భిన్నత్వం లో ఏకత్వం సనాతన ధర్మం - అచ్చంగా తెలుగు

భిన్నత్వం లో ఏకత్వం సనాతన ధర్మం

Share This
    భిన్నత్వం లో ఏకత్వం  సనాతన ధర్మం

బి.ఎన్.వి.పార్ధసారధి 


ఒకసారి కొందరు ఋషులు వ్యాస మహర్షిని పద్దెనిమిది పురాణాల సారం ఏమిటి ? అని అడిగారు. దానికి వ్యాస మహర్షి “ అష్టాదశ పురాణానాం సారం సారం సముద్ద్రుతం పరోపకారః పుణ్యాయ పాపాయ పర పీడనం “ అంటాడు. ( ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, ఇతరులను పీడించడం పాపం )
సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాసులు ఉన్నట్టు వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. అన్ని జన్మలలో మిక్కిలి దుర్లభం మానవ జన్మ.  గరుడ పురాణం లో శ్రీ మహా విష్ణువు గరుత్మంతుడితో అంటాడు,
“ యది వర్ష సహస్రాణి తో చతే హర్నిశం నరః
తధాపి నైవ నిధనం గతో దృశ్యేత కర్హిచిత్ “
(జన్మించిన ప్రతి మనిషి మరణించక తప్పదు. మరణించిన ప్రతి మనిషి తిరిగి జన్మించక తప్పదు. ఈ సత్యం సకల జీవ రాసులకీ వర్తిస్తుంది.) కర్మలు చేస్తూ ఉన్నంత కాలం ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి మరల జన్మించక తప్పదు. కర్మ రాహిత్యం కలిగిన నాడు మనిషికి జన్మ రాహిత్యం కలుగుతుంది.
పితృకర్మలు: మనిషి మరణించిన తరువాత కూడా ఆత్మ వుంటుంది అనే సిద్దాంతాన్ని, పునర్జమనీ  నమ్మేది మన  సనాతన ధర్మం. గరుడ పురాణంలో శ్రాద్ధం, పితృ కర్మల ప్రాముఖ్యత వివరంగా చెప్పబడింది. వంశంలో మరణించిన మూడు తరాల పూర్వీకులు మరణానంతరం పితృలోకంలో సూక్ష్మ శరీరంతో వుంటారని, వారి వారసులు పితృకర్మలు ఆచరించి పిమ్మట  శ్రాద్ధం, పితృ తర్పణాలు చేస్తే , అప్పుడు మరణించిన ఆ పూర్వీకులు తాము చేసిన పుణ్య ఫలాలు పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. మనిషి ఎన్ని పుణ్యాలు చేసినా, తన పితృ దేవతలకి శ్రాద్ధం ,  తర్పణాలు  పెట్టకుంటే ఫలితం వుండదని అంటారు. పిండ ప్రదానం లో అన్నం, తర్పణాలలో ఉదకము విడిచి పెడతారు.
మహాలయ పక్షాలు : భారత యుద్ధం లో కర్ణుడు మరణానంతరం స్వర్గానికి వెడతాడు. కానీ అక్కడ కర్ణుడికి అన్న పానాదులకి బదులు బంగారం, రత్నాలు ఆహారంగా పెడతారు. ఆశ్చర్యపోయిన కర్ణుడు అదేమని ప్రశ్నించగా దానికి ఇంద్రుడు , “ నువ్వు జీవించి వుండగా అన్న దానం, పితృ దేవతలకి శ్రాద్ధ కర్మలు, తర్పణాల విధులు నిర్వర్తించనందున నీకు అన్న పానాదులు ఇవ్వము. నువ్వు బంగారము, రత్నాలు ఎందరికో దానం గా ఇచ్చినందున ఆ పుణ్య ఫలంగా  ఇప్పుడు నీకు కేవలం వాటినే ఇవ్వగలము” అంటాడు. అందుకు కర్ణుడు ఇంద్రుడితో, “ నాకు జన్మ నిచ్చిన తల్లిదండ్రులు, నా వంశంలోని పూర్వీకుల వివరాలు నాకు తెలియనందున నేను పితృ దేవతలకి శ్రాద్ధ కర్మలు, తర్పణాలు పెట్టలేక పోయాను” అంటాడు. అప్పుడు ఇంద్రుడు కర్ణుడికి భూ లోకానికి వెళ్లి పితృ దేవతలకి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడానికి పక్షం రోజులు అనుమతి ఇస్తాడు. కర్ణుడు భూలోకానికి వచ్చి పితృ దేవతలకి శ్రాద్ద కర్మ విధులు నిర్వహించి  తర్పణాలు విడిచి పెడతాడు. ఆ పిమ్మట మరలా స్వర్గానికి తిరిగి వచ్చిన కర్ణుడికి స్వర్గంలో అన్న పానాదులు లభిస్తాయి.  కర్ణుడు పితృకర్మలు నిర్వర్తించిన ఆ పక్షం రోజులే మహాలయ పక్షాలుగా ప్రసిద్ది చెందాయి. ప్రతీ ఏడు భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ గల పక్షం రోజులని మహాలయ పక్షాలుగా పాటిస్తారు. ( ఈ ఏడాది 2015 లో 29 సెప్టెంబర్ నుండి 12 అక్టోబర్ వరకూ మహాలయ పక్షాలు.) మహా భారతం లో స్త్రీ పర్వంలో యుద్దానంతరం మరణించిన వారికి ధర్మరాజు దహన సంస్కారాలు చేస్తాడు. ధర్మోదకాలనాడు కుంతీ దేవి ధర్మరాజుతో కర్ణుడు తన జ్యేష్ట పుత్రుడనే సత్యాన్ని వెల్లడిస్తుంది. అప్పుడు ధర్మ రాజు తో పాటు ధృత రాష్ట్రుడు కూడా యుద్ధం లో మరణించిన కర్ణుడికి తమ గోత్రం తో ధర్మోదకాలు విడిచి పెడతారు.
గయాసురుడు :  గయాసురుడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. అతను తపస్సు చేసి తన శరీరం అతి పవిత్రమైనదిగా లోకంలో కొలవ బడాలని, తన శరీరాన్ని చూసిన జనులు ముక్తి పొందాలని  విష్ణువు నుండి వరం పొందుతాడు. ఆ పిమ్మట గయాసురుడు లోకంలోని జనులు అందరూ తన శరీరాన్ని చూసి మోక్షం  పొందాలనే ఉద్దేశంతో  తన దేహాన్ని భారీగా పెంచుతాడు. భూలోకంలో అందరూ ముక్తి పొందితే తన విధులు నిర్వర్తించడానికి మరి పనే వుండదని భయపడి ఇంద్రుడు త్రిమూర్తులని ప్రార్ధిస్తాడు.  అప్పుడు త్రిమూర్తులు బ్రాహ్మణ వేషధారులై గయాసురుడిని సమీపించి యాగార్ధం పవిత్రమైన  భూమిని ఇవ్వ వలసిందిగా కోరతారు. భూమిలో ఎక్కడా పవిత్రమైన స్థలం లభించ నందున చివరికి గయాసురుడు తన శరీరాన్ని యాగం నిమిత్తం వాడుకోవలసిందిగా కోరతాడు. బ్రాహ్మణ వేష ధారులైన త్రిమూర్తులు దానికి అంగీకరించి, యాగం పూర్తి అయ్యే వరకూ గయాసురుడు తన శరీరాన్ని కదల్చకుండా వుండాలని  షరతు విధిస్తారు. గయాసురుడు అంగీకరించి యాగానికి అనుకూలంగా తన శరీరాన్ని పెంచి , శిరో భాగం గయ(బీహార్) లో, ఉదర భాగం జాజిపూర్ ( ఒరిస్సా) లో, పాద భాగం పిఠాపురం( అంధ్ర ప్రదేశ్) లో అమరుస్తాడు.  బ్రాహ్మణ వేషం లో వున్న విష్ణువు గయాసురుడి శిరస్సు వద్ద (గయ లో), బ్రహ్మ గయాసురుడి ఉదరం వద్ద (జాజిపూర్ లో), శివుడు గయాసురుడి పాదాలవద్ద ( పిఠాపురం లో) యాగం ప్రారంభిస్తారు.  యాగం ఆరు రోజులు నిర్విఘ్నంగా కొనసాగుతుంది.   ఆరో రోజు రాత్రి శివుడు కుక్కుట రూపధారియై కూత కూయగా వేకువ అయ్యిందని భ్రమించిన గయాసురుడు కంగారుగా నిద్రలోంచి మేల్కొని కదులుతాడు.  యాగ భంగం అవుతుంది. గయాసురుడి మరణానంతరం ఈ మూడు ప్రదేశాలు పవిత్ర క్షేత్రాలుగా విరాజిల్లుతాయని బ్రాహ్మణ వేషంలో వున్న త్రిమూర్తులు నిజ రూప ధారులై అతనికి వరమిస్తారు.
ఈ మూడు క్షేత్రాలు అష్టాదశ శక్తిపీఠాల లో వున్నాయి.
శక్తిపీఠాలు : తన తండ్రి దక్ష యజ్ఞానికి పిలవని పేరంటం గా వెళ్లి భంగపడి సతీ దేవి యజ్ఞ గుండంలో దూకి ప్రాణ త్యాగం చెయ్యగా , ఆగ్రహించిన శివుడు రుద్ర రూపుడై తన భార్య సతీ దేవి పార్ధివ శరీరాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేస్తాడు. శివుని ప్రళయతాండవానికి లోకాలన్నీ దద్దరిల్లగా శ్రీ మాహా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ దేవి పార్ధివ శరీరాన్ని ఖండించగా అవి పద్దెనిమిది ఖండాలుగా భూమి మీద పడతాయి.  స్తన భాగం గయలో, నాభి భాగం జాజిపూర్ లో, వామ హస్తం పిఠాపురంలో పడగా , అమ్మవారు సర్వ మంగళ పేరుతో గయలో, గిరిజా దేవి నామ ధేయంతో జాజిపూర్ నందు, పురూహూతికా దేవి గా పిఠాపురం నందు వెలసింది. పిఠాపురంలో  పరమశివుడు కుక్కుటేశ్వరుడుగా దర్శనం ఇస్తాడు. దత్తాత్రేయ అవతారంలో శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి  జన్మించిన స్థలం పిఠాపురం. ఇక్కడ దత్తాత్రేయ స్వామి స్వయంభువుగా ప్రత్యేకించి విగ్రహ మూర్తిగా దర్శనమిస్తాడు.
గయాసురుడి శరీర భాగాలతో పాటు అమ్మవారి శరీర భాగాలతో కలిసి వున్న ఈ మూడు క్షేత్రాలు విశేష ప్రదేశాలు. ఈ క్షేత్రాలలో పితృ దేవతలకి పిండ ప్రదానం, తర్పణాలు విడుస్తే , పితృ దేవతల ఆత్మ శాంతిస్తుందని , వారు పుణ్య ప్రాప్తిని పొందుతారని నమ్మకం. సంవత్సరం లో ఏ నాడైనా ఈ క్షేత్రాలలో పితృ తర్పణాలు విడువ వచ్చు. ముఖ్యంగా మహాలయ పక్షాల సమయంలో  ఈ క్షేత్రాలలో పితృ తర్పణాలు విడుస్తే విశేష పుణ్య ఫల ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. పితృ తర్పణాలు కేవలం  పరమపదించిన తల్లితండ్రులు, తాత ముత్తాతలు, ఇతర బంధువులే కాకుండా , మరణించిన మిత్రులు, సన్నిహితులు, గురువులు, సకల జీవ రాసులకి కూడా పెడతారు.
అయం బంధురయం నేతి గణనా  లఘు చేతసాం
ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం.( మహోపనిషద్ )
అల్పులు తనవాళ్ళు , పరులు అనే భేద భావం పాటిస్తారు. ఉత్తములు యావత్ సృష్టిని ఒకే కుటుంబంగా భావిస్తారు. అందుకే సనాతన ధర్మం కేవలం హిందువులకు మాత్రం పరిమితం కాదు. సనాతన ధర్మం మతం కాదు. మతానికి ఒక ప్రవక్త కారకుడు. మన భారత దేశంలోని  ఎందరో ఋషులు తమ దార్శనికత తో సృష్టి రహస్యాలని శోధించి,ప్రకృతితో, ప్రకృతిలోని సకల జీవ రాశులతో మానవుడు ధార్మికంగా సహ జీవనం చేసే విధానాన్ని పొందుపరచిన వెల కట్టలేని ఆణిముత్యం సనాతన ధర్మం. సనాతన ధర్మం కుల మతాలకి అతీతం. శాంతియుతంగా సకల జీవ రాసులు ధార్మిక ప్రవర్తనతో  సహ జీవనం ఎలా చేయాలో దిశా నిర్దేశం  చేసే  శాశ్వత మార్గ దర్శి సనాతన ధర్మం. ఈ సత్యాన్ని గ్రహించిన నాడు భిన్నత్వం లో ఏకత్వాన్ని చూడగలుగుతాం, శాంతియుతంగా మనగలుగుతాం.
 లోకా సమస్తా సుఖినోభవంతు.
   

No comments:

Post a Comment

Pages