గాయత్రీ మంత్రార్థ వివరణము – జ్ఞానబోధ మీమాంసా దృష్టి - అచ్చంగా తెలుగు

గాయత్రీ మంత్రార్థ వివరణము – జ్ఞానబోధ మీమాంసా దృష్టి

Share This

గాయత్రీ మంత్రార్థ వివరణము – జ్ఞానబోధ మీమాంసా దృష్టి

 వారణాసి రామబ్రహ్మం


గాయత్రీ మంత్రార్థవివరణము – జ్ఞానబోధ మీమాంసా దృక్పథము
సాంప్రదాయజ్ఞులు సంధ్యావందనం చేస్తున్నప్పుడు అనుష్ఠించే గాయత్రీ మంత్రములో, లౌకిక, ఆధ్యాత్మిక జ్ఞానములను మనం నేరుస్తున్నప్పుడు పనిచేసే మానసిక దశలు, మనసు స్థితి, గతుల గురించి, మానసిక కార్యకలాపములు నిర్వహింపబడే విధము గురించీ సమాచారము, వివరణ ఉన్నాయి. మనందరకు పరిచయమైన, తెలిసిన విషయముల గురించి జ్ఞానబోధ మీమాంసా (Cognitive Science) దృక్పథముతో ఈ వ్యాఖ్యానము వ్రాయబడినది. ఇప్పటికే గాయత్రీ మంత్రార్థం మరొక విధముగా అవగాహన ఉన్నవారికి ఈ వివరణము తేడాగా అనిపించవచ్చు. ఏకమ్ సత్ విప్రా: బహుధా వదంతి – కదా!
గాయత్రీ మంత్రార్థ వివరణము – జ్ఞానబోధ మీమాంసా దృష్టి
వెలుగు ఆధ్యాత్మిక పరిభాషలో జ్ఞానానికి చిహ్నము. తమము లేక చీకటి అజ్ఞానానికి, జ్ఞానాభావానికి (జ్ఞానము లేకపోవడానికి) చిహ్నము.
బ్రహ్మ జ్ఞానముతో పాటు, గాయత్రీ మంత్రము ఈ విషయమై చెబుతుంది.
మనకు రెండు విధములుగా గాయత్రీ మంత్రము లభిసతోంది. అవి:
ఓం భూ: - ఓం భువ: - ఓం సువ: - ఓం మహ: - ఓం జన: - ఓం తప: - ఓగ్ మ్  సత్యం – ఓం తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న: ప్రచోదయాత్ – ఓం ఆపో జోతీ రసోమృతం బ్రహ్మ భూ: భువ: సువ: ఓం - భూర్భువస్సువరోం!
ఇందులో ఏడు లోకముల గురించి ప్రస్తావించారు. అవి: భూ: భువ: సువ: మహ: జన: తప: సత్యమ్.
ఓం భూ: ఓం భువ: ఓం సువ: ఓం తత్ సనితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న: ప్రచోదయాత్!
దీని అర్థము:
ఏ వెలుగైతే జాగ్రత్ (భూ:), స్వప్న (భువ:) సువ: (సుషుప్తి) లనుకలిగిస్తుందో ఆ వెలుగు మా బుద్ధిని ప్రేరేపించుగాక!    అని.
(ఇక్కడ ప్రస్తావించిన వెలుగు చిత్. సత్- చిత్-ఆనందములలోని చిత్. చిత్ మనకు లౌకిక, ఆధ్యాత్మిక జ్ఞానములను కలిగించే ఆత్మ శక్తి. సత్ గా ఆత్మ మనకు జీవ (మనం ఫలానా నేను అనే) స్పృహ, కాల, దేశము (చోటు)ల స్పృహ కలిగిస్తుంది. ఆనందముగా అన్ని అనుభవములు, అర్థ స్పృహలు, స్ఫురణలు కలిగిస్తుంది. చిత్ శక్తి మేధలో ప్రతిఫలించి చిదాభాస ( మాయ అన్నా, ప్రణవము అన్నా, స్ఫోట అన్నా ఇదే). మన మానసిక కార్యకలాపములన్నీ ఈ చిదాభాసా – మాయా పరిణామములే. ఈ మాయా (మానసిక శక్తి) పరిణామములు మనలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి, జాగ్రత్ సుషుప్తి మానసిక దశలను కలిగిస్తుంది. ఈమాయయే దివ్య (జ్ఞాన),స్వర శక్తులుగా మారి వేరు వేరుగా పురోధాన దిశలో పరిణమించి, అంత:కరణములుగా మారి, వాసనలను ప్రేరేపించి, భావముల కలిగించి జ్ఞాన కర్మేంద్రియముల జాగరూక పరచి వక్తలో మానసిక కార్యకలాపములు జరిపించి; శ్రోతలో తిరోధాన దిశలో పరిణమించి జ్ఞానేంద్రియముల ద్వారా మనసు మాధ్యమమున మష్తిష్కములో విషయ ప్రపంచం సృష్టించి, విషయములు అదే సమయంలో కలిగించే అనుభవములను వాసనలు (జ్ఞాపకములు, జ్ఞప్తిగా) ఏర్పరచి, తాత్పర్యమై తత్పరత కలిగించి మానసిర కార్యకలాపములను జరిపిస్తుంది.
మాయామయమ్ ఇదమ్ జగత్ కదా! జగత్ అంటే భావనా ప్రపంచము. ఇదమ్ అంటే మానసిక కార్యకలాపముల నిర్వహణా రూపము.)
ఇలా గాయత్రీ మంత్రము లోకములను గురించి ప్రస్తావిస్తుంది. బ్రహ్మజ్ఞానము మానసిక దశల గురించి మాట్లాడుతుంది. పరిభాష వేరుగాని,రెండూ ఒక విషయము గురించే చర్చిస్తాయి. ఆ విషయము ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము, బ్రహ్మ జ్ఞానము ఒకే జ్ఞానానికి రెండు పేర్లు. ఆత్మ,బ్రహ్మము ఒకటే - అయమ్ ఆత్మా బ్రహ్మా కదా!
లోక్యతే ఇతి లోక: - అని లోకము పదమునకు నిర్వచనము - చూడబడేది లోకము అని దీని అర్థము.
కేన? – ఈ సంస్కృత పదానికి రెండు అర్థములు- అవి – దేని చేత? ఎవరి చేత?
“కేన” పదము – క: - ఎవరు? – పుంలింగ శబ్దానికి, కిమ్ – ఏమిటి? – అనే నపుంసక లింగ శబ్దానికి తృతీయా విభక్తి ఏక వచన రూపము. రెండూ “కేన” – పదముతోనే సూచించబడతాయి.ఇలా “కేన” పదానికి అర్థాన్ని అన్వయించడంలో – అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత – దృష్టులతో వ్యాఖ్యానములు, భాష్యములు, మతములు, అభిప్రాయ భేదములు ఏర్పడ్డాయి.
ఈ నా వివరణ అద్వైత పరంగా సాగుతుంది.
అలా, లోక్యతే ఇతి లోక: - లో దేనిచేత? అని ప్రశ్నించుకున్నప్పుడు – ఆత్మ చేత అని సమాధానం చెబితే అది సత్యలోకము అవుతుంది. ఆత్మ దశ. మనసు, ఇతర అంత:కరణములైన బుద్ధి, అహంకారము, చిత్తము ఆత్మ కన్న విడిగా ఉండవు. అందువల్ల వాసనల రూపంలోని అనుభవములు,అర్థస్పృహలు, కలగక విరమింపబడి ఉంటాయి. ఆంతర మానసిక ప్రపంచము, బహిర్ విషయ ప్రపంచము దృష్టిలోనుండవు. ఈ దశలోని దృష్టిని విశ్రాంత దృష్టి అంటారు.
ఆత్మను అహమ్ (అహమ్ బ్రహ్మాస్మి కదా), అద: అని కూడా అంటారు. ఆంతర మానసిక ప్రపంచాన్ని, బహిర్ విషయ ప్రపంచాన్ని కలిపి ఇదమ్ అంటారు. ఇది అంత:కరణముల ద్వారా చూడబడుతుంది. అహమ్ దృష్టిగా ఉండి, ఇదమ్ కనిపించకపోతే అది అద్వైత స్థితి. చూపు ఒక్కటే ఉంటుంది. చూడబడేది ఉండదు. దీనిని పైన చెప్పినట్టు,
గాయత్రీ మంత్రము సత్యలోకము అంటుంది. ఒక విషయము ఇక్కడ గమనించాలి. ఆత్మజ్ఞానము / బ్రహ్మజ్ఞానము, గాయత్రీ మంత్రము, మంత్రపుష్పము – ఇవన్నీ – మనసు, ఇతర అంత:కరణములు పనిచేసే స్థితిని (ద్వైత స్థితి), అవి విరమింపబడి ఉన్న స్థితిని – నిర్మల మానసిక స్థితిని (అద్వైత స్థితిని) వర్ణించాయి. మానసిక కార్యకలాపములు జిరిగే స్థితులు, అవి విరమింపబడి ఉండే స్థితి గురించి కూలంకషంగా, లోతుగా పరిశీలించి, ఆ అవగాహనను మనకు పంచిపెట్టాయి.
బ్రహ్మజ్ఞాన మూలములైన ఉపనిషత్తులు నాలుగు మానసిక దశలను గుర్తించి, వాటిని వివరించాయి. విశదపరిచాయి. ఆ మానసిక దశలలో రెండు అద్వైత స్థితులు – అవి జాగ్రత్ సుషుప్తి (మెళకువతో కూడిన నిద్ర), సుషుప్తి (గాఢనిద్ర). సుషుప్తి అంటే మానసిక కార్యకలాపములు విరమింపబడిన, అంత:కరణములు పనిచేయక విశ్రాంతి తీసికొనుచున్న సమయము. ఆంతర మానసిక ప్రపంచము, బహిర్ విషయ ప్రపంచము విడిగా తోచని స్థితి. అహమ్-అహమ్ గా దృష్టి ఉంటుంది. ఆత్మ గమనికగా, చూపుగా, దృష్టిగా ఉండి ఏ ఇతరమును – విషయ, విషయానుభవములను – గ్రహింపక, గమనికలో లేని నిర్మల మానసిక స్థితి. జాగ్రత్ సుషుప్తిలో గమనిక ఉంటుంది, మానసిక కార్యకలాపములు నిర్వహింపబడుతున్నా, విరమింపబడి ఉన్నా లెక్కచేయని స్థితి. సరకు చేయని స్థితి. వట్టి గమనికగా ఉండే స్థితి. ఇది సత్యలోకము. ఈ స్థితిలో చూసేది, చూడబడేది ఒకటే అయి ఉంటుంది.
యత్ర (యదా) నాన్యత్ పశ్యతి, నాన్యత్ శృణోతి సా భూమా – అని ఒక ఉపనిషత్ విద్య (ధ్యాన పద్ధతి) ఈ స్థితిని అభివర్ణిస్తుంది.
సుషుప్తి అద్వైత స్థితియే అయినా ఇది సత్యలోకముకాదు. దీనిని గాయత్రీ మంత్రము – సువ: లోకము – సువర్లోకము - అంటుంది. ఇప్పుడు చూసేవాడు / చూసేది, చూడబడేది ఉండదు. చూపు ఉంటుంది – ప్రజ్ఞ – తెలియడం ఉండదు.
భూ: లోకము జాగ్రత్ (మెళకువ) మానసిక దశను సూచిస్తుంది. ఈ దశలో మనసు బహిర్ ముఖమై బహిర్ జగత్తులోని విషయములను జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించి, గ్రహణగా ఆంతర మానసిక ప్రపంచంగా ముద్రలు వేస్తుంది. మెళకువ స్థితిని బహిర్ముఖ దృష్టి అనీ అంటారు.
ఈ ఆంతర ప్రపంచం నుంచి మనసు విషయగ్రహణ చేస్తే దానిని జగత్ (భావము) అంటారు.
భువ: లోకము స్వప్న (కల) మానసిక దశ. ఆంతర ప్రపంచం నుంచి మనసు విషయగ్రహణ చేసేది  జగత్ (భావములు)  ఏర్పడేది ఈ దశలోనే. కల, మెళకువ, మెళకువతో కూడిన నిద్ర ఒకే సారి, ఒకదాని తరవాత ఒకటి కలిగి ఆ సమయంలో అన్ని గ్రహణలు, సమాధానములు, బదులు చెప్పడాలు మానసిక కార్యకలాపముల రూపంలో జరుగుతాయి. మనము లౌకిక, ఆధ్యాత్మిక జ్ఞానముల అధ్యయన, అధ్యాపనములను నిర్వహించే విధము ఇది.
భూ:, భువ:, సువ:, మహ: (బుద్ధి పనిచేయు సమయము), జన: (అహంకార, అహంభావ, మమకారములు, తజ్జనిత అనుభవములు – జీవుని స్థితి), తప: (ధ్యాన స్థితి – ఇప్పుడు చూడబడే విషయము ఒక్కటే అయి ఉంటుంది – ఏక వస్తు చింతనమేవ ధ్యానమ్ కదా) లోకములు అంత:కరణములచే చూడబడతాయి. ఇవన్నీ ద్వైత స్థితి లోనివి.
సత్య లోకము ఆత్మచే చూడబడుతుంది. ఈ సమయంలో ఆత్మ తనని తాను చూస్తూంటుంది. చూపు, చూడబడే వస్తువు ఒకటే అయిపోతుంది. బ్రహ్మ స్థితి, ఆత్మ స్థితి. మౌన, శాంత, ఆనంద స్థితులన్నా ఇదే.
మోక్షమంటే సదాఈ స్థితిలో నిలిచి ఉండడం.
గాయత్రీ మంత్రములో ప్రస్తావించిన సప్త లోకములు ఇవి. భూర్భువస్సువ, మహ:, జన: తపో లోకములు మానసిక కార్యకలాపములు జరిగే సమయము. సత్యలోకము అన్నిమానసిక కార్యకలాపములు విరమింపబడిన నిర్మల మానసిక సమయము. శుద్ధాహమ్ స్థితి. ప్రజ్ఞాన స్థితి.
సమస్త సన్మంగళాని భవంతు! శ్రీర్భూయాత్! ఏతత్ సర్వమ్ పరమేశ్వరార్పణమస్తు!

No comments:

Post a Comment

Pages