దసరా సరదా - అచ్చంగా తెలుగు

దసరా సరదా

Share This

దసరా సరదా

- పూర్ణిమ సుధ 


అమ్మవారి గుడికి వచ్చే భక్తులతో కిటకిటలాడుతున్న బెజవాడలో దసరా ఎలా జరుపుకుంటున్నారో తెలుసుకోవడానికి, ’కెమెరామెన్ నాగశేషం’ తో ’శ్రీనివాసం’ టివి మిర్చీ నించీ వచ్చేసారు... ఇక చదవండి...
1. నా.శే: (నా.శే) అరే... ఎలాగైనా బెజవాడలో దసరా  సందడిని క్యాచ్ చేసెయ్యాలి... ప్రమోషన్ కొట్టెయ్యాలి…
శ్రీ.వా: ఆగరొరేయ్... ఈయనెవరో సదువుకున్నోడిలా ఉన్నాడు… అడుగుదాం... మాస్టారూ… హల్లో మాస్టారూ… మిమ్మల్నే... బెజవాడలో దసరా గురించి చెప్తారా ?
కపి : ఓ… భేషుగ్గా చెబుతాను... అసలే నేను "కపి" ని
శ్రీ.వా: అదేంటి ? కెమెరా ని చూసి, అత్యుత్సాహంతో అన్నట్టున్నారు... కవి అనాలేమో...!
కపి : అది రొటీను… ఇది వెరైటీ… సరే... దసరా గురించి తర్వాత – ముందు "క" మీద ఒకటి వదుల్తా...
శ్రీ.వా: "క" మీద మాకెందుకండీ...?
కపి : ఏకాకిగా, మాంచి కాక మీదున్న మా కుక్క, కాకీక ని పీక్కు తింటుంటే, పక్కనే కూర్చుని, ముక్కలున్న పలావ్ తింటూ, దానికొక్క ముక్క... ఎయ్యకపోయేసరికి, పిక్కట్టుకుంది... ఎక్కడికెళ్ళాలో తెలియక, బిక్క చచ్చి, ఎక్కువ లేట్ చెయ్యకుండా, కుక్కల డాక్టర్ దగ్గరకెళ్ళి, విషయం కక్కాను... మా అక్క వచ్చి, తిక్క వేషాలేసావెందుకురా ? అని నా చొక్కా పట్టుకుని, తొక్క తీసింది... లెక్క లేనన్ని తిట్లు తిన్నాక, కాకి, గాని, కుక్క గాని, దేని జోలికీ వెళ్ళొద్దని మహా చక్కగా తలకెక్కింది... ఎలా ఉంది ? ఇందులో... 47 క లు ఉన్నాయి...
శ్రీ.వా: కానీ మాకు మాత్రం రెండు కాళ్ళే ఉన్నాయి... బాగా అర్థం అయింది... మీరు "కపి" అని... ఇంక ఆపెయ్యండి మహాప్రభో...
శ్రీ.వా: శేషం…
నా.శే: మూసాం...
ప్రస్తుతానికి అదీ సుందరి - కెమెరామెన్ నాగశేషం తో, శ్రీనివాసం… టివి మిర్చి - దసరా సందడి దొరికేవరకూ ఆగదు మా సెర్చి...
- కట్ -
నా.శే: ఈ పిల్లాడినడుగు... దసరా ని క్యాచ్ చెయ్యొచ్చు…
శ్రీ.వా: హి హి హి…
నా.శే: వద్దులే... చిన్న పిల్లలు జడుసుకుంటున్నారు... పెద్దోళ్ళు ప్రేమించారు…ఇదిగో బాబూ...ఇట్రా నాన్న…
పిల్లాడు: చెప్పండంకుల్...
నా.శే: చూడమ్మా...! దసరా గురించి నీకు తెలిసింది చెప్పమ్మా...!
పిల్లాడు: దసరా అంటె సెలవులు… అస్సలు పుస్తకాలు ముట్టుకోవక్కర్లేదు…పాలు తాగుతూ టివి చూడొచ్చు... ఆ పాలు ఆవు నించీ వస్తాయి... ఆవు... ఆవు కి రెండు కొమ్ములు, నాలుగు కాళ్ళూ ఉంటాయి...
శ్రీ.వా: అది కాదు నాన్నా... పూజలు... నైవేద్యాలు...?!
పిల్లాడు: అమ్మ రోజూ పూజ చేసి, నైవేద్యంగా రోజుకో స్వీటు పెడ్తుంది... చాలా బావుంటుంది... స్వీట్లని ఆవుపాలతో చేస్తారు... ఆవు... ఆవు కి రెండు కొమ్ములు, నాలుగు కాళ్ళూ ఉంటాయి...
నా.శే: పాపం... వీడి చేత ఎన్ని సార్లు ఆవు మీద వ్యాసం రాయించారో.. ? వీడు ఇలా ఫిక్స్ అయిపోయాడు... వదిలెయ్ నాన్నా.... ఆడుకో పో...!
కెమెరామెన్ నాగశేషం తో, శ్రీనివాసం… టివి మిర్చి - దసరా సందడి దొరికేవరకూ ఆగదు మా సెర్చి...
- కట్ -
నా.శే: ఈయనెవరో... జెంటిల్మేన్ లా ఉన్నారు... ఈయన్నడిగితే, దసరా సందడంతా పిండేసుకోవచ్చు...! హల్లో మాస్టారూ…
జంధ్యాల ఫ్యాన్ : చెప్పండి…
నా.శే: బెజవాడలో దసరా సందడి గురించి చెప్తారా ?
జంధ్యాల ఫ్యాన్ : నాదీ ఊరు కాదండీ...!
నా.శే: ఓహో...! ఎక్కణ్ణించి, వచ్చారు...!?
జంధ్యాల ఫ్యాన్ : ఆసిఫాబాదు, అదిలాబాదు, అల్లహాబాదు, ఔరంగాబాదు, ఫైసలాబాదు, నిజామాబాదు, దౌలతాబాదు, ముస్తాబాదు, మురాదాబాదు, ముస్తఫాబాదు, సికందరాబాదు, హైదరాబాదు, సిందుబాదు
నా.శే: నా బొంద బాదు - బాబోయ్ - జంధ్యాల సినిమా మళ్ళీ చూసినట్టుంది... బాదింది చాలు... మీరెప్పుడూ ఇలా తిరుగుతూనే ఉంటారా ?
జంధ్యాల ఫ్యాన్ : అంటే అదీ...
నా.శే: వద్దులే... ఈ సారి, మీరు ఏ నగరం మీదో, పాడు మీదో పడితే, తిరిగొచ్చేసరికి, సంక్రాంతొస్తుంది... వదిలెయ్యండి...
శ్రీ.వా: శేషం…
నా.శే: మూసాం...
ప్రస్తుతానికి అదీ సుందరి - కెమెరామెన్ నాగశేషం తో, శ్రీనివాసం… టివి మిర్చి - దసరా సందడి దొరికేవరకూ ఆగదు మా సెర్చి...
- కట్ -
తమిళ తంబి : మీ అమ్మవాండు... మీ అమ్మా వాండు... మీ అమ్మవాండు... నాకోసం కనే వుంటాడు... మీ బాంబు వాడు... నీ కోసం...
నా.శే: తమిళ తంబిలకి, భక్తెక్కువ... ఈడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది... ఎటాక్...
శ్రీ.వా: సర్... బెజవాడ లో దసరా ఎలా జరుగుతుందండి ?
తమిళ తంబి : నాన్ దా ప్రతీ ఏండాది... ఇంగ వచ్చి పూడ్సి, అమ్మవారి ఆశీర్వాదం దండిగా తీసుకుంటా... మా దగ్గర కూడా మదురై మీనాక్షి అంబవారుండారు... సో... అంబ అన్న రొంబ భక్తి... నా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి పూడ్చా...
శ్రీ.వా: అయ్యో... సారీ అండీ...
తమిళ తంబి : ఆండవలే... ఎన్న విషయం ?
శ్రీ.వా: అదీ మీ ఫ్యామిలీని పూడ్చి వచ్చారు కదా...!
తమిళ తంబి : అరెరె... అది ఇల్లప్పా...
శ్రీ.వా: ఆహా...! ఎంత ప్రేమండీ... ఇంట్లోనే పాతేసుకున్నారంటే..!
తమిళ తంబి: యొ... ఎన్నయ్యా నీవు... ఇప్పిడి మాట్లాడ్తుండావు ? విషయం... పూర్తిగా సెప్పి పూడ్సనియ్యరేంటి ? ఫ్యామిలీతో పాటుగా ఫుల్లుగా సాపాట్ సేసి... బీసెంట్ రోడ్ల్ల.... షాపింగ్ సేత్తావుంటే... నీవచ్చి పూడ్చి...!!!
శ్రీ.వా: భాషావస్థ - హ్యాండిల్ చెయ్యడం కష్టం లే... పండగ చేస్కోండి సర్...
శ్రీ.వా: శేషం…
నా.శే: మూసాం...
ప్రస్తుతానికి అదీ సుందరి - కెమెరామెన్ నాగశేషం తో, శ్రీనివాసం… టివి మిర్చి - దసరా సందడి దొరికేవరకూ ఆగదు మా సెర్చి...
- కట్ -
శ్రీ.వా: ఆగరొరేయ్… ఈయనెవరో మాంచి కళ కళ లాడుతున్నాడు... బాబూ... బెజవాడలో దసరా సందడి ఎలా ఉంది ?
దొంగ: అసలు... మా బెజవాడలో దసరా అంటే, నెల మొదట్లో కొట్టేసిన పర్సులాగుంటది...
శ్రీ.వా: అదేంటీ ?
దొంగ: ఫుల్లు జనాలు... చేతికి బోలెడంత పని... అసలు ఆడ లేడీస్ మెడలుంటాయి... అబ్బో... నగలతో ధగ ధగ... నా చేతులకి దురద... అసలు, ఒక్క దసరా ని నమ్ముకుని, బెంజ్ సెంటర్ లో ఇల్లు ప్లాన్ చేసేయొచ్చు తెలుసా ?
శ్రీ.వా: మీరేం చేస్తుంటారండీ ?
దొంగ : అవన్నీ మీకెందుకండీ... ? అబ్బా... చెబుతారు... అవునూ... మీరేంటీ ? జేబులో కార్డ్లు తప్ప, కరెన్సీ ఎట్టుకోరా ? అసలీ కార్డ్ కనిపెట్టినోణ్ణి... కసిగా కుమ్మేస్తా... ఎవ్వడు చూడు... గోకెయ్యడమే... ఇంక మా చెయ్యి దురదకి ఏం గోకాలి ? ఇది వరకు చక్కగా, నెల మొదట్లో... పర్సులు, తొమ్మిది నెల్ల కడుపుతో ఉన్న లేడీస్ లాగా కళకళ్ళాడేవి... ఇప్పుడో... ? జీరో సైజ్ తో కరీనా లా తయారయ్యాయి... మాకిదే సరైన సమయం...
శ్రీ.వా : అమ్మో...! ఈడేదో వ్యాపార రహస్యాలు చెప్పేస్తున్నాడు... మనకి కూడా వాటా ఉందనుకుని కుమ్మే లోపే జంపు...
ప్రస్తుతానికి అదీ సుందరి - కెమెరామెన్ నాగశేషం తో, శ్రీనివాసం… టివి మిర్చి - దసరా సందడి దొరికేవరకూ ఆగదు మా సెర్చి...
- కట్ -
శ్రీ.వా: ఈ మెంటల్ కృష్ణకి వారసుడ్నడుగుదాం...! ఏమండీ... దసరా గురించి మీ అభిప్రాయం...!
పోసాని: అంటే, ఇప్పుడు నేను చెప్పేస్తే, అదే నిజమైపోద్దా ? నేనేమన్నా సరే... ఇరికించేసి, పగులుతున్న వార్తలు, మళ్ళీ చూడండి... అని ఊదరగొట్టేసి, నన్ను అన్ పాపులర్ చేసేద్దామనే ? చూడు రాజా...! ఈ పోసాని కూసాన్ని ఎవ్వరూ కదిలించలేరు...
శ్రీ.వా: అది కాదండీ..! అసలు సరదాగా జరుపుకునే దసరాని...!
పోసాని: సరదానా ? ఎవరికి రాజా ? జనాలొక పక్క ఏవీ కొనుక్కోలేకుండా ఉంటే, సరదా ఎక్కణ్ణుంచొస్తుంది ? నీ పెళ్ళాం నిన్ను "చీర కూడా కొనలేని చేతగాని ఎదవ"... అని తిడితే తెలుస్తాదిరా... "మెంటలోడా"...!
శ్రీ.వా : అదేంటండీ ? అలా తిట్టేసారు ?
పోసాని: ముద్దుకి -  ముద్దొస్తే... అంతే రాజా... ఎళ్ళు... ఐ లవ్యూ రాజా - ఐ లవ్యూ... నువ్వొప్పుకుంటే పెళ్ళి చేసుకుంటా..!
శ్రీ.వా : వామ్మో... నువ్వొదిల్తే... పారిపోతా... ప్యాకప్ రా శేషు...
ప్రస్తుతానికి అదీ సుందరి - కెమెరామెన్ నాగశేషం తో, శ్రీనివాసం… టివి మిర్చి - దసరా సందడి దొరికేవరకూ ఆగదు మా సెర్చి...
- కట్ -
శ్రీ.వా: అరేయ్... పూజలు చేసే పండు ముత్తైదువ... బామ్మగారొస్తున్నారు... ఈ సారి, ప్రమోషన్ గ్యారెంటీ
నా.శే: అంత ఎమోషన్ అవ్వకురోయ్... ముందావిణ్ణి ఆపు...
బామ్మ: ఎవర్రా అది ? మా ఇంట్లో మొన్న మరచెంబెత్తుకెళ్ళిన ఈరిగాడేనా ?
శ్రీ.వా: కాదండీ... టివి మిర్చీ అని...
బామ్మ : స్టీలు కుర్చీయా ? నడిరోడ్డు మీద మర్యాదలెందుకులేరా...!
శ్రీ.వా : ఓహో...! సౌండింజనీరు ... నేను మానేజ్ చేస్తాగా...!
బామ్మ : ఈ ఏజ్ బార్ అయిన బామ్మతో మ్యారేజ్ కి మహేష్ బాబు ఒప్పుకుంటాడో లేదో... ఇంకెవరన్నా అయితే నేనొప్పుకోను...
శ్రీ.వా : (మనసులో) వామ్మో - బామ్మ చూపు మహేష్ బాబు మీద పడిందా ? ఇప్పుడూ... దసరా ఎలా చేసుకుంటారు ?
బామ్మ : వసారా నా ? ఊడ్చి పెట్టు బాబూ... రోజూ ఒక్కదాన్నే చిమ్ముకోలేక చచ్చిపోతున్నాను...
శ్రీ.వా : కాదండీ... ! నవరాత్రులు...
బామ్మ : వంటపాత్రలు కూడా తోముతావా ? ఏం తీసుకుంటావేంటి ?
శ్రీ.వా : నీ ప్రాణం... నిన్నూ...
బామ్మ : 101 రూపాయా ? ఇదిగో ఇప్పుడే చెబుతున్నా... టీ లు, టిఫెన్లూ వండి వార్చలేను...
శ్రీ.వా : మ్.. మ్... వదిలెయ్ రా బాబూ...! ఇంకోళ్ళని చూసుకోవడం best...!
ప్రస్తుతానికి అదీ సుందరి - కెమెరామెన్ నాగశేషం తో, శ్రీనివాసం… టివి మిర్చి - దసరా సందడి దొరికేవరకూ ఆగదు మా సెర్చి...
మాకు ఈ యేడు - ప్రమోషన్ ప్రాప్తం లేదు - ఈ సందర్భంగా - తిరిగి తిరిగి తెలుసుకున్న సూత్రం ఏంటయ్యా అంటే -
న్యూటన్ నాలుగో సూత్రం - ప్రమోషనయినా, ఎమోషనయినా, లూస్ మోషనయినా - మొదలయిందంటే ఆపడం కష్టం...!

No comments:

Post a Comment

Pages