చేరువైన దూరాలు - అచ్చంగా తెలుగు

చేరువైన దూరాలు

Share This

చేరువైన దూరాలు 

అక్కిరాజు ప్రసాద్ 


"టీం, ఐ వుడ్ లైక్ టు సీ దీస్ డెడ్లైన్ బి ట్రాక్డ్ కేర్ఫుల్లీ అండ్ మేక్ షూర్ దట్ వి ఫినిష్ ద ప్రాజెక్ట్ మచ్ బిఫోర్ దట్" -అని కాంఫరెన్స్ రూం టేబుల్ దగ్గర నిలబడి తన టీం వంక ప్రగాఢమైన భావనతో చెప్పి అక్కడినుండి బయటకు బయలుదేరింది గాయత్రి. ఒక బహుళజాతి సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలప్‌మెంట్ మేనేజర్ ఆమె. పదేళ్ల అనుభవం. ఎంతో కష్టపడి వేర్వేరు కంప్యూటర్ భాషలలో ప్రావీణ్యం పొంది ఎంతో మంది కస్టమర్ల మన్ననలను పొందిన గాయత్రి అనతి కాలంలోనే మేనేజర్ స్థాయికి ఎదిగింది. కంపెనీ యాజమాన్యానికి ఆమె అంటే ఎంతో గౌరవం. తన గదిలోకి వచ్చి ఆలోచనలో పడింది. నెలరోజులే టైం ఉంది, 5 మిలియన్ డాలర్ల కాంట్రాక్టుకు డెమో తయారు చేయాలి. ఈ కాంట్రాక్టు ఎలాగైనా సాధించాలి అని నిర్ణయించుకుంది. చీకటి పడింది. ఇంటి దారి పట్టింది.
"మాం! ఐ హావ్ సైన్స్ ప్రాజెక్ట్ టు బి సబ్మిటెడ్ టుమారో. ఐ టోల్డ్ యూ టూ వీక్స్ బ్యాక్. యూ నీడ్ టు హెల్ప్ మీ". ఇంటికి రాగానే గాయత్రి ఏకైక కుమార్తె ప్రవల్లిక చెప్పింది. "నో యూ డిడ్ నాట్ టెల్ మీ. ఐ నోట్ ఎవ్రీథింగ్ ఇన్ మై క్యాలెండర్. ఇన్నాళ్లూ ఏం చేసావ్? లాస్ట్ మినిట్లో చెబితే ఎలా? క్యాన్ యూ ఆస్క్ డ్యాడ్ ఇఫ్ హీ క్యాన్ హెల్ప్ యూ? " గాయత్రి సమాధానం. తలదించుకొని తండ్రి దగ్గరకి వెళ్లింది ప్రవల్లిక. "నాకు ఇప్పుడు కాల్స్ ఉన్నాయి అమ్మా! క్యాన్ యూ కాల్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టేక్ దెయిర్ హెల్ప్?" "డ్యాడ్! ఇది నేను సొంతంగా ఆలోచించి చేయాల్సిన ప్రాజెక్ట్. హెల్ప్ మీ..."..."సారీ డియర్! ఐ నీడ్ టు ఎటెండ్ ఎన్ ఇంపార్టెంట్ కాల్..ఇట్స్ ఎబౌట్ అ మిలియన్ డాలర్ డీల్...ప్లీజ్ మేనేజ్". నిరాశతో, భయంతో అక్కడినుండి వెళ్ళిపోయింది ప్రవల్లిక.
గాయత్రి, వెంకట్‌లు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. వెంకట్ ప్రాడక్ట్ మేనేజ్‌మెంటులో సీనియర్ పొజిషన్‌లో ఉన్నాడు. కెరీర్‌లో చాలా ముందుకు వెళ్లారు ఇద్దరు దంపతులు. ఎంతో పేరు ప్రతిష్ఠలు పొంది డబ్బు కూడా సంపాదించారు. ఇద్దరికీ ప్రవల్లిక అంటే ప్రాణం, కానీ తనతో గడిపేందుకు సమయం మాత్రం లేదు. ఉద్యోగాలే జీవితం. అక్కడ వచ్చే కిక్ ఇంట్లో పొందే పరిస్థితిలో లేరు. వారి సంసారానికి వారధి వెంకట్ తల్లి దుర్గమ్మ గారు.
"నాయనమ్మా! నాకు అమ్మా నాన్న మీద కోపం వస్తోంది. వాళ్లకు నాతో ఒక అరగంట గడిపే తీరిక లేదు. మా క్లాసులో చాలా మంది స్టూడెంట్స్‌కు వాళ్ల అమ్మ, నాన్నలు చదువులో సాయం చేస్తారు, వారి మంచి చెడు కనుక్కుంటారు. నాకు ఎవ్వరూ లేరు. ఏమి చేయాలో తోచట్లేదు"....అంది ప్రవల్లిక. దుర్గమ్మ నొచ్చుకొని "అమ్మా ప్రవల్లికా! నువ్వు చాలా తెలివిగల పిల్లవు. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి నీకు సాయం చేయలేకపోతున్నా. కానీ, నువ్వు చేయాల్సిన ప్రాజెక్టుకు ఇంటర్నెట్‌లో ఏమైనా సాయం దొరుకుతుందేమో చూడు" అని చెప్పింది. "తెలుసు నాయనమ్మా! అదే చేయబోతున్నా" అని అక్కడినుంచి లేచి తన రూంలోకి వెళ్లింది.
ప్రవల్లికలో రోజురోజుకూ అసహనం పెరుగుతోంది. ఎవ్వరికీ చెప్పలేదు. చెప్పినా ఉపయోగంలేదు. ఎదురు తిరగటం మొదలు పెట్టింది. క్లాసులు ఎగ్గొట్టి ఇంట్లో కూర్చోవటం, టీవీ చూడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం, మాల్స్‌కు వెళ్లటం లాంటి పనులు మొదలు పెట్టింది. అలాంటి సమయంలో పదమూడేళ్ల ప్రవల్లికకు పరిచయం అయ్యాడు ఇరవైఏళ్ల శ్రీకాంత్. ఫేస్బుక్‌లో ఫ్రెండ్ అయ్యాడు. ఎవరో తెలియదు. కానీ, ప్రవల్లికను బాగా పరిశీలించి తన మెప్పు పొందాడు.
"ప్రవల్లికా! ఇవి తీరే సమస్యలు కాదు. వీటి గురించి టెన్షన్ పడకు. మైండుకు రిలాక్షేషన్‌గా ఉంటుంది. అలా రోజూ కాసేపు బయటకు వస్తూ ఉండు. నీకు ఓకేనా" అని ఒక రోజు అడిగాడు. సరే అని ఇద్దరూ ఇనార్బిట్ మాల్‌లో కలిసారు. కాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు. ప్రవల్లికకు అతను తన ఒంటరితనంలో తోడుగా కనిపించాడు. ప్రతిదీ పంచుకోవటం మొదలు పెట్టింది. రోజూ ఉదయం, సాయంత్రం చాటింగ్. నాయనమ్మకు ట్యూషన్ అని అబద్ధం చెప్పి అప్పుడప్పుడూ శ్రీకాంత్‌ను కలుస్తూనే ఉంది.
"నాకు నీతో ఉంటే ఎంతో హాయిగా ఉంది శ్రీకాంత్. హాయిగా లా తిరుగుతూ, మాట్లాడుతూ ఉంటే ఇంటికి వెళ్ళాలని లేదు. నీ మాటలలో ఏదో తెలియని హాయి ఉంది. నాకు మళ్లీ జీవితంపై ఆశ కలుగుతోంది" అని ప్రవల్లిక.
"ప్రవల్లికా! నేనున్నాను నీకు. మీ అమ్మ నాన్నలకు టైం లేదని దిగులు పడొద్దు. నువ్వు నాకు ఎప్పుడైనా ఫోన్ చెయ్యచ్చు. నీకు బ్రేక్‌లా కావాలంటే మనిద్దరం బెంగుళూరు వెళదాం. అమ్మ నాన్నలకు  కాలేజీ ఇండస్ట్రియల్ టూర్ అని చెప్తాను. నువ్వు కూడా అలానే చెప్పు..." అని చాటింగ్‌లో ప్రవల్లికతో చెప్పాడు. ప్రవల్లిక హుషారుగా ముందు వెనుక ఆలోచించకుండా సరే అని చెప్పింది. "మాం! ఐ హ్యావ్ ఎ ఫీల్డ్ ట్రిప్ టు బెంగళూరు ఫర్ 2 డేస్ ఫ్రం స్కూల్. ఐ వాన్న గో". "ఓకే ప్రవల్లికా! టేక్ కేర్" అని డబ్బులిచ్చింది. ప్రవల్లిక, శ్రీకాంత్ బెంగుళూరు వెళ్లారు.
మూడో రోజు ఉదయం ప్రవల్లిక ఇంటికి రాలేదు. దుర్గమ్మకు గుబులు మొదలయ్యింది. కొడుకు కోడలుకు కనీసం పిల్ల ఎలా వెళ్లింది, ఎక్కడ ఉంది అన్న వివరాలు తెలుసుకునే తీరిక లేకపోయింది. గాభరాగా కోడలికి ఫోన్ చేసింది. మీటింగులో ఉన్న గాయత్రికి నెత్తిన పిడుగు పడ్డట్లయింది. స్కూలుకు ఫోన్ చేసింది. టీచర్లు అసలు ఫీల్డ్ ట్రిప్ లేదు అని చెప్పటంతో భూమి బద్దలైనంత భయం వేసింది. పదమూడేళ్ల పిల్ల తనతో అబద్ధం చెప్పి ఎటువెళ్లింది అని విపరీతమైన ఆందోళన, కోపం వచ్చేశాయి. వెంకట్ కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి స్కూల్‌కు వెళ్లి ప్రవల్లిక క్లాస్‌మేట్స్‌తో మాట్లాడారు.
"ఆంటీ! ఆ మధ్య తను బాగా డల్‌గా, మూడీగా ఉండేది. మా ఎవ్వరితోనూ ఏమీ చెప్పేది కాదు. ఒక్కసారి మాత్రం మార్క్స్ బాగా తక్కువ వచ్చాయని మా దగ్గర ఏడ్చింది. అప్పుడు టీచర్ సర్ది చెప్పింది. తరువాత మళ్లీ ఉత్సాహంగా కనిపించింది. ఎవరో మంచి ఫ్రెండ్ అయ్యాడు, తనకు చాలా సపోర్టింగ్‌గా ఉంటున్నాడు అని చెప్పింది. మాకు ఇంతకన్నా వివరాలు తెలియవు" అన్నారు.
ఇంటికి వచ్చి ప్రవల్లిక రూమంతా ఆ ఫ్రెండ్ వివరాల కోసం వెదికారు. ఎక్కడా దొరకలేదు. ఇక లాభం లేదని పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. ప్రవల్లిక సెల్‌ఫోన్ నంబరుకు వచ్చిన కాల్స్ వివరాలు తెలుసుకొని దాని ద్వారా శ్రీకాంత్ నంబర్ కనుక్కున్నారు. అతని తల్లిదండ్రులకు ఫోన్ చేశారు "మా వాడు బెంగుళూరు ఇండస్ట్రియల్ టూర్ వెళ్లాడు" అని చెప్పారు వాళ్లు. క్షణాల మీద శ్రీకాంత్ ఫోన్ డేటా, ప్రవల్లిక ఫోన్ డేటా ఆధారాలతో బెంగుళూరు సమీపంలో వాళ్లు ఉన్న రిసార్ట్ స్థలాన్ని కనుక్కున్నారు. అది శ్రీకాంత్ స్నేహితుని తండ్రి సొంత రిసార్ట్. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది.
శ్రీకాంత్ పాశవికపు ఆలోచనలకు ఫలితం ప్రవల్లిక శారీరిక హింసకు గురైంది. భయంతో ప్రవల్లిక తల్లిదండ్రుల ముందు నిలబడింది. పారిపోబోతున్న శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
"గాయత్రి గారు, వెంకట్ గారు - మీ అమ్మాయిపై ఆ శ్రీకాంత్ దారుణమైన అత్యాచారం చేశాడు" అని డాక్టర్లు చెప్పారు. తల్లిదండ్రులకు ఏమి మాట్లాడాలో, ఎందుకిలా జరిగిందో అర్థం కాలేదు. పోలీసులు శ్రీకాంత్ గతం గురించి ఆరా తీసి అతని ఇంటర్నెట్ ప్రొఫైల్‌ను సేకరించారు. అతనో సెక్స్ సైకో. ఆడపిల్లలను మంచి మాటలతో బుట్టలో వేసుకొని వారి జీవితాలతో ఆడుకోవటం జరుగుతోంది అన్న సంగతి విచారణలో తేలింది.
ప్రముఖ సైకాలజిస్టు అభిరాం దగ్గర కన్సల్టేషన్ కోసం ప్రవల్లికతో కలిసి వెళ్లారు గాయత్రి, వెంకట్. వివరాలు ప్రవల్లిక దగ్గర సేకరించాడు అభిరాం. ముందు భయంతో ఏమీ చెప్పకపోయినా, తరువాత దాచుకోలేక తెరలు తెరలుగా వచ్చే దుఃఖంతో అంతా చెప్పేసింది.  మూడు గంటల తరువాత అభిరాం తల్లిదండ్రులను లోపలకి పిలిచి వారితో ఏకాంతంగా మాట్లాడాడు.
"గాయత్రి గారు, వెంకట్ గారు - జీవితంలో మీరు వేసిన తప్పటడుగులకు, మీరు చూపించిన బాధ్యతారాహిత్యానికి మీ అమ్మాయికి చెప్పలేని క్షోభను అనుభవించింది. టీనేజిలో ఉన్న పిల్లకు తల్లిదండ్రుల దగ్గర సమయం దొరకక బయట వాళ్ల దగ్గర సాంత్వన పొంది దానిలో మోసపోయిన ఫలితం ఇది. హోంవర్కులో సాయం చేయలేనంత, తనతో ఒక అరగంట గడపలేనంత హడావిడి జీవితాలు మీవి. ఏమి సాధించాలని మీ పరుగు? బాధ్యతగా, ప్రేమగా, పిల్లతో సమయం గడపలేనప్పుడు పిల్లలను కనే హక్కు మీకు ఎవరిచ్చారు? మీ శారీరిక ఆనందం యొక్క ఫలం బిడ్డ అయితే దానికి ముందు బాధ్యత నడుస్తుంది. మీరిద్దరూ దాన్ని విస్మరించి మీ ఉద్యోగ సోపానపు ప్రపంచంలో పడి ఒక వికసిస్తున్న మొగ్గ ఈ విధంగా నరరూప రాక్షసుల చేతిలో హింసించబడేలా చేశారు..కారణం ముమ్మాటికీ మీరే..." అని ఒక రెండు గంటల పాటు వారికి నిజాన్ని ఆవిష్కరించాడు.
వెంకట్-గాయత్రిలకు నిజం భరించలేని పరిస్థితి. తాము పెట్టిన పరుగుకు పిల్ల జీవితం ఎలా నలిగిపోయిందో తెలిసే సరికి తమ మీద తమకే అసహ్యం వేసింది. కేసు, వైద్య పరంగా జరగాల్సినవి ముందుకు వెళ్లే ఏర్పాట్లు చేశారు హితులు. ఇంటికి వచ్చారు ముగ్గురూ. అప్పటికి గానీ అన్ని వివరాలు దుర్గమ్మకు చెప్పలేదు కొడుకు కోడాలు. హతాశురాలైంది ఆ వృద్ధురాలు. మనవరాలిని దగ్గరకు తీసుకొని ఏడ్చింది. ఆవేశంతో కొడుకు-కోడలుపై ఊగిపోయి ఇలా అంది  -
"మీ స్వార్థం, బాధ్యతా రాహిత్యం మీరున్న దుస్థితికి కారణం. జీవితంలో ఏ సమయంలో దేనికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో మీరు మీ ఉద్యోగం-డబ్బు ప్రపంచంలో పడి మర్చిపోయారు. నేను ఎంత చెప్పినా వినలేదు. ఐదేళ్ల వయసులో ఒక పార్కుకో, ఆటలకో, విహారానికో తీసుకువెళితే పిల్ల ప్రపంచంలో అడుగులు వేయటం మొదలు పెట్టేది. అదీ చేయలేదు. చదువు ట్యూషన్లు అని ఆ వయసునుండే దాని ఆనందాన్ని హరించారు. సరే, ఆ చదువులో మీరు ధ్యాస పెట్టారా? అబ్బే అది అంతకన్నా లేదు. పిల్ల ఏమి నేర్చుకుంటోంది, ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏ సబ్జెక్టులో బలహీనమో, దానికి కారణమేమిటో తెలుసుకునే సమయం ఉందా? లేదు. ట్యూషన్ల మీద ఆధారపడి, తల్లిదండ్రులుగా మీరు చేయవలసినదాన్ని చేయలేదు. పునాది గట్టిగా లేకపోతే ఇల్లు ఎంత హంగు ఉండి ఏమి లాభం? మీరు ఎంత డబ్బులు పెట్టి ట్యూషన్లు చెప్పిస్తే ఏమి ఉపయోగం? ఆడపిల్లలు అమ్మ గుణాలను, జీవనశైలిని కలిసి నడిచి నేర్చుకుంటారు. తండ్రి వాళ్లకు మొదటి హీరో. వీటికి మీరు సమయం ఎక్కడ ఇచ్చారు. ఫలితం దానిని ఇంతటి శారీరిక, మానసిక క్షోభకు గురి చేస్తారా? మిమ్మల్ని నేను క్షమించలేను. మీరు చేసిన దానికి ప్రవల్లిక కూడా ఎప్పటికీ మిమంలని క్షమించలేదు. ఇప్పటికైనా గాడితప్పిన మీ మీ జీవితాలను సరిదిద్దుకోండి. లేకపోతే మీకు తల్లిదండ్రులు అని పిలిపించుకునే హక్కు లేదు...." అని ఆక్రోశంతో చెప్పింది. కాళ్లు నేల మీదకు వచ్చాయి గాయత్రి దంపతులకు.
అభిరాం రెండో విడత కౌన్సిలింగ్..."పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తారు. వారి మాటలను, వారి ఆచారాలను, వ్యవహారలను, వారు ఇతరులతో ఉండే పద్ధతిని...అన్నిటినీ గమనిస్తారు. దానినే తమ జీవన శైలి చేసుకుంటారు. ఈ మొదటి అడుగులలో తల్లిదండ్రులు ఎంత సమయం వెచ్చిస్తే అంత వ్యక్తిత్వపు పునాదులు గట్టిపడతాయి. ఆ పునాదులు మీరు వేయలేకపోయారు. ఎదుగుతున్న సమయంలో పిల్లలకు నేర్పవలసింది విలువలు. ఎంతటి కష్టం వచ్చినా ఆ విలువలు అనూహ్యమైన పరిస్థితులను ఎదుర్కునే సామర్థ్యాన్ని ఇస్తాయి. ఒక కొత్త వ్యక్తితో ఎలా ఉండాలో అన్న విలువలు మీరు మీ అమ్మాయికి ఇవ్వలేకపోయారు. దానివలన అతని మోసానికి చాలా తొందరగా బలైంది ప్రవల్లిక. ఇంకో ముఖ్యమైన విషయం. యుక్తవయసులోకి మీ అమ్మాయి అడుగిడబోతోంది. అంటే శారీరికంగా, మానసికంగా మార్పులు వచ్చే సమయం. ఆ సమయంలో తల్లిగా, తండ్రిగా మీ బాధ్యత మరింత పెరుగుతుంది. తొందరగా విషయాలు చెప్పరు ఆ వయసులో. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మీరు మరింత సమయాన్ని వెచ్చించాలి. వారి మనసు విప్పారి మీతో మాట్లాడేలా చేయాలి. విలువలను మరింత ఇనుమడింప చేయాలి. మీరు దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేశారు...ఫలితం ఈరోజు"...
గాయత్రి-వెంకట్‌లకు ఇటువంటి సంభాషణలు మరో రెండుమార్లు జరిగిన తరువాత తాము చేసిన పొరపాట్లు పూర్తిగా అర్థమయ్యాయి. సరిదిద్దుకునే దారిలో అడుగులు వేశారు. సమయానికి ఇంటికి రావటం, ప్రతిరోజూ ప్రవల్లికతో సమయం గడపటం, స్నేహితులుగా మెలగి అమ్మాయి కవళికలు గమనించి సరిదిద్దటం, కలిగిన గాయానికి కుంగిపోకుండా అభిరాం సాయంతో కౌన్సెలింగ్ తీసుకోవటం, ప్రవల్లిక స్నేహితుల వివరాలు, వారి వ్యక్తివాలను అర్థం చేసుకోవటం, టీచర్లతో మాట్లాడటం....ఒక ఆరు నెలల తరువాత ప్రవల్లిక గతమనే భయంకరమైన ప్రపంచంలో నుండి బయటకు రావటం మొదలు పెట్టింది. ఆత్మ స్థైర్యం కోసం ప్రవల్లికను కరాటేలో చేర్పించారు. తను కూడా ఇష్టంగా నేర్చుకుంటోంది. పరిపూర్ణమైన శారీరిక, మానసిక ఆరోగ్యం కోసం కుటుంబం మొత్తం యోగాలో చేరారు. అందరి ఆలోచనలలోనూ మార్పు రావటం మొదలు పెట్టింది....పదమూడేళ్ల ప్రవల్లిక మళ్లీ మూడేళ్ల బాలికలా బుడి బుడి అడుగులు వేయటం మొదలు పెట్టింది.

No comments:

Post a Comment

Pages