రామో విగ్రహవాన్ ధర్మః - అచ్చంగా తెలుగు

రామో విగ్రహవాన్ ధర్మః

Share This

రామో విగ్రహవాన్ ధర్మః

బి.ఎన్.వి.పార్ధసారధి 


“రామో విగ్రహవాన్ ధర్మః” అంటాడు మారీచుడు రావణుడితో రాముడిని గురించి చెబుతూ. ధర్మం మూర్తీభవించిన స్వరూపం శ్రీ రామచంద్రుడు.
మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీః సమాః
యత్ క్రౌన్చ మిథునాదేకమవధీ కామ మోహితం
ఇది ఆది కావ్యమైన రామాయణం లో మొట్ట మొదటి శ్లోకం.  రతి కాలమందున్న జంట క్రౌంచ పక్షులలో మగ పక్షి ఒక బోయవాడి బాణానికి అంతమొందగా ఆగ్రహించిన వాల్మీకి మహర్షి ఆ బోయవాడిని త్వరలోనే మరణిస్తావని శపిస్తాడు. ఈ ఉదంతం మనకి రెండు ముఖ్య విషయాలని  తెలియచేస్తుంది. ఒకటి - పరుల స్వేచ్చ కి భంగం కలిగించరాదని. రెండు- అకారణంగా పరులకి హాని తలపెట్ట రాదనీ. మనిషి సంఘ జీవిగా కొన్ని నియమాలని పాటించాలని, అలా పాటించనివారు శిక్షార్హులని  సూచన ప్రాయంగా చెప్పకనే చెప్పాడు వాల్మీకి పై శ్లోకంలో. వ్యక్తి, దాంపత్యం, సమాజం, సామాజిక ప్రవర్తన అన్న అంశాలు పై శ్లోకంలో సున్నితంగా స్పృశించాడు వాల్మీకి.   నాన్రుషి కురుతే కావ్యం అన్నారు. వాల్మీకి మహా ఋషి. అందుకే వాల్మీకి రాసిన రామాయణం మహా కావ్యం, ఆది కావ్యం అయింది.
విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఘోర తపస్సు చేసి బ్రహ్మ చేత ఋషిగా, మహర్షి గా, అటుపిమ్మట బ్రహ్మర్షిగా గుర్తింప బడతాడు. బ్రహ్మ జ్ఞానం పొందిన విశ్వామిత్రుడి చేత చెప్పబడినదే గాయత్రి మంత్రం. తర్కించి చూస్తే విశ్వామిత్రుడు జన్మతః క్షత్రియుడు.కానీ జితేంద్రియుడై ఘోర తపస్సుతో బ్రహ్మర్షి అయి, బ్రహ్మ జ్ఞానంతో గాయత్రి మంత్ర సిద్ధి ని పొందుతాడు. సూక్ష్మంగా ఈ అంశాన్ని పరిశీలిస్తే మనకి బోధపడేది ఏమిటంటే – కేవలం జన్మతః మనిషికి బ్రాహ్మణత్వం లేదా బ్రహ్మ జ్ఞానం వంశ పారంపర్యంగా వారసత్వంగా లభించే హక్కు ఏమాత్రం కాదు. మనిషి ఏ వంశంలో జన్మించినప్పటికీ కేవలం సాధన చేత, ఇంద్రియ నిగ్రహం చేత మాత్రం బ్రహ్మ జ్ఞానం పొందుతాడని.
ద్వాపరయుగంలో భారతంలో జూదంలో ఓడిన పాండవులు పన్నెండేళ్ళు అరణ్య వాసం, ఏడాది అజ్ఞాత వాసం చేస్తారు. త్రేతా యుగంలో రామాయణంలో రాముడు సీతా లక్ష్మణ సమేతంగా పద్నాలుగేళ్ళు అరణ్య వాసానికి వెడతాడు. జ్ఞాతులైన కౌరవులు భారతంలో, కైక రామాయణంలో రాజ్యాన్ని కైవసం చేసుకోవటానికి ఈ షరతులు విధిస్తారు. ఈ నాటి మన న్యాయ శాస్త్ర రీత్యా స్థిర ఆస్తులపై ( భూమి, గృహం) తనఖా పెట్టినప్పుడు రుణదాతకి  తనఖా పత్రాలపై  చట్ట రీత్యా సంక్రమించే హక్కుకు గల కాల పరిమితి  పన్నెండేళ్ళు . దీనిని బట్టి మనకి ప్రాచీన కాలంలో మన భారత దేశంలో చెప్పుకోదగిన న్యాయ వ్యవస్థ, చట్టం వున్నట్టు తెలుస్తుంది.
దశరధుడు రాముడిని వనవాసానికి వెళ్ళమన్నప్పుడు రాముడి తల్లి కౌసల్య, తమ్ముడు లక్ష్మణుడు అయిష్టత వ్యక్త పరుస్తారు. అప్పుడు రాముడు వారితో “ ధర్మ, అర్ధ, కామము లనే మూడు పురుషార్ధాలలో కేవలం ధర్మ ఆచరణ వలన ధర్మ , అర్ధ, కామ ఫలాలు మూడు వరుసగా లభిస్తాయి. ధర్మ రహితముగా వచ్చే అర్ధ కామముల ఫలాలు నిష్ప్రయోజనం, నష్టదాయకం” అంటాడు. ధర్మో రక్షతి రక్షితః అన్న ఆర్యోక్తి ప్రాచీన కాలం నుంచి మన దేశం లో ఆచరించే వారని దీనిని బట్టి తెలుస్తోంది. పితృవాక్య పరిపాలనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాడో  రాముడు ధర్మాచరణకి కూడా అంతే ప్రాధాన్యతని సమపాళ్ళలో ఇచ్చేవాడని మనకి అవగతమౌతుంది.
సీతని తనతో పాటు వనవాసానికి రావద్దని రాముడు వారించినప్పుడు రాముడితో , “ తల్లి, తండ్రి, తోబుట్టువులు కేవలం వారి పాప పుణ్య ఫలాలను వారి వారి కర్మానుసారంగా అనుభవిస్తారు. కానీ ఒక్క భార్య మాత్రం తన కష్ట సుఖాలతో పాటు భర్త యొక్క కష్ట సుఖాలలో కూడా పాలు పంచుకొంటుంది” అంటూ సీత తానూ కూడా భర్త అయిన శ్రీ రామ చంద్రునితోపాటు వనవాసానికి వస్తానంటుంది. హైందవ సంప్రదాయంలో వైవాహిక బంధానికి వున్న విలువని,భార్యాభర్తల బాధ్యతని రామాయణం అద్భుతంగా వర్ణిస్తుంది.
రామాయణ మహాభారతాలు కేవలం కల్పిత గాధలా లేక ఇతిహాసాలా (చారిత్రిక గాధలు) అన్న మీమాంస ఇప్పటికీ  కొంతమందికి వుంది. భారతం దాదాపు ఐదు వేల ఏళ్ల క్రితం నాటి చరిత్ర అని ఇటీవలి కాలంలో సముద్ర గర్భం లో ద్వారక లో లభించిన  సాక్ష్యాధారాలు చెబుతున్నాయి. ఇక రామాయణం విషయానికి వస్తే , రామ జననం, రామ వనవాస ప్రారంభం, హనుమంతుడి లంకా పయనం, లంక పై వానరుల యుద్ధం చేసిన తొలిదినం, రావణ వధ వంటి ప్రధానాంశాలు జరిగిన సందర్భాలు వివరిస్తున్న సమయంలో వాల్మీకి ఆనాటి గ్రహ నక్షత్రాల స్థితి గతులని విపులంగా రామాయణంలో  వర్ణిస్తాడు. వాల్మీకి పేర్కొన్న గ్రహ నక్షత్రాల స్థితి గతులని సూక్ష్మంగా పరిశీలిస్తే రామ జననం నుంచి రావణ వధ వరకు జరిగిన ఘటనలు అన్నీ ఒకటి తరువాత ఒకటి వరుస క్రమంలో జరిగినవేనని మనకి తెలుస్తాయి. పూర్తిగా ప్రామాణికమయిన చారిత్రక ఆధారాలు ఇంకా లభ్యం కావలసి వున్నప్పటికీ, ఖగోళ శాస్త్ర రీత్యా పైన పేర్కొన్న గ్రహ నక్షత్రాల స్థితి గతులను పరిశీలిస్తే రామాయణ చరిత్ర కాలం కనీసం  పది వేల ఏళ్ల నాడు జరిగి వుండవచ్చని భావించవచ్చు. వాల్మీకి రామాయణంలో ప్రధానంగా అరణ్యవాసంలో ఋతువులని వర్ణిస్తూ ఆయా ఋతువులలో చెట్లు, పువ్వులు, ఫలాలు విపులంగా పేర్కొన్న అంశాన్ని ఆధారంగా ఇటీవల కాలంలో వృక్ష శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి దండకారణ్యంలో మొదట సీతాలక్ష్మణ సమేతుడైన రాముడు చరించిన ప్రదేశాలు, అటుపిమ్మట సీతా వియోగుడైన రాముడు లక్ష్మణుడితో కలిసి సంచరిస్తూ మార్గంలో కిష్కింద లో సుగ్రీవుడితో మైత్రి చేసి పిదప లంక పై దండయాత్ర చేయటం ఇవన్నీ వరుస క్రమంగా ఆయా ప్రదేశాలలో జరిగినవేనని నిర్ధారించారు. దండకారణ్యం లో ఇప్పటికీ ఆయా ప్రదేశాలలో రామాయణం లో  వాల్మీకి పేర్కొన్న చెట్లు, పువ్వులు, ఫలాలు వుండటం చెప్పుకోదగ్గ విషయమే కాక రామాయణం వాస్తవ గాధ అన్న అభిప్రాయానికి బలాన్ని చేకూరుస్తుంది. మన వేదాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు,అనాదిగా ప్రాచుర్యం లో వున్నవి. ఇవి ప్రాచీన కాలం లో  గ్రంధస్తం చెయ్యబడలేదు (అప్పటిలో ఆ అవకాశం కూడా లేదు). తర తరాలుగా గురు శిష్య పరంపరలో శ్రవణ, స్మరణ విధానంలో ప్రాచుర్యం పొంది ఈ నాటికీ ప్రమాణాలుగా నిలిచాయి. ఈ క్రమంలో చారిత్రిక ఆధారాలని పదిల పరచటం, గ్రంధస్తం చేసిన విషయాలపై మన హక్కులని ప్రకటించటం అన్న అంశాలమీద  మన పూర్వీకులు ఎన్నడూ దృష్టి పెట్టలేదు. సనాతన ధర్మం లోని అపార సంపద , సంస్కృతీ, లోకమంతటికీ చెందాలని మన ఋషులు ఎంతో ఉదాత్తంగా భావించారు.
ఇంకొక్క ముఖ్య విషయం ఏమిటి అంటే రామాయణ కాలం నాటికి వాల్మీకి, భారతం నాటికి వ్యాసుడు కేవలం జీవించి ఉండటం మాత్రమే కాక, ఆనాటి చరిత్రకు వారు సాక్ష్యులు, ఐతిహ్యంలో వారు రచయితలతో పాటు పాత్రధారులు కూడా.
అరణ్య వాసానికి బయలుదేరి చిత్రకూట పర్వతం మీద ఆశ్రమం లో నివసిస్తున్న రాముడిని దర్శించిన భరతుడు , రాముడిని అయోధ్యకు మరలివచ్చి రాజ్యాన్ని పాలించవలసిందిగా ప్రార్ధిస్తాడు. ఆ సమయంలో జరిగిన చర్చలో పాల్గొంటూ జాబాలి అనే బ్రాహ్మణుడు రాముడితో ఇహపరాలని గూర్చి చెబుతూ, ఇహం వాస్తవం, సత్యం కానీ పరం మిధ్య అని వాదిస్తూ , రాజ్యభోగాన్ని అనుభవించవలసిందని రాముడికి చెబుతాడు. అప్పుడు రాముడు ప్రత్యుత్తరం ఇస్తూ ఇలా అంటాడు , “ ఓ జాబాలీ, నీవు నా హితం కోరి చెప్పినా నీ మాటలు ధర్మ సమ్మతం కావు. సత్యమే పరమ ధర్మము. రాజ ధర్మం ప్రాచీనమైనదీ, శాశ్వతమైనదీ. రాజ ధర్మం కూడా సత్య స్వరూపమైనది. రాజు యొక్క ప్రవర్తనని బట్టి రాజ్యం లోని ప్రజల ప్రవర్తన ఆధారపడి వుంటుంది. రాజు సత్య ప్రవర్తనుడు కానప్పుడు ,రాజ్యం లో ధర్మం గతి తప్పుతుంది. ఈ దేశం కర్మ భూమి. ఈ భూమి మీద జన్మించిన వ్యక్తి శుభమైన కర్మలు ఆచరించాలి.” ధర్మాచారణలో మనిషికి ముఖ్యంగా ప్రభువుకి ఎంతమాత్రం స్వార్ధ ప్రయోజనాలకి తావు లేదని శ్రీ రాముడి ద్వారా వాల్మీకి మనకి తెలియబరుస్తాడు.
రావణుడు ఒక్క సీతా దేవిని తప్ప మరెవ్వరినీ బలాత్కారంగా తీసుకురాలేదు. సీతా దేవిని బలాత్కారంగా తీసుకుని వచ్చినప్పటికీ కొంత కాలానికి ఆమె తన మనసు మార్చుకుంటుందని రావణుడు ఎదురు చూసాడు. ( పరస్త్రీలను వారి సమ్మతి లేకుండా వాంచిస్తే మరణం సంభవిస్తుందని రావణుడికి బ్రహ్మ దేవుడి శాపం వుంది.) కానీ సీతా దేవి మహా పతివ్రత. రావణుడిని సీతమ్మ గడ్డిపరకతో సమానంగా చూసింది. సీతమ్మ తనని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడితో, “ నేను రాముడిని తప్ప పర పురుషుడి శరీరాన్ని తాకను. అనాధగా నిస్సహాయ స్థితిలో వున్న నన్ను రావణుడు బలాత్కారంగా అపహరించుకొని లంకకు తీసుకుని వచ్చినప్పుడు ఆ రావణుడి శరీర స్పర్శ నాకు కలిగింది. “ అంటుంది. వివాహ బంధం లోని పవిత్రతని ఔన్నత్యంతో రామాయణంలో వాల్మీకి చెబుతాడు.
   సీతాదేవి సందర్శనానంతరం హనుమ వానరులతో కిష్కిందకు మరలివచ్చి “ ప్రభూ! సీతమ్మ తల్లి పాతివ్రత్య నియమాలను కాపాడుకుంటూ, ఆరోగ్యంగా వుంది.” అంటాడు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న శ్రీ రామచంద్రుడితో. కేవలం సీతమ్మ సజీవంగా వుండటమే మాత్రమే కాక తన శీలానికి, దేహానికీ రావణుడి నుంచి ఎటువంటే హాని జరుగకుండా పదిలంగా వున్నదన్న విషయాన్ని క్లుప్తంగా మూడు వాక్యాలలో కుదించి చెబుతాడు హనుమ. అల్పాక్షరాలలో అనల్పమైన విషయాన్ని వాల్మీకి హనుమంతుడి ముఖతః మనకి అత్యద్భుతంగా చెబుతాడు రామాయణంలో.
     లంకా దహనానికి ముందు బంధింపబడి రావణుడి కొలువులో ప్రవేశించినప్పుడు రావణుడి వర్చస్సు ని, తేజాన్ని చూసి హనుమంతుడు , “ ఇతడు సర్వ లక్షణ సంపన్నుడు. కానీ ఇతను అధర్మం గా ప్రవర్తిస్తున్నాడు. ధార్మికంగా ప్రవర్తిస్తే రావణుడు ఇంద్రలోకానికి కూడా ప్రభువు అయ్యే వాడు. ముల్లోకాలని అల్లకల్లోలం చేయగలిగిన సమర్ధుడు ఈ రావణుడు. ధర్మపరుడై వుంటే రావణుడు ముల్లోకాలకి ప్రభువై వుండేవాడు.” అని తలపోస్తాడు. ఎంతటి పరాక్రమ వంతుడైనప్పటికీ అధర్మాన్ని పాటిస్తే పతనానికి గురి అవుతాడని సూచన ప్రాయంగా హనుమంతుడి ద్వారా చెబుతాడు వాల్మీకి రామాయణంలో.
వానరులు కామరూపులు. ఈ విషయాన్ని గ్రహించిన రాముడు దూర దృష్టితో రావణుడి పై యుద్ధం ప్రారంభించే ముందు వానరులని ఉద్దేశించి కేవలం తాను, లక్ష్మణ విభీషణులు,అంగదుడు, హనుమ, సుగ్రీవుడు, నీలుడు మాత్రం మానవ రూపంలో వుంటామని, మిగతా వానరులు అందరూ యుద్ధం ముగిసేవరకు మనుష్య రూపం దాల్చరాదని ఆజ్ఞాపిస్తాడు. యుద్ధ సమయంలో వానరులు తమ నాయకులైన రామ లక్ష్మణ, సుగ్రీవాదులని సులభంగా గుర్తు పట్టటానికి ఈ ఆజ్జ్ఞ విధిస్తాడు రాముడు. రాముడి దూర దృష్టికి, సమయస్పూర్తికి ఇది ఒక మచ్చుతునక.
వానర సేన మీదికి రామ రావణ సంగ్రామంలో యుద్ధానికి వెళ్లేముందు కుంభ కర్ణుడు అన్న రావణుడితో,                 “ రాజన్నవాడు  ప్రాతః కాలాన ధర్మాన్ని, మధ్యాహ్న సమయంలో అర్ధాన్ని, సాయం సమయాన కామాన్ని  పాటించాలి. లేదా ఉదయాన్న ధర్మార్ధాలని, మధ్యాహ్నం అర్ధధర్మాలని, సాయంకాలం ధర్మ కామాలని పాటించ వచ్చు. సాయం సమయంలో ధర్మార్ధ కామాలని మూడింటిని పాటించవచ్చు. కానీ త్రికాలాలలో కామాన్ని కాంక్షించ రాదు. ధర్మార్ధకామాలని కాలానుసారంగా పాటిస్తూ, సందర్భోచితంగా మంత్రులతో మంతనాలు సాగిస్తూ, సామ దాన భేద దండాలనే చతుర్విధ ఉపాయాలని సమయోచితంగా ఆచరించాలి. లేదా ఆ రాజు దుఃఖాల పాలవుతాడు.” అని సున్నితంగా మందలిస్తాడు. విపరీతమైన కామ వాంఛతో వివేకాన్ని కోల్పోయి సమయాన్ని సందర్భాన్ని మరచి ప్రవర్తించడం వలన మహా పరాక్రమ వంతుడైన రావణ బ్రహ్మ ఎలా దుస్థితి పాలయ్యాడో సోదరుడు కుంభ కర్ణుడి ద్వారా  పై విధం గా వాల్మీకి మనకి తెలియ పరుస్తాడు. నియమ బద్ధమైన జీవితం వ్యక్తికీ సంఘానికీ ఎంతో అవసరం అన్న విషయం వాల్మీకి కుంభ కర్ణుడి మాటల ద్వారా రామాయణంలో మనకి బోధ పరుస్తాడు.
యుద్ధం లో మరణించిన రావణుడికి దహన సంస్కారాలు చెయ్యడానికి అతని తమ్ముడు విభీషణుడు తిరస్కరించినప్పుడు అతనితో రాముడు,” రావణుడు అధర్మంగా ప్రవర్తించి ఉండవచ్చు. కానీ అతను మహా బలశాలి, తపస్సంపన్నుడు, పండితుడు. ధర్మానుసారంగా అతనికి సోదరుడైన నువ్వు దహన సంస్కారాలు చెయ్యాలి. అలా చెయ్యడం వలన నీకు మంచి కీర్తి వస్తుంది.” అని నచ్చ చెబుతాడు.ఇతర వ్యక్తులు వారి నడవడిక ఎలా వున్నప్పటికీ వాటితో ప్రమేయం లేకుండా  ధర్మాచరణ లో ఎవరి విధులని వారు ఆచరించటం ప్రధానం అన్న అంశాన్ని వాల్మీకి పై సన్నివేశం లో విశదీకరిస్తాడు.
వాల్మీకి రామాయణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలలో రచించాడని అంటారు.
సదా ధర్మాన్ని ఆచరిస్తూ పరిపూర్ణుడై మానవుడు పురుషోత్తముడిగా ఆదర్శ పురుషుడిగా ఎలా ఎదగాలో రాముడి ద్వారా వాల్మీకి లోకానికి తెలియచెబుతాడు. రామాయణం మనిషి ఈ భూమండలం మీద జీవించి ఉన్నంత కాలం ఆదర్శ గ్రంధంగా నిలిచింది, నిలిచి పోతుంది. అందుకే రామాయణం ఆది కావ్యం, అనాది కావ్యం, అనంతమైన కావ్యం.
లోకః సమస్తః సుఖినోభవంతు.
B.N.V.Parthasarathi.

No comments:

Post a Comment

Pages