గాన గంధర్వులు - పద్మశ్రీ కె.జె.యేసుదాస్ - అచ్చంగా తెలుగు

గాన గంధర్వులు - పద్మశ్రీ కె.జె.యేసుదాస్

Share This

 గాన గంధర్వులు  - పద్మశ్రీ కె.జె.యేసుదాస్

- మధురిమ 


మందరస్థాయి నుండీ తార స్థాయి వరకు ఏ స్థాయిలో పాడినా "జనమందరినీ" తన కంచు ఘంట లాంటి కంఠంతో తమని తాము మైమరచిపోయేలా చేసే స్వరమాంత్రికులు ఎవరో కాదు "గాన గంధర్వ" అని సంగీతాభిమానులు, "దాసేట్టన్" అని మలయాళీయులు ముద్దుగా పిలుచుకునే పద్మశ్రీ డా. కె.జె.యేసుదాసు గారు.
గానమే ఓ గాయకుడి జీవం. అందుకే ఓ కవి"నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాశం గానం" అన్నాడు. గానమే గాయకుడి భాష కూడా. భాష అంటే భావాన్ని వ్యక్తం చేసేది.అందుకే తమిళం,మలయాళం,తెలుగు,హిందీ ఇలా భాషలకి మనం పెట్టుకున్న పేర్లు గాయకులకు వర్తించవు. వారి భాష ఒకటే అది వారి గళం. వారి గళం సప్తస్వరాల మధువనం.
ఆ మధువనానికి ఎల్లలు లేవు. రసికులైన  శ్రోతలు భాషాభేదాన్ని కాస్త పక్కన  పెట్టి ఆ మధువనానికి వెళితే సుమధుర భావనా గీతాలను ఆశ్వాదించవచ్చు. ఇది సత్యం కనుకనే జన్మతః మళయాళీయుడైన శ్రీ యేసుదాసు గారు  ఇరవై భాషలలో పాడి జనమందరినీ తన గాన మాధుర్యంతో మెప్పించారు.
 కట్టస్సెరి జొసెఫ్ యేసుదాస్ 1940వ సంవత్సరం జనవరి 10వ తేదిన అగస్టీన్ జొసెఫ్,ఆలిస్ కుట్టి అనే రోమెన్ కేథలిక్ దంపతులకు కేరళా రాష్ట్రంలో ఫోర్ట్ కోచి అనే గ్రామంలో జన్మించారు.తండ్రి గారు ప్రసిద్ధ మళయాళీ శాస్తీయ సంగీత విద్వాంసులు,కళాకారులు కూడా.తండ్రిగారే సరిగమలు నేర్పిన తొలి గురువులు కూడా. బాల్యం నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ అదే తన జీవిత గమ్యం గా దిశా నిర్దేశం చేసుకున్నయేసుదాసుగారికి ఆర్.ఎల్.వి.మ్యూసిక్ అకాడమీ (త్రిప్పునితురా) ఆ దిశ గా పయనించడానికి ఎంతో తోడ్పడింది.
ఆ తరువాత స్వాతి తిరునాళ్ కాలేజ్ ఆఫ్ మ్యూసిక్ తిరువనంతపురంలో శ్రీ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగార్ ,శ్రీ కె.ఆర్. కుమార స్వామి వంటి దిగ్గజాల వద్ద శిష్యరికం చేస్తూ శాస్తీయ సంగీతం నేర్చుకున్నారు. కాని కొన్ని ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆ కాలేజీలో సంగీత శిక్షణ సగంలో ఆగిపోయినా నిరుత్సాహ పడక చెంబై వైద్యనాధ భాగవతార్ వద్ద శిక్షణ పొందుతూ ఉండేవారు.
ఈ ప్రయాణం ఇలా కొనసాగుతూ ఉండగా 17ఏళ్ళ వయసులో కేరళా రాష్ట్ర స్థాయి యువకుల కర్ణాటక గాత్ర సంగీత పోటీలలో బంగారు పతకాన్ని సాధించారు.ఇది ఆయన తొలి విజయ సోపానం. ఇక తరువాత ఎప్పుడు జీవితంలో వెను తిరిగి చూడలేదు ఆ విజయపథం వైపు అలా పురోగమిస్తూనే ఉన్నారు.
ఆ తరువాత కేరళా కేథలిక్ యువ ఉత్సవాలలో కూడా పాల్గొంటూ ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. ఇక ఆ తరువాత కేరళా రాష్ట్రంలో ఇంచుమించు ప్రతీ ఊరులో సంగీత కచేరి చేసిన ఘనత ఆయనదే.ఈవిధంగా శాస్తీయ సంగీత ప్రస్థానం కొనసాగుతూ ఉండగా 1961 నవంబర్ 14న సినీ సంగీత జగత్తులో ఓ శుభారంభం జరిగింది. ఓ కొత్త పరిణామానికి నాంది పలికింది ఆరోజు.ఎలా అంటే యేసుదాసు గారు తన మొట్ట మొదటి ప్లేబ్యాక్ రికార్డింగ్ మళయాళంలో చేసినది ఆరోజే.   ఆ పాట భావం ఇలా ఉంటుంది. "ఈ పుడమిపైనే జాతిభేదం,మతద్వేషం లేకుండా సోదర భావంతో సంఘీ భావంతో కులమత విభేదాలు లేకుండా జీవించ గలిగే అవకాశం ఉంది" అని. ఇంత మంచి సందేశాత్మకమైన పాటతో తన సినీ సంగీత జైత్రయాత్ర కు శ్రీకారం చుట్టారు శ్రీ యేసుదాసు గారు.ఇక అప్పటినుంచీ శాస్త్రీయ సంగీత కళాకారుడిగా ఎంత ప్రతిభ కనబరుస్తూ ఎదిగారో,సినీ సంగీత జగత్తులో కూడా తన మధురమైన విలక్షణమైన గాత్రంతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.1962వ సంవత్సరంలో "కాలేపాదుకల్" అనే మలయాళీ చిత్రంలో ప్లేబ్యాక్ పాడడం మొదలు పెట్టాక ఇక అప్పటినుండీ తెలుగు,తమిళ ,కన్నడ,హిందీ మొదలగు భాషలతో కలిపి మొత్తం 20 భాషలలో పాడారు.భారతదేశంలో కాష్మీరి,అస్సామీ తప్ప మిగిలిన అన్ని భాషలలో పాడిన రికార్డ్ కూడా ఆయనదే. 2011వ నేపధ్యగానం లో 50 వసంతాలు పూర్తి చేసుకుని ఇంకా నిర్విరామంగా 54 సంవత్సరాలుగా పాడుతూనే ఉన్నారు. మన భారత దేశ భాషలలోనే కాక మలేసియన్,రష్యన్,అరబిక్,లాటిన్,ఆంగ్ల భాషలలో కూడా పాడి శ్రోతలను మెప్పించారు.
మళయాళంలో (సలిల్-యేసుదాస్-ప్రేమ్ నాజిర్) వీరి ముగ్గురి కలయిక లో వచ్చిన అన్ని చిత్రాలు సంగీత పరంగా సంచలనం సృష్టించాయి.1970వ సంవత్సరంలో యేసుదాసు గారు హిందీ సినీపరిశ్రమలో అరంగ్రేటం చేశారు. ప్రఖ్యాత హిందీ కథానాయకులైన అమితాబ్,అమోల్ పాలేకర్, జితేంద్ర వంటివారికి తన గళాన్ని అందించారు. బప్పిలహరి, రవీంద్రజైన్,ఖయ్యం,సలీల్ చౌదరి,వంటి మేటి సంగీత దర్శకుల సారధ్యంలో పాడి దక్షినాది నుండీ వచ్చినా ఉత్తర భారత దేశ ప్రజలను కూడా మెప్పించ గలిగినా అనితర సాధ్యులు.
1976లో రవీంద్ర జైన్ గారి సంగీత సారధ్యంలో విడుదలైన చిత్ చోర్ యేసుదాసు గారి జీవితంలోనే ఓ మైలురాయి అనుటలో ఏ అతిశయోక్తి లేదు.ఈపాటలు చాల సంగీత మాధుర్య ప్రధానమైనవి.స్వతహా గా యేసుదాసుగారు శాస్త్రీయ సంగీతాన్ని ఔపాశన పట్టినవారు కనుకనే ఇంత బాగా పాడగలిగారన్నది ఇంకో నిజం.రవీంద్ర జైన్ గారు యేసుదాసు గారిని "వాయిస్ ఆఫ్ ఇండియా" అని సంభోదించేవారట. రవీంద్ర జైన్ గారికి కంటి చూపు లేదు,జన్మతహ అంధులు. వారు ఓసారి ఏమన్నారంటే "భగవంతుడు నాకు ఒక్క సారి కంటి చూపుని ఇస్తే చాలు.ఒక్కసారి యేసుదాసును కళ్ళారా చూస్తాను నాకు ఇంకేమీ అఖర్లేదు".
ఒక వ్యక్తికి ఇంతకన్నా అపూర్వమైన గౌరవం ఇంకేముంటుంది??1965లో రష్యా ప్రభుత్వంచేత ఆహ్వానించబడి అక్కడ ఎన్నో కచేరీలు చేసి,అక్కడ కజకిస్తాన్ రేడియోలో కూడా రష్యన్ భాషలో  ఓ పాట పాడారు.
ఓ కళాకారుడిగా ఎంత ఎత్తు ఎదిగినా యేసుదాసుగారు కాంక్షించేది,అధికంగా ప్రేమించేది జాతీయ సమైక్యతా భావాన్ని అందుకే ఆ దిశ గా ఎన్నో కార్యక్రమాలు చేశారు.
1971వ సంవత్సరంలో ఇండియా-పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు,కేరళా రాష్ట్రంలో వీధి వీధి ఒక ట్రక్కులో పర్యటించి కచేరీలు చేసి,విరాళాలు సేకరించి అప్పటి ప్రధాన మంత్రిగారైన శ్రీమతి ఇందిరా గాంధీ గారికి యుద్ధనిధిగా అందజేసిన గొప్ప దేశ భక్తులు కూడా,ఏ ప్రసార మాధ్యమాల ప్రభావంలేని రోజుల్లో కేవలం తన సంగీతాన్నే ఒక మాధ్యమం గా వాడుకుని కేరళా రాష్ట్ర ప్రజలయొక్క జాతీయ సమైక్యత్వాన్ని ధిల్లీ కి తీసుకువెళ్ళిన  మహోన్నత వ్యక్తి.
ప్రతీ వ్యక్తి మాతృ,పితృ,గురు ఋణాలతో పాటుగా సామాజిక ౠణాన్ని కూడా తప్పని సరిగా తీర్చుకుని తీరాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి.దీన్ని ఆచరించి చూపారు మన యేసుదాసు గారు.
 అలాగే 1999వ సంవత్సరంలో యునెస్కో శాంతి కి సంగీతం(మ్యూసిక్ ఫర్ పీస్) అనే కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ శతాబ్దానికి శాంతితో స్వాగతం పలకాలని నిర్వహించింది ఆ కార్యక్రమంలో పాడే అరుదైన అవకాశాన్నిదక్కించుకున్నారు  శ్రీ యేసుదాసు గారు.
2001వ సంవత్సరంలో "అహింస" అనే ఆల్బం కోసం సంస్కృతం, లాటిన్ భాషలలో కూడా పాడారు.అరబిక్  దేశాలలోని వారి సంగీతాన్ని  కర్ణాటక సంగీత శైలిలో  పాడి వారిని మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
అలాగే 2004వ సంవత్సరంలో  సునామీ వచ్చినప్పుడు చెన్నై లో అన్ని మతాల వారిని ఆహ్వానించి ప్రజలందరి శాంతి సౌఖ్యాలకై ఒక యాగాన్ని నిర్వహించారు దీని బట్టి ఆయన నమ్మిన సర్వమత సమానత్వ సిద్ధాంతాన్ని కేవలం మాటలకే పరిమితం చెయ్యక ఆచరించి చూపిన త్రికరణ శుద్ధి గలిగిన పుంభావ సరస్వతీ స్వరూపం.
లండన్ నగరంలో రోయల్ ఆల్బెర్ట్ హాల్ లో, సిడ్నీ నగరంలోని ఒపెరా హౌస్ లో గానం చేసే అవకాశం దక్కించుకున్న అతి కొద్ది మంది భారతీయులలో వీరొకరు.
అన్ని మతాలు చెప్పేది ఒక్కటే ప్రేమ ,శాంతి,కాని నేడు మతం నేడు మారణహోమం సృష్టించడం నాకు చాల బాధ కలిగిస్తూనుంటుంది అని తన మనోవేదనను ఓసారి తెలియజేస్తూ తన చిన్ననాటి అనుభవాన్ని ఇలా తెలియ జేశారు. ఓసారి ఈయనకు పాఠశాలలో క్రైస్తవులు స్వర్గానికి వెళతారని చెప్పారట. అప్పుడు పరుగుపరుగున ఇంటికి వచ్చి  క్రైస్తవులే స్వర్గానికి వెళితే మరి అక్కడ నేను ఎవరితో ఆడుకోను నా హిందూ స్నేహితులందరు అక్కడికి రాలేరు కదా అని అమాయకంగా ఏ కల్మషం లేకుండా తండ్రిగారిని అడిగారట.దానికి తండ్రిగారు ఇలా చెప్పారట"నీ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే నువ్వు అన్ని మతాలను గౌరవించాలి అని."తండ్రిగారి మాటని తూచా తప్పకుండా పాటించారు కాబట్టే అంత పరమత సహనం అలవరుచుకోగలిగారు.
ఈ నాగరిక సమాజంలో నేడు ఇన్ని కులాలు ఇన్ని మతాలు వ్యాప్తి చెందినా ఉన్నది ఒక్కటే  దైవం.కాని ఆయనను వేరు వేరు మతాల వారు వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు.యేసు అన్నా ఈసా,ఈశ్వరా అన్నా పలికేది ఒక్కరే. వేద శాస్త్ర సారం అయిన ఈ రహస్యాన్ని,తత్వాన్ని తన నర నరాలలో జీర్ణించుకున్నారు కాబట్టే మానవులందరిదీ ఒకే కులం,ఒకే మతం అన్న సందేశాన్ని తన గానంతో దేశమంతటా వ్యాపింపజేస్తూ ఉన్నారు. దీనికి ఉదాహరణే ఆయన స్వామి అయ్యప్ప పై పాడిన ""హరివారశనం" అన్న పాట.రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించిన ఆయన ఈ పాట ఎంత భక్తితో పాడక పోతే అది అది అంత జనాదరణ పొందుతుంది. ఇంకో విశిష్టత ఏమిటంటే ఈ పాటను ఇప్పటికి చాలమంది కళాకారులు గానం చేసినప్పటికీ ఇప్పటికీ సబరిమలై లో ఆలయం తెరిచిఉన్న రోజులలో రాత్రి పూజ పూర్తి అయిన తరువాత ఆలయన్ని మూసివేసేముందు యేసుదాసు గారు పాడిన ఈ పాటనే వేసి పవలింపుసేవ జేసి  ఆలయాన్ని మూసివేస్తారు. ఆ హరిహర సుతునికి ప్రతిరోజూ తన గానంతో సేవచేసుకునే భాగ్యాన్ని జీవించి ఉండగానే పొందిన ఈయన ఆచంద్రార్కం చిరస్మరణీయులు.యేసుదాసు అంటే భగవంతునికి సేవచేసుకునే దాసుడు.తన పేరు ని  ఇలా సార్ధకం చేసుకున్న నామసార్ధకులు యేసుదాసు గారు.హిందూ దేవాలయాలలోపాడినా,చర్చిలలో ఎక్కడ పాడినా సంగీతమనే మంత్రంతో భగవంతునికి దగ్గరవడానికి ఆయన ప్రయత్నిస్తూ, విన్న మనతో కూడా ఆ ప్రయత్నం చేయిస్తున్నారు.
కానీ ఇంతటి మహోన్నతమైన వ్యక్తికి ఇప్పటికీ గురువాయూరు దేవస్థానంలోకి ప్రవేశించడానికి అనుమతి లభించకపోవడం దురదృష్టకరం. ఈయన ఎంతటి దైవ భక్తులంటే గత 15 సంవత్సరాలుగా తన జన్మదినాన్ని కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపీ జిల్లాలో ఉన్న మూకాంబికా అమ్మవారి సన్నిధానంలోనే  జరుపుకుంటున్నారు. మూకాంబికా అమ్మవారి సన్నిధానంలోనే సంకీర్తానర్చనచేసి తనకు సంగీత జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటారట.
1980వ సంవత్సరంలో తిరువనంతపురంలో తరంగిణి స్టూడియో స్థాపించారు.తరంగిణీ రికార్డ్స్ కూడా దీనికి అనుబంధ సంస్థ.వీరు యేసుదాసు గారు పాడిన అన్ని భాషలలోని శాస్త్రీయ,భక్తి సినీ సంగీత పాటలను క్యాసెట్లుగా చేసి విక్రయిస్తారు.
ఇక వారి ఆంతరంగిక జీవితానికొస్తే ప్రభాయేసుదాసు గారు వీరి ధర్మపత్ని.వీరికి ముగ్గురు అబ్బాయిలు. వీరిలో రెండవ వారైన విజయ్ యేసుదాసు గారు తండ్రి గారి అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన సంగీత వారసులు.వర్ధమాన సినీ నేపధ్య గాయకులు కూడా.
యేసుదాసు గారికి మాత్రమే వర్తించే కొన్ని నిజాలు: ఇప్పటికి 36 సంవత్సరాలుగా కేరళా లో ప్రఖ్యాత కర్ణాటక సంగీతోత్సవమైన సూర్యా సంగీతోత్సవంలో 36 సార్లు పాడిన ఏకైక వ్యక్తి.అసలు యేసుదాసు గారివలనే ఈ సంగీతోత్సవం ఇంత జనాదరణ పొందిందనే వాదం కూడా ఉంది.
కేరళా రాష్ట్ర ప్రభుత్వం చే ఇప్పటికి 26సార్లు కేరళా స్టేట్ అవార్డ్ గెలుచుకున్న రికార్డ్.ఇక ఆ తరువాత కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే సదుద్దేశ్యంతో స్వచ్చందంగా ఆయనే తప్పుకున్నారు.ఇది వారి ఔదార్యానికి నిలువెత్తు నిజం. హరివరాశనం పాట ఎంతమంది పాడినా దేవస్థానంలో ఈయన గళం మాత్రమే వినిపించడం ఆయనపై దైవానికి గల సంపూర్ణ అనుగ్రహానికి తార్కాణం.
ఇక ఆయనకు లభించిన పురస్కారాల విషయానికొస్తే :ఇప్పటికి భారత ప్రభుత్వంచే 7సార్లు ప్లేబ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న రికార్డ్ ఈయనదే.
ఆం.ప్ర ప్రభుత్వంచే 4సార్లు,కర్ణాటక ప్రభుత్వంచే 3సార్లు,తమిళనాడు ప్రభుత్వంచే 5సార్లు,బెంగాల్ ప్రభుత్వంచే ఒక సారి,కేరళా ప్రభుత్వం చే 26 సార్లు రాష్ట్ర స్థాయి పురస్కారాలు.
1968 లో గాన గంధర్వన్ బిరుదు.
1977లో పద్మశ్రీ
1986లో కలైమామణి
1989లో అన్నామలై విశ్వవిద్యాలయం నుండీ గౌరవ డాక్టరేట్
1993 లో మధ్యప్రదేశ్  ప్రభుత్వంచే  లతామంగేష్కర్ పురస్కారం
1994వ సంవత్సరంలో మదర్ థెరీసా గారిచే""నేషనల్ సిటిజెన్ అవార్డ్ "
2002లో సంగీత కళాశిఖామణి
2004 లో ఫిల్మ్ ఫేర్ సంస్థ వారిచే జీవిత సాఫల్య పురస్కారం.
2005లో విజ్డం ఇంటర్నేషనల్ అవార్డ్
2006లో ఆం.ప్ర ప్రభుత్వంచే నందీ అవార్డ్
2009లో మహాత్మా గాంధి విశ్వవిద్యాలయంవారిచే గౌరవ డాక్టరేట్.
ఇవన్నీ ఆయనకు  లభించిన పురస్కారాలలో పదోవొంతు కూడా కావు. సూర్యుణ్ణి గుప్పెట్లో  బంధించాలనుకోవడం ఎంత అవివేకమో  వారి ప్రతిభను లెక్కించాలనుకోవడమూ అంతే అవివేకము.
కర్ణాటక సంగీతం ఒక మహాసాగరం లాంటిది ఎంతటి విద్వాంసులైనా జీవితకాలమంతా సాధన చేసినా  ఒక్క చుక్క మాత్రమే తాగగలరు అని ఒక సందర్భంలో తెలియచేసి,నాకు ఇప్పటికీ పరిపూర్ణ సంతృప్తి కచేరి చేసెటప్పుడు కన్నా నేర్చుకున్నఫ్ఫుడే కలుగుతుంది అని తన సంగీత తృష్ణని తెలియ జేశారు.ఇప్పటికీ కనీసం 12 గంటలు సంగీత సాధనలోనే గడిపే ఆయన ఖాళీ సమయాల్లోనూ,ప్రయాణిస్తున్నప్పుడూ ఎక్కువగా సంగీతానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ,మహమ్మద్ రఫీ,బాలమురళీ కృష్ణ మొదలగు వారి పాటలు వింటారట.
స్వగృహే పూజ్యతే జ్యేష్టా
స్వగ్రామే పూజ్యతే ప్రభూః
స్వదేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్త్  అన్నట్టు ఇంతటి ప్రతిభావంతులు, యావత్ ప్రపంచంచేత వేయినోళ్ళ కొనియాడబడిన బహుముఖ  ప్రజ్ఞాశాలి. ఎంత ఎదిగినా ఎప్పుడూ ఒదిగి ఉండే వినయవిధేయతలు మూర్తీభవిస్తూ, ఎప్పుడూ తెల్లటి దుస్తులను మాత్రమే ధరిస్తూ శాంత స్వభావనికి నిలువెత్తు రూపంగా చెదరని చిరునవ్వుతో సంగీతాభిమానులందరి మనసులలో ఎల్లప్పుడూ ప్రాతః స్మరణీయులుగానే కాక చిరస్మరణీయులుగా కూడా ఉంటారు.
ఈ జగత్తులో సప్తస్వరాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం శ్రీ యేసుదాసు గారి గళంలో అవి వినిపిస్తూనే ఉంటాయి.
ఏసుదాస్ గారి అమరగానాన్ని క్రింది వీడియోలలో చూడండి...

No comments:

Post a Comment

Pages