మాణిక్యమ్మ గారి మనవరాలు – 2 - అచ్చంగా తెలుగు

మాణిక్యమ్మ గారి మనవరాలు – 2

Share This

మా బాపట్ల కధలు – 3

మాణిక్యమ్మ గారి మనవరాలు – 2

భావరాజు పద్మిని


వేసంకాలం వచ్చిందంటే ఎంత సందడో ! వచ్చేపోయే చుట్టాలు, పెళ్ళిళ్ళు, చిన్న చిన్న ప్రయాణాలు, యాత్రలు, మా భావన్నారాయణుడి తిరునాళ్ళు. తిరునాళ్ళలో కొనుక్కున్న కాగితంబూరలు ఊది, ఊది, అందరినీ ఊదరగొట్టేవాళ్ళం. లక్కపిడతలలో అటుకులు, పప్పులూ వేసి, అన్నం వండుతున్నట్లు ఆటలు ఆడేవాళ్ళం.  మేమంతా ‘చేప మేడ’ మీద పిల్ల వంటలు వండుతుంటే, బామ్మ కోడళ్ళంతా వంటింట్లో చేరి ఒకటే జోకులు, సందడి. బామ్మకు ఐదుగురు కొడుకులు. ఈ అమ్మలు పిల్లలకి అర్ధంకాని భాషలో ఏం మాట్లాడుకుంటున్నారో తెలీక మాకు కడుపునొప్పి, బెల్లం చుట్టూ ఈగల్లా, వంటింటి చుట్టుపక్కల తిరుగుతుంటే, కోప్పడి పంపేసేవారు. పొద్దుటి నుంచి, ఎవరో ఒకరు వస్తూ, పోతూనే ఉండేవారు. అంతా వెళ్ళారని, ఇక వీళ్ళు ఏ మధ్యాహ్నం మూడింటికో భోజనాలకి కూర్చోగానే, ఎవరోఒకరు మళ్ళీ అన్నార్తులై వచ్చేవారు. మళ్ళీ కోడళ్ళు వంటకు దిగేవారు.
“ఏమే, పొద్దుట లేస్తే, వంటింట్లో పడి వండడం అలావాటైపోయి, రేప్పొద్దున్న మనం చచ్చి దయ్యాలు అయ్యాకా కూడా, అలవాట్లో పొరపాటుగా ఇక్కడికి వచ్చి, వండేస్తామేమో !” అని పెద్దమ్మ వేసిన జోకుకి ఓసారి అంతా పగలబడి నవ్వటం గుర్తు. అల్లరి కెరటంలా ఉండేది పెద్దమ్మ, ఆవిడ చుట్టూ ఎవరు కూర్చున్నా, నవ్వలేక, పొట్టలుపట్టుకోవాల్సిందే ! మొత్తానికి కష్టానిపై నవ్వుల కళ్ళాపి చల్లి చల్లార్చి, ఆడుతూ పాడుతూ కోడళ్ళంతా ఎలాగైనా పని పూర్తిచేసేవాళ్ళు.
వంటలు, బొబ్బట్లు, పిండి వంటలు, అప్పడాలు, వడియాలు, ఊరుమిరపకాయలు పెట్టడాలు ఒకెత్తు. అయితే, మరోప్రక్క  ఊరగాయలు పెట్టడాలు పెద్ద ప్రహసనం. మా గుంటూరు జిల్లా వాళ్లకి, ఆవకాయలు, మాగాయల కంటే, ముఖ్యమైనవి, ఉప్పు గోంగూర, పులిహోర గోంగూర, మిరప్పళ్ళు గోంగూర, కొరివికారం(పండు మిరపకాయ పచ్చడి), చింతకాయ, ఉసిరికాయ వంటివి. మణుగులు మణుగుల గోంగూర కొనేది బామ్మ. వాటి కాడలు తియ్యడం, మిరప్పళ్ళకి తొడిమలు తియ్యడం, మేడ కింద పెద్దరోట్లో, పసుపూ, ఆ పసుపుని కుంకుమ గా మార్చే సున్నపురాయిని వేసి నూరుతుంటే, కలపడం, పచ్చళ్ళకి కారాలు కొట్టిస్తుంటే, ప్రపంచంలో ఉన్న పనులన్నీ మేమే చేస్తున్నట్టు, జల్లెళ్ళు పట్టుకు పైకి కిందికి హడావిడి చేస్తూ తిరగడం మధుర జ్ఞాపకాలు. పొలాల నుంచి వచ్చే మినుముల్ని, ఆవాల్ని పీటల మీద గాలించేవారు. అది చూసేందుకు భలే సరదాగా ఉండేది. మట్టి బెడ్డలు పీట మధ్యలోనే ఆగిపోతే, గుండుగా ఉండే ఆవాలు, మినుములు దొర్లుకుంటూ జారేవి. ఆ తర్వాత మినుములు వేయించి, తిరగలిలో తిప్పి, జల్లించి చేసే సున్నుండల రుచి, ఇప్పుడు రాదు మరి.
బామ్మకి అన్నీ ఆస్థానాలే. ఆస్థాన కూరలమ్మి, పొద్దున్నే గంపలో తాజా కూరలతో వచ్చేది. అన్నింటికంటే మా బాపట్ల వాసులకి ప్రియమైనవి ఇంకేముంటాయ్? అచ్చంగా విశ్వవిఖ్యాతమైనవి, నూనెలో వెయ్యగానే వెన్నలా మగ్గిపోయేవి, మా బాపట్ల వంకాయిలే. ఆ తర్వాత ఆస్థాన మల్లెపూల వెంకమ్మ ఉండేది. ఒక్కో మల్లెమొగ్గ రెండంగుళాలు ఉండేది. ఒక్కోసారి బుట్టెడు పూలు కొనేసి, తాను ముద్దుగా ‘అష్టలక్ష్ములు’ అని పిల్చుకునే, మనవరాళ్ళు అందరికీ పూలజళ్ళ కార్యక్రమం పెట్టేది బామ్మ. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి, మా బామ్మ జడేస్తే, ఆ చేతిలో పట్టుకి, మా కళ్ళు చెంపకు చారెడు సాగి, పెద్దవయ్యేవి. మూడు రోజులు జడ చెక్కు చెదిరితే ఒట్టు !
అప్పట్లో నాకు కొన్నాళ్ళు బాబ్డిహైర్ ఉండేది. అయినా పూలజడ కోసం గొడవ పెట్టేదాన్ని, ఎలాగో సవరం అతికి, జడ కుట్టేస్టే, అందరికీ చూపించే సందట్లో మెట్లమీంచి ఒక ఉరుకు ఉరగ్గానే, జడ కాస్తా ఊడి కింద పడిపోయేది. అంతే, భవంతి ఎగిరిపోయేలా అందుకునే ఆరున్నొక్క రాగాన్ని తట్టుకోలేక, మళ్ళీ జడ అతికించేవారు. ఆ రోజుల్లో ఫెవికాల్ ఉంటే, దాని ‘మజ్బూత్ జోడీ’ తో అమ్మ పని సులువు అయ్యేదేమో మరి ! ఆ తర్వాత పూలజళ్ళతో  స్టూడియోలకు వెళ్లి ఫోటోలు దిగే ప్రహసనం. అదేంటో గాని, చచ్చినా నవ్వేదాన్ని కాదు నేను. అదీ కెమెరా ముందైతే బిర్రబిగుసుకు పోయేదాన్ని. మా బాబాయి అస్తమానూ, ‘పావలా ఇస్తాను నవ్వవే, అర్ధరూపాయ్ ఇస్తాను నవ్వవే’ అని బ్రతిమాలి, చివరికి ఘోరంగా విఫలమై, గేరు మార్చి, ‘పావలా ఇస్తాను ఏడవ్వే, అర్ధరూపాయ్ ఇస్తాను ఏడవ్వే’ అనేవాడు. వెంటనే ఠంచనుగా ఏడ్చేసేదాన్ని.
రాత్రిళ్ళు మల్లె దండలు, జాజి దండలు, కనకాంబరాలు, మరువం వేసి కట్టిన మాలలు, నిద్దట్లో నలిగిపోతాయని, బట్టలారేసుకునే దండేలమీద వేసి, తెల్లారి లేచి తయారవగానే, మళ్ళీ తీసి, పెట్టుకునేవాళ్ళం. ఇక పండుగలు వస్తే, మా బామ్మ ఓ బట్టల కొట్టుకు వెళ్లి, ఓ తాను కొనుక్కు వచ్చేది. వెంటనే పక్క వీధిలో ‘పిల్లి గడ్డం సాయిబు’ కి కబురు వెళ్ళేది. చెవిలో పెన్సిలు పెట్టుకుని, అతను కొలతలు తీస్తుంటే, ఆ పిల్లిగడ్డం లాగాలన్న కోరికను, బలవంతంగా ఆపుకునేవాళ్ళం. ఇంట్లో మిషను ఉన్నన్నాళ్ళు, కూర్చోపెట్టి, ఇంట్లోనే మాకు బట్టలు కుట్టించేది. ఆ తర్వాత అతను, పట్టుకెళ్ళి, కుట్టుకువచ్చేవాడు. ఇక పండగ ముందే, అందరికీ బ్యాండ్ మేళం డ్రెస్ లు సిద్దమయిపోయేవి. ఏ మనవరాలైనా తప్పైపోయినా దిగుల్లేదు, డ్రెస్ చూసి, పట్టుకొచ్చి, ఇంట్లో అప్పజెప్తారు, అని నవ్వుకునేవాళ్ళం.
పాలు అమ్మేవాళ్ళు ఆస్థానమే ! నిజానికి మొదట్లో బామ్మ పెరట్లోనే, ఆవులు, గేదల్ని పెంచేది. మిగిలిన అన్నాలు, తవుడుతో  వాటికి కుడితి కలిపి పెట్టేవారు. ఆ తర్వాత వాటిని సాకలేక, పాలు కొనడం మొదలుపెట్టింది బామ్మ. బాపట్లకు ఓ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిరాజ తోట నుంచి పాలు పితికి, పట్టుకు వచ్చేవారు. రెండు రోజులకి ఓ సారి బామ్మ తీసిన మీగళ్ళు చిలుకుతుంటే, వెన్న కోసం కాబూలి దానిలా అక్కడే కూర్చునేదాన్ని. చూసి, చూసి, ఇంకా వెన్న పడలేదని, ఏ ఆటలకో వెళ్తే, ఎక్కడున్నా వెన్న పడగానే పిలిపించి మరీ మొదట నాకే పెట్టేది. వెన్న తియ్యగానే వచ్చే వెన్నమజ్జిగ అంటే కూడా నాకు చచ్చేంత ఇష్టమని బామ్మకి తెలుసు. అందుకే నా చిట్టి బొజ్జ నిండేదాకా, మజ్జిగ పోస్తూనే ఉండేది. ఏది ఎవరికి ఇష్టమో గుర్తుంచుకుని పీకలదాకా పెట్టడం ఆవిడ అలవాటు. సూపర్ కంప్యూటర్ లాంటి చురుకైన మేధస్సు ఆవిడది. మొదటినుంచి తను తినడం కంటే, ఇతరుల కడుపులు నింపి మురిసిపోడం అలవాటు ఆవిడకి. మా ఇంటికి ఎవరొచ్చినా సరే, భుక్తాయాసంతో పడుతూ లేస్తూ వెళ్ళాల్సిందే ! ఖాళీగా ఉన్నప్పుడు పడక్కుర్చీలో పడుకుని రామకోటి రాసుకోడమో, భజనలు పాడుకోడమో చేసేది బామ్మ.
ఇక విచిత్రం ఏమిటంటే, ఆస్థాన సోదెమ్మ కూడా ఉండేది. ‘సోది చెబుతానమ్మ సోది , కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పలుకవే పలుకు...’ అంటూ సాగాదీసుకుంటూ, మాట్లాడేది. ఇక సోది వినేందుకు బామ్మ అందరినీ క్యూ కట్టించేసేది. మా చిట్టి చేతుల మీద కర్రతో కొడుతూ, ఏదేదో చెప్పేది. ఆవిడ విచిత్రమైన బొట్టు, ముక్కెర, కర్ర, కళ్ళు మూసుకుని, హావభావాలు గమనించడం ఒక సరదా. ఓ చీర, కాస్త బియ్యం, డబ్బులు ఇస్తే, తీసుకుని, సంతోషంగా దీవించి వెళ్ళిపోయేది. ఒక్కోసారి ఆలోచిస్తే, అప్పటివాళ్ళు అల్పసంతోషులేమో అనిపిస్తుంది. చిన్న చిన్న వాటికే ఆనందపడి, తృప్తి పడిపోయేవారు కదా !
కాలచక్రం గిర్రున తిరిగింది. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. నాన్నగారి బ్యాంకు ఉద్యోగరీత్యా మేము కొల్లూరులో ఉండేవాళ్ళం. ఉగాది పండక్కని, బాపట్ల వచ్చాము. బామ్మ, తాత లేరు, హైదరాబాద్ వెళ్ళారు. హఠాత్తుగా మా తాతగారు హైదరాబాద్ లో వైద్య పరీక్షలకు వెళ్లి, బయాప్సీ చేసే వైద్యుల తప్పిదం వల్ల, శ్వాస నాళం తెగి కాలం చేసారన్న కబురు తెలిసింది. కదిలే అమ్మవారిలా, వెండి జరీ చీరలతో, నుదుట రూపాయి కాసంత కుంకుమతో కళకళ లాడిపోయే మా బామ్మ ఈ సంఘటనకు మ్రాన్పడిపోయింది. అప్పుడామె చేసిన పని, బహుశా, మరెవరూ చేసి ఉండరేమో!
తాతగారు కాలం చేసిన పదోరోజున ఆమె తన వెండి జరీ, గద్వాల్, పట్టుచీరలు అన్నింటినీ, పేద, గొప్ప తారతమ్యం చూడకుండా, వచ్చినవారు అందరికీ పంచి పెట్టేసింది. జుట్టు కత్తిరించుకుని, అప్పటికప్పుడే కాషాయం రంగు చీరలు తెప్పించుకుని, కట్టేసుకుంది. నగలన్నీ త్యజించింది. ఆ రోజు నుంచి ఏ సందర్భానికైనా కాషాయం చీరలే కట్టేది. వైభోగం, వైరాగ్యం రెండూ తెలుసు ఆమెకు. అయితే దానధర్మాలు, పెళ్ళిళ్ళు, సేవాకార్యక్రమాలు మాత్రం అలాగే కొనసాగేవి. బామ్మకోసం మా మకాం బాపట్లకు మార్చి, ఓ ఏడాది అక్కడే ఆమెకు తోడుగా ఉన్నాము. ఆపై మా పైచదువులకు వేరే ఊరికి కుటుంబం మారింది.
ఆ తర్వాత నేను డిగ్రీ చదువుతూ ఉండగా ఆమెకు కాన్సర్ వచ్చింది. చికిత్స జరుగుతూ ఉంది. “పూర్వ జన్మ కృతం పాపం” వ్యాధుల రూపంలో అంత్యకాలంలో పట్టుకుని  పీడిస్తుందని అంటారు. అలా ఆవిడ వాచిన ఎడమ చేత్తో అవస్థలు పడుతూ ఉండేది. బామ్మకు స్వాభిమానం ఎక్కువ. ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు ఎవరి పంచనా బ్రతికేందుకు నిరాకరించేది. అలా ఒక్కత్తే గడుపుకునేది.
నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో ఎం.ఎస్.సి. కెమిస్ట్రీ లో చేరటంతో, బామ్మ దగ్గరే ఉండి, కాలేజీ కి వెళ్లి వస్తూ ఉండేదాన్ని. మా కాలేజీ ఉదయం 7 గం. నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఉండేది. నేను వచ్చేదాకా, బామ్మ అన్నం తినకుండా పాపం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసేది. “ఏమే, వచ్చావా? ఏ వెధవైనా కాలేజీలో ఏడిపిస్తే చెప్పు, తాట తీసేస్తాను,” అంటూ, “ఇదిగో, పక్కింటి లక్ష్మి దొండకాయ పచ్చడి ఇచ్చింది, వేసుకో, నీకు ఇష్టమని వంకాయ కొత్తిమీర ఖారం చేసానే, తిను, అసలే బక్కదానివి, సరిగ్గా తినప్పోతే బలం ఎలా వస్తుంది“ అంటూ కొసరి కొసరి తినిపించేది. ఆ స్థితిలో కూడా అందరికీ పచ్చళ్ళు పెట్టేందుకు బామ్మ శ్రమ పడుతుంటే – “బామ్మా, నీ ఎడం చెయ్యి, అట్టే కష్టపడకూడదు, ఎందుకూ ఇవన్నీ?” అని మందలించేదాన్ని. నవ్వూరుకునేది, ఎవరైనా నోరు తెరిచి అడిగితే, ఖర్చైనా, శ్రమైనా చేసిచ్చే దాకా మనసూరుకునేది కాదు ఆవిడకి.
బామ్మ పరిస్థితి క్షీణించడంతో, నేను ఎం.ఎస్.సి. రెండో సంవత్సరంలో ఉండగా అమ్మావాళ్ళు కూడా బాపట్ల వచ్చేసారు. వాచిన చేత్తో చాలా బాధపడేది బామ్మ. అంతమందికి అన్నం పెట్టి, సాయం చేసిన చెయ్యి, జడేస్తే మూడు రోజులు సడలని పట్టు బిగించగలగల చెయ్యి, కదలనని మొరాయించి, నరకం చూపించేది. అప్పటికప్పుడు బాధతో మెలికలు తిరిగిపోతుంటే, కంపౌండర్ ను తీసుకువచ్చి, ఇంజక్షన్ ఇప్పించే వాళ్ళం.
రానురాను బామ్మ మంచానికే పరిమితం అయిపొయింది. అమ్మ చాలా ఓపిగ్గా బామ్మకు సేవ చేసేది. స్నానం చేయించి, బట్టలు మార్చడం, చెయ్యి లేవకపోతే, మలినాన్ని కడగడం, వీపంతా కురుపులు లేస్తే, వాటిని శుభ్రం చెయ్యడం, వంటివి విసుక్కోకుండా చాలా ఓపిగ్గా చేసేది. సేవ, క్షమ ఆచరించి మాకు చూపింది అమ్మ. మధ్యమధ్య చికిత్స కోసం ఆవిడని హైదరాబాద్ తీసుకువెళ్ళడం చేసేవాళ్ళం. నా చదువు పూర్తయ్యి, పెళ్లి కుదిరింది. నా పెళ్లి హైదరాబాద్ లోనే చెయ్యాలని, మా అత్తగారు వాళ్ళు కోరారు. బామ్మ కదలలేని స్థితిలో ఉండడంతో ఆమెను బాపట్ల లోని బాబాయ్ ఇంట్లో వదిలేసి, వెళ్ళాము. నా పెళ్ళైన రోజున నాతో ఫోన్ లో మాట్లాడింది కూడాను. మర్నాడే, నన్ను కాపురానికి దింపగానే, బామ్మ చనిపోయింది అన్న కబురు వచ్చింది. ఆ సమయంలో ఐదుగురు కొడుకులూ హైదరాబాద్ లోనే ఉన్నారు. నన్ను అత్తింట్లో వదిలేసి, అంతా వెళ్ళిపోయారు. కనీసం ఆవిడ కడసారి చూపు కూడా నాకు దక్కలేదు. ‘కొత్త పెళ్లి కూతురువి, కన్నీరు పెట్టకూడదు,’ అని అంతా ఎంత ఓదార్చినా, బామ్మ జ్ఞాపకం వెంటాడుతూనే ఉంది.
కాలం కొన్నిసార్లు చాలా కరుకుగా వ్యవహరిస్తుంది, ప్రశ్నించలేని తీర్పులు ఇస్తుంది. మనం మౌనంగా, అసహాయంగా  చూస్తూ, ప్రేక్షక పాత్ర వహించడం తప్ప, ఏమీ చెయ్యలేము. అలా మహావైభవంగా మహారాణిలా వెలిగిన మాణిక్యమ్మ గారి గాధ ,మా బాపట్ల వాసుల మనస్సులో ఆకాశంలో తారకలాగా నిలిచిపోయింది.
***

No comments:

Post a Comment

Pages