.." అత్మీయంగా అడిగాడు.
" బాగానే వున్నాను..అలా గడిచిపోతుంది.." చెప్పింది ..గొంతులో ఏదో తెలియని చిన్న అసంతృప్తి.
అది గ్రహించాడు కృష్ణ.
" ఏమైంది..బంగారం..చెప్పు..నాకు చెప్పడానికి ఎందుకు మొహమాటం.." అడిగాడు.
ఒక్కసారిగా హృదయకవాటాల్ని తెంచుకొని,హృదయాంతరాళాల్లోని భాధనంతటిని చెప్పుకోవాలని వుంది ఆమెకి.కాని ఆ బాధంతా తనలోనే దిగమింగుకొని ..
" ఏం లేదు..బాగానే వున్నాను.." అంది పొడి పొడిగా..
ఇంతలో ఆ కారు గాయత్రి నిలయం అనే బొమ్మరిల్లు లాంటి  ఇంటి ముందు ఆగింది.ఇంటిని చూడగానే ఏదో తెలియని ఓ అనుభూతి కలిగింది ఆమెకి.భారతీయ సనాతనానికి,హైందవ సాంప్రదాయానికి ప్రతీకలా అనిపించింది.
కారు దిగగానే వేదవతి గుమ్మంలోకి వచ్చి వారికి స్వాగతం చెప్పింది..
" ఏమ్మా..ప్రయాణం ..బాగా..జరిగిందా.." అభిమానం గా పలకరించింది.
ఆమెని చూడగానే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ని చూసినట్టు అనిపించింది ప్రణవికి.
ఒంగి కాళ్ళకి నమస్కరించింది.
" లే..అమ్మా..లే.." అనునయంగా లేవదీసింది. ఆమె.
ఇంతలో కృష్ణమోహన్‌ భార్య గాయత్రి లోపలినించి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది ఇద్దరికీ.
గాయత్రిని తేరిపార చూసింది ప్రణవి.మూర్తీభవించిన మార్ధవం,సాంప్రదాయపు ఒడిలో ఒదిగిపోయిన ఓ పుత్తడిబొమ్మలా కనిపించింది ఆమెకి.
పెద్దగా పరిచయాలు అక్కరలేకుండానే ఒకరికొకరు పరిచయమయ్యారు.
విష్ణుశర్మగారు వేదపాఠశాల నుంచి వచ్చారు.
ఆయన రాగానే ఆయన పాదాలకి నమస్కరించింది ప్రణవి..
" పరమేశ్వరార్పణమస్తు.." అని సుతారంగా అన్నారు ఆయన.
" హాయిగా ఉండమ్మా..ఇది నీ ఇల్లే..అనుకో .." అంటూ లోపలకి వెళ్లారు.
" ఈ లోగా ..ఫ్రెష అవు..భోజనం చేద్దాము..అని తనకో గది చూపించాడు.కృష్ణ.
ఈ అనిర్వచనీయమైన అనురాగాలు,ఆత్మీయమైన పలకరింపులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ప్రణవిని.
మనిషి యాంత్రికంగా మారి..సమయంతో పోటీపడి పరుగులెత్తుతున్న ఈ రోజుల్లో..ఏదో తెలియని ప్రశాంతత..ఎంతో తెలియని అలౌకిక బంధం తనని పెనవేసుకున్నట్టు అనిపించాయి ఆమెకి.
ఈలోగా ప్రణవి తయారవడం,భోజనాది కార్యక్రమాలు ముగియడం జరిగాయి.
కొసరి,కొసరి వడ్డించే వేదవతి ఆప్యాయత తో నోటమాట రాలేదు ప్రణవికి.వడ్డన లో సాయం చేస్తున్న గాయత్రిని ఓ కంట గమనిస్తూనే వుంది ప్రణవి.కృష్ణ ముభావంగా వున్నా నవ్వుతూనే సరదాగా అందరితో మాట్లాడుతున్నాడు.
"పద నా గది చూపెడతాను.."అన్నాడు ప్రణవితో.
" సరే..పద.." అంది ముక్తసరిగా.
తన గదిలోకి తీసుకెళ్ళాడు..
అప్పటివరకు మూసి వుంచిన వెనెటియన్‌ బ్లైండ్స్‌, విండో ఓపెన్‌ చేసాడు కృష్ణ..
అది చూసి ఒక్కసారి షాక్‌ తిన్నట్టయింది ప్రణవి..
" నీకు బుద్దుందా..నాకు అరికాలి కింద భూకంపం వచ్చినట్టుంది.." అరవలేక నెమ్మదిగా చెప్పింది.
" ఏం..ఇందులో ఏమంత కంగారు పడ్డానికి ఏముంది.." అన్నాడు చాలా ప్రశాంతంగా.
" నువ్వునంత కూల్‌ గా నేను వుండలేను గాని ..ఇవి తీసెయ్‌..వద్దు.." అంది.
" అలాగంటావే గాని..ఎంత ముగ్ధమనోహరంగా,ప్రశాంతంగా పారే సెలయేరులా,నిండుగా..నిర్మలంగా..ఎంత సమ్మోహనంగా వున్నావో ఆ భ్లైండ్స్‌,లో ..దాన్‌ గురించి చెప్పవు.."అన్నాడు.
" నీ తలకాయ్‌..ఏడిసినట్టు వుంది..నీకెలా చెప్పాలో అర్ధం కాలేదు..పద సెమినార్‌ హాల్‌ కి వెలదామా.."అడిగింది.
" సరే..లెట్‌ అజ్‌ వెయిట్‌ ఫ్యూ మినిట్స్‌,రడీ అవుతా.." అన్నాడు.
ఈ లోపు గదిలో వున్న ఓ ఆల్బం ఇచ్చాడు ..చూడమని...
అందులో అన్నీ తన ఫొటోలే కనిపించాయి ఆమె కి..కానీ ఎక్కడా ఆ ఫొటోల్లో అసభ్యత లేదు..అన్ని ఫొటోల్లో ఒకటే కనిపిస్తోంది..అంతులేని ప్రేమ..
విష్ణు శర్మ వేదపాఠశాలకి వెళ్ళారు..అతని వెనకాల గాయత్రి కూడా వెళ్ళడం చూసింది ప్రణవి.తనకి కూడా ఓసారి చూడాలనిపించింది ఆమెకి.
" కృష్ణ..నువ్వు తయారవుతూ వుండు..నేను కూడా ఓ సారి వేద పాఠశాల చూసొస్తాను.." చెప్పింది ప్రణవి.
" సరే ..వెళ్ళు..నేను తయారయి వస్తాను.." చెప్పాడు.
వేద పాఠశాలలో వాతావరణం ప్రశాంతంగా వుంది..చీమ చిటుక్కుమన్నా వినిపించే శబ్ధం.తరగతి గదిలో ఒద్దికగా కూర్చొన్న ఇరవై మంది పది,పన్నిండు ఏళ్ళ పిల్లలు.ముచ్చటగా అనిపించింది ప్రణవికి.
మామగారికి కొంచెం దూరంలో కూర్చుంది గాయత్రి ఏదో పుస్తకం పారాయణ చేస్తున్నట్టు వుంది.
" గురువు గారు..ఈ రోజు శివ తత్వం పాఠం చెబుతానన్నారు.." ఆసక్తిగా గుర్తు చేసాడు ఓ విధ్యార్ధి.
" తప్పకుండా..ముందుగా ఆ శివ తత్వాన్ని చెబుతాను..తరువాత మీరు వేదపారాయణ చేద్దురు గాని.." అన్నాడు విస్ణుశర్మ
అక్కడ నిలబడి ఇదంతా గమనిస్తున్న ప్రణవిని చూసి .." రా..అమ్మా..నువ్వు కూడా ..కూర్చో.."అంటూ ఓ పీఠని చూపించాడు.
గాయత్రికి ఓ పక్కగా ,ఆ పీఠమీద కూర్చొని వినడం మొదలెట్టింది.
నెమ్మదిగా చెప్పడం మొదలెట్టారు విస్ణుశర్మ.
శంకరునికి మూడు కన్నులు  కావున శివుని త్రినేత్రుడని సంభోధించెదరు.ఈ మూడు నేత్రములు సూర్యునికి,చంద్రునికి,అగ్ని కి ప్రతి రూపాలు.ప్రతి జీవి హృదయంలో ఆ పరమాత్ముడు కొలువై వుంటాడు. " హృదయం మే మహాదేవా!ఈశ్వరో వ్యాత్సమాంతరం "అన్నది రుద్ర కవచ వువాచ.సర్వ జీవులలో వున్న పరమాత్మకు త్రికరణ శుద్ధి గా నమస్కరించు వానికే ఈశత్వము సిద్దిస్తుంది..ఇక ప్రతి జీవి రూపురేఖలు,వర్ణ భేదములు,శరీర వర్ణ భేదములు,గొప్ప,పేద ,విద్యావంతుడు,పామరుడు..ఇలా ద్వంద్వాలను చూడటం అనవసరం.ఇవన్నీ పైపై కప్పబడి వున్న తెరలాంటివే.ఆ తెర ఎన్నో మచ్చలతో కూడిన పూత లాంటిది.అది శాశ్వతము కానేరదు.అశాశ్వతమైనది ఈ శరీరము అని గుర్తించగలిగిన వానికి ఆ ప్రతిపనిలోను ఆ పరమాత్ముడే దర్శనమిస్తాడు. చెప్పుకుంటూ పోతున్నారు.
శ్రద్ధగా వింటున్నారు అందరూ..
(సశేషం..)

No comments:

Post a Comment

Pages