శ్రీవేంకటేశ్వర శతకము - తాళ్ళపాక తిరుమలాచార్యుడు - అచ్చంగా తెలుగు

శ్రీవేంకటేశ్వర శతకము - తాళ్ళపాక తిరుమలాచార్యుడు

Share This

శ్రీవేంకటేశ్వర శతకము - తాళ్ళపాక తిరుమలాచార్యుడు

వివరణ : దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవిపరిచయం:
ఈ శతకరచయిత తాళ్ళాపాక తిమలాచార్యుడు, పదకవితాపితామహుడు అని పేరుపొందిన తాళ్ళపాక అన్నమాచార్యుని ద్వితీయ కుమారుడు. ఈకవి బహుశా క్రీ.శ. 1505 నుండి 1545 ప్రాంతాలవాడని చరిత్రకారుల అభిప్రాయం. ఇతనికి పెక్కు నామాంతరాలున్నాయి. ఈకవి అన్నయతిమ్మనార్యుడు, తిమ్మయ్య, తిరుమలార్యుడు, తిరుమలాచార్యుడు, పెదతిరుమలాచార్యుడు, పెదతిమ్మయ్య, తిరుమలయ్యంగారు, పెదతిరుమలయ్యంగారు అనే పేర్లతో పిలువబడేవారు. ఈకవి అనేక గ్రంధములు రచించాడు. 1. శృంగారసంకీర్తనములు, 2. శృంగారదండకము, 3. వైరాగ్యవచనమాలికా గీతములు, 4. చక్రవాళమంజరి, 5. శృంగారవృత్తపద్యశతకము, 6. వేంకటేశోదాహరణము, 7. నీతిసీసపద్యశతకము, 8. సుదర్శనరగడ, 9. రేఫారకారనిర్ణయము, 10. ఆంధ్రవేదాంతము, 11. హరివంశము, 12. ఆంధ్రభగవద్గీత.
ఈ కవి శ్రీకృష్ణదేవరాయ, అచ్యుతరాయ, సదాశివరాయ సమకాలికుడు. ఈతను శ్రీవేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడు. స్వామికైంకర్యానికోసం అనేక దానధర్మములు చేసినవాడు. తిరుమలలో అనేక కట్టడాలను కూడా నిర్మించినవాడు. వీరిదానధర్మములను గురించిన క్రీ.శ. 1517 నుండి 1546 వరకు గల శాసనములు ఇప్పటికి కనిపిస్తున్నాయి. వీరి రచనలలోని శతకములలో శృంగారవృత్తశతకము అలభ్యం. రెండవశతకమైన నీతిసీసపద్యశతకమే ఈ శ్రీవేంకటేశ్వరశతకము.
శతక పరిచయం:
"కలితలక్ష్మీశ, సర్వజగన్నివేశ, విమలరవికోటి సంకాశ వేంకటేశ" అనే మకుటంతో ఉన్న ఈశతకంలో సరిగా 100 పద్యాలున్నవి. ఇది నీతిని బోధించు మొట్టమొదటి సీసపద్య శతకముగా పండితుల అభిప్రాయం. జానతెలుగు పదాలతో చక్కనిభావార్ధములతో, భావానుగుణమైన పదాల విరుపులతో ఈశతక పద్యాలు వినసొంపుగా సాగిపోతాయి. సందర్భోచితమైన లోకోక్తులు, జాతీయాలు ఈ పద్యాలలో అనేకచోట్ల దర్శనమిస్తాయి. ఇటువంటి ప్రయోగాలలో తిరుమలాచారుడు అఖండుడనే చెప్పవచ్చును. పలుచోట్ల నూత్న దేశ్యశబ్దములు మనకు దర్శనమిస్తాయి. చక్కనీ ఈ నీతిపద్యం గమనించండి.
ధర్మంబుగలచోటఁ దలకొను జయమెల్ల, దయగలచో సుకృతంబు నిలుచు
సత్యంబుగలచోట సమకూరు శుభములు, నేమంబుగలచోట నిలుచు సిరులు
పాడిగలచోటఁ బంతంబులీడేఱు, దాక్షిణ్య మున్నచోఁ దగులు మైత్రి
భక్తిచేసినచోట ఫలమిచ్చు దైవంబు, మనసునిల్పినచోట మలయు సుఖము
లితరమగుచోట వెదికిన నేలయుండు, సొరిదినీదైనకృపగలచోటఁగాక (కలిత)
మరొక చక్కని పద్యం
శౌర్యంబు గలుగుట జన్మసాఫల్యంబు, శాంత మాత్మవివేక సాధనంబు
మానంబు దనకును మహనీయసంపద, సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు
సవినయవచనంబు సర్వవశ్యకరంబు, వెలయునాచారంబు వెనుబలంబు
దానంబు సేయుట తనకది దాఁచుట, సజ్జనసంగతి సౌఖ్యమొసఁగుఁ
గాన బుధులీగుణంబులు మానకెపుడు, తగిలి మిమ్ముభజింతురు తలఁచితలఁచి (కలిత)
ఈశతకమునందు పలు పద్యములు రాజనీతి బోధకములు. అందువలననే ఈశతకానికి నీతిసీసపద్యశతకమని కవి నామముంచెను. కొన్నిపద్యాలను చూద్దాం.
జలకంబు, తగుపాటి జపము దేవార్చన బ్రాహ్మణసేవ పురాణగోష్టి
దానంబు చోరాశాత్రవవినిగ్రహచింత; స్వజనగజాశ్వరక్షణము గణన
యాప్తమంత్రి పురోహితాలోచనంబులు, రాజ్యాదిధనవిచారంబు భుక్తి
సంగీతసాహిత్య సౌఖ్యానుభవములు, గూఢచారులకొల్వు గుప్తనిద్ర
సలుపవలయును బ్రతిదినమునందు, నయమెరింగినయట్టి భూనాయకుండు (కలిత)
రాజనీతితోపాటుగా రాజులు వ్యసనాలకు బానిసలై  నీతితప్పిచరించిన ఏమిజరుగునో కూడా ఈ కవి తన శతకంలో హెచ్చరించాడు:
పరకాంతకై సింహబలుడట్లు మృతుడయ్యె, రాజ్యలోభమునఁగౌరవుఁడు డులిసె
బరుషోక్తులను శిశుపాలుడు హతుడయ్యె, మహినిజూదమున ధర్మజుడు నొగిలె
నలపాండురాజు వేటాడి శాపమునొందె, మునురావణుడు చలముననె సమసె
గ్రూరదండమున గూలెను వేనుండు, చదిసె బాణమున రాక్షసగురుండు
ఘనవివేకులు వీరలగతులు దెలిసి, వ్యసనములు మాని నడువంగవలయునిలను (కలిత)
చాటికాఁడగువాఁడు సటలెల్లబోధించు, నందున కొరులపై నలుగవలదు
పాతకుండగువాడు పరులనుదూషించు, వెఱ్ఱియై తానవి వినఁగ వలదు
వెడదొంగయగువాఁడు విత్తంబు లీవచ్చు, బ్రమసి యాసల నివి పట్టఁదగదు
మాయావియగువాఁడు మందుమంత్రంబు నేర్పు, మఱచితప్పియు నవి మరగవలదు
కర్తయగువాఁడు కపటులగతులుదెలిసి, యేమఱకరాజ్యమెపుడు నేలవలయు (కలిత)
ఇటువంటి రాజనీతి పద్యాలే కాక సామాన్య ధర్మాలను నీతులను అనేకం ఈ శతకంలో మనం చూడవచ్చును. కొన్ని సూత్రప్రాయాలైన నీతులు:-
1. సాలీనిపోఁగులా సంసారపాశంబులు? 2. నీటిపై వ్రాఁతలు, 3. తాఁజేసిన ధర్మంబు తలనుగాచు, 4. అసలువిడిచిన నటమటలె లేవు, 5. ఏమిచేయగవచ్చు సర్వేశ్వరాజ్ఞ, 6. దైవికంబేదియుఁదప్పింపఁగారాదు, వంటి అనేక నీతులు ప్రతిపద్యంలోను మనకు కనిపిస్తాయి.
ఈ పద్యం చూడండి.
బహుపుణ్యుఁ డగువాని బ్రతుకది మంచిది, మనసుగెల్చినవాని మహిమమేలు
జ్ఞానంబుగలవాని జన్మంబు సఫలంబు, తప్పుఁజెప్పని వాని తగవులెస్స
సమబుద్దిగలవాని చరితంబు సమ్మతి, యుపమరి యగువానియునికి బాగు
వావిగల్గిన వాని వర్తన శుభమిచ్చు, మేలెఱింగిన మెచ్చువచ్చు
భువికినిటువంటిమనుజుండు భూషణంబు, గలుగు నీకృప నీరీతి ఘనులకెపుడు (కలిత)
సామెతలు ఈశతకం లో విరివిగా కనిపిస్తాయి. మచ్చుకు కొన్ని
1. జిలువు పెరిగిన మాలెకంబముగాదు, 2. కప్పకాటెందైన గలదని వింతిమే, 3. గాడిద యెఱుఁగదు గంధపువాసన, 4. చెదాంటునే నిప్పుసీమలోన, 5. షాండునకేటికి సతులపొందు, 6. కల్పవేక్షము నెంచి కలివిచెట్టెంచుట, 7. కోరి దవ్వులఁ జూడఁ గొండలు నున్నన, చేరిదగ్గఱినను జెట్లురాళ్ళు, 8. చేతఁబట్టినయట్టి జిడ్డు లెక్కకురాదు, 9. కొండతో దగరు ఢీకొని యెంతతాఁకినఁ దలవ్రక్కలగు గాక దానికేమి? 10. కఱువదే యొకదోమ గంధగజము - దొరలదే విరులలో దుంగపోచ.
ఈశతకంలోని ఒక పద్యంపై ఒక కథ ప్రాచీనకాలంగా వినిపిస్తూవస్తోంది. ఈ కవి తనువ్రాసిన పద్యాన్ని కృష్ణదేవరాయలి ఆస్థాననికి తీసుకుపోయి వినిపించగా తెనాలి రామకృస్ణకవి ఆ పద్యాన్ని ఆక్షేపించినట్లుగా ఒక కథ. ఈదిగో ఆపద్యం.
పతికి మాఱాడక పలుమాఱు నేడ్వక, యలుగక మిగుల గయ్యాళి గాక
తనుఁ దిట్టుకొన కాతాళించి గొణగక, మృచ్చలింపక పాపమునకుఁ జొరక
పొరుగింటి కేఁగక పరు నాత్మఁ దలపక, కుపితగాక పరానుకూలగాక
యదువ దాఁచక మర్మ మవ్వలఁ జెప్పక, బొంకక నిద్దురపోతుగాక
కాపురము సేయు కామిని గలిగెనేని, పలుకులేటికి బురుషును భాగ్యమహిమ (కలైత)
రామకృష్ణుని ఆక్షేపణకు రాయలవారి నవ్వినా శతకపరిశిలనతరువాత ఈ కవిని సత్కరించి పంపినట్లు కథ ముగుస్తుంది.
మరొక మంచి పద్యంతొ ఈ పరిచయాన్ని ముగిస్తాను.
కాంచనపాదము ల్గజ్జలు నందియ, ల్గడు మించు మొలఁ జంద్రికావిదట్టి
పీతాంబరముమీదఁ బిల్లల మొలనూలు, బిగియించి కట్టినపెనుకటారి
వరదానకరము నుజ్జ్వలకటిహస్తంబు, వటుశంఖచక్రోరుబాహుయుగము
నొఱపైననాభ్యు నుదరబంధ మురంబు, నలమేలుమంగతో హరములును
శిరసుమకుటంబు తిరుమణి చిత్రమకర, కుండలమ్ములుఁగలమిమ్ముఁ గోరితలఁతు
కలితలక్షీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ, వేంకటేశ
ఇంతచక్కని నీతి శతకాన్ని అందరూ చదివి ఆకళిపుచేసుకోవాలి. మీరు చదవండి. అందరిచేత చదివించండి.

No comments:

Post a Comment

Pages