దేవస్థానాల తీర్థయాత్ర - అచ్చంగా తెలుగు

దేవస్థానాల తీర్థయాత్ర

Share This

 దేవస్థానాల తీర్థయాత్ర

(గురువాయూర్ శ్రీకృష్ణ -మమ్మియూర్ మహాదేవ- త్రిస్సూర్ వడక్కుంనాథన్ ఆలయాలు)

అక్కిరాజు ప్రసాద్ 


కేరళ యాత్రలో భాగంగా మేము ప్రసిద్ధ వైష్ణవ పుణ్య క్షేత్రం గురువాయూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నాము. ఇక్కడినుండి కొచ్చిన్ విమానంలో వెళ్లాము. అక్కడినుండి గురువాయూర్ 80 కిలోమీటర్ల దూరం. ఉదయాన్నే ఐదు గంటలకల్లా స్నానాలు చేసి కారులో బయలుదేరాము. కేరళ మొత్తం ఎలా ఉంటుందో అదే విధంగా మార్గమంతా పచ్చగా కొబ్బరి చెట్లు, అరటి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంది. దాదాపు గంటన్నర ప్రయాణం తరువాత గురువాయూర్ చేరాము.
కేరళ ఆలయాలలో ప్రధానంగా రెండు గుర్తుపెట్టుకోవాలి. మగవారు చొక్కా/బనీను/ప్యాంటు ధరించరాదు. పంచెలో మాత్రమే వెళ్ళాలి. ఆడవారు చీర/పంజాబీ డ్రెస్సులో వెళ్లవచ్చు. మగవారి నిబంధనలు చిన్న పిల్లలకు కూడా వర్తిస్తాయి. విషయం ముందుగానే తెలుసు కాబట్టి కారు దిగగానే పంచె కట్టుకొని బయలుదేరాము. విపరీతమైన వర్షం. దేవాలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రవేశాలు. ప్రవేశాలనుండి గర్భగుడి దాదాపు ఒక 100 మీటర్లు ఉంటుంది. ప్రవేశం నుండి గర్భగుడి వరకు పూర్తిగా భక్తులు తడవకుండా చక్కని ఎత్తైన షెడ్లు ఏర్పాటు చేశారు. మందిరం ప్రాకారం ముందు పెద్ద ధ్వజస్థంభం, దీపాల స్థంభము ఉన్నాయి. కేరళలో అన్ని మందిరాలలోనూ దీప స్థంభాలు ప్రసిద్ధి.
ప్రవేశానికి ఎడమవైపున ఒక వేదిక, దాని ముందు విశాలమైన ప్రాంగణం ఉన్నాయి. ఆ వేదికపై చక్కగా పట్టుచీరలు కట్టుకొని సిగలో పూలు పెట్టుకొని, ఎదురుగా కృష్ణుని పటం పెట్టి దానికి పూల మాలలు వేసి శ్రీమన్నారాయణీయం పఠిస్తున్నారు. కొంత సేపటికి భగవద్గీత పఠనం మొదలు పెట్టారు. ఎంతో ఆనందంగా అనిపించింది. లైనులో నించున్నాము. గురువాయూరులో దేవునికి సేవలు దాదాపు ప్రతి గంట గంటకూ ఉంటాయి. కాబట్టి దర్శనం నిరంతరం ఉండదు. ఆరోజు మేము ఉదయం  6:45 నిమిషాలకు లైనులో నించున్నాము. దాదాపు 8:15 కు దర్శనానికి లోనికి పంపించారు.
మందిరం లోపలి భాగం అద్భుతమైన కళాకృతి. అక్కడ మరో ధ్వజస్థంభం, ఒక పక్క పాకశాల, మరో పక్క తులాభరం, ఇంకో పక్క ప్రసాదాల వితరణ కేంద్రాలు ఉన్నాయి. ఎడమవైపుగా వెళ్లి రెండు మలుపులు తిరిగి పక్క ద్వారంగుండా గర్భగుడిలోనికి ప్రవేశించాము. ప్రత్యేకమైన శిల్పసంపదతో గర్భగుడి నిర్మించబడింది. ఇత్తడి దీపాలు, పూజా సామాగ్రి, వంటసామాగ్రి పవిత్రమైన అర్చక సమూహము ఇక్కడి ప్రత్యేకతలు. మందిరమంతా నారాయణ నామస్మరణతో మారిమ్రోగుపోయింది. అక్కడ స్వామిని ఎర్రని కలువపూలతో అర్చిస్తారు. స్వామి ఎదురుగా నిలబడితే ఆ నల్లనయ్య అద్భుతమైన విగ్రహం. అసలు విగ్రహం శ్రీమహావిష్ణువే అయినా అందరూ కృష్ణునిగానే కొలుస్తారు. ఇది పాతాళాంజన శిల. ఎంతో పవిత్రమైనది. స్వయంగా శ్రీమహావిష్ణువుచే పూజించబడినదని స్థలపురాణం చెబుతోంది. ఎక్కువ ఎత్తు ఉండదు. స్వామి చుట్టూ దీపాలు, అందమైన పుష్పాలంకరణ. రెండు కళ్లు చాలలేదు. ఉదయం సమయం, వర్షం కావటంతో ఎక్కువ తోపులాట లేకుండా స్వామిని దర్శించుకున్నాము.  స్వామి ముందు నుండి వెనుకకు వెళితే అక్కడ గణపతి, హనుమంతుడు, అయ్యప్ప (శాస్తా అంటారు) విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ గుళ్లో స్వామి అర్చనకు ఉపయోగించిన గంధము, కలువపూలను భక్తులకు వితరణ చేస్తారు. మేము కూడా గంధాన్ని తీసుకొని నుదుటన ధరించాము. తరువాత మందిరం వెనుక స్వామికి సాష్టాంగం చేసే స్థలం ఉంది. అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి బయట పడ్డాము.
బయట ప్రాంగణంలో ప్రసాదాల కౌంటరు ఉంది. అక్కడ వెన్న, నెయ్యి బెల్లపు పాయసం,పాల పాయసం, చక్కెరపొడి, అరటి పండ్లు మొదలైన అనేక ప్రసాదాలు అమ్మకానికి ఉన్నాయి. ఈ ప్రసాదాలు ఎంతో రుచికరమైనవి. మాకు కావలసిన ప్రసాదాలు కొనుక్కున్నాము. ఇక్కడి అరటి పండ్లు అతి మధురంగా ఉంటాయి. ఒక రెండు తింటే చాలు కడుపు నిండుతుంది. గురువాయూరు మందిరం ప్రత్యేకత తులాభారం. మన మనసులో కోర్కెలు తీరటానికి, శరీరంలో రుగ్మతలు తొలగటానికి ఇక్కడ మన బరువు సమానమైన అరటి గెలలు, బెల్లం, వెన్న, బియ్యం, వెండి బంగారం ఇలా చాలా రకాల వస్తువులు స్వామికి మన నిలువెత్తు సమర్పించవచ్చు. మన బరువును తూచి దానికి సరిపడ వస్తువు ఖరీదు చెల్లిస్తే వారు స్వామికి సమర్పిస్తారు. మా పిల్లవాడికి బెల్లం తులాభారం ఇచ్చాము.
గురువాయురప్ప గుడి పిల్లల అన్నప్రాశలు చేయటానికి చాల ప్రసిద్ధి. దీనికొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. తులాభారం తరువాత మేము దేవస్థానం అధికారి వద్ద శ్రీకృష్ణుని బిళ్లలు కొనుక్కున్నాము. వెండివి 5 గ్రాముల బిళ్ల 490 రూపాయలు. గుడినుండి బయటకు వచ్చే చోట భగవతి మందిరం ఉంది. అక్కడ కూడా కలువపూలు, కుంకుమ ప్రసాదం ఇచ్చారు. మందిరానికి ఉత్తరభాగంలో రుద్రతీర్థమనే పుష్కరిణి ఉంది. అక్కడ భక్తులు స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చు. మొత్తం దేవస్థానం ఉద్యోగులలో, అర్చకులలో ఎక్కడా అవినీతి అనేది కనిపించలేదు. ఇక్కడ అర్చకులందరూ నంబూద్రి కుటుంబాలకు చెందినవారు. ఇక్కడ అర్చన సమయంలో ఉన్నన్ని రోజులూ ఆ నంబూద్రీలు అతి కఠోరమైన బ్రహ్మచర్య దీక్షను పాటిస్తారని అక్కడ తెలిపారు. వీరిని తంత్రి అంటారు (మన శాస్త్రులు లాగా).
గుడినుండి బయటకు వచ్చిన తరువాత ఎదురుగా దేవస్థానం వారి ద్వారక ఫలహారశాల ఉంది. అక్కడ ఎంతో తక్కువ ధరకు రుచికరమైన ఫలహారాలు ఉన్నాయి. హాయిగా లాగించి బయటకు వస్తుండగా అక్కడ ఎన్నో షాపులు. వాటినిండా ఇత్తడి సామాగ్రి, పుస్తకాలు, పటాలు, దేవతామూర్తులు అమ్మకానికి ఉన్నాయి. ఇక్కడి షాపులలో ప్రత్యేకత రకరకాల హల్వాలు. మేము అరటిపండు హల్వా కొనుక్కున్నాము. ఎంతో రుచిగా ఉంది. గురువాయూర్ తీర్థయాత్ర అక్కడి సమీపంలో ఉన్న మమ్మియూర్ దేవస్థానంలో ఉన్న శివుని దర్శించుకోనిదే పూర్తి అవ్వదని అక్కడి వారి నమ్మకం. మేము త్రిస్సూరులో వడక్కుంనాథన్ దేవస్థానానికి వెళ్లి తిరిగి వెళ్లే దారిలో మమ్మియూర్ దేవస్థానం చూడాలని అక్కడినుండి త్రిస్సూర్ బయలుదేరాము.
 త్రిస్సూరు అక్కడినుండి 25 కిలోమీటర్లు. ఒక 45 నిమిషాలలో చేరుకున్నాము. వడక్కుంనాథన్ మందిరం ఒక అద్భుతం. ఎంతో ప్రాచీనమైనది. ఇక్కడ పరశురాముడు క్షత్రియులను సమ్హరించిన తరువాత శివుని కొలువగా అక్కడ ఒక వృక్షంలో శివుడు వెలిశాడుట. అది చాల పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఇది మందిరం పడమర దిక్కు ద్వారం ముందు భాగంలో ఉంటుంది. కొన్ని పదుల ఎకరాల విశాలమైన ప్రాంతంలో ఈ దేవస్థానం నిర్మించబడింది. అక్కడ లింగం గడ్డకట్టిన నెయ్యి. ఎప్పటినుందీ ఉందో ఎవ్వరికీ తెలియదు. ఎన్ని దీపాలు వెలిగించినా అది కరుగదుట. అద్భుతమైన మందిరం ఇది. అక్కడ స్వామికి అలంకరణగా లింగాకృతిలో అర్థచందరాకరమైన బంగరు గొలుసులను పేర్చి వేశారు. ఎంతో రమ్యంగా ఉంది. పక్కనే అమ్మవారు, శంకరనారాయణుడు, రాముడు, గణపతి మందిరాలు ఉన్నాయి. ఈ శివుడు ఎంతో మహిమ కలవాడని అక్కడి వారి నమ్మకం. ప్రాంగణమంతా తిరిగి ఎంతో ఆనందం చెందాము. అక్కడినుండి బయలుదేరి తిరిగి గురువాయూర్ వచ్చి మమ్మియూర్ శివుడిని దర్శించుకున్నాము. ఇది కూడా ఎంతో పవిత్రమైన క్షేత్రము. ఇక్కడ శివ కేశవుల మందిరము, వెనుక భాగమున భగవతి మందిరము ఉన్నాయి.
కేరళ మందిరాలలో ప్రత్యేకత గర్భగుడి చుట్టూ ఉండే వేల దీపాలు, ప్రధాన ద్వారం ముందు ఉండే దీపతోరణాలు. అలాగే ఇక్కడి  ప్రాకారాలు ప్రత్యేకమైన ఆకారం కలిగిఉంటాయి. ఇతర దక్షిణ భారతదేశ దేవాలయాలలా గోపురాలు ఉండవు. సాయంత్రం కాగానే ఈ మందిరాలలో దీపాలన్నిటినీ వెలిగిస్తారు. వీటికి ప్రత్యేకమైన వ్యవస్థ కూడా ఉంది.
మొత్తంగా, గురువాయురప్ప నా మనోభీష్టాన్ని నెరవేర్చి ఎక్కువ శ్రమలేకుండా దర్శన భాగ్యం కలిగించాడు, పిల్లవాడి తులాభారం చేయగలిగాము. అటు తరువాత మేము దగ్గరలోనే ఉన్న ఏనుగుల సంరక్షణ కేంద్రానికి వెళ్లాము. ఎంతో ఆరోగ్యమైన 60 ఏనుగులు దంతాలు కలిగినవి అక్కడి పచ్చని ప్రకృతిలో హాయిగా పోషించబడుతున్నాయి. ఈ ఏనుగులను గురువాయూర్ స్వామికి జరిగే ఉత్సవాలలో ప్రదర్శిస్తారు. వీటికి గ్రాసం ఇవ్వటం స్వామికి సేవగా భావిస్తారు. ఈ పున్నత్తూర్‌కొట్టలోని అందమైన ఏనుగులను దర్శించిన తరువాత మేము తిరిగి కొచ్చి బయలుదేరాము.

No comments:

Post a Comment

Pages