జస్ట్‌ ఫర్‌ ఫన్ - అచ్చంగా తెలుగు

జస్ట్‌ ఫర్‌ ఫన్

Share This

జస్ట్‌ ఫర్‌ ఫన్     

 - పోలంరాజు శారద


అక్కడి హాస్పిటల్ లో కొన్ని మందులు దొరక లేదు. అర్జెంట్ గా ఒక ఇంజెక్షన్ తెమ్మని డాక్టర్ రాసి ఇచ్చాడు. అది దొరికే షాప్ ఒక్కటే వుంది. ఇంపోర్టెడ్ మెడిసిన్. తొందరగా తేవాలి. అన్నయ్యను అమ్మ దగ్గర కూర్చోమని నేను షాప్ కు వచ్చి మెడిసిన్ తీసుకొని బైక్ స్టార్ట్ చేయబోయాను. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడో, ఒక యువకుడు, దాదాపు పదిహేడు ఏళ్ళు వుంటాయి. చేతిలో ఒక పెద్ద కాడతో వున్న ఆర్నమెంటల్ పూవు వున్నది.
"సార్, సార్ ప్లీస్ ఈ పువ్వు కొనండి సార్."
"సారీ బాబూ నాకొద్దు. కాస్త తొందరలో వున్నాను. మా అమ్మకు మందులు కొనుక్కెళ్ళుతున్నాను. ఇంకెవరికన్నా అమ్ముకో" బైక్ స్టార్ట్ చేయబోయాను.
అతను హాండిల్ మీద చేయి వేసి, "సార్ ప్లీస్ నేను చాల ఇబ్బందుల్లో వున్నాను. నాకు డబ్బు అత్యవసరంగా వుంది. ఇమ్మీడియట్లీ కాలేజి ఫీజ్ కట్టాలి. ప్లీస్ కొనండి సార్." దీనంగా మొహం పెట్టి బతిమిలాడసాగాడు.
నాకు ఈ హైబ్రిడ్ పూలతో చాలా ఎలర్జీ వస్తుంది. అతనేమో ఆ పూవును నా మొహం మీద పెట్టాడు. అప్పటికే నాకు కళ్ళల్లో దురద మొదలైంది. తుమ్ములు కూడా వస్తున్నాయి.
ఏదో పాపం, కాలేజీ ఫీజ్ అంటున్నాడు, ఇబ్బందులంటున్నాడు, సహాయం చేద్దామని అనిపించింది. "కొంటాలే గాని ఆ పూవు దూరంగా పెట్టు. ఎంతన్నావు?"
"జస్ట్ హండ్రెడ్ రుపీస్ సార్."
"వాట్! ఈ పూవుకు వంద రూపాయలా. నాకు పూవు వద్దుకాని ఇదిగో ఈ యాభై రూపాయలు తీసుకో." ఎట్లానైనా ఆ అబ్బాయిని వదిలించుకోవాలని డబ్బు ఇవ్వబోయాను.
"సార్ మేమేమీ బిక్షగాళ్ళము కాము. కష్టపడి పూలమ్ముకొని బతికే వాళ్ళము." అని పౌరుషంగా అని, మళ్ళీ టోన్ మార్చి, "సార్ ఇది కొనండి సార్. మీ ఇంట్లో ఏదైనా ఫ్లవర్ వాజ్ లో పెట్టుకోండి. వారం రోజులైనా తాజాగా వుంటుంది." అన్నాడు చేయి బైక్ మీద నుండి తీయకుండానే.
ఎలర్జీ తో పాటే అసహనం పెరిగి పోతున్నది. కోపం వస్తున్నది. "ముందర ఆ పూవు నా మొహం మీదనుండి తీయవయ్యా." కాస్త గట్టిగానే అరిచాను. ఆ పాటికే చుట్టూ జనం పోగయ్యారు. చోద్యం చూస్తూ నిలబడ్డారే కాని, ఒక్కరు కూడా ముందుకు వచ్చి అతన్ని మందలించే ప్రయత్నం చేయలేదు.
ఇంతలోకే ఇంకో పక్కనుండి ఇంకో కుర్రాడు వచ్చి, అట్లాంటిదే ఇంకో పువ్వు పట్టుకొచ్చి, "సార్ ఈ పువ్వు కూడా తీసుకోండి సార్. ఒకటి కొంటే హండ్రెడ్ రుపీస్, రెండు కొంటే వన్ ఫిఫ్టి. మీకే లాభం" అంటూ బైక్ ఇంకో పక్క పట్టుకున్నాడు. ఈ విధంగా వాళ్ళు బ్రతిమిలాడటం నేనేమో తుమ్ములతో కళ్ళు ఎర్రబడి నీళ్ళు కారటంతో అవస్త పడటం అందరూ వినోదంగా చూస్తున్నారు.
ఇంతలో నా జేబులో సెల్ మోగింది. అన్నయ్య. "ఏరా ఎంత సేపు? అమ్మకు ఇంజక్షన్ ఇచ్చే టైం అవుతోంది. ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావు?" కాస్త అసహనంగా అరిచాడు.
అంతే అప్పటిదాకా వుపేక్షించిన నేను, ఆ ఇద్దరి కుర్రాళ్ళ చేతుల్లోంచి ఆ పూలు తీసుకొని నేలకేసి కొట్టి, "రాస్కెల్స్, ఒకపక్క నేను మా అమ్మకు మందులు కొనే తొందరలో వున్నానని చెప్పినా వినకుండా పదిహేను నిమిషాల నుండి విసిగిస్తున్నారు. మీకసలు సివిక్ సెన్స్ వుందా?" దగ్గరలో వున్న ఒక కుర్రాడి కాలర్ పట్టుకున్నాను.
"ఆగండి ఆగండి సార్. అదిగో అక్కడ చూడండి కెమెరా. ఇది టివి చానెల్ లో జస్ట్ ఫర్ పన్ ప్రోగ్రాం కోసం చేస్తున్న నాటకం. సార్ ఈ సంఘటన మీద మీ స్పందన ఏమిటి సార్?" మైక్ మొహం మీద పెట్టి ఒక వ్యక్తి అడిగాడు.
"నా స్పందననా? ఇదిగో." అని చాచి అతని చెంప మీద ఒక్కటిచ్చి, "ఇది నా స్పందన. దమ్ముంటే ఇది కూడా టెలికాస్ట్ చేసుకోండి. పబ్లిక్ కి ఎంత న్యూసెన్సో అర్ధం చేసుకోకుండా ఏమిటిరా మీ ఫన్? మా అమ్మ కు ఎమర్జెన్సీ మెడిచిన్ తీసుకెళ్ళుతున్నానని చెప్పినా మీ గోల మీదేనా? నాకేమో ఆ దిక్కుమాలిన పూలవల్ల తుమ్ములు, కళ్ళ నీళ్ళు. ఈ స్థితిలో ఇప్పుడు బైక్ మీద అయిదు కిలో మీటర్లు ప్రయాణం చేయాలి.
మందు ఆలస్యమయి మాఅమ్మకేమైనా అవాలి, లేదా నేను బైకు నడపలేక నాకేదైనా అవాలి, మళ్ళీ వచ్చి మీ ఒక్కక్కడి అంతు చూస్తాను జాగ్రత్త."
చుట్టూ మూగిన జనాన్ని వుద్దేశించి, "అయినా మీరందరూ ఏమిటండీ వినోదం చూస్తున్నారు? ఒక్కరికైనా వాళ్ళను ఆపుదామన్న ఇంగితం లేకపోయిందా? ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ వుంటే అక్కడే పనులన్నీ మానుకొని చూస్తూ నిలబడటానికి మీకు సిగ్గులేదా?" అని నాలుగూ కడిగేసి, బైక్ స్టార్ట్ చేసి ఒక్కసారి ముందుకు పోయాను. చుట్టూ వున్న జనం చెల్లాచెదరు అయిపోయినారు. కాస్త ముందుకెళ్ళగానే వెనక కలకలం వినిపించి ఆగి వెనక్కి చూస్తే, జనమంతా ఆ టివి క్రూ మీద పడి దేహశుద్ది చేయటం కనిపించింది.

No comments:

Post a Comment

Pages