శ్రీ రామ కర్ణామృతం -4 - అచ్చంగా తెలుగు

శ్రీ రామ కర్ణామృతం -4

Share This

శ్రీ రామ కర్ణామృతం -4   

డా.బల్లూరి ఉమాదేవి.

                             

41.శ్లో:
మూలే కల్పద్రుమస్యాఖిలమణి విలసద్రత్న సింహాసనస్థం
కోదండేనాశుగేనోల్లసిత కరయుగే నార్చితం లక్ష్మణేన
వామాంకన్యస్థ సీతం భరతధృత మహా మౌక్తిక చ్ఛత్రకాంతం
శత్రుఘ్నే చామరాభ్యాంసువిలసితకరే రామచంద్రం భజేహం.
తెలుగు అనువాద పద్యము.
చం:సురతరుమూలమందు మణిసోభిత పీఠిని సీతతో వసిం
ప రహి సుమిత్రపుత్రకుడు మార్గణచాపము లంది యీయగా
భరతుడు పుండరీకము శుభస్థితి దాల్చగ శత్రుఘాతి చా
మరములు వీవ జెన్నగు సమస్త జగత్ప్రభు రాము నెన్నెదన్.
భావము:కల్పవృక్షము మొదట సర్వరత్నములతో కూడిన పీఠమందున్నట్టి ధనుర్భాణములచే సొగసైన హస్తములులుగల లక్ష్మణునిచే పూజింపబడుచున్నట్టియు ఎడమతొడపై సీతను కూర్చొండ బెట్టుకొన్న భరతుడు ముత్యాలగొడుగు బట్టగా శత్రుఘ్నుడు వింజామర విసురుచుండగా వెలిగెతి రాముని సేవించుచున్నాను.
42.శ్లో:వామే కోదండదండం నిజకరకమలే దక్షణే బాణమేకమ్
పశ్చాద్భాగే చ నిత్యం దధత మభిమతం చాపతూణీర భారం
వామేవామే లసద్భ్యాం సహమిళిత తనుం జానకీలక్ష్మణాభ్యాం
రామం శ్యామం భజేహం ప్రణత జన మనఃఖేద విచ్ఛేద దక్షమ్.
తెలుగు అనువాద పద్యము.
చం:ఇరుగడలందు లక్ష్మణ మహీసుతులుం జెలువొంద దూణమున్
శరము శరాసనంబు వరుసన్ జరమాంగకరంబులందు వి
స్ఫురత దనర్ప భక్తజనపుంజ విపద్ధరుడైన రామభూ
వరుడు జగద్గురుండు భగవంతుడనంతుడు నన్ను బ్రోవుతన్.
భావము:ఎడమ చేతిలో ధనుస్సు,కుడిచేత బాణము,వెనుక నంబులపొది,యిరుప్రక్కల సీతాలక్ష్మణులు గలిగి నమస్కరించువారి దుఃఖమును పోగొట్టునట్టియు,ఛామనఛాయగల రాముని సేవించుచున్నాను.
43.శ్లో:అంభోధర శ్యామల మంబుజాక్షం
ధనుర్ధరం వీర జటా కలాపం
పార్శ్వద్వయే లక్ష్మణ మైథిలాభ్యాం
నిషేవ్యమాణం ప్రణమామి రామం.
తెలుగు అనువాద పద్యము.
మ:శరద శ్యామలగాత్రుఁబార్శ్వయుగళ స్థానావనీజానుజున్
గురుతామ్రాంశుజటాకలాపు విలసత్కోదండ హస్తున్ బరా
త్పరుఁబంకేరుహ పత్రనేత్రుఁగరుణాపాత్రున్ బుధస్తోత్రు ఖే
చరసత్పుత్రు సురారి జైత్రు రఘువంశస్వామిఁగీర్తించెదన్
భావము:మేఘమువలె నల్లనైనట్టియు,పద్మములవంటి నేత్రములు కలిగినవాడు  ధనుస్సును ధరించినవాడు,వీరుడు,జటాసమూహము గలవాడు సీతాలక్ష్మణులచే సేవింపబడుచున్న రాముని నమస్కరించుచున్నాను.
44.శ్లో:కోదండ దీక్షా గురు మప్రమేయం
సలక్ష్మణం దాశరథిం దయాళుం
ఆజానుబాహుం జగదేకవీర
మనాథనాథం రఘునాథ మీఢే.
తెలుగు అనువాద పద్యము.
మ:గురుకారుణ్య పయోనిధాను విలసత్ కోదండ దీక్షా గురున్
వరకల్యాణ గుణాకరున్ శుభకరున్వైదోహి సంయుక్తు దా
శరథిన్ లక్ష్మణ సేవ్యు నారఅతజన రక్షాదక్ష దీక్షాకరున్
బరునాజానుకరున్ జగద్గురు హరిన్ భక్తిన్ బ్రశంసించెదన్.
భావము:ధనుస్సును దీక్షతో ధరించిన వాడు,లక్ష్మణునితో కూడిన వాడు,దశరథనందనుడు,ఆజానుబాహుడు,అనాథరక్షకుడు ఐన శ్రీరాముని స్తుతించుచున్నాను.
45.శ్లో:కర్పూరాంగ విలేపనం రఘువరం రాజీవ నేత్రం ప్రభుం
కస్తూరీ నికరాగృతుం ఖరధృతి ప్రధ్వంసినం శ్రీహరిం
కందర్పాయతకోటి సుందరతనుం కామారి సేవ్యం గురుమ్
కాంతా కామద మప్రమోయ మమలం సీతా సమేతం భజే.
తెలుగు అనువాద పద్యము.
మ:ఘనకర్పూర విలేపనున్ రఘువరున్ గామారి సేవ్యున్ ఘనా
ఘన గాత్రున్ సరసీజ నేత్రు ఖరరక్షః కాలు రామున్ సనా
తనుఁ గందర్ప శతోత్తమాకృతిని గాంతాకామదున్ శ్రీహరిన్
జనకక్ష్మారమణాత్మజానన సరోజాతార్కు భావించెదన్.
భావము:దేహమున కర్పూరమును పూసుకొన్నట్టివాడు,రఘివంశ శ్రేష్ఠుడైనట్టివాడు,పద్మములవంటి నేత్రములు కలిగినవాడు,ఖరాది దైత్యును చంపినవాడు,విష్ణుస్వరూపుడైనట్టివాడు కోటి మన్మథుల వంటి సౌందర్యము కల్గినవాడు శిరుని చేత సేవింపబడువాడు,సీతతో కూడిన రాముని సేవించెదను.
46.నీలాబ్ద బృంద సదృశం పరిపూర్ణ దేహమ్
దిక్పాలకాదిసురసేవిత పాదపద్మం
పీతాంబరం కనక కుండల శోభితాంగమ్
సీతాపతిం రఘుపతిం సతతం భజామి.
తెలుగు అనువాద పద్యము.
మ:మృగనాభీ నిభసుందరాంగు భవసన్మిత్రున్ బవిత్రున్ లస
న్నిగమాంతార్థ విచారవర్యు నుతవాణీనాథుఁ బీతాంబరున్
దిగధీశానముఖాయరావనుని ధాత్రీ పుత్రికాధీశ్వరున్
భగవంతున్ మణికుండలాభరణు సంభావింతు నశ్రాంతమున్.
భావము:నల్లనిమేఘమువంటి సర్వలక్షణపారఅణుడైన వాడు,దేవతల చేత సేవింపబడు చరణారవిందములు గలవాడు
పీతాంబరము ధరించినవాడు,బంగారు మకరకుండలాలచే ప్రకాశించువాడు సీతాపతియైన శ్రీరాముని ఎల్లప్పుడూ కొల్చెదన్.
47.శ్లో.భర్గ బ్రహ్మ సురేంద్ర ముఖ్య దివిజ ప్రాంచత్కిరీటాగ్ర సం
సర్గానేక మణి ప్రభాకర సహస్రాభాం పదాంభోరు హే
దుర్గాసంతత సంస్తుతాంఘ్రికమలం దుర్వార కోదండినం
గంగా విస్ఫుట మౌళిమానసహరం కల్యాణరామం భజే.
తెలుగు అనువాద పద్యము.
శా:భర్గఅంభోజ భవేంద్ర ముఖ్యదివిజ ప్రాంచత్కిరీటాగ్రసం
సర్గానేకమణి  ప్రభాకర సమంచత్ పాదపంకేరుహున్
దుర్గాసంతత సన్నుతాంఘ్రి యుగళున్ దోషాపహున్ మౌనిరా
డ్వర్గ ప్రస్తుతు శంభుమానసహరున్ వైకుంఠుఁ బ్రార్థించెదన్.
భావము:శివబ్రహ్మమరేంద్రాది దేవతల కిరీటములందలి  మాణిక్యకాంతుల సమూహము చేత నొప్పుచున్న పాదములు కలిగినట్టియు,పార్వతిచే నెల్లప్పుడూ స్తోత్రము చేయబడిన పాదపద్మములు గలిగినట్టియు, నివారింప శక్యముకాని ధనుస్సు కలిగినట్టియు ఈశ్వరమనోహరుడైనట్టి రాముని సేవించుచున్నాను.
48.శ్లో.అగ్రే ప్రాంజలి మాంజనేయ మనిశం వీరం చ తారా సుతం
పార్శ్వే పంక్తిముఖానుజం పరిసరే సుగ్రీవ మగ్రాసనే
పశ్చాల్లక్ష్మణ మంత్రికే జనకజాం మధ్యే స్థితం రాఘవం
చింతాతూలికయా లిఖంతి సుధియ శ్చిత్తేషు పీతాంబరమ్.
తెలుగు అనువాద పద్యము.
చ:పవనుజుడంగదుండెదుట బ్రాంజలులై వినుతింపచెంగటన్
రవిసుత రావణానుజులురంజిల వెన్క సుమిత్రా సూను డా
యవనితనూజ చేరువను హర్షమొసగంగ సింహపీఠి రు
క్మవనజకర్ణికన్ వెలయు రాముని చిత్తములో దలచెదన్.
భావము:ఎదుట దోసిలి కల ఆంజనేయుని ప్రక్కన వీరుడైన అంగదుని,సమీపమునందువిభీషణుని,ఎదుట పీఠమందు సుగ్రీవుని వెనుక లక్ష్మణుని,సమీపమున సీతను,మధ్యను పచ్చని బట్టగల రాముని విద్వాంసులుధ్యానమను కలముచేత చిత్తములందు వ్రాయుచున్నారు.
49.శ్లో.క్షీరాంభోనిధి మధ్యవర్తిని సితే ద్వీపే సువర్ణాచలే
రత్నోల్లాసిత కల్పభూరుహతలే జాంబూనదే మండపే
తేజోభ్రాజిత వేదికే సురుచిరే మాణిక్య సింహాసనే
హేమాంభోరుహ కర్ణికోపరితలే వీరాసనస్థం భజే.
తెలుగు అనువాద పద్యము.
మ:తెలిదీవిన్ గనకాద్రి దుగ్ధనిధ నుద్పీప్తామర నోకహ
స్థలజాంబూనద మంటపంబున విభాసద్వేదికరంజితో జ్జ్వల సింహాసన జాత రూపమయ కంజాత స్ఫురత్కర్ణికా
స్ధలి వీరాసన యుక్తుడైన రఘువంశస్వావిఁగీర్తించెదన్.
భావము:పాలసముద్రము నడుమనున్నశ్వేతద్వీపమందు బంగారుకొండపై రత్నముఉలచేత శోభించు కల్పవృక్షములక్రింద బంగారు మంటపమునందు తేజస్సుచేత నొప్పుచున్న మణిసింహాసనము నందుబంగారు పద్మపు మిద్దెపై వీరాసనమునందున్న రామునిసేవించుచున్నాను.
50.శ్లో.దోర్దండేన చ కుండలీకృత మహాకోదండ చండాశు
దుర్వారైరవికోటి తుల్య నిశితైర్బ్రహ్మాది ముఖ్యస్తుతైః
సుగ్రీవాది సమస్ద వానరవరా నాఙ్ఞాపయంతం గిరా
దైత్యాన్ తాడయ తాడయే త్యనుపదం శ్రీరామచంద్రం భజే.
తెలుగు అనువాద పద్యము.
మ:కరదండంబున మండలీకృత మహాకాండాసనోన్ముక్త ౹భా
స్వరకోటిప్రకట ప్రభానిశత నిర్ఘాతంబులై పద్మజా
మర సంస్తోత్రములైన బాణములచే మర్ధింపుచున్ వేగ వా
నర సంఘంబుల తోడ దైత్యవరులన్ మర్దింపుమర్దింపు డం
చు రయంబొప్పగ దెల్పు రామవసుధేశుండిచ్చు నిష్టార్తముల్.
భావము:పిడుగులతో సమానమైనట్టియూ కోటి సూర్యులతో తుల్యముగా తీక్షణములై బ్రహ్మాదులచేనుతింపబడుచున్నట్టియు,భుజములచేత లాగబడి గుండ్రమైన ధనుస్సుయొక్క బాణములచేత  నొప్పుచూ రక్షసులను కొట్టు కొట్టుడని సుగ్రీవాది వానరుల నాఙ్ఞాపించుచున్నట్టియు రాముని సేవించుచున్నాను.

No comments:

Post a Comment

Pages