‘సేవే మార్గం’ సురేఖా శ్రీనివాస్ - అచ్చంగా తెలుగు

‘సేవే మార్గం’ సురేఖా శ్రీనివాస్

Share This

‘సేవే మార్గం’ సురేఖా శ్రీనివాస్

భావరాజు పద్మిని


‘భగవంతుడు అన్నీ విరివిగా ఇచ్చినా కూడా, అందరికీ పంచిపెడుతూ, సాయపడుతూ జీవించడం అనేది, దివ్యమైన జీవనమార్గం’ అంటారు పూజ్య గురుదేవులు. అటువంటివారే ఈ జంట. వారి మనసుల రాగం ఒకటే, వారి అడుగుల తాళం ఒకటే, జంటగా సేవామార్గంలో పయనిస్తూ, ‘సొంత లాభం కొంతమాని’ సమాజానికి సేవ చేస్తున్న గజల్ మాస్ట్రో శ్రీ గజల్ శ్రీనివాస్ గారి శ్రీమతి సురేఖ గారి పరిచయం, ఈ నెల ప్రత్యేకించి మీ కోసం.
నమస్కారం సురేఖ గారు,మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి చెప్పండి.
నమస్కారమండి. మాది, వెస్ట్ గోదావరి, భీమవరం దగ్గర రాచూరు అని ఒక ఊరు. మేము మొత్తం నలుగురు పిల్లలం. ఒక చిన్న తమ్ముడు, అన్నయ్య, చెల్లి. మా ఊళ్ళో అప్పుడు స్కూల్ అదీ పెద్దగా లేదు. ప్రభుత్వ స్కూల్, ప్రతీ ఏడాది, ఒక్కో క్లాసు పెంచుకుంటూ వెళ్ళేవాళ్ళు. 6 వ తరగతి నుంచి పక్క ఊరికి వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. ఒక 15 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి చదువుకునేవాళ్ళం.
అప్పుడు ఒకసారి మా బాబాయ్ గారు (నాన్నగారి తమ్ముడు) మా ఇంటికి వచ్చి, ఆడపిల్ల అంత దూరం నడిచి వెళ్లి వస్తోంది అని, తానే వెంట తీసుకుని వెళ్లి చదివిస్తాను అన్నారు. అప్పుడు 7 వ తరగతి నుంచి, ఆయన వద్దే ఉండి, చెన్నైలో చదువుకున్నాను.
సేవాభావం అనేది, పెద్దలు ఆచరించి చూపితేనే పిల్లల్లో కలుగుతుంది కదా. మీ ఇంట్లో ఎవరైనా సేవా మార్గంలో ఉండేవారా ?
అంటే, నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు నాకు పెద్దగా ఊహ తెలియలేదండి. చెన్నైలో మా పిన్నిగారు లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ అన్నింటిలో మెంబెర్ గా ఉండేవారు. వాటన్నింటికీ నన్నూ తీసుకు వెళ్ళేవారు. అక్కడ సేవ చేసేదాన్ని. మా ఊళ్ళో ఉన్నప్పుడు కూడా, నాకు కులభేదాలు అవీ నచ్చేవి కాదు. కాని, అప్పుడు వ్యక్తీకరించడం తెలిసేది కాదు.
మా పిన్నిగారు బోల్డ్ గా ఉండాలి, సర్వీస్ చెయ్యాలి, బయట పనులు చేసుకోవాలి, ఇలా అన్నీ నేర్పారు. భాష కూడా తెలిసేది కాదు. బోర్డులు కూడా తమిళ్ లోనే ఉండేవి. అయినా అలాగే కష్టపడి నేర్చుకున్నాము. అలా ఆవిడతో పాటు బైటికి వెళ్లి, సేవ అలవాటు అయ్యింది. ఎవరికైనా కంటి ఆపరేషన్ లు జరిగితే సేవ చెయ్యడం, తర్వాత ఊర్ల నుంచి చెన్నై వచ్చినవారికి సాయం చెయ్యడం, చేసేవాళ్ళం. లయన్స్ క్లబ్ వారు పిల్లలకు ‘ లియో క్లబ్’ అనే పేరుతో ఒక చిన్న క్లబ్ ను ఏర్పాటు చేసారు. రూరల్ విలేజిలకు వెళ్ళడం, అనేకచోట్ల సర్వీస్ కు తీసుకు వెళ్ళడం చేసేవారు. పిన్ని కూడా ఒక ఏడాది తర్వాత, మేము పల్లెటూరు నుంచి వచ్చామని, అన్నింటికీ అడ్జస్ట్ అవ్వడం, బైటికి వెళ్లి మాట్లాడడం నేర్చుకుంటామన్న ఉద్దేశంతో మమ్మల్ని అందులో చేర్పించారు. అక్కడే మాకు ఎక్కువ సేవ అనేది అలవాటు అయ్యింది.
మీ విద్యాభ్యాసం ఎంతవరకు కొనసాగింది ?
అక్కడ నేను ఎం.కాం వరకూ చదివానండి. లియో క్లబ్ లో అక్కడా ఉండడం వల్ల, అక్కడి కార్యక్రమాలు కొనసాగిస్తూనే చదువు కొనసాగించాను. అప్పట్లో అందరూ అత్యవసర పరిస్తితులకి హైదరాబాద్ కంటే, చెన్నైకి ఎక్కువ వచ్చేవారు. మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండేవారు. వాళ్లకు వండి భోజనాలు పెట్టడం, అతిధులకు మర్యాద చేసి, తర్వాత మేము తినడం ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాము.
గజల్ శ్రీనివాస్ గారు మీకు బంధువే కదా ?
అవునండి, మా మేనత్త గారి అబ్బాయే.
మరి చిన్నప్పటి నుంచి పెళ్లి ప్రస్తావన ఎప్పుడైనా వచ్చిందా ?
లేదండి, నేను చిన్నప్పుడు నేను ఒకటి రెండు సార్లు చూసాను అంతే. అయితే ఆయన, ‘చిన్నప్పుడు మీ నాన్న నాకు నిన్ను ఉయ్యాలలో చూపించి, ‘ఇది నీ పెళ్ళాం’ అన్నారు, అప్పటినుంచి నేను ఫిక్స్ అయ్యాను,’ అని చెబుతూ ఉంటారు. (నవ్వుతూ) నేను ‘అదంతా ఏం లేదులే ఏదో స్టొరీ చెబుతున్నావు,’ అంటాను.
ఆ తర్వాత ఆయన ‘లైబ్రరీ సైన్సు ‘ చదివేందుకు చెన్నై వచ్చారు. ఆయన మేనమామ గారి దగ్గర ఒకసారి మాటల్లో చెబితే, మా పెద్దలను సంప్రదించారు. నాన్నగారు నా చిన్నప్పుడే పోయారు, అమ్మ, అన్నయ్య సమ్మతితో మా వివాహం జరిగింది.
మీరు కూడా పాటలు పాడతారా ?
విని విమర్శిస్తాను, మంచి శ్రోతని. నా పెళ్లి అయ్యిన తర్వాత ఆయన ‘కోరుకొండ సైనిక స్కూల్’ లో పని చేసేవారు. అప్పట్లో సి.నారాయణ రెడ్డి గారు, లిరిక్స్ పోస్ట్ లో పంపేవారు. అవి రాగానే తీసుకువచ్చి, ట్యూన్ చేసుకుని, లిరిక్స్ నాకిచ్చి, పాడుతూ చూడమనేవారు. ట్యూన్స్ రిపీట్ అవుతున్నాయా, లేదా అన్నది, నేను చూసి చెప్పేదాన్ని.
 ‘మీరు చాలా సింపుల్ గానే ఉండడానికి ఇష్టపడతారు అని, స్టేటస్ లు అవీ మైంటైన్ చేసేందుకు ఇష్టపడరని,’ శ్రీనివాస్ గారు చెప్పారు. దీని గురించి మీరు ఏమంటారు ?
అంటే, వేరే వాళ్ళ మెప్పు పొందేందుకు బ్రతకడం నాకు ఇష్టం ఉండదు. ఇవన్నీ వస్తూ, పోతూ ఉంటాయండి. లక్సరీ అనేదానికి లిమిట్ లేదు. ఒకటి దొరికితే, ఇంకొకటి కావాలని అనిపిస్తుంది. నాకు అటువంటివి ఏమీ ఉండవు.  మనకు వచ్చిన దాంట్లో ఎవరికైనా ఇచ్చేయ్యడమే. ఇవాళ మనం పెడితే, రేపు మనం అడగకుండానే దైవమే ఇస్తారు. అందుకే అవసరంలో ఎవరు వచ్చినా, వారి నుంచి ఏమీ ఆశించకుండానే సహాయం చేస్తాను. ఆ టైం కి ఇచ్చేస్తాను అంతే. మనల్ని వాడుకుని, వాళ్ళు వదిలేసి వెళ్ళినా సరే, అదీ సంతోషమే. మనం ఎవరో ఒకరికి, చిన్న పనికైనా ఉపయోగపడ్డాను అని, అటువంటి అవకాశం దైవం ఇచ్చారని, ఆనందపడతాను.
ఇంతటి పరిణితి మీలో ఎలా కలిగింది ?
ఏమోనండి, నేను నార్మల్ గానే ఉంటాను. అందరినీ సమానంగానే చూస్తాను. ఇంటికి ఎవరు వచ్చినా, ఆనందంగా వెళ్లాలని అనుకుంటాను. ఆఖరికి మా పనమ్మాయిని కూడా మా అమ్మాయితో సమానంగానే చూస్తాము. తను చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉండి పెరిగింది, పెళ్లి చేసాకా, వెళ్ళిపోయి, మళ్ళీ పిల్లలతో వచ్చి, ‘అమ్మా, మీ దగ్గరే ఉంటాము అంది,’ సరేనని అప్పటినుంచి మా వద్దనే అట్టేపెట్టుకున్నాము. మా ఇంట్లో సభ్యురాలి లాగానే ఉంటుంది.
మీ పెళ్లి తర్వాత మీరు సేవను ఎలా కొనసాగించారు?
నేను మొదట చెప్పినట్లు చెన్నైలో ఉండగా నాకు ఇవన్నీ అలవాటు అయ్యాయి. అప్పుడు నేను స్వయంగా వెళ్లి చేసేదాన్ని. ఇప్పుడంటే, నేను పర్సనల్ గా వెళ్ళిపోయి, చెయ్యలేను. ఎందుకంటే, నాకు ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ. మాటసాయం, అవసరానికి తగిన సాయం చేస్తూ ఉంటాను. కాని ఇంకా వెళ్లి, వాళ్ళతో గడపాలని అనిపిస్తుంది.
మీ ఆధ్వర్యంలో కూడా అనాధ, వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయేమో కదండీ.
అవునండి, శ్రీనివాస్ గారు ‘గజల్ ఛారిటబుల్ ట్రస్ట్’ నెలకొల్పి, పలు ఆశ్రమాలకు తన కార్యక్రమాల నుంచి వచ్చే డబ్బుల్ని విరాళంగా ఇచ్చేస్తూ ఉంటారు. ముందు వాళ్లకు ఉన్న ఆశ్రమాలకే కొత్త భవనాలు కట్టించి, ఫండ్స్ ఇచ్చి, సపోర్ట్ చేసారు. ప్రోగ్రామ్స్ కు వెళ్లి, స్వయంగా టికెట్స్ పెట్టుకుని, కార్యక్రమాలు నిర్వహించి, వచ్చిన డబ్బును విరాళంగా ఇచ్చేస్తారు. మొదట్లో శ్రీనివాస్ గారు వృద్ధాశ్రమాలు అంటే ఇష్టపడేవారు కాదు.  కాని, క్రమంగా పెద్దలే ‘మేము పిల్లల మీద ఆధారపడకూడదు’ అన్న దృక్పధంతో స్వచ్చందంగా వెళ్లి చేరుతుంటే, వారి వయసువారితో ఆనందంగా గడుపుతుంటే తప్పేముంది, అని భావించారు. ఇలా చాలా మందికి సహాయపడే అవకాశం మాకు దక్కింది.
‘మనకు సమయం సరిపోనప్పుడు మన జీవిత భాగస్వామి సమయంలోంచి కాస్త లాక్కోవాలి,’ అన్నారు గజల్ శ్రీనివాస్ గారు. ఆయన మీ సమయంలోంచి, యెంత లాక్కుంటూ ఉంటారో చెప్పండి.
(నవ్వేసి...) అలా ఏం లేదండి. ఆయనకు మొదటి నుంచి ఒక లక్ష్యం ఉంది. దానికి నేను అడ్డు రానని, ముందే చెప్పాను. పక్కపక్కన కూర్చుంటే, నాతో వ్యక్తిగతంగా సమయం గడిపితేనే, ప్రేమ, అభిమానం అని నేను భావించను. మీ మార్గంలో నేను అడ్డురాను, నేను మీ నుంచి ఏమీ ఆశించను, అని చెప్పాను. ఎక్కడికో బయటికి తిరగాలి అన్న కోరిక కూడా నాకు ఉండదు. మిగతా వారికంటే, బాగున్నాము – ఇల్లు, మా అమ్మాయి, శ్రీనివాస్ గారి పని, ఇదే నా లోకం.
మీరు చిన్న పిల్లలతో గ్రీటింగ్ కార్డ్స్ తయారుచేయించి, సేల్ చేసి, తిరిగి ఆ డబ్బును రూరల్ స్కూల్స్ కు విరాళంగా ఇస్తున్నారట ?
అవునండి, అది ‘గ్రీట్ వే’ అనే ఒక కంపెనీ. ఇది అమెరికా లో ఉంది. మనం 15 ఏళ్ళ లోపు పిల్లలకు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలు పెట్టి, వాటిని స్కాన్ చేసి, వాళ్లకు పంపితే, వాళ్ళు  దాన్ని ఎలివేట్ చేసి, నెట్ లో సేల్ చేస్తారు. దాని మీద వచ్చిన డబ్బులో ఒక 10% సర్వీస్ కోసం – అంటే, ఇక్కడి రూరల్ స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందించుకునేందుకు ఇస్తారు. ఒక స్కూల్ నుంచి, 2000 మంది విద్యార్ధులు పాల్గొంటే, వారిచ్చిన డబ్బుతో స్కూల్ వారిని సంప్రదించి, వారిని ఏదైనా కారణానికి వాడతారా అని అడుగుతాము. గ్రీట్ వే వారిని, వీరికి కనెక్ట్ చేస్తాము, ఆ స్కూల్స్ అవసరాలు తీరేలా చూస్తాము.
మొత్తం చార్ట్స్, పెయింటింగ్ మెటీరియల్ అంతా మేమే సప్లై చేస్తాము. L.K.G నుంచి పిల్లల డేటా తీసుకోవడం, పోటీలు నిర్వహించడం, జడ్జిమెంట్ ఇవ్వటము, ప్రైజులు ఇవ్వటం వంటివి చేస్తాము. పిల్లలకూ ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. తర్వాత సేల్స్ అవీ మొదలవుతాయి. ఏ స్కూల్ లో పోటీలు పెట్టామో, ఆ స్కూల్ కు ఫండ్స్ ఇచ్చి, ఆ పనులు జరిగాయా లేదా అనేవి చూడాలి.
ఇవి కాకుండా మీరు ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా ?
మేము మా ‘గజల్ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా గజల్ రచయతలకు పుస్తక ప్రచురణ కోసం విరాళాలు ఇవ్వటం, పుస్తకాలు ప్రచురించటం వంటివి చేస్తున్నాము. ఇది కాక, నల్గొండ అటువైపు ఇప్పుడు ఫ్లోరైడ్ సమస్య వల్ల కొంతమంది చనిపోతున్నారు. వాళ్ళ కోసం వాటర్ ప్లాంట్స్ పెట్టిస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం దగ్గర కిడ్నీ బాధితులు చాలామంది ఉన్నారు. వాళ్ళకూ సాయపడుతున్నాము. ఎక్కువగా శ్రీనివాస్ గారు అటూ-ఇటూ వెళ్ళినప్పుడు, అక్కడ సమస్యలు పరిశీలిస్తారు. వాళ్లకు ఏదో ఒకరకంగా సాయపడాలని, వచ్చిన దాన్లో 10 -20 % వరకూ మా ట్రస్ట్ లో వేసుకుని అందులోంచే సాయంచేస్తాము. ఎవరినీ విరాళాలు అడగము. టాక్స్ ఎక్సంప్షన్ ఉంది కనుక, ఎవరికైనా తెలిసి ఇస్తే, తీసుకుంటాము.
మనం విరాళాలు ఇవ్వటమే కాదు, అసలు అక్కడ ఆ పనులు అమలు జరిగాయా లేదా అన్నది పర్యవేక్షించాలి. దీని కోసం శ్రీనివాస్ గారి ఫాన్స్, అక్కడా, ఇక్కడా ఉన్నవాళ్ళు బాగా సాయపడుతూ ఉంటారు.
బాగుందండి. ‘ఒక వ్యక్తి కదిలితే, ఒక శక్తి కదిలిన తీరుగా ఉంది’. ఇంకా చెప్పండి.
అంటే, నాకు ఆయన ముందే చెప్పారండి. “నాకు కొన్ని కొన్ని ఆశయాలు ఉన్నాయి అన్నారు.” నేనేమీ ఆపను, అడ్డు రాను అని ముందుగానే చెప్పాను. అలాగే ఉంటూ నేను కూడా ఆయనకు వీలైనంత సహాయపడుతూ ఉంటాను, అడిగిన అందరికీ సాయపడలేకపోయినా, వీలైనంత మందికి సాయం చేస్తాము.
మా అమ్మాయి కూడా ఏమీ అడగదు. తను కూడా మూడు కిట్టి బ్యాంకులు పెట్టుకుని, అందులో డబ్బులు వేసుకుని, ఒకటి అనాధాశ్రమానికి, ఒకటి వృద్ధాశ్రమానికి అలా ఇచ్చేస్తుంది.
మీ పాప ‘సంస్కృతి’ ఏమి చదువుతుందండి ?
పదవ తరగతిలో ఉందండి. చిన్నప్పటి నుంచి సంగీతము, కూచిపూడి డాన్స్ నేర్చుకుంటోంది. అప్పుడప్పుడూ టీచర్ తో ప్రదర్శనలు ఇస్తుంది.
చాలా చక్కగా చెప్పారు సురేఖ గారు. వింటుంటేనే ఆనందం కలుగుతోందండి. భార్యాభర్తలు ఇద్దరూ ఒక్క మార్గంలో పయనించడం చాలా గొప్ప సంగతండి.  మా పాఠకుల కోసం ఏదైనా చిన్న సందేశం ఇస్తారా ?
అయ్యో, సందేశాలు ఇచ్చేంత గొప్పదాన్ని కాదండి. ఇప్పటి తరం అంతా సేవా కార్యక్రమాలకు ముందుకు వస్తున్నారు. కార్పోరేట్ సంస్థల్లో కూడా సేవ అనేది, ప్రతి నెలా చెయ్యాలని నియమం పెట్టారు. ఇది కొన్నాళ్ళు చేసేసరికి వాళ్ళకు అలవాటు అయిపోతుంది. ఇది చాలా సంతోషించదగ్గ పరిణామం. మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల కూడా కొంతమంది అవసరాలు తెలుస్తున్నాయి. వెంటనే, కొందరు ఉదారంగా ముందుకు వచ్చి, సాయం చేస్తున్నారు. ఈ మార్పులు అన్నీ నాకు సంతోషం కలిగిస్తాయి.
భవిష్యత్తులో మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చెయ్యాలని అనుకుంటున్నారు ?
‘హాల్ అఫ్ గజల్ శ్రీనివాస్’ అనే పేరుతో ఇన్నాళ్ళు తను గజల్స్ పై చేసిన అధ్యాయంతో, ఒక ప్రదర్శనశాల పెట్టాలని ఒక కోరిక. చిన్న పల్లెల్లో యువతకు వృత్తి విద్యల శిక్షణ ఇస్తూ, వాళ్లకు ఆర్ధికంగా ఉపాధికి ఉపకరించే విధంగా సహకరించాలని ఒక కోరిక. ఖాళీ అవుతున్న పల్లెల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరిక. లేకపోతే పల్లెలు ఖాళీ అయిపోతాయి కదండీ. మమ్మల్ని చూసి, ఎంతోమంది ప్రేరణ పొంది, మంచి పనులు మొదలుపెడతారు. అప్పుడు చాలా ఆనందం కలుగుతుంది.
అటువంటి ఒక మర్చిపోలేని సంఘటన గురించి చెప్పండి.
శ్రీనివాస్ గారు జైళ్ళకు వెళ్లి పాడుతూ ఉంటారండి. అది విన్న ఖైదీలు కొంతమంది, బైటికి వచ్చాకా ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ‘నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు మారిపోయాను. ఏదో ఆవేశంలో ఇలా చేసాను, మా అమ్మనీ, నాన్నని బాగా చూసాను’ అంటూ వచ్చే ఆ ఉత్తరాలు, చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తాయి. అటువంటివి చూసినప్పుడు, ‘మనం ఒక వెయ్యి మందిని మార్చలేకపోవచ్చు, కాని 2,3  మారినా వాళ్ళను చూసి, తర్వాత మిగిలిన వాళ్ళు మారతారు. మనం చెప్పాల్సింది చెప్పేస్తే, వాళ్ళు తర్వాత దాన్ని మననం చేసుకుని, మారాలని అనుకుంటారు.
ఒకసారి ఏదో పెళ్ళికి వెళ్తే, ఒకతను అక్కడే నిలబడి, మావంకే చూస్తున్నాడు. ‘ఎవరా ఇతను?’ అని చూస్తుంటే, అతను దగ్గరికి వచ్చి, ‘సర్, ఒకసారి మీరు మా జైలుకు వచ్చి పాడారు కదా. అది విన్నాకా నాలో మార్పు కలిగి, బైటికి వచ్చాకా, ఈ టెంట్ హౌస్ లో చేరి, ఉద్యోగం చేస్తున్నాను. అందరూ వెళ్లిపోయాకా, ఒక్కసారి మిమ్మల్ని కలిసి వెళ్ళాలన్న కోరికతో ఇలా వెయిట్ చేస్తున్నాను,’ అన్నాడు. ఇలాంటివి చూసినప్పుడు, మరిన్ని మంచి పనులు చెయ్యాలన్న సంకల్పం కలుగుతుంది.
సేవామార్గంలో పయనిస్తున్న ఈ దివ్య దంపతుల మార్గం నిజంగా అందరికీ ఆదర్శవంతం, అనుసరణీయం. వీరికి అడుగడుగునా అఖండ విజయం కలగాలని, మనసారా ఆకాంక్షిస్తోంది - అచ్చంగా తెలుగు. 
[fbcomments]

No comments:

Post a Comment

Pages