అన్నమయ్య శృంగార (భక్తి)మాధురి - అచ్చంగా తెలుగు

అన్నమయ్య శృంగార (భక్తి)మాధురి

Share This

అన్నమయ్య శృంగార (భక్తి)మాధురి

-డా.తాడేపల్లి పతంజలి


ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వర స్వామి పెండ్లి ముచ్చట్లు అన్నమయ్య చనువుగా ఆయనకే విన్నవిస్తున్నాడు: ఇదె పెండ్లిలగ్న వేళ యింటికి నీకు.
పల్లవి:  ఇదె పెండ్లిలగ్న వేళ యింటికి నీకు
          సుదతిమోవిచిగుళ్ళు సోబనపత్రికలు
చ.1:    తొయ్యలి చూచినచూపు తుమ్మిదపేరటాండ్లు
          నెయ్యమున నవె నీకు నివాళ్ళు
          పయ్యదలో చన్నులు పరగ బూజగుండలు
          నియ్యడఁ గంత కవె నిమ్మపండ్లు
చ.2:    చెలియ నవ్విననవ్వు జిగి నీకుఁ దలఁబాలు
          చెలఁగి బువ్వాన కవె చిలుపాలు
          పలుకుల సరసాలు బలుమంగళాష్టకాలు
          మలసి యవె మదనమంత్రాలు
చ.3:    వనిత కాఁగిలి నీకు వాటపుఁ బెండ్లిచవిక
          దినము నదె దోమతెరమంచము
          వినయపు రతులు శ్రీవేంకటేశ యిద్దరికి
          కనుఁగొన నవె మీకు కంకణదారాలు   (రేకు: 0775-1సం:  16-439)

అర్థాలు

పల్లవి లగ్న =తగుల్కొన్న;శుభ ముహుర్తం
 ఇంతి =స్త్రీ
 సుదతి =చక్కని పలువరుసకలిగిన స్త్రీ
 మోవి =పెదవి
 సోబన =మంగళం(శుభం)
చ.1:
 తొయ్యలి =స్త్రీ
 తుమ్మిద =నల్లరెక్కలు  కలిగి పూ తేనె తాగు  ఒక పురుగు పేరటాండ్లు =ముత్తైదువులు
 నెయ్యము =ప్రేమ
 నివాళ్లు =హారతులు(నీరాజనాలు)
కంత = పెండ్లిలో ఉప్పు-పప్పు-బియ్యము పెట్టెలో ఉంచి తీసుకొని పోయి పెండ్లి వారికి ఇచ్చునది.
చ.2
 పయ్యద = పైట
 బూజ =దేవతకు మంత్రాలతో,పూలు మొదలైన వానితో చేసే పూజ
 బూజగుండలు =వివాహంలో పూజకోసం వేదికలో ఉంచే కుండలు
 ఇయ్యడ =ఈ పెండ్లి సమయంలో
 పరగ =ఒప్పునట్లుగా
 కంత =సందు
 జిగి =మిక్కిలి కాంతి
 తలబాలు =వివాహకాలంలో దోసిళ్లతో ఒకరి తలపై ఒకరు పోసికొను నానుడు బియ్యం
 బువ్వము =పెండ్లివారితో సహ భోజనం
 చిలుపాలు =తియ్యనిపాలు
 మంగళాష్టకాలు =దీవనలు; పెండ్లి సమయంలో చదివే అష్టకాలు
అష్టకము= ఎనిమిది శ్లోకముల/పద్యముల కావ్యము.
చ.3:
 మలసి =విజృంభించి
 కాగిలి =కౌగిలి
 వాటపు =అనుకూలంగా
 పెండ్లిచవిక =పెండ్లిలో వేసే నాలుగు కాళ్ల మంటపం
 వినయపు =రహస్య మైన,మంచి పద్ధతులు నేర్పే
 రతులు =కలయికలు
 కంకణ దారాలు = వివాహకార్యం నెరవేరేవరకు చేతికి విప్పని దారాలు

భావం

పల్లవి:
          స్వామీ! అదుగో నీ పెండ్లి వేళ సమీపిస్తోంది.పెండ్లికి ఆహ్వానించే శుభలేఖలు ఎక్కడంటావా!అదుగో! చక్కనిపలువరుస
 కలిగిన అమ్మ అలమేలుమంగ లేత చిగుళ్ల వంటి  పెదాలు రా...రమ్మని ఆహ్వానించే శుభలేఖలు .
చరణం1
           పెళ్లిలో ఆశీర్వదించే ముత్తైదువులు ఎక్కడంటావా! అదుగో స్వామీ! మా అమ్మ చూసే తుమ్మెదల్లాంటి చూపు లు ముత్తైదువులు.(ముత్తైదువులు సుఖంగా ఉండమని ఆశీర్వదిస్తూ పాటలు పాడతారు.తుమ్మెదఝంకార ధ్వనులు   ఆ ఆశీర్వాదాలని భావం)
          మా అమ్మ చూసే తుమ్మెదల్లాంటి చూపులునీ ముఖం చుట్టూ తిరుగుతున్నాయికదా! అవేనయ్యా! నీకు ప్రేమతో ఇచ్చే మంగళారతులు.
          వివాహ వేదికలో ఉంచే కుండలు ఏవయ్యా! అంటున్నావా! స్వామీ! మా అమ్మ పైటలో ఉన్న స్తనా లు ఆ కుండలు. అవి ఉభయతారకాలు.ఈ వివాహ సమయంలో పెండ్లిలో ఉప్పు-పప్పు-బియ్యము పెట్టెలో ఉంచి తీసుకొని పోయి పెండ్లి వారికి ఇచ్చునవి కూడా అవే.(పెండ్లివారు వేంకటేశుడని ఇక్కడ గ్రహించాలి)
చరణం2
          స్వామీ! మా అమ్మ నవ్వే నవ్వులు వివాహకాలంలో దోసిళ్లతో ఒకరి తలపై ఒకరు పోసికొను తలంబ్రాలు.(నవ్వులు నా లుగు పక్కకి విరబూస్తాయి. తలంబ్రాలు కూడా అలాగే విస్తరిస్తాయి కనుక నవ్వుకి, తలంబ్రాలు కి పోలిక.)
          ఆనవ్వులే పెండ్లివారితో సహ భోజనం చేసే బువ్వపు బంతిలో తియ్యనిపాలు.(ఇష్ట మైన వారి నవ్వు రుచిగా ఉంటుంది.కనుక రుచిగా ఉన్న పాలతో  పోలిక.)
          స్వామీ! మీ ఇద్దరు మాట్లాడుకొనే సరసాల మాటలు పెండ్లి సమయంలో చదివే దీవెనలు .స్వామీ!మీ ఇద్దరి విజృంభణను కలపటానికి మన్మథుడు చదివే మంత్రాలు కూడా  ఆ సరసపు మాటలే.
చరణం3
          స్వామీ! అమ్మ వారి కౌగిలి నీకు అనుకూలంగా పెండ్లిలో వేసే నాలుగు కాళ్ల మంటపం.(కౌగిలిలో నీవి,ఆవిడవికలిపి మొత్తం నాలుగు కాళ్లు.అందుకే నాలుగు కాళ్ల మంటపంతో పోల్చానయ్యా!)          ప్రతిదినము ఒకరికొకరికి సుఖాన్నిచ్చే దోమతెరమంచం కూడా అమ్మ వారి కౌగిలి.అవునుకదా!
          శ్రీ వేంకటేశా!కార్యం నెరవేరేవరకు చేతికి విప్పని దారాలు ఏవయ్యా! దేనితో పోలుస్తానంటావా!స్వామీ! మీ ఇద్దరిరహస్యమైన-మంచి పద్ధతులు- ఒకరికొకరు నేర్పే -కలయికలు కంకణదారాలు. ఆ కంకణ దారాలు.విప్పకయ్యా స్వామీ! మాకు శుభాన్నిచ్చేవి అవే.స్వస్తి.
విశేషాలు
          పెండ్లి ఇద్దరికి సంబంధించిన వ్యవహారం. కనుక అన్నమయ్య కూడా ప్రతి పోలిక రెండింటికి అన్వయించాడు. ఉదాహరణకి అమ్మ నవ్వే నవ్వులు వివాహకాలంలో దోసిళ్లతో ఒకరి తలపై ఒకరు పోసికొను తలంబ్రాలు ఆనవ్వులే పెండ్లివారితో సహ భోజనం చేసే బువ్వపు బంతిలో తియ్యనిపాలు .అది ఈ కీర్తనలో చమత్కారం.స్వస్తి.
                                                                                                         ****

No comments:

Post a Comment

Pages