బయ దెల్లరా బిడ్డా(గేయం) - అచ్చంగా తెలుగు

బయ దెల్లరా బిడ్డా(గేయం)

Share This

బయ దెల్లరా  బిడ్డా(గేయం)

మోపిదేవి భాస్కరరావు


పల్లవి:
బయ దెల్లరా  బిడ్డా  బయ దెల్లరా
బడిగంట  మోగింది  బయ దెల్లరా
ఈ బర్రె  ఈ  గొర్రె  నీకొద్దురా
మాలాగా  నీ బతుకు  మారొద్దురా  !బయ !
చరణం : 1
బళ్ళోని పంతుళ్ళు ఇల్లిల్లు తిరిగారు
సర్కారు పథకాలు చక్కంగ చెప్పారు
కూలోడి కడుపున కూలోడే పుట్టాలా ?
పాలేరు బిడ్డడు  పాలేరే కావాలా ?
ఆటందుకో బిడ్డా  పాటం దు కో--
పాటం దుకొని నీవు బాటందుకో -
బడిబాటందుకో -                          !బయ !
చరణం : 2
చదువుకొనే పుస్తకాలు
ఉచితంగా ఇస్తారు
రెండు జతల బట్టలు
కుట్టించి పెడతారు
మా కన్నా మిన్నగా
మంచి చెడులు చెబుతారు
తమకన్నా గొప్పగా
తీర్చిదిద్దుకుంటారు
పలకందుకో బిడ్డా పలకందుకో
పలకన్దుకొని నీవు పలుకందుకో
మంచి పలుకందుకో --               !బయ !
చరణం :3
సోమవారం గురువారం
సాంబారు గుడ్డుతో
మంగళ శుక్రవారాలు
కూరగాయల కూరతో
బుధవారం శనివారం
ఆకుకూర పప్పుతో
ఎచ్చెచ్చని బువ్వ నీకు
మధ్యాహ్నం పెడతారు
కలమందుకో బిడ్డా కలమందుకో
కలమన్దుకొని  నీవు  కళ  అందుకో
కొత్త  కళ అందుకో                   !బయ !
చరణం : 4
కష్టాలను తీర్చేది
కన్నీళ్లను తుడిచేది
చదువొక్కటే  బిడ్డా  చదువొక్కటే
తలయెత్తుకు బ్రతికేలా
తలరాతలు  మార్చేది
చదువొక్కటే  బిడ్డా  చదువొక్కటే
గుర్తింపు తెచ్చేది
గౌరవాన్ని  పెంచేది
చదువొక్కటే బిడ్డా  చదువొక్కటే
అందుకే --
చదువందుకో  బిడ్డా  చదువందుకో
చదువన్దుకొనినీవు తెరువందుకో
బ్రతుకు తెరువందుకో            ! బయ !
*********   ********

No comments:

Post a Comment

Pages