ఇలా ఎందరున్నారు ?- 12 - అచ్చంగా తెలుగు

ఇలా ఎందరున్నారు ?- 12

Share This

ఇలా ఎందరున్నారు ?- 12   

అంగులూరి అంజనీదేవి

(జరిగిన కధ : సంకేత, శివాని, పల్లవి, హిందూ స్నేహితురాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. ఆ కాలేజీ లోనే చదువుతున్న శ్రీహర్ష తండ్రి ,సంకేత తండ్రి  స్నేహితుడుకావడంతో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటుంది. నీలిమ శ్రీహర్ష ఇంట్లో పనిమనిషి, 10 వ తరగతి వరకు చదువుకుంటుంది. కోడలు కాంచనమాల తనను ఎలా చూస్తుందో నీలిమకు చెప్తుంది వరమ్మ. కాలేజీ ఫీజు కట్టేందుకు, తగినంత డబ్బు లేకపోవడంతో తన స్నేహితురాళ్ళను అప్పు అడిగేందుకు వెళ్ళిన సంకేతను, పల్లవి బలవంతంగా బాగా డబ్బున్న అనంత్ పుట్టినరోజు వేడుకకు తీసుకు వెళ్తుంది. బాగా చదివే సంకేత తీరును ఇష్టపడి, ఆమె ఫీజును కడతాడు అనంత్. సంకేతకు అనంత్ పట్ల ఒక గౌరవ భావం కలుగుతుంది. అనంత్ కూడా సంకేతను ఇష్టపడుతూ ఉంటాడు. అనంత్ రూమ్ కు వెళ్తుంది పల్లవి. అతను ఎన్నో గాడ్జెట్ లను చూపిస్తాడు, ఒక మొబైల్ ను గిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అతని సమక్షమే ఆమెకు లోకమవుతుంది. అనంత్ తో సంకేత  ప్రేమను గురించి నీలిమకు చెబుతుంది శివాని.  ఇక చదవండి... )
ఇంటికెళ్ళగానే వరమ్మ దగ్గరకి వెళ్లింది నీలిమ.
కాంచనమాల ఎవరోవస్తే తన గదిలో కూర్చుని మాట్లాడుతోంది. ఆమె అప్పుడే బయటకు రాదని గ్రహించి పుచ్చకాయ తీసికెళ్లి వరమ్మకి కోసిపెట్టింది. కోడలు వచ్చి చూస్తుందేమోనని వరమ్మకి లోలోన భయంగా వుంది. వచ్చి చూసి అకస్మాత్తుగా చిన్నమాట అన్నా తను చిన్న బుచ్చుకోవలసి వస్తుంది.
          అసలే తన కోడలి సణుగుడు తనకి తెలియంది కాదు. తేలు చెంబునీ, చేటనీ కుట్టినట్టు మాటలతో కుడుతూనే ఉంటంది. ఆమెకు అదోరకమైన ఉన్మాదం. దానికి మందులేదు. ఆసుపత్రులు లేవు. అదీకాక సణుగుడు అనేది శరీరానికి, మనసుకు పట్టిన వ్యాధికాదు. ఈ రెండింటికీ అతీతంగా ‘జీవి’ తో దిగుతుందంటారు. దీనికి కారణం అసంతృప్తి అట.... అన్ని వాగులు చివరికి నదిలో చేరినట్లు ఆమెకు ఏ రకమైన అసంతృప్తి వున్నా చివరకి వచ్చి తన మీదనే పడుతుంది.
          వరమ్మ భజం పట్టుకొని కదిలిస్తూ ‘ఏంటి వరమ్మా! ఆలోచిస్తున్నావు! తినకుండా!” అంది నీలిమ.
“ఏం లేదు నీలిమా! సోక్రటీస్ నుండి రామానుజుల వరకూ తమ ధర్మపత్నుల సణుగుడుతో విరాగులై లోకానికి శాంతిని ఇవ్వగలిగారట... మా కాంచన లాంటి కోడళ్ళ సణుగుడు వల్ల మా అత్తలం శాంతిని ఇవ్వటం లేదు. పోగొట్టుకుంటున్నాం... తినాలన్నా భయమే, తాగాలన్నా భయమే! చివరికి గాలి పీల్చాలన్నా భయమే! ఇది ఇక ఇంతేనా?” అంది.
“మీరేం ఆలోచించకుండా తినండి వరమ్మా!” అంటూ ఓ ముక్క తీసి వరమ్మ నోట్లో తనే స్వయంగా పెట్టింది నీలిమ.
వరమ్మ కళ్ళు అప్రయత్నంగానే చెమర్చాయి.
వరమ్మ తింటుంటే నీలిమ సంకేత గురించి ఆలోచిస్తోంది. సంకేత అనంత్ తో తిరుగుతుందని తెలిస్తే కాంచనమాల తన ఇంట్లో వుంచుకోదు. అందుకే సంకేత గురించి కాంచనమాలతో చెప్పకూడదనుకుంది. వరమ్మకు చెప్పింది.
వరమ్మ ఆశ్చర్యపోలేదు. తల పంకించి మౌనంగా వుంది.
“సంకేత మేడమ్ చదువుకోకుండా, కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో అపద్ధం చెప్పటం నాకెందుకో నచ్చటంలేదు వరమ్మా! వల్ల పెద్దవాళ్ళకి తెలిస్తే బాధపడతారు... పెద్దవాళ్లని బాధపెట్టటం మంచిదికాదు. మీరేమంటారు?” అంది.
ఏదైనా అనటానికి మనం ఎవరం నీలిమా? సంకేత తన దారి మార్చుకుంది. రెండు సంవత్సరాలు బాగానే చదివింది. ఈ సంవత్సరం పూర్తిగా చదవటం తగ్గించింది. ఈ మధ్యన మన ఇంటికి సంకేత స్నేహితురాలు హిందూ రావటం లేదు. శివాని, పల్లవి మాత్రమే వస్తున్నారు. అంటే అర్ధం చేసుకో! సంకేత మార్పుకి శివాని, పల్లవి పరోక్షంగానైనా ఎంత దోహద పద్తున్నారో! సంకేత స్నేహితురాళ్ల వల్లనే పూర్తిగా మారిపోయింది. అది కూడా వాళ్లను చూసికొంత, వాళ్ల మాటలు విని కొంత... ఇప్పటి అమ్మాయిల్లో చాలామంది సంకేతలా మారినవాళ్ళే” అంది వరమ్మ.
“ఈ మార్పు మంచిదంటారా?”
“మంచిది కాదు. ఇదొక కర్మ! ఈ కర్మ అనేది ఎంత శక్తివంతమైన దంటే మసక వెలుతురులో దూరంగా వున్న లేగదూడ పరిగెత్తుకుంటూ వచ్చి మందలో వున్న తల్లిని గుర్తుపట్టినట్లు గుర్తుపట్టి వెన్నాడుతుంది. దాన్ని తప్పించుకు తిరగటం సాధ్యంకాదు. ఎప్పుడైనా కర్మను స్వీకరించినంత ప్రేమగా ‘ఫలితాలను’ కూడా ఆహ్వానించగలిగితే, అంతటి శక్తిని సంపాయించుకోగలిగితే... ఇక అనుకుని బాధపడేది ఏముంది? అంతా అనడమే కదా!” అంది వరమ్మ.
వరమ్మ మాటల కొద్దిగా అర్ధమై కొద్దిగా కానట్లున్నాయి నీలిమకి...
బహుశ సంకేత తన తల్లిదండ్రులు దగ్గర లేకపోవటం వల్ల ఇలా తయారయిందేమో! చెప్పేవాళ్లు లేకపోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు! ఒకసారి వరమ్మ సంకేతను పిలిచి మాట్లాడితే! ఎంతయినా పెద్దవాళ్లు చెప్పే మాటలకి తను చెప్పే మాటలకి తేడా ఉండదా! అయినా తనేం చెప్పగలడు? ఏం చెప్పినా ‘ఓ చెప్పావులే పెద్ద ఆరిందాలా’ అనదా! అదీకాక ‘అనాథ ఆశ్రమం నుండి వచ్చిన దానివి నా కన్నా నీకు ఎక్కువ తెలుసా? నా కన్నా ఎక్కువ చదివావా? నా కన్నా ఎక్కువ చూశావా? వరమ్మ తప్ప .. నీకేం తెలుసనీ మాట్లాడుతున్నావు?’ అని అంటుంది. అందుకే వరమ్మ వైపు చూసి “ ఇక్కడ సంకేతమ్మ తల్లిదండ్రులు లేరుకదా వరమ్మా! వాళ్లు వుంటే మంచీ, చెడూ చెప్పుకునేవాళ్ళు... ఇప్పుడు మా అందరికి పెద్దదానివి నువ్వేకాబట్టి ఒకసారి సంకేతమ్మను పిలిచి నువ్వు మాట్లాడితే బావుంటుందేమో!” అంది నీలిమ.
“చెప్పే వాళ్లు ఎప్పుడూ ఉంటారా నీలిమా! పసిబిడ్డగా వున్నప్పుడు ముద్దకలిపి నోట్లోపెడతారు. జోలపాడి నిద్రపుచ్చుతారు. జీవితాంతం అలాగే ఉంటుందా? శరీరంతో పాటు బుద్ధి కూడా పెరగాలి. సముద్రంలోకి మునకేసినట్లే జీవితంలోకి మునకెయ్యాలి. దొరికింది పిచ్చిగవ్వా, ముత్యపుచిప్పా  అన్నది పైకి తేలాకనే తెలుస్తుంది... తొందరపడితే ఎలా?” అంది.
“పైకి తేలేవరకు మునిగేవుండాలా? అదే మీ మనవరాలైతే చదువుమానేసి ఓ అబ్బాయితో తిరుగుతుందని తెలిస్తే ఇలాగే మాట్లాడుతారా?” అంది నీలిమ.
..వరమ్మ నెమ్మదిగా నవ్వి “మాట్లాడటానికి అసలు నాలాంటి బామ్మలు చాలామంది ఇళ్ళల్లో లేరు నీలిమా! నాకు తెలిసి పల్లవి తను స్కూలు చదువులు చదువుతున్నప్పుడే ‘ఇంట్లోకి రాగానే ఈ ముసలికంపును నేను భరించలేను నాన్నా!” అంటూ నాన్నతో పోరుపెట్టుకొని వాళ్ళ బామ్మను వృద్ధాశ్రమానికి పంపించివేసింది.
శివానీ కూడా వాళ్ల బామ్మతో ‘బామ్మా! నువ్వేమైనా మా అమ్మ లాగా పొలంవెళ్లి పనులు చెయ్యగలవా? అలాంటప్పుడు నీకు తిండి ఎలా వస్తుందే! మన పాలివ్వని ఆవుకి గడ్డిమేపటం దండగనే కదా ఇంట్లోంచి పంపించివేశాం! నాకెందుకో నీ ఖర్చు లేకుంటే మా నాన్న నాకింకా మంచి డ్రస్ లు కొనిస్తాడేమో, పాకెట్ మనీ ఇస్తాడేమో ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చినట్లు నీవల్లనే నా అవసరాలకు డబ్బుల్లేకుండా పోతున్నాయ్!” అని అనగానే ఆమె రోషపడి ఏడ్చుకుంటూ వెళ్లి అనాథ ఆశ్రమంలో చేరింది.
శ్రావ్య తల్లి మాత్రం ‘అత్తయ్యా! నిన్ను చూసుకోవటం నావల్ల కాదు మీ అబ్బాయికి దూరంగా ట్రాన్స్ఫర్ అయింది. నాకు ఆఫీసుకి వెళ్ళిరావటమే గగనంగా వుంది అందుకే శ్రావ్యను హాష్టల్లో వేశాను. నిన్ను కూడా ఇద్దరం చేరి కాస్త డబ్బులు వేసుకొని ఒల్దేజ్ హొంలో ఉంచుతాం!” అంటూ చాలా ఏండ్ల క్రితమే వాళ్ల అత్తగారిని ఒల్దేజ్ హోంలో వుంచి వచ్చింది.
ఇలాంటివాళ్లు ఎందరున్నారో తెలియదుకాని చాలామంది ఇళ్ళలో బామ్మలు, మామ్మలు కరువైపోతున్నారు... తల్లిదంద్రులేమో తమ పిల్లల్ని హాష్టల్స్ లో, పెద్దవాళ్లని వృద్ధాశ్రమాల్లో చేర్చాలంటే తగినంత డబ్బుకావాలి కాబట్టి చేతినిండా పనులు కల్పించుకొని ఆఫీసుల్లో, కంపెనీల్లో గడిపేస్తున్నారు...” అంటూ ఆగింది వరమ్మ.
వరమ్మనే చూస్తూ శ్రద్దగా వింటోంది నీలిమ.
వరమ్మ బరువుగా నిట్టూర్చి “దీనివల్లనే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో అడిగి తెలుసుకునే బామ్మలు, ఆసక్తి చూపించే తల్లిదండ్రులు తక్కువయ్యారు... నా లాంటి బామ్మలు వున్న మనవరాళ్లు కూడా కొందరు సంకేతలాగే వుంటున్నారు. ఎందుకంటే శివాని లాంటి స్నేహితురాళ్ల ప్రవర్తన నిత్య శిక్షణగా వాళ్లపై పనిచేస్తోంది. ‘నాకేం తక్కువ. నేను మాత్రం ఆ సంతోషాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి?’ అని భయం లేకుండా ముందుకు దూకుతున్నారు. శివాని నాకెలా తెలుసనుకుంటున్నావా? శివాని సంకేత కోసం మన ఇంటికి రావటం వల్లకాడు. అది నా స్నేహితురాలి మనవరాలు! ‘దీని జీవితం ఎటుపోయి ఎటువస్తోందో కాలికి స్ప్రింగులున్నట్లు అటు ఇటు గెంతుతూనే వుంటుంది వరం! నిలకడగా ఓ చోట ఉండలేదు. నన్నేమో మనసు గాయపరచి ఆశ్రమానికి పంపింది... నాకన్నా ఈ వయసులో దానిగురించే నాకు బెంగగా వుంటోంది’ అంటూ అది వాపోతుంది నాదగ్గరకి వచ్చినప్పుడు...!
ఇలా ఎవరి ప్రయాణం వాళ్లకి ఎక్కువ అన్నట్లు నైతికపతనం పరాకాష్టకు చేర్చే అవినీతి పరుల్లాగానో, నేరగాళ్లలాగానో ఎవరేమనుకుంటే మనకేం అన్నట్లు మౌనం వహిస్తున్న కొందరు తల్లిదండ్రులను క్షమించకూడదు... తండ్రి సంపాయిస్తే తల్లి దగ్గరుండి పిల్లల్ని చూసుకోవాలి. ప్రేమగా పలకరించాలి. ప్రేమను పంచాలి. వాళ్లు చెప్పేది ప్రేమగా వినాలి. ఇలావుంటేనే చాలామంది ఆడపిల్లలు బాగుంటారు. ఇలా లేకనే ప్రేమకోసం ఎవరు దొరికితే వాళ్లమీద ఆధారపడుతున్నారు. ఆవురావురంటూ అంగలార్చుతున్నారు. చదువుకన్నా ఎక్కువగా ప్రేమగా మాటలు చెప్పేవాళ్లను, గాలికి తిప్పేవాళ్లను ఇష్టపడుతున్నారు... స్వేచ్చను చేతిలోకి తీసుకొని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు” అంది వరమ్మ.
నీలిమ వరమ్మనే చూస్తూ,”ఇప్పుడు అర్ధమైంది వరమ్మా ! అసలు తప్పు ఎక్కడుందో ! ఎప్పుడైనా పిల్లల్ని తమ ఆర్ధిక స్థితిగాతులకి తగిన వాతావరణంలోనే ఉంచాలి. ఆకర్షణల జోలికి పోనివ్వకూడదు. అంటే, శక్తికి తగిన ఏడుపే ఏడవాలి. ఎక్కువ ఏడిస్తే కళ్ళు వాచిపోతాయి. అంతే కదూ ?” అంది.
వరమ్మ సమాధానం చెప్పేలోపలే కాంచనమాల గట్టిగా కేకేసినట్లు పిలిచింది. ఉలిక్కిపడి లేచి లోపలికెల్లింది నీలిమ.
*****
 హాస్టల్ ముందు కారు దిగుతున్న అనంత్ తల్లి శరదృతిని చూడగానే ‘ఆంటీ’! అంటూ కారుదగ్గరికి కుంటుకుంటూ వెళ్లింది పల్లవి. వణుకుతున్న బంతిలా ఆగుతూ, ఆగుతూ, వస్తున్న పల్లవిని చూసి కంగారుపడుతూ “కాలికేమైంది పల్లవీ?” అంది శరదృతి.
 “మెట్లెక్కుతుంటే స్లిప్పయింది ఆంటీ!” అంది పల్లవి.
పల్లవి భుజంపై ఆత్మీయంగా చేయివేసి “ఏదీ చూడనీ! హాస్పటల్ కి వెళ్ళావా?” అంటూ కాలివైపు చూసింది.
  వెళ్లానాంటీ! ఈకట్టు హాస్పిటల్లోనే కట్టారు” అంటూ తన పాదం దగ్గర ప్యాంట్ కాస్త పైకి లేపి చూపించింది.
  “స్పీడ్, స్పీడ్ గా నడిస్తే అలాగే అవుతుంది మరి...” అంది మందలింపుగా
  చెప్పాలంటే స్పీడ్ వల్ల కాదు,  హీల్ వల్ల ఆంటీ..
  “అంత హీల్ ఉండేవి ఎందుకు తీసుకున్నావ్?”
కొద్దిగా తలవంచి “నేను నా ప్రెండ్స్ కన్నా పొట్టిగా అన్పిస్తున్నాను అందుకే హైట్ ను కవర్ చేసుకుందామని...” అంది నసుగుతూ.
 "నీకు నేనో అడ్వయిజ్ ఇవ్వనా?”
“ఇవ్వండి ఆంటీ!”
  “ఇకముందు హైట్ కోసం కాళ్లు విరగగొట్టుకోకుండా నీకన్నా హైట్ తక్కువ వుండే అమ్మాయిలను చూసి ఫ్రెండ్ షిప్ చెయ్యి. సరేనా! కారులో కూర్చో! నీతో మాట్లాడాలి....” అంది గంభీరంగా.
  ఏం మాట్లాడుతుంది ఆంటీ తనతో? అని ఒకక్షణం పల్లవి ఆలోచించి... ఏం మాట్లాడబోతుందో ఊహకి అందక కారు ఎక్కి శరదృతి పక్కన కూర్చుంది.
శరదృతి పల్లవి వైపు తిరిగి ప్రశాంతంగా చూస్తూ “ మా అనంత్ గదికి ఎవరో ఒక అమ్మాయి తరచుగా వెళ్తున్నట్లు తెలిసింది. ఎవరా అమ్మాయి? నీకు తెలుసా?” అని అడిగింది.
పల్లవికి భయంతో ఒళ్లంతా ఒక్కసారిగా వణికింది. తెలుసు అనలేదు. తెలియదు అనలేదు. ఇది శరదృతికి ఎలా తెలిసిందో! దీని పర్యవసానం ఎలా వుంటుందో అని ఆలోచిస్తోంది. సంకేత గురించి అడిగితే ఏం చెప్పాలి? ఎలా పరిచయమైందని చెప్పాలి? గుండెను గుప్పెట పట్టి నొక్కినట్లు చెమట పట్టటం ఒక్కటే తక్కువగా వుంది.
“ఆ అమ్మాయిని నువ్వు చూశావా?” మళ్లీ ప్రశ్నించింది శరదృతి
  పల్లవి మాట్లాడలేదు.
  పేరు తెలుసా? ఎలా వుంటుంది?”
ఇప్పుడు కూడా మౌనంగానే వుంది పల్లవి. కారంతా ఏ.సి. వల్ల చల్లగా వున్నా ఉక్కబోస్తున్నట్లు ఉక్కిరిబిక్కిరి అయింది. ఆమె నవ్వి పల్లవి గడ్డం పట్టుకొని “ఎందుకింత మౌనంగా వున్నావ్? అ అమ్మాయిది మీ హాస్టలేనా?” అని అడిగింది చాలా కూల్ గా... కాదన్నట్లు తలవూపి దొరికిపోయింది పల్లవి.
“మరి మాట్లాడవే? ఆ విషయం చెప్పటానికి ఎందుకింతగా సంశయిస్తున్నావ్?”
“ఈ వారం నా రాశిలో మౌనంగా ఉండమనే రాసి వుంది ఆంటీ! అసలే ఈ కాలి బాధ ఒకటి పులిమీద పుట్రలా తోడైంది” అంది బాధగా చూస్తూ.
“తగ్గిపోతుందిలే! నాకు ఆ అమ్మాయిని చూడాలని వుంది. ఒకసారి తన దగ్గరకి నన్ను తీసికెలతావా? నాకు పరిచయం చేస్తావా?”
షాకింగ్ గా చూసింది పల్లవి. వెంటనే తేరుకుంటూ...
“ఎందుకు ఆంటీ? అనంత్ ని వదిలేస్తే డబ్బులిస్తానని చెప్పి రావటానికా?” అంది.
“కాదు. నాకు నచ్చితే అనంత్ కిచ్చి చేద్దామని...”
“పెళ్ళా! నిజంగానే వాళ్లిద్దరికీ పెళ్ళి చేస్తారా? సంకేత మీకు నచ్చాలంటే ఎలా వుండాలి ఆంటీ?”
శరదృతి వెంటనే పల్లవి తలమీద టపీమని కొట్టింది.
పల్లవి తన తలను నిమురుకుంటూ “అబ్బా! ప్రతిరోజు ఆసనాలు ఎంతసేపు చేస్తున్నారాంటీ? ఇంతబలంగా కొట్టారు. రేపు పెళ్ళయ్యాక సంకేతను కూడా ఇలాగే కొడతారా? దాని పని అవుట్! ఈ దెబ్బతోనే నాకు కన్ ఫం అయిపొయింది”.
“ఛ..ఛ.. కోడలిని ఎవరైనా కొడతారా? నువ్వంటే ఏదో కూతురులాంటి దానివని అలా కొట్టాను” అంది.
కూతురు అన్న పదం వినగానే పల్లవికి గాల్లో తేలినట్లయింది. బెలూన్ లా ఉబ్బినట్లు అయింది.
“మీకు వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసికోపంగా లేదా?”
“అస్సలు లేదు. ఇంకా ఆనందంగా వుంది. అనంత్ ఇప్పటికైనా వాడి ఫ్రెండ్స్ ని, పార్టీలని వదిలిపెట్టి బాగుపడతాడని ఆశ...ప్రేమకు దేన్ని అయినా మార్చే శక్తి వుంటుంది కదా!”
“వుంటుందాంటీ! కూసే గాడిద వెళ్లి మేసేగాడిదను చెడగొట్టినట్లు అనంత్ వల్ల సంకేత చదువు అడుగంటి పోయింది” అని మనసులో అనుకుంటూ నీరసంగా చూసింది.
“ఏంటలా అయ్యావ్! పేరు సంకేతనా?” అడిగింది ఆసక్తిగా శరదృతి. శరదృతిని చూస్తుంటే సంకేతను తనకొడుక్కి తప్పకుండా చేసుకునేలాగే అన్పిస్తుంది. సంకేత అనంత్ కి భార్య అయితే చదువు లేకపోయినా వున్న దరిద్రం పోతుంది. హాయిగా వుంటుంది. అందుకే పల్లవి హుషారుగా చూస్తూ “అవునాంటీ! తను మీకు తప్పకుండా నచ్చుతుంది. నేనిప్పుడే మిమ్మల్ని తీసికెళ్లి సంకేతను పరిచయం చేస్తాను” అంటూ డ్రైవర్ కి ఎలా వెళ్ళాలో రూట్ చెబుతూ శరదృతిని శివరామకృష్ణ ఇంటికి తీసికెళ్ళింది పల్లవి.
గేటు ముందు కారు దిగుతున్న పల్లవిని బాల్కానీలో నిలబడి వున్నసంకేత చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకుంది. పల్లవి నవ్వుతూ సంకేతను విడిపించుకుని “కారులో ఎవరున్నారో తెలుసా! అనంత్ వాళ్ల మమ్మీ! నిన్ను చూడాలని వచ్చారు”, అంటూ చెవి దగ్గర నోరుపెట్టి గొంతు తగ్గించి చెప్పింది.
“నన్నా...” అదిరిపడింది సంకేత. గుండె దడదడలాడుతుంటే ఒక్కక్షణం ఏం చేయాలో తోచనట్లు చూసింది.
వెంటనే జాగ్రత్తపడి పరిగెత్తుకుంటూ లోపలికెళ్లి అనంత్ తనకి ఇచ్చిన మినీ లాప్టాప్ ను, సెల్ ఫొన్ ను దాచేసింది. తిరిగి కారు దగ్గరకి వెళ్లినంత వేగంగా వచ్చింది.
ఈ లోపలే కారు దిగి, చుట్టూ పరిసరాలను గమనిస్తోంది శరదృతి.
“రండి ఆంటీ!” అంటూ కుంటుతూ నడుస్తున్న పల్లవిని పట్టుకుని “ఏమైందే కాలికి?” అంది సంకేత.
“నీకు మళ్లీ ఎక్స్ ప్లెయిన్ చేస్తానులే! ఆంటీ ఇది నా ఫ్రెండ్ సంకేత” అంటూ సంకేతను శరదృతికి... అలాగే ఈవిడ మా ఆంటీ!” అంటూ శరదృతిని సంకేతకి పరిచయం చేసింది.
పరిచయాలు అయ్యాక నలుగురు లోపలకి నడిచారు. నాలుగు అడుగులు వెయ్యగానే
మెట్లకింద వున్న వరమ్మకి ఎవరో వస్తున్నట్లు విన్పించి చదువుతున్న బాలరామాయణం పుస్తకంలోంచి తలెత్తి “ఎవరూ?” అన్నట్లు శరదృతి వైపు చూసింది.
పల్లవి అది గమనించి “మనం ఈ వరమ్మ దగ్గర ఆగితే ప్రశ్నలతో చంపుతుంది ఆంటీ!” అంటూ వరమ్మ ఎవరో, ఎలాంటిదో! తను కన్పిస్తే చాలు కాలేజీ విషయాలను ఎలా అడిగి తెలుసుకుంటుందో! ఎలా మాట్లాడుతుందో! ఇప్పటికీ ఎంత హుషారుగా ఉంటుందో చెప్పింది. “వుండేది మెట్లకిందయినా ఆ చూపు చూడు జడ్జీలా. ఎలా వుందో” అంటూ వరమ్మను చూడకుండా పక్కకు చూస్తూ గొణిగింది.
శరదృతి నవ్వి “పెద్దవాళ్లు ఆమాత్రం అలర్ట్ గా వుండటం చాలా అవసరం” అనుకుంది మనసులో... ఇలాంటి వాతావరణంలో వున్న సంకేతపై మంచి అభిప్రాయం కలిగింది శరదృతికి...
నేరుగా తన బెడ్ దగ్గరకి తీసికెళ్లి ఓ కుర్చీ వేసి “కూర్చోండి ఆంటీ!” అంది సంకేత.
కుర్చీలో కూర్చుంది శరదృతి..పల్లవి, సంకేత మాత్రం బెడ్ మీద కూర్చున్నారు.
...మాటలు ఎలా మొదలు పెట్టి ఎలా ముగించాలో తెలియని వాళ్లలాగ ఎవరికీ వాళ్లు మౌనంగా వున్నారు.
చుట్టూ పరిశీలనగా చూసింది శరదృతి. ఒకవైపు సంకేత డ్రెస్స్ లు, పుస్తకాలు వుంటే ఇంకోవైపు మడతలు వేసి ఉంచిన నీలిమ డ్రస్స్ లు, పడుకునే చాప బెడ్ షీట్ వున్నాయి. ఆ గది మొత్తం వీలైనంత నీట్ గా సర్దివుంది.
ఆ నిశ్శబ్దాన్ని చేధిస్తూ “ఆంటీ! వాటర్ తాగండి!” అంటూ వాటర్ బాటిల్ తెచ్చి శరదృతికి ఇచ్చింది సంకేత.
కాంచనమాల నీలిమ మీద దేనికో కేకలు వేస్తూ ఎప్పటిలా సంకేత దగ్గర కూర్చుందామని వచ్చి, కొత్తవ్యక్తి కన్పించటంతో ఒక్కక్షణం ఆగి “మీరూ”? అంటూ శరదృతి వైపు చూసింది.
“నా పేరు శరదృతి! పల్లవికి కాలు ప్రాక్చరయిందని తెలిసి, తనని ఇంటికి తీసికెల్దామని వచ్చాను. ఇంతలో తన రికార్డు ఏదో సంకేత దగ్గర వుందని చెప్పింది. వెళ్తూ, వెళ్తూ ఇలా వచ్చాం...” అంటూ చెప్పింది. ఆంటీ ఇంత అందంగా అబద్దం చెబుతుందా? ఆశ్చర్యపోయింది పల్లవి... పల్లవితో పాటు సంకేత కూడా.. పల్లవి రికార్డు సంకేత దగ్గర లేదు.
కాంచనమాల శరదృతికి తన్ను తాను పరిచయం చేసుకుంది. శరదృతి వేషభాషల్ని అంచనావేస్తూ, సంతృప్తిగా అన్పించటంతో కళ్లార్పకుండా అలాగే చూస్తోంది కాంచనమాల.
శరదృతి సంకేతనే పరిశీలనగా చూస్తూ వాటర్ బాటిల్ మూతను నెమ్మదిగా తీసి, తాగాలని నోటి దగ్గర పెట్టుకోబోతుండగా...
‘ఆగండి! మీకు ఫ్రిజ్ లోంచి కూల్ వాటర్ తెప్పిస్తాను. హాస్టల్లో ఇచ్చినట్లు బాటిల్ తోనా నీల్లివ్వటం..? వచ్చిన గెస్ట్ లు ఎలాంటి వాళ్లో చూసుకోవద్దా! నీలిమా! మన ఫ్రిడ్జ్ లోంచి కూల్ వాటర్ తీసుకొని వెండి గ్లాసులో పోసుకుని రాపో!” అంటూ అక్కడే నిలబడి ఆర్డర్ జారీ చేసింది కాంచనమాల.
నీలిమకి వెండి గ్లాసు అనగానే అర్ధమైపోయింది వచ్చినవాళ్లు ఎలాంటి వాళ్లో వాళ్ళకి దేనికోసం కాంచనమాల మర్యాద చేయిస్తుందో. ఎక్కువ టైం తెసుకోకుండా వెంటనే నీళ్లు  తెచ్చి శరదృతికి ఇచ్చింది నీలిమ.
శరదృతికి నీలిమను చూడగానే – కాంచనమాలతో ఏదో ఒకటి మాట్లడాలన్నట్లు.
“ఈ అమ్మాయి మీ బంధువా?” అని అడిగి, నీలిమ చేతిలో వున్న వెండి గ్లాసును అందుకొని నీళ్లు తాగి, ఖాళీ గ్లాసును తిరిగి నీలిమచేతిలో పెట్టింది.
“బంధువు కాదు. ఇదో పెద్ద రోభో!” అంది కాంచనమాల పెద్దగా నవ్వి.
“ రోభో నా!” ఆశ్చర్యంగా చూసింది నీలిమను శరదృతి. సంకేత, పల్లవి కూడా ఆశ్చర్యపోయారు కాంచనమాల నీలిమను రోభో అనగానే ..
“రోబో చార్జింగ్ అయిపోగానే ఆగిపోతుంది. ఇది అలాకాదు. పనిచేస్తున్నా కొద్ది రీచార్జ్ అవుతూనే వుంటుంది. పేరు నీలిమ. మా మామగారు బ్రతికుండగా రోడ్డు మీద ఏడుస్తూ కన్పించిందని తీసుకొని నా నెత్తిన పెట్టారు. మెల్లగా పనులు నేర్పుకొని పనిమనిషిని తీసేశాను . ఇక్కడికి రాకముందు అనాథ ఆశ్రమంలో వుండేదట... దానికన్నా ముందు ఎక్కడుండేదో ఆ దేవుడికే తెలియాలి....” అంది అదేదో జోక్ అయినట్లు ఇంకా నవ్వుతూనే ఉంది కాంచనమాల.
నీలిమ గురించి ఎవరికైనా అలాగే చెబుతుంది.
నీలిమకు ఆ మాటలు అలవాటైపోయాయి.
“మీ మామగారు చాలా మంచిపని చేశాడు. ఈ రోజుల్లో ఇంత బాగా పనులు చేసేవాళ్లు దొరకటం కష్టం... దొరికినా టైంకు రారు. వాళ్ళకి కూడా సెల్ ఫోన్ లు అలవాటు అయ్యాయి. పనిలోకి వచ్చేముందు వాళ్ళ సెల్ ఫోన్ కి రింగ్ ఇచ్చి నిద్ర లేపాల్సి వస్తుంది. దానికోసం వాళ్ళ కన్నా ముందుగా మనం నిద్రలేవాలి... మావారు ఇంత సంపాదించినా మంచి పనిమనిషిని సంపాయించుకోలేకపోతున్నాం. ఫంక్షన్స్ అప్పుడైతే మరీ ఇబ్బంది అవుతోంది” అంటూ గృహిణిగా తన సమస్యను చెప్పింది శరదృతి.
“ఇకముందు మీ ఇంట్లో ఎప్పుడు ఫంక్షన్లయినా బాధ పడకండి నేను మా నీలిమను పంపిస్తాను” అంది కాంచనమాల.
శరదృతి నవ్వింది.
నీలిమ వెండిగ్లాసు తీసుకొని కిచెన్ లోకి వెళ్లింది.
”ఇక్కడ మీక తగిన గాలి దొరకదు. రండి నా గదికి వెళ్దాం. అక్కడ ఏ.సి. వుంటుంది” అంటూ శరదృతిని తన గదికి తీసికెళ్లి కూర్చోబెట్టింది కాంచనమాల.
శరదృతి వెళ్లగానే సంకేత గుండెల మీద చేయి వేసుకొని హమ్మయ్య ఇప్పుడు హాయిగా వుంది. అవిదముండు కూర్చోవాలంటేనే టెన్షన్ గా వుంది. నెర్వేస్ గా వుంది” అంది సంకేత.
“ఇప్పుడే అలావుంటే జీవితాంతం ఎలా ఉంటావే! ఆవిడకు నువ్వు నచ్చితే అనంత్ కి భార్యవైపోతావ్!”
“నచ్చకపోతే?”
“లవర్ గానే వుండిపోతావ్!”
“నన్ను చూస్తుంటే నీకెలా అన్పిస్తుందే! వుండు నీపని చెబుతా!”
అంటూ దుప్పటికింద దాచివుంచిన మినీ లాప్ టాప్ ను చేతిలోకి తీసుకొని కొట్టబోయింది.
పల్లవి భయంతో, కంగారుగా దాన్ని పట్టుకొని ఆపుతూ “కొట్టావంటే నా తల పగిలిపోతుంది. ఇప్పటికే కాలుపోయి కుంటుతున్నాను. తల పగిలిందంటే నేను ఎందుకూ పనికిరాకుండా పోతాను. నీ కెందుకు తల్లీ ఆపాపం! ఏదీ! ఇలా ఇవ్వు! దాన్నిక్కడ భద్రంగా దాచుకుంటా! నేను వెళ్ళేంతవరకు...” అంటూ లాప్ టాప్ ని లాక్కుని ఒల్లో పెట్టుకుంది. ఆ తర్వాత దాన్నే చూస్తూ...
“అనంత్ మంచి గిఫ్టే ఇచ్చాడు నీకు కానీ కోపం వచ్చినప్పుడు దీన్ని ఎవరిమీడకి ప్రయోగించకూడదు అని ఓ చిన్న స్లిప్ రాసి దీనిమీద అతికించి వుంటే బావుండేది...” అంది పల్లవి.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages