విచక్షణ
మానవ మేధస్సు చాలా చిత్రమైనది. మనం సవ్యమైన దిశలో నడిపిస్తే మంచిగా, అపసవ్య దిశలో నడిపిస్తే చెడుగా పరిణమించే శక్తి దానికి ఉంది. అయితే, జీవితాన్నిఈ సవ్య, అపసవ్య దిశల్లో నడిపించే మంచి - చెడుల విచక్షణ మన చేతుల్లోనే ఉంది. మనస్సుకు ఒక చిత్రమైన శక్తి ఉంది. ఏది ఎక్కువగా తలుస్తూ ఉంటే, దానిగా మారిపోతుంది. అంటే మంచి గురించి ఆలోచిస్తే మంచిగా, చెడు గురించి ఆలోచిస్తే చెడుగా మారిపోతుంది. అందుకే మన పెద్దలు, స్నేహం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండమని ఉపదేశించారు. సత్సాంగత్య మహిమను తెలిపే ఒక చిన్న కధను చెప్పుకుందాము.
ఒక దొంగ అర్ధరాత్రి రాజమహలులో ప్రవేశించాడు. రాజు, రాణి తమ ఆంతరంగిక మందిరంలో మాట్లాడుకుంటున్నారు. దైవం తమకు ఎన్నో సిరిసంపదలను ఇచ్చినందుకు కృతజ్ఞతగా, తమకు అల్లుడిగా మరొక రాజును కాక, ‘రేపు గంగాతీరంలో దొరికే యువకుడైన, అతి బీదవాడైన సన్యాసిని అన్వేషించి, అతనికి తమ కుమార్తెను ఇచ్చి, వివాహం చేసి, ఆ రాజ్యానికి రాజును చెయ్యాలని’ ఆ మాటల సారాంశం. ఇది విన్న దొంగ, ‘ఆహా, యెంత గొప్ప అవకాశం... రేపు కపట సన్యాసి వేషంలో, నేనే గంగాతీరంలో కూర్చుని, వీరి కుమార్తెను పెళ్ళాడి, ఈ దేశానికి రాజును అవుతాను. అటువంటప్పుడు ఇక దొంగతనం ఎందుకు, అనుకుని, ఆ ప్రయత్నం మానుకుని, బయటపడ్డాడు. మర్నాడు రాజు, రాణి గంగాతీరానికి చేరుకొని, అక్కడ ఉన్న సన్యాసులలోని యువకుల్ని ఒక వరుసలో కూర్చోపెట్టి, ఒక్కొక్కరినీ తమ కుమార్తెను పెళ్ళాడమని, అభ్యర్ధించసాగారు. అయితే... అతి చిత్రం. వారు నిరాకరిస్తూ, అంతా దాదాపు ఒకే విధంగా బదులిచ్చారు. దాని సారాంశం ఏమిటంటే –
‘అయ్యా ! దైవబలం వల్ల అన్నీ వదిలి, అలౌకికమైన పరమానందాన్ని పొందుతున్న మేము, మళ్ళీ సంసార తాపత్రయంలో, సిరిసంపదల్లో పడి వెనుకకు మరలలేము. క్షమించండి.’ దొంగకు ఆశ్చర్యం వేసింది. తాను ధనాన్ని, బంగారాన్ని, వజ్రాలను,విలువైన మణి మాణిక్యాలను చూసాడు. తను వారిని ఉదయం నుంచి గమనిస్తూనే ఉన్నాడు, వారివద్ద దండం, కమండలం తప్ప ఏమీ లేవు. మరి వారు వారివద్ద అపారమైన సంపద ఏదో ఉంది అంటున్నారే ! అది రాజపదవి కంటే, ఖజానా కంటే, రాకుమార్తెను పొందడం కంటే విలువైనది అంటున్నారు. అదేవిటో తెలుసుకోవాలనే తృష్ణ అతనిలో మొదలయ్యింది. రాజదంపతులు మారువేషంలో ఉన్న దొంగ వద్దకు చేరారు. దొంగ వెంటనే లేచి నిలబడి, తానెవరో, ఎందుకొచ్చానో చెప్పి, క్షమాపణ వేడుకుని, ‘వీరంతా చెబుతున్న గొప్ప సంపద ఏవిటో తెలుసుకోవాలన్న కోరిక నాకు కలిగింది. అందుకే, మీ కుమార్తెను పెళ్లాడలేను, వీరితో స్నేహం చేసి, వారివద్ద నుంచి ఆ పొందే దిశలో పయనించడం ఎలాగో తెలుసుకుంటాను’, అన్నాడు.
గంధపు చెట్టు పరిమళం అన్ని దిశలకు వ్యాపించినట్లు,ఈ కధను పరిశీలిస్తే, ఇక్కడ సత్సాంగత్యం వల్ల దొంగకు రెండుసార్లు మేలు జరిగింది. మొదటిసారి – మంచివారైన రాజదంపతుల మాటలు విని, దొంగతనం మానుకున్నాడు. రెండవసారి- సాధువుల ప్రక్కన కూర్చున్నంత మాత్రాన అతనిలో మానసిక పరివర్తన కలిగింది. అందుకే, మనము, మన అంతఃకరణమే కాక, మన చుట్టూ ఉండే పరిసరాలు, వ్యక్తుల ప్రభావం కూడా మనమీద ఉంటుంది కనుక మనం అప్రమత్తంగా ఉండాలి. ఇతరులపై చెడ్డ ప్రచారం చేసేవారిని, చాడీలు చెప్పేవారిని, దిగజార్చి మాట్లాడి వినోదించేవారిని మనం దూరం చెయ్యకపోతే మనం వారిలా మారడం తధ్యం. అందుకే ఎప్పటికప్పుడు విచక్షణతో ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనమే చక్కదిద్దుకోవాలి.
ఆరు ఋతువుల వంటి ఆరు చక్కటి కధలతో, పంచెవన్నెల ఐదు సీరియల్స్ తో, పెద్దలు అందించిన ఛందస్సు లోని సరికొత్త ప్రయోగాల పద్యాలతో అనేక ప్రత్యేక అంశాలతో ముస్తాబై, ఈ కొత్త సంచిక మీ ముందుకు వచ్చేసింది. సురేఖ గా పేరున్న కార్టూనిస్ట్ ఎం.వి. అప్పారావు గారి పరిచయం, ఆంకర్ ఝాన్సీ గారితో ముఖాముఖి, ముత్తుస్వామి దీక్షితులు గారి జీవితవిశేషాలు మిమ్మల్ని మరిపించానున్నాయి. మరి, త్వరగా చదివి, కామెంట్స్ రూపంలో మీ ప్రోత్సాహంతో మమ్మల్ని దీవిస్తారు కదూ !
కృతజ్ఞాతభివందనాలతో,
భావరాజు పద్మిని.
No comments:
Post a Comment