బుడుగు నాలెడ్జి టెస్ట్ - అచ్చంగా తెలుగు

బుడుగు నాలెడ్జి టెస్ట్

Share This

బుడుగు నాలెడ్జి టెస్ట్

- యనమండ్ర శ్రీనివాస్ 


“బుడుగు బుడుగూ….నాకు కొంత హెల్ప్ చెయ్యవా? మా మాస్టారు ఈ ఏడాది నన్ను కూడ జెనరల్ నాలెడ్జి టెస్టు రాయమన్నారు” పెసూనాంబ అడిగింది నన్ను.
పెసూనాంబ అడగటము నేను చెప్పకపోవటమూనా. సరే పుస్తకాలు తీసుకుని రమ్మన్నాను. మా వైజాగ్ మాస్టారు కూడా నన్ను రాయమన్నారుగా. అందుకే కలసి చదూకుందామని.
తను మా ఇంటికి వచ్చిన రోజు పక్కింటి పిన్నిగారు కూడా వుంది. “ఏంటి, బుడుగు బుద్ధిమంతుడయిపోయాడే” అంది.
“పిన్నిగారు, జెనరల్ నాలెడ్జి టెస్టు కదా, బుడుగు చేత కొన్ని చెప్పించుకుందామని నేనే అడిగా. తనూ రాస్తున్నాడు” పెసూనాంబ అంది.
పిన్నిగారి కళ్ళల్లొ - ఏరియల్ పౌడర్ చూస్తే ఆంటీ కళ్ళల్లొ కనపడే మెరుపు లాంటిది – కనిపించింది. “బుడుగు, మా మంచి బాబే…మంచి హేమాహేమీల్లాంటి వాళ్ళకే ఈ టెస్టు కష్టమంటారు. ఇద్దరూ జాగ్రత్తగా చదూకోండి. సరేనా” అంది.
“బుడుగూ. హేమాహేమీలంటే?” పెసూనాంబ అడిగింది.
“ఇది కూడా తెలీదా. హెడ్ మాస్టారు – హెడ్ మిస్ట్రెసు. వాళ్ళకే టెస్టు కష్టముగా. మనకి ఇంకా కష్టమని అంటున్నారు పిన్నిగారు.” ఈ పెసూనాంబకి ఏవీ తెలీదు. అందుకే నా దగ్గరకే వచ్చింది.
సరే. పెసూనాంబ తీసిన మొదటి పుస్తకం సైన్సు. హబ్బ ఆ పుస్తకం చూస్తేనే నాకు నిద్ర వచ్చేస్తుంది. అందులో ఆ న్యూటన్ బొమ్మ చూస్తే మరీను. అసలు ఒకోసారి అనిపిస్తుంది. ఆ వెధవ ఆపిల్ పండు ఆయన పక్కన కాకుండా ఆయన గుండు మీద ఠపీమని పడుంటే అసలు మనకి సైన్సులో ఒక చాప్టరు తగ్గి వుండేది కదా.
“సైన్సు కాదు కానీ బయాలజీ చదువుకుందాం, పెసూనాంబా. అది అయితే బాగుంటుంది నాకు” అన్నాను.
“జీర్ణ వ్యవస్ఠ గురించి చెప్తాను అయితే” పెసూనాంబ ఎగిరి గంతేసింది. నిన్ననే చదివిందిట. సరేలే చెప్పు అన్నాను.
“ఆహారాన్ని నోటి ద్వారా తీసుకుని పళ్లతో నమిలటముతో జీర్ణ వ్యవస్థ ప్రారంభమవుతుంది. లాలాజల సాయముతో ఆహారం జారుతూ పొట్టలోకి వెళతాయి. అక్కడ రసాయనాలు సూక్ష్మక్రిములను చంపి ఆహారాన్ని ముక్కలు ముక్కలు చేస్తాయి. ఆ తరువాత వాటిలోని పోషక విలువలు చిన్నపేగు ద్వార రక్తములోకి వెళతాయి. అనవసరమయిన పదార్ధాలు పెద్ద పేగుద్వారా బయటకి మల విసర్జన ద్వార వదిలెయ్యబడుతాయి” పెసూనాంబ చెన్నయ్ ఎక్స్ ప్రెస్ రైలులాగా గబ గబా చెప్పేసింది.
హమ్మో హమ్మో ఎంత చదివేసింది. నాకు ఇంత తెలీదు జీర్ణ వ్యవస్థ గురించి. బాబాయిని చెప్పవా అని అడిగితే “కుడి చేతితో ప్రారంభమయ్యి ఎడం చేతితో సమాప్తమయ్యే ప్రక్రియ” అని మాత్రమే చెప్పాడు. అంత వరకే నేను చదివా. గాఠిగా ప్రైవేటు చెప్పెయ్యాలి బాబాయికి.
ఇక పెసూనాంబకి నేనేమి చెప్తాను. అందుకే “పెసూనాంబా. ఇంక నిద్ర వస్తోంది. నేను పడుకుంటా.” అని చెప్పేసి నన్ను నేను రష్షించేసుకున్నాను. పెసూనాంబ, పిన్నిగారు వెళ్ళిపొయాక ముసుగుతన్ని పడుకున్నాను.
మర్నాడు టెస్టు రాయడానికి వెళ్లానా…అక్కడ వాడు ఇచ్చిన పేపరు చూశానా అంతే. తారె జమీన్ పర్ సినిమాలో అబ్బాయికి కళ్ళ ముందు అక్షరాలు డాన్స్ చేస్తాయే అలా కనపడ్డాయి. అవే రాయలేక నేను సతమతమవ్వుతుంటే, అక్కడ మాస్టారు నాకో షీటు పేపరు ఇచ్చాడు. అందులో నాలుగు గళ్ళు. ఒకో గడిలో ఒకో జంతువు కాళ్ళు మాత్రమే వున్నాయి. అవి చూసి ఆ జంతువు పేర్లు రాయాలట. ఎలా కనపడుతున్నారు పిల్లలు వీళ్లకి, అనిపించింది ఒక్కనిమిషం.
అందుకే బెల్లు మోగేదాకా పేపరుమీద ఏదో ఒకటి కెలుకుతూ కూర్చున్నా. పెసూనాంబ మటుకు తెగ హడావుడి పడుతూ రాసేస్తోంది. అసలు ఈ ఆడపిల్లలు చదూకోటానికే పుట్టారేమో.
ఇంక పెసూనాంబ నా పేపరు చూస్తే నవ్వుతుందేమో అని బెల్లు కొట్టగానే పేపరు అక్కడి మాస్టారుకి ఇచ్చేసి బయటకి పరిగెట్టాను,. గబగబా క్లాసు బయటకి వెళ్ళేలోపే ఆయన “ఒరేయ్” అని నన్ను పిలిచారు.
ఏమిటా అని వెళితే “ఒరెయ్, నీ పేరు రాయలేదు ఈ పేపరు మీద” అన్నారు.
హబ్బ. దొరికారు మాస్టరు అనిపించింది. చిన్నపిల్లలకి ఇలాంటి టెస్టు పెడితే ఎంత కష్టపడతారో ఆయనకి ప్రైవేటు చెప్పెయ్యాలిగా.
అందుకే..ఆయనకి కొద్దిగా దూరంగా జరిగి, నా బుల్లి పేంటు కొద్దిగా పైకెత్తి, నా కాళ్ళు రెండూ ఆయనకి చూపించి “ఇవి చూసి నా పేరు రాసెయ్యండి అక్కడ, మాస్టరుగారూ’ అనేశా.
హమ్మో. ఇంక అక్కడ వుంటే డేంజరుగా డిప్పకి. అందుకే తుర్రుమనేశా.

No comments:

Post a Comment

Pages