సినీగేయరచయత రామజోగయ్య శాస్త్రి గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

సినీగేయరచయత రామజోగయ్య శాస్త్రి గారితో ముఖాముఖి

Share This

సినీగేయరచయత రామజోగయ్య శాస్త్రి గారితో ముఖాముఖి 

భావరాజు పద్మిని 


జీవితం చాలా చిత్రమైనది. మనం ఊహించని మలుపులు తిరుగుతుంది. అటువంటప్పుడు ఆ మలుపులకు అనుగుణంగా తననుతాను మలుచుకుని, అంతా దైవానుగ్రహమేనని భావించి, కర్తృత్వం వదిలిన మనిషి మనీషి అవుతారు. అడుగడుగునా ఆ దైవం చేసే అద్భుతాలను చూస్తారు. ఎం.టెక్ ఐ.ఐ.టి ఖరగ్పూర్ లో చదివి, GE లో పెద్ద ఉద్యోగం చేస్తున్న ఆయన జీవితం కూడా సరిగ్గా ఇటువంటి మలుపే తిరిగింది. అనుకోకుండా సినీరంగప్రవేశం చేసారు, సాక్షాత్తూ మహామౌని వంటి సిరివెన్నెల గారి శిష్యరికం సంపాదించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, అలుపెరుగకుండా ప్రయాణం చేస్తూ, విలువలకు కట్టుబడి ఉంటూనే భావాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ, మన మనసుల్ని గెల్చుకున్న నేటితరం సినీ గేయ రచయత – దారివేముల రామజోగయ్య శాస్త్రి గారు. వారితో ముఖాముఖి ఈ నెల ప్రత్యేకించి మీ కోసం...
మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించిన అంశాలు చెప్పండి.
గుంటూరు జిల్లా నర్సారాపేట దగ్గర ముప్పాళ్ళ అనే ఊర్లో పుట్టాను నేను. నాన్నగారు సూర్యప్రకాశరావు గారు, అమ్మ సరస్వతమ్మ. నాన్నగారు పౌరోహిత్యం చేసేవారు. నేనొక్కగానొక్క కొడుకుని. 10 వ తరగతి వరకు ముప్పాళ్ళ లోనే చదువుకున్నాను. మాది వ్యవసాయ కుటుంబం, ఇంట్లో చిన్నప్పుడు పాలేర్లు, కాడెద్దుల గేదెలు, అమ్మ స్వయంగా పాలు పితకడం, చల్లకుండ, అందులో మజ్జిగ చేస్తుంటే వెన్నపూస కట్టడం వంటి వాతావరణం ఉండేది. పల్లెటూరు కాబట్టి, చిన్నప్పుడు గోళీలు సేకరించడం, సిగరెట్ ప్యాకెట్ లతో మందిరాలు కట్టడం, ఊరి బయట చెప్టా మీద కూర్చుని, స్నేహితులతో కబుర్లు చెప్పడం, ఎర్రబస్సు, అడపాదడపా వచ్చే చిన్న ప్రొజెక్షన్ ల ముందు చాప తీసుకెళ్ళి కూర్చుని, సినిమా చూడడం, ఎన్.టి.ఆర్. గారి మీద అభిమానం కొద్దీ 8 వ తరగతి దాకా వారి పేపర్ కటింగ్ లు సేకరించడం వంటి మధురజ్ఞాపకాలు ఉన్నాయి. నేను 8 వ తరగతిలో ఉన్నప్పుడు ఆయన పాలిటిక్స్ లోకి వచ్చారు. అప్పుడప్పుడూ నర్సరావుపేట వెళ్లి, మా బంధువుల అబ్బాయి, నన్ను ‘బావా, బావా’ అని పిలిచే శేఖర్ తో సినిమాలు చూసేవాడిని. పెద్ద గొప్ప అడ్వెంచరస్ గా కాదు కాని, మామూలు పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుందో అలా గడిచింది.
ఒక్కగానొక్క కొడుకును కనుక ఇంకా గారాబంగా పెంచారు, కర్వేపాకు తీసుకొస్తాను, చెట్టెక్కుతాను అన్నాకానీ, ‘నీ వల్ల ఏమౌతుంది, వద్దులే నాన్నా, ‘ అనేవారు. చదువులో బావుండేవాడిని. మాష్టార్లు అందరూ సాయంత్రం సరదాగా పేకాడేందుకు మా ఇంటికి వచ్చేవారు. వాళ్లకు వ్యాపకానికి మా ఇల్లు ఒక అడ్డా. వాళ్ళు వచ్చే వేళకు నేను హోం వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు అది చూసి, ‘అబ్బా, చూడండి, మీ పిల్లాడు ఎంత బుద్ధిమంతుడో, మిగతా పిల్లలు ఆటలాడుతుంటే, చక్కగా హోం వర్క్ చేసుకుంటున్నాడు, ‘ అనేవారు. నాన్న కూడా నన్ను పొగిడేవారు. 10 వ తరగతి వరకూ నేను స్కూల్ ఫస్ట్. మాష్టార్లు అందరూ చాలా ఫ్రెండ్లీ గా ఉండేవారు. ముఖ్యంగా లెక్కలు చెప్పే ప్రసాదరావు మాష్టారు, 9 వ తరగతి పాఠాలు 8 వ తరగతి సెలవల్లోనే సీనియర్లతో పాటు కూర్చోపెట్టి చెప్పేవారు. సోషల్ స్టడీస్ అంటే నాకు భయం ఉంటే, ‘ఒరేయ్, 10 వ తరగతి దాకా చదవరా, తర్వాత నీకు ఛాయస్ ఉంటుంది అని చెప్పడం, కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడం వంటివి చేసేవారు. అలాగే మదీనా మాష్టారు అనే ఆయన మా డ్రిల్ మాష్టారు. మేము ఆయన దగ్గరికి ట్యూషన్ కు వెళ్ళేవాళ్ళం. అప్పుడు కొండవీటి సింహం, ప్రేమాభిషేకం సినిమాల్లోని పాట ఒకటి పాడితే కాని, ఇంటికి పంపేవారు కాదు. స్కూల్ లో ఎక్ష్త్రా కర్రిక్యులర్ ఆక్టివిటీస్ కి ఒక పీరియడ్ పెడితే, అందులో పాటల పుస్తకం తీసుకుని, పాటలు పాడేవాడిని నేను. ఇలా చదువుతో పాటే సమానంగా కళల్లోనూ రాణించేవాడిని.
మా బావగారు (ఆయనే మా మావగారు కూడా)ఉద్యోగం మానేసి, పౌరోహిత్యం చేసేవారు. బాగా సరదా మనిషి. ఊళ్ళో ఒక గ్రూప్ తోటి సాంఘిక నాటకాలు వేయించేవారు. ఆ నాటకాలు, రిహార్సిల్స్, వాటిలో పాటలు, అలా చూస్తూ పాట నా చెవిన పడడం జరిగింది. అవి వినడం, పాడడం, నేనూ పాడగలను అన్న నమ్మకం ఏర్పడడం ద్వారా పాటంటే ఒక మక్కువ ఏర్పడింది. ఇది మొదటి బీజం.
ఆ తర్వాత ఇంటర్మీడియట్ కి నర్సరావుపేట వచ్చి చదివి, ఎంసెట్ రాంక్ సంపాదించడం, ఆ తర్వాత వరంగల్ ఆర్.ఈ.సి. లో ఇంజనీరింగ్ లో చేరటం జరిగింది. ఇవే బాల్యపు తీపి గుర్తులు. కాని, పల్లెటూరి వాతావరణంతో ఒక అనుబంధం, పరిచయం అనేది, నాకొక బ్లెస్సింగ్ గా నేను భావిస్తాను. ఆ స్పర్శ మనకు తెలీకుండా మనసులో ఒక తడిని కలుగజేస్తుంది. ఆ అనుభవం అనేది, ఎప్పటికైనా చాలా అక్కరకొచ్చే వ్యవహారం. నా వృత్తికి, అలాగే భావుకత పరంగా సరైన జీవన స్పర్శను పరిచయం చెయ్యడానికి, అది ఉపయోగపడింది.
సాహిత్యం పట్ల చిన్నప్పటి నుంచీ మీకు అభిరుచి ఉండేదా ? ఎటువంటి పుస్తకాలు చదివేవారు ?
నేను చదువే తప్ప వేరే పుస్తకాలు చదవలేదండీ. మా నాన్నగారు బాగా చదివేవారండి. ఆయన కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి గారి నవలలు లైబ్రరీ నుంచి తెచ్చుకుని చదివేవారు.
నిజం చెప్పాలంటే, నాకు చదవడం మీద కూడా ఆసక్తి లేదు. మహా ఐతే, న్యూస్ పపెర్, అప్పుడప్పుడు మాగజైన్స్  చదివేవాడిని. చందమామ, బాలమిత్ర , బాలజ్యోతి వంటివి లైబ్రరీ లో చదివేవాడిని. నవలలు చదివేవాడిని కాదు. మంచి చదువరిని కాదు, అదే నా లోపమేమో అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
బి.టెక్, ఎం. టెక్ ఖరగ్పూర్ అంటూ చదువుల మీదే పడింది వ్యవహారం. చదువు తర్వాత బెంగుళూరు లో ఉద్యోగం, అక్కడి పరిచయాలతో అప్పటిదాకా పాడటం అలవాటున్న నన్ను రాసేలా చేసాయి. అప్పటినుంచి రాయడం అనేది ఇష్టపడడం మొదలుపెట్టాను. వెనుకటి రోజుల్లో కవులు రాసిన దానికి బాణీలు కట్టేవారు. కాని ఇప్పుడు సంగీత దర్శకులు ఇచ్చిన ట్యూన్ లో మనం ఒక భావాన్ని ఇమడ్చగలగాలి. ఇది నాకు ఒక పజిల్ ని పూరించిన కిక్ ని ఇచ్చింది. అదే చేస్తూ, చేస్తూ, అదే పనిని మరింత సమర్ధవంతంగా చెయ్యడం మొదలుపెట్టాను. అలా రాయడం నా ప్రొఫెషన్ అని నిర్ణయించుకున్నప్పటి నుంచి కొద్దో గొప్పో ఏదన్నా పాట వింటే, అధ్యయనం చెయ్యాలి అన్న ధ్యాసతో వినడం, రాగాలాపన వింటే, ఇందులో మనకు పనికొచ్చేది ఏమైనా ఉంటుందా అన్న దృష్టితో చూడడం, ఈ మాత్రం కసరత్తే కాని, నేను ఇంతకుముందు పుస్తకాలు అవీ చదివి వచ్చినవాడిని కాదు.
సినీరంగ ప్రవేశం ఎలా జరిగిందండి ?
సీతారామశాస్త్రి గారి వద్దకు రావడం అనేది, నా జీవితంలో చేసుకున్న గొప్ప అదృష్టం. బెంగుళూరు నేను వెళ్ళీ వెళ్ళగానే పరిచయం అయిన వ్యక్తులు శ్రీచంద్ర గారు – రైటర్, సుజాత దత్ గారు – సింగర్. వీళ్ళు బెంగుళూరు లో స్థిరపడ్డ తెలుగువాళ్ళు. వీళ్ళ దగ్గర నేను స్వాతిముత్యంలో కమలహాసన్ లాగా తిరుగుతూ ఉంటే, వాళ్ళు వాయిస్ చెక్ చేసి, “అంత గొప్పగా ఉండదు, నువ్వు రాయచ్చు కదా, మేము రాస్తుంటే నువ్వు వెనుక అందించే నాలుగు మాటలు చాలా సమంజసంగా ఉంటాయి. చూస్తుంటే నీకు రాయటం మీద ఆసక్తి ఉన్నట్లు ఉంది. రాయటం ఎందుకు మొదలుపెట్టకూడదు ?” అన్నారు. వారే ప్రాజెక్ట్  లు ఇప్పించారు. అలా వారి ప్రోద్బలంతో ప్రారంభించి, బెంగుళూరు లో ఉంటూనే 40,50 ప్రైవేట్ కాసేట్ లకు రాసాను. అలా రాస్తున్నప్పుడు ఒకానొక్క పరిచయం వల్ల, ఎల్.ఎన్.శాస్త్రి (లక్ష్మీ నరసింహ శాస్త్రి) గారని, ఆయన నన్ను హీరో రవిచంద్రన్ దగ్గరకి తీసుకెళ్ళారు. అప్పుడు ఆయన ఏదో తెలుగు/కన్నడం ప్రాజెక్ట్ ఉందని తీసుకువెళ్ళారు. అది అవ్వకపోయినా, ఆయనతో నా పరిచయం బలపడింది. అలా అప్పట్లో ఆయన సంగీత దర్శకత్వం వహించేవారు కనుక వారి ఇంట్లో ఒక సంగీత వాతావరణం ఉండేది. నాకు సినిమా పిచ్చి కనుక, నేనూ అక్కడికి వెళ్ళేవాడిని. అలా పరిచయం పెరగ్గా, ఆయన ఒక సినిమా నాకోసం డబ్బింగ్ చెయ్యమన్నారు. ఆ డబ్బింగ్ సినిమా తాలూకు అన్ని పాటలు నేను రాసాకా, ఉద్యోగం మారి, హైదరాబాద్ వచ్చాను. రవిచంద్రన్ గారు కృష్ణవంశీ గారిని కలిసి, పాటలు వినిపిస్తే, ఇవేవో డబ్బింగ్ పాటల్లా ఉన్నాయి అన్నారట. అయితే, తెలుగు శాస్త్రి (ఎల్.ఎన్.శాస్త్రి గారిని కన్నడం శాస్త్రి అని, నన్ను తెలుగు శాస్త్రి అని, అనేవారు) గారు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు, మీ ఆధ్వర్యంలో మళ్ళీ రాయించండి, అన్నారు. నేను కృష్ణవంశీ గారిని కలిసి, ‘నేను నిజానికి రాయగలిగేంత సమర్ధత ఉన్నవాడిని కాదు, ఒకపని చేద్దామండి, సిరివెన్నెల గారి వద్దకు వెళ్దాము. నేను కన్నడం తెల్సిన తెలుగువాడిగా ఆయన వద్ద కూర్చుని, రాయించుకుంటాను ‘ అన్నాను. అలా సీతారామశాస్త్రి గారిని కలిసినప్పుడు, ‘నేను రాయటం అంటే రాస్తున్నాను కానీ అవి అరకొరగానే ఉంటున్నాయి, కానీ మీ దగ్గర శిష్యరికం చేసి, నా టాలెంట్ ను ఫైన్ ట్యూన్ చేసుకోవాలని ఉంది,’ అని విన్నవించుకున్నాను. ఆయన ఒప్పుకున్నారు. అలా గురువుగారి వద్ద శిష్యరికం చేస్తుండగా, ప్రొడ్యూసర్ రవికిషోర్ గారు నాతో ఆయన సినిమాలో అవకాశం ఇస్తున్నట్లుగా  శాస్త్రి గారితో ముందుగా చెప్పారు. శాస్త్రి గారు కూడా పెద్దమనసుతో తను రాయాల్సిన మరొక పాటను కూడా నాతో రాయించి రెండు పాటలతో నా కెరీర్ కు శ్రీకారం చుట్టారు. అలా మొదలైంది.
పాట రాయటం పూర్తయ్యాకా, మీ కుటుంబసభ్యులకు గాని, స్నేహితులకు గానీ వినిపిస్తారా ? ఒక్క పాటకి ఎన్ని వర్షన్స్ రాస్తారు ?
అన్ని పాటలు అందరికీ వినిపించను, ఒక్కోసారి మూడ్ ని బట్టి వినిపిస్తాను. కాని, రిలీస్ కు ముందు రికార్డు అయిన పాటలు కొన్ని నా దగ్గరకు వస్తుంటాయి. అవి ఎప్పుడన్నా, ఇంట్లోవాళ్ళకి వినిపిస్తాను.
ఇకపోతే వెర్షన్స్ అన్నీ ఇన్నీ అని ఏమీ ఉండదు, ప్రొడ్యూసర్, దర్శకులకి ,నాకు సంతృప్తి కలిగేంతవరకు రాస్తూనే ఉంటాను.
ఎక్కువ సమయం తీసుకుని, ఎక్కువ వర్షన్స్ రాసిన పాట ఏదైనా ఉందా ?
చాలా ఉంటాయి. ప్రతి పాటకి కూడా నేను ఎక్కువ వెర్షన్స్ రాస్తాను. ఎక్కువ సమయం అన్న లెక్కలో చెప్పడం కష్టం.
పాట నాలుగు కాలాల పాటు నిలబడాలి అంటే, నాలుగు వెర్షన్లు రాయాలి. శ్రమ పడేందుకు వెనకాడను. అంతా మనమంచికే అని వెళ్ళిపోతూ ఉంటాను.
ఏదైనా పాట రాయలేను అని తప్పుకున్న సందర్భాలు ఏవైనా ఉన్నాయా ?
అస్సలు లేవండి.
ఈ మధ్య కొన్ని పాటలు మరీ ఇబ్బందికరంగా ఉంటున్నాయి. అసలు మీ దృష్టిలో సినిమా పాట అంటే ఎలా ఉండాలి ?
ఎలా ఉండాలో కాదు గాని, ఎలా ఉండకూడదు అన్న విషయం మీద నాకు క్లారిటీ ఉంది. పాట పరంగా నేను కర్తని కాదు. నావరకు నా మనోభీష్టం ప్రకారం రాసుకోవాలి అంటే, సినిమానే నాకు మాధ్యమం కాదు. విడిగా గేయాలు, కధలు, కవితలు రాసుకోవచ్చు, నా ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, పుస్తకాలు వేసుకోవచ్చు, బ్లాగ్ లో పెట్టుకోవచ్చు. నాకు స్వేచ్చ ఉంటుంది. కాని, నేను సినిమా అనే మాధ్యమాన్ని ఎన్నుకున్నప్పుడు నా పరిమితులు నాకుంటాయి.
సినిమా రంగంలో పాట అనేది కధతో మొదలై, సందర్భం, దర్శకుడు, పిక్చరైజేషన్ వంటి అంశాలపై ఆధారపడుతుంది. కాబట్టి ఇక్కడ కర్త నేను కాదు. వాళ్ళు అనుకున్న సందర్భానికి, నాకు రాయగలిగే శక్తి ఉంది కనుక, నేను రాస్తున్నాను. ఇదీ నా ప్రొఫెషన్. అయితే ‘అంతా వాళ్ళు చెప్పినట్టే రాస్తావా, నీదేమీ ఉండదా’ అని మీరు అడిగితే – నాదైన ఉనికిని చాటుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తాను.  నాకు నచ్చని పద్ధతిలో ఉన్నప్పుడు దాన్ని నిరోధించే ప్రయత్నం కూడా చేస్తాను. ఏదైమైనప్పటికీ, వాళ్ళకు కావాల్సిన పద్ధతిలో రాస్తున్నప్పుడు నాకు పూర్తి స్థాయి స్వేచ్చ ఉండదు. కాబట్టి, ఎలా ఉండాలి పాట అన్నది నిర్దేశించే హక్కు నాకు లేదని భావిస్తాను. కాని, ఎలా ఉండకూడదు అన్న దానిపట్ల నాకొక లెక్క ఉంది, దాన్ని నేను పూర్తి స్థాయిలో నిలబెట్టుకోగలను. అనుకుంటే అలా చెయ్యగలిగే శక్తియుక్తులు, మరికొంత సమయం కేటాయించగల ఓర్పు నాకున్నాయి. కమర్షియల్ సినిమాకు రాస్తున్నాము కదా అని, కుటుంబసభ్యులతో కూర్చుని, వినలేనటువంటి పాటలు రాయకూడదు. అలా అని అశ్లీలం, శృంగారం ఒకటే కాకుండా, విభిన్నమైన ఉద్వేగాలలోనూ సమాజాన్ని చెడుగా ప్రేరేపించే మాటలు ఏవైనప్పటికీ నాకు నిషిద్దం. ఎందుకంటే పాట  రాగప్రధానంగా ఉంటుంది కాబట్టి, సినిమా అనేది పాపులర్ మీడియా కాబట్టి, వద్దన్నా చెవిలో రింగుమని మ్రోగుతూ, సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయి సమయానుకూలంగా గుర్తొస్తాయి కొన్ని మాటలు. అలా గుర్తొచ్చిన మాటలు మనిషిని చెడుదారి పట్టించకూడదు. రచయత కలం నుంచి వచ్చిన మాటలు, ఈ మాధ్యమం ద్వారా మంత్రాక్షరాలు అయిపోతాయి. అవి మంచి చేసే మాటలు కాకపోయినా, చెడు చేసేవి మాత్రం కాకూడదు. చెడుగా అనకూడదు అన్న పరిశుద్ధత నాకుంది. రోజులు మారుతున్న తరుణంలో ‘చెడు చెయ్యకుండా ఉండడమే మంచి’ అన్న సూత్రాన్ని నేను నమ్ముతాను. నా మూలంగా చెడు జరక్కుండా జాగ్రత్తవహిస్తాను.
ద్వంద్వార్ధాలు లేకుండా మీరు అభిమానించే సిరివెన్నెల గారిలా పాటలు రాయడం, దర్శకులని ఒప్పించడం కష్టమైన విషయమా ? ఆయన రాయగలిగినప్పుడు మిగతా రచయతలు ఎందుకు రాయలేకపోతున్నారు ?
ఇది ఎవరూ చెయ్యలేని పనేమీ కాదండి. ఇప్పుడు నేను ఇలా అంటున్నాను అంటే, నేనేదో గొప్పవాడినని కాదు. ఆ ఒరవడిలో ఉన్నాను కాబట్టి, ఈ వృత్తిలో సాధకబాధకాలు గ్రహించాను కనుక, ఈ మాట అనగలుగుతున్నాను. అదేంటంటే వృత్తిపరమైనటువంటి ఒత్తిడులు ఎంతోకొంత ఉన్నప్పటికీ, ద్వంద్వార్ధాలు లేకుండా రాయడం అనేటువంటిది  అనేది పూర్తిగా నిబద్ధతకు సంబంధించినవి. పాట రాయటం విషయంలో ఎవరి పరిణితి ఎలా ఉన్నప్పటికీ, సంకల్పం స్థాయిలో ఒక క్లారిటీ ఉంటే తప్పకుండా ఆచరణలో అది ప్రతిఫలిస్తుంది. అందుకే సంకల్పం స్థాయిలో నన్ను నేను కరెక్ట్ గా మౌల్ద్ చేసుకుని, విలువల విషయంలో రాజీ లేకుండా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు నేనెలా ఉన్నానో సమీక్షించుకుంటూ ఉంటాను. అలా నేను లేనప్పుడు ఎత్తి చూపించే హక్కు, మీతో సహా అందరికీ ఉందని భావిస్తాను.
ఎవరికైనా వ్యక్తిగత విజ్ఞత, సంకల్పం ఉండాలి. అది ఉంటే భగవంతుడు, ప్రకృతి అనుకూలిస్తాయి. పాతతరం రచయతలతో పోల్చుకుని, నేను పిపీలికం అనుకుంటే, నా సత్తా నాకు తెలీకుండానే నిమిత్తమాత్రం అయిపోతుంది. నేను ఆంజనేయస్వామిలా నా శక్తియుక్తులను నమ్మితే, నా శక్తికి మించి పనిచేస్తే, నా సంకల్పం నేరవేరలా పనిచేస్తే భగవంతుడు అనుకూలిస్తాడు. భగవంతుడు అంటే ఎక్కడో లేడు – మన సంకల్పం లోని ఔన్నత్యం, మంచి, ఉదాత్తత, ఇందులోనే ఉంటారు. అందుకే భావాల్లో స్పష్టత ముఖ్యం. అది కలిగిననాడు ఎవరైనా ఇలా రాయగలరు.
ఇప్పుడు గురువుగారు 30 సం. ఇండస్ట్రీ లో నిలబడ్డారు అంటే, ఆయన ప్రతి ఒక్క ఛాలెంజ్ ని సమర్ధవంతంగా ఎదుర్కున్నారు. అందుకు ఆయన పడే కష్టం, నష్టం అన్నీ నేను కొన్నిసార్లు ప్రత్యక్షంగా చూసాను. ఆయనకీ తేలిగ్గా సిద్ధించవు. కాని చివరికంటా మన సంకల్పాన్ని నిలబెట్టుకుని, ప్రయాణం చెయ్యటంలోనే మన గొప్పతనం దాగి ఉంటుంది. అలా నిలబడ్డ ధీరోదాత్తుడు కాబట్టి, ఈ 30 సం. కాలంలో ఒక్క పాటకూడా అశ్లీలమైన పాట లేకుండా రాయగలిగారు. ఆ ఒరవడిలో నేను ఉన్నాను, ఇంకా చాలామంది రచయతలే ఉన్నారు. మా అందరికీ ఆయన ఆదర్శం.
ఒక్కపాట కూడా రాయకుండా ఇప్పటివరకు ఖాళీగా ఎప్పుడైనా ఉన్నారా? ఉంటే ఎన్నాళ్ళు ఉన్నారు ?
లేదండి. నేను కాస్త లేట్ గా రాస్తాను, నాకు పాటంటే 15 రోజుల వ్యవహారం. కాబట్టి ఎప్పుడూ చేతిలో ఏదో పనుంటుంది. సంవత్సరానికి సుమారు 70 చొప్పున ఈ పదేళ్ళలో, 600 పాటలుమాత్రమే రాయగలిగాను.
ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్ళలో కదలిక తెస్తుంది అంటారు. ప్రస్తుత సినిమా పాటకి ఆ స్థాయి ఉందంటారా ?
లేదని సినికల్ గా ఉండటాన్ని నేను ఇష్టపడను. విషయాన్ని విషయప్రమాణంగా చూడగల ఒక దృక్కోణంలో మనం ఉంటూ బయాస్ అవకుండా, సైడ్స్ తీసుకోకుండా, సత్యాన్ని సత్యప్రమాణంగా తూకం వేసుకోవాలి. ఇదేదో సానుకూల దృక్పధంగా అనుకోవాలి కాబట్టి  అనడం కాదు. ఆమాటకొస్తే సానుకూల దృక్పధం కూడా ఎంతోకొంత కాల్పనికం అవుతుంది. కాని నేను మాట్లాడేది, దానికి మించిన బలమైన నిజం. సరే, ప్రస్తుతం రచయతలు అందరూ చెత్త పాటలు రాస్తున్నారు, అనుకుంటే,  సీతారామశాస్త్రి గారు ఇవాల్టికీ పాటలు రాస్తూనే ఉన్నారుగా. మరి ఆయనా ఈకాలంలోనే ఉన్నారుగా. ఇప్పటికీ కావ్యఖండికలుగా భావించగల పాటలు గురువుగారు రాస్తున్నారు కదా. ఆయనే కాదు, ఆయన స్పూర్తితో  ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో నేను ‘ప్రేమే మానవత్వం, ప్రేమే దైవత్వం’ అన్న పాట రాసాను.  ప్రపంచమంతా కొనియాడిన పాట ‘మౌనంగానే ఎదగమని’ అనే పాట చంద్రబోస్ గారు రాసారు. ఇంకా చాలామంది చాలా గొప్ప పాటలు రాసారు, రాస్తున్నారు.
అక్షరానికి మెదడు కదిలించే శక్తి ఉంది అన్నప్పుడు, సినిమా పాటలో ఉన్నది కూడా అక్షరమే ! ఎటొచ్చి, సినిమా చట్రం రచయతనుంచి ఏ పాటను ఆశిస్తుంది అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.  మొన్న ‘శ్రీమంతుడు’ సినిమాకు నేను రాసిన పాటలకే మంచి పేరొచ్చి, ‘అబ్బ, భలే ఉన్నాయ్, భలే ఉన్నాయ్’ అంటున్నారు. కాబట్టి, మంచి ఇస్తే తీసుకునేందుకు జనం సంసిద్ధంగా ఉన్నారు. మంచి కధలు రావాలి, మంచి దర్శకులు రావాలి, వారు మంచి సందర్భాలు క్రియేట్ చెయ్యాలి, బాగా రాయాలి అన్న జ్ఞానం మనలో కలగాలి కాని, తదనుగుణంగా మనం ఇచ్చే టాలెంట్ ని అక్సెప్ట్ చేసి అందిస్తే, తీసుకునేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. నాతో సహా, ఇప్పుడున్న రచయతల్లో ఎవరూ తక్కువవారు కాదు. టాలెంట్ లేకుండా ఎవరూ ఇక్కడ నిలబడలేరు.
గెలుపు ఓటములని, ప్రశంసా విమర్శలని మీరు ఎలా స్వీకరిస్తారు ?
ఇందాకే నేను చెప్పాను కదా, సంకల్పం విషయంలో నేను రాజీపడితే, ఎత్తి చూపే హక్కు మీతోసహా అందరికీ ఉంటుందని, అంత ఓపెన్ గా ఉంటాను నేను. గెలుపు, ఓటమి అంటూ ఏమీ ఉండదండి. వాటిగురించి నేను ఆలోచించను. గురువుగారు రాసినట్లు, ‘గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు’ అన్నది నేను నమ్ముతాను. నేను ఎప్పటినుంచో, ఆ బెంగుళూరు వారు పరిచయం అయిన దగ్గరినుంచి, మనసులోనే సినిమా పాట రాయాలని  అనుకున్నాను, అదే లక్ష్యంగా ఏర్పడి, దానికోసం మనసులో ఒక తపన, తపస్సు మొదలైంది. అది నెరవేరి, ఒకవైపు నా తపస్సు నేను చేస్తుంటే ,ఒక అవకాశం వచ్చింది. భగవంతుడి దయ వల్ల ఆ ఒక అవకాశం పది అవకాశాలు అయ్యి,  ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఒక స్థాయిలో ఉన్నాను. ఇలాంటప్పుడు, “అందిన వరాన్ని చెయ్యి జారిపోయేలా చేసుకోకుండా , దైవం నాకిచ్చిన అవకాశాన్ని నేను ఎంతవరకు మంచికి ఉపయోగించగలుగుతున్నాను అన్న లెక్కల్లో ఉండటానికి నేను ఇష్టపడతాను. గెలుపు అంటే ఏమిటి – నన్నడిగిన దర్శకుడు, నిర్మాత వారు అడిగిన విధంగా, నా విలువల విషయంలో రాజీ పడకుండా, ఉన్న టైం స్పాన్ లో, వాళ్లకి తృప్తి కలిగేలా రాసి, వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా ఇచ్చి, చిరునవ్వుతో సాగనంపడం నాకు గెలుపు. అంతేగాని, సినిమా సక్సెస్ కాదు. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే, కొన్నాళ్ళకి ఇతరులు నన్ను నాకు పరిచయం చేసి, నా పాటల్ని అభినందించడమే గెలుపు. ఓటమి అనేది లేనేలేదు. అది నాకు సంబంధించిన విషయం కాదు. 5 నెలలు ఇచ్చినా, 3 రోజులు ఇచ్చినా, ఉన్నమేరకు శక్తివంచన లేకుండా పూర్తి స్థాయిలో ఉద్యమించి రాస్తాను. అంతే, నా పని అయిపొయింది, ఇక దాన్ని ఎలా తీసారు, ఎలా చూపారు అన్న ప్రశ్నలు నేను పెట్టుకోను. నా ఇంటెన్షన్స్ గురించి నాకు పట్టింపు, ఏ రకమైన సంకల్పంతోటి నేను పాట రాస్తున్నాను అన్నది నాకు ముఖ్యం. శక్తియుక్తుల్ని నేను పట్టించుకోను.
బాబా గారి సచ్చరిత్రలో ఒక డాక్టర్ కధ ఉంటుంది. డాక్టర్ రోగికి పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇస్తారు, అది వికటించి అతను చనిపోతాడు. ఇప్పుడు డాక్టర్ గారికి పాపం అంటుతుందా అంటదా అన్నది ప్రశ్న. దీనికి జవాబు ఏమిటి అంటే, డాక్టర్ సంకల్పం పేషెంట్ ను రక్షించడమే. అతని సంకల్పం మంచిది అయినప్పుడు అతనికి పాపం అంటదు. ఇక రోగి పోవడం అనేది అతని కర్మ, అంతే. నేను దీన్ని నమ్ముతాను. నా సంకల్పం సరిచూసుకుంటాను, అలా పనిచేస్తే ఔట్పుట్ తప్పనిసరిగా మంచిగానే వస్తుంది.
ప్రస్తుతం గేయరచయతలకు సినీ పరిశ్రమలో ఉన్న విలువ ఏమిటి ?
సంగీత దర్శకులతో పోలిస్తే విలువ కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి. మోసెయ్యడం అంటారు, అలా ఎందుకో తెలియకుండా ఒకరిమీద పొద్దుపొడుస్తుంది, వాళ్ళను ఆకాశానికి ఎత్తేస్తారు, కొంతమంది సోదిలో కూడా ఉండరు. ఏదేమైనా లిరిక్ రైటర్ అంటే, అంత విలువ లేదు. యధారాజా తధాప్రజా అన్నట్లుగా... యధా కాన్వాస్ తధా పాట. మా కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తున్నాము. మాకు సమున్నతంగా ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చి తీరాలి. ఆ గౌరవం కొద్దిగా సన్నగిల్లుతోంది అన్నది నా భావన. నావంతు ప్రయత్నంగా ఆడియో ఫంక్షన్ లలో నేను వెళ్లి, ‘ప్రతి పాట చివర లిరిక్ రైటర్ పేరు తప్పనిసరిగా చెప్పండి, వారు వచ్చినా రాకపోయినా సరే,’ అని మనవి చేస్తాను. పోస్టర్స్ లో పేరు వెయ్యమని అడుగుతాను. మాకూ హక్కుంది, అని నామోషీ లేకుండా అడుగుతాను. నాకు దక్కాల్సిన గౌరవం కోసం పోరాడతాను. తెల్సిన లిరిక్ రైటర్ లకు కూడా అడగమని ఫోన్ చేసి చెప్తాను. ఇంతే, చిన్న చిన్న విషయాలే పెద్ద మార్పుకు దారితీస్తాయి. లిరిక్ రైటర్ తక్కువ సమానం అన్న ఈ కొరత అయితే ఉంది. ఇదేదో, పెద్ద లోపమని నేను అనను కాని, మెల్లగా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని నమ్ముతాను.
 ఇప్పటివరకు లభించిన అత్యుత్తమ ప్రశంస, అతి పెద్ద విమర్శ ఏమిటి ? ఎవరినుండి ?
ప్రశంసా, విమర్శా దేనికైనా నాకు మా గురువుగారు, సీతారామశాస్త్రి గారే. ఆయన పాటనే ఆయన నిప్పులతో కడుగుతారు, అటువంటాయన, నా పాటవిని, ఒక్కలైను ‘బాగుంది’ అన్నా నాకు అంతకు మించిన అవార్డు లేదు, ఆస్కార్ లేదు. మొన్నీ మధ్యే, ఎందరో మహానుభావులు అన్నపాట రాస్తే, ఆయన బాగుంది అన్నారు. అలాగే శుభప్రదం సినిమాలోని తప్పట్లోయ్ తాళాలోయ్... అన్న పాట మెచ్చుకున్నారు.
అలాగే పంజా సినిమాలో ‘వెయ్ రా చిందేయ్ రా’ అన్న ఒక ఐటెం సాంగ్ రాసాను. అది విని ఆయన నన్ను మందలించారు, ‘అలా రాయకుండా ఉండాల్సింది’ అన్నారు. అదొక పాఠంగా భావించి, మళ్ళీ అలాంటి తప్పు చెయ్యను గురువుగారు అన్నాను. ఏదైనా ఆయన నుంచే, ఆయన్ను మించి నాకు ఎవరూ లేరు.
తెలుగు సినిమా పాట పైన మీరు ఎలాంటి ముద్ర వేసాను అనుకుంటున్నారు ?
అది ఫలానా అని నాకుగా అనెను అనుకోటానికి ఇష్టపడనండి. నా పాట ఒరవడి ఇలా వెళ్తోంది అని గమనించి ఎవరైనా చెప్తే వింటాను. అదికూడా నేను సవరించుకోదగ్గ మార్పులు చేర్పులు ఉన్నాయేమో తెలుసుకోవాలన్న సమీక్షా దృక్పధంతో నేను మీవంటి వారినుంచి విని, అడిగి, తెలుసుకుంటాను.
గేయరచయతలుగా సినీ రంగంలో అడుగు పెట్టాలని అనుకునేవారికి మీరిచ్చే సందేశం ఏమిటి ?
సందేశం కాదు గానీ, సమాజం పట్ల ఉన్న కన్సర్న్ తో నాకు తోచింది చెప్తాను. బయటి నుంచి సినీరంగం చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. వచ్చాకా, ఒక్కరోజులో విజయం లభించదు, మన పునాదులు గట్టిగా ఉండాలి. పట్టుదల, ఓర్పు, నిరంతర కృషి అనే విషయాలు ధృడ చిత్తం ఉండాలి. ఒక్కోసారి అనుకున్నది నెరవేరలేదు అన్న నిరాశతో ఆత్మహత్యకు ప్రయత్నించడాలు వంటివి చెయ్యకూడదు. వచ్చే ముందే, ‘ఇది లేకపోతే నేను బ్రతకలేను అన్నంత పాషన్ మనకు ఉందా?” అన్నది ప్రశ్నించుకోవాలి. దానితోపాటు, అది ఎంత కాలమైనా దీన్ని సాధించుకోవడానికే నా జీవితం అన్న పట్టుదల కూడా ఉండాలి. ఇవి ముఖ్యమైన అర్హతలు, వీటి గురించి ఎవరికి వారే ఆలోచించుకోవాలి. పాత, కొత్త పాటల్ని అధ్యయనం చేస్తూ సాధన చెయ్యాలి. దీనికి మన కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయా, అన్నది ఆలోచించుకోవాలి. ప్రయారిటీలు, బాధ్యతలు ఆలోచించుకోవాలి. చివరికి చెప్పేది ఏమిటంటే, ఇలాంటి నిర్ణయాలు కుటుంబ నేపధ్యంలో తీసుకోవాలి.
ముందుతరాలకి మీరు ఎలా గుర్తుండిపొవాలి అనుకుంటున్నారు ? అందుకు మీరు చేస్తున్న కృషి ఏమిటి ?
నాకు అలాంటి నియమాలు లేవు. నాకు ఇష్టమైన పని చేసే అవకాశం దైవం నాకు ఇచ్చినప్పుడు, నా మూలంగా సమాజానికి నాలుగు మంచి ముక్కలు వెళ్ళగలిగేలాగా ఆయన నన్ను వాడుకోవాలి. రేపటి పిల్లలకి ఎలా గుర్తుండాలి అన్నది కూడా అనుకుంటే అయ్యేది కాదు, ఇవాల్టికి ఇలా ఆలోచిస్తాను. దీనికి అనుగుణంగా పనిచేస్తాను.
చాలా సంతోషమండి, మీ విలువైన సమయాన్ని కేటాయించి, ఎన్నో సంగతులను పంచుకున్నందుకు మా పాఠకులు అందరి తరఫునా కృతజ్ఞాతభివందనాలు.
మీ ద్వారా నన్ను నేను ఆవిష్కరించుకునే అవకాశం ఇచ్చినందుకు నాకూ చాలా ఆనందంగా ఉందండి. మీ చదువరులకు శుభాకాంక్షలు, అభినందనలు. థాంక్స్ అండి. నమస్కారం.
************

No comments:

Post a Comment

Pages