నేటి మహిళ ఆంకర్ ‘ఝాన్సీ’ గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

నేటి మహిళ ఆంకర్ ‘ఝాన్సీ’ గారితో ముఖాముఖి

Share This

నేటి మహిళ ఆంకర్ ‘ఝాన్సీ’ గారితో ముఖాముఖి

భావరాజు పద్మిని


నమస్కారం ! ఏ మతంలోనైనా సంపాదనలో 10% సామాజిక సేవకు వినియోగించమని చెప్తుంటారు, నటిగా, ఆంకర్ గా, మానవతావాదిగా, సంఘ సేవికగా, ఇలా విభిన్న రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆంకర్ ఝాన్సీ గారు. తెగువలో ఝాన్సీ రాణిని, మనసులో నవనీతం వంటి సున్నితత్వాన్ని సంతరించుకుని, తన సంపాదనలో చాలావరకు పేద మరియు బలహీనవర్గాల, వ్యాధిగ్రస్తుల, వికలాంగుల అభ్యున్నతికి వినియోగిస్తున్న ఆదర్శ మహిళామణి,  ఝాన్సీ గారే –  అచ్చంగా తెలుగుతో ముఖాముఖి జరిపిన తొలి మహిళ కావడం విశేషం. ఇక ఝాన్సీ గారితో మాట్లాడేద్దామా, మరి ?
నమస్కారం ఝాన్సీ గారు. బాల్యం, కుటుంబనేపధ్యం గురించిన విశేషాలు చెబుతారా ?
బాల్యం అంటే అందరిలాగే గడిచిందండి. మధ్యతరగతి బాల్యం. అమ్మ శారద కేంద్రప్రభుత్వ ఉద్యోగిని,  AIR లో చేసేవారు. నాన్న రాజారావు గారు, పైలట్ ఎలక్ట్రికల్ కాన్ సాఫ్ట్వేర్  లో చేసేవారు. గచ్చిబౌలిలో ఉన్న కేంద్రప్రభుత్వ  క్వార్టర్స్ లో, అన్ని రకాల వ్యక్తుల మధ్యా, అన్ని పండగలను కలిపి జరుపుకుని, ఉన్నంతలో సంతోషంగా గడిచిందండి. నేను చాలా ఆక్టివ్ చైల్డ్ ని. అన్నిటిలోనూ ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. స్వస్థలం అంటూ చెప్పడానికి ప్రత్యేకంగా ఒక ఊరంటూ లేదు. తల్లిదండ్రులు ఇరువురూ ఒకరు కృష్ణా, ఒకరు గుంటూరు జిల్లా నుంచి వచ్చినవారు. కాని, ఇద్దరూ స్వస్థలాలను వదిలేసి, ఒకరు ఏలూరులో, ఒకరు విజయవాడలో ఉంటూ, చివరికి ఇద్దరూ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. నేను పుట్టడం, పెరగడం అంతా హైదరాబాద్ లో కనుక, ఇదే నా సొంతూరని చెప్పుకోవాలి.
మీకు చిన్నప్పటి నుంచి నటన పట్ల ఆసక్తి ఉండేదా ?
క్రియేటివ్ గా ఎక్కడ స్టేజి ఉంటే, అక్కడ మనకు అవకాశం ఉంది అనుకుని వెళ్ళేదాన్ని. చాలా ఔత్సాహికంగా ఉండడమే నన్ను నటన వైపు లాక్కొచ్చి, ఇదొక కెరీర్ గా ఏర్పరుచుకునేలా చేసాయేమో. వినాయకచవితి పందిళ్ళలో, స్కూల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేదాన్ని. చాలా చిన్నప్పుడు నాకు గుర్తు – నేను కేంద్రీయ విద్యాలయలో హిందీ విద్యార్ధుల మధ్య చదువుతూ ఉండగా, మాయాబజార్ సినిమాలోని తల్పం- గిల్పం, తాంబూలం సీన్ ను ఏకపాత్రాభినయంలో చేసాను. రోల్ అవుతున్న మాట్, కొడుతున్న మంచం, తిరుగుతున్న కోళ్ళు, ఇవన్నీ అభినయించి, నార్త్ ఇండియన్ ఆడియన్స్ ను మెప్పించగలగటం నేను చేసిన మొదటి ప్రయోగం.
AIR లో అమ్మ పనిచేస్తూ ఉండడంవల్ల, జానకి అక్కయ్య గారితో పరిచయం, తద్వారా బాలానందం, బాలవినోదం, వివిధభారతి, డ్రామా సెక్షన్ లో  చాలా చిన్నవయసులోనే పాలుపంచుకునే అవకాశం నాకు దక్కాయి. ‘చిట్టి చిలకమ్మా’ తో బాలనందంలో మొదలుపెట్టి, బాల వ్యాఖ్యాతగా బాలానందం, బాలవినోదం కార్యక్రమాలకు పనిచేసాను. తర్వాత వివిధభారతి చాలా కార్యక్రమాలు చేసాను, యువవాణిలో చాలా ఔత్సాహిక పాత్ర పోషిస్తూ, కార్యక్రమాలు చేసాను. అప్పట్లో AIR అతి పెద్ద ప్రసార మాధ్యమం, చాలా మందిని చేరేది. ‘పిల్లలారా రారండోయ్...’ అన్న పాట తెలియనివారు ఎవ్వరూ ఉండరు. ఇలా నేను ఎదుగుతుండగానే, నాలోని వివిధ పార్శ్వాలు వీటి ద్వారా బయల్పడి, ఇవే ఒక కెరీర్ గా ఏర్పడ్డాయి.
టీవీలోకి ప్రవేశం ఎలా జరిగింది ?
టీవీ కంటే ముందు రేడియో నాటకాలు, స్టేజి ప్లే లు చేసాను. నాకు చాలా పొడుగు జుట్టు ఉండేది. అమ్మ ఫ్రెండ్ సత్యవతి గారని, ఒకావిడ ఆడ్ ఫిలిం మేకర్. ఆవిడ అశ్విని హెయిర్ ఆయిల్ ఆడ్ కోసం నన్ను అడిగారు. ఆ ఆడ్ ఫిలిం డైరెక్టర్ మా ఇంటికి వచ్చి, అమ్మాయి చిన్నగా ఉంది, వాళ్ళ అమ్మగారు చేస్తారేమో కనుక్కోమని, అన్నారు. అలా నేనా ఆడ్ చెయ్యలేదు కాని, ఆ డైరెక్టర్ కళ్ళలో పడ్డాను. రెండేళ్ళ తర్వాత ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చారు.
అప్పట్లో రెండు ఎపిసోడ్ ల టెలిఫిలిమ్స్ వచ్చేవి. నేను మొదట నటించినది, ‘విజేత’ అనే టెలి ఫిలిం లో. ఒక వికలాంగురాలు  తన వైకల్యాన్ని విజయావకాశంగా మార్చుకుని, ఎంతోమందికి ప్రేరణగా ఎలా నిలిచింది అనేది ఇందులోని కధ. నా మొదటిపాత్ర దగ్గరినుంచి, నాలో ఉన్న సామాజిక స్పృహ, దృక్పధానికి తగ్గ పాత్రలే వచ్చాయి. మనకి నచ్చినట్లుగా మనం ఎన్నుకుంటాము అనేకంటే, మనకి నచ్చినట్లుగా మనం ఆకర్షిస్తాము అన్నదాన్ని నేను నమ్ముతాను. అటువంటిదే విజేత. అదే టీం తో 13,14 ఎపిసోడ్ లు పనిచేసాకా, బయటి వారితో పనిచేసాను. అప్పటికే నాకు మంచి సర్కిల్ ఏర్పడడంతో, నా విలువలు, నా వ్యక్తిత్వం ఇవన్నీ కుదిరాయి.
ఈ క్రమంలోనే నీకు బ్నిం గారితో పరిచయం ఏర్పడింది. ఆయన నాలో ఉన్న , బలహీనతల్ని గుర్తించారు. నేను చాలా స్పీడ్ గా మాట్లాడతాను, ఇందువల్ల చెప్పాలి అనుకున్నది నేను స్పష్టంగా చెప్పినా, అవతలి వారు సరిగ్గా అవగాహన చేసుకునే సమయం ఉండదు అని ఆయనకు అనిపించి, పరవళ్ళు తొక్కే నదికి ఆనకట్ట వేసినట్టు, నన్ను, నా వొకాబులరీని, మాడ్యులేషన్ ని, ఆయనే నేర్పారు.వీటన్నిటినీ ఒక పెద్ద రిసర్వాయర్ లాగా తయారుచేసి, అవసరమున్నప్పుడు వాడుకోవడం ఆయన నాకు తెలియచేసారు. అసలు ఎప్పుడూ హిందీ తప్ప, తెలుగు చదువుకోని పిల్లని తెలుగు మాట్లాడుతూ ఉంటే అందులో ఉన్న లోపాలు చెప్పారు.
మా అమ్మ నేను హిందీ మీడియం లో చదివినా, తెలుగు రావాలని ఈనాడులో క్రాస్ వర్డ్స్, తెలుగు లిపి నేర్పడం, బాలానందం, బాలవినోదం. గ్రాంధికంగా నేర్పకపోయినా, పుస్తకాలు చదవడం వల్ల తెలుగు బాగా మెరుగయ్యింది. వీటి వెనుక అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. నేను యువవాణి కి బుక్ రివ్యూస్ చేసాను. దానివల్ల కూడా నా తెలుగు బాగా మెరుగయ్యింది.
మరి ఆంకర్ గా ఎలా రంగప్రవేశం చేసారు ? దీనికోసం శిక్షణ ఏదైనా తీసుకున్నారా ?
అప్పట్లో ఇదొక ప్రొఫెషన్ అనే ఎవరికీ తెలీదు. టీవీ పరిణామం మొదలవుతున్న దశ. 94లో నేను స్టార్ట్ చేసానండి, 95  లో సాటిలైట్ టీవీ మొదలయ్యింది. అది జెమినీ, ఫిబ్రవరి లో మొదలయ్యింది, ఆగష్టు లో ఈటీవీ మొదలయ్యింది. 96 లో మొదలైన తొలితరం కార్యక్రమాలు వ్యాఖ్యానంలో ఒక కొత్త ఒరవడి. ఎందుకంటే అప్పటివరకూ వ్యాఖ్యానం అంటే ఇంటర్వూస్ చెయ్యడం లేక అనౌన్సుమెంట్. కార్యక్రమాలకు ఒక ప్రయోక్త, వ్యాఖ్యాత కావాలి అనేది మెల్లిమెల్లిగా ఎవోల్వ్ అయ్యింది. నేను మొదట ఆంకరింగ్ చేసిన ప్రోగ్రాం ‘అందెల రవళి’ అని దూరదర్శన్ కోసం. ఇందులో శాస్త్రీయ నృత్యం ఉన్న సినిమా పాటల గురించి మాట్లాడుతూ, నేను మధ్యలో పలానా సినిమాలో, పలానా సందర్భంలో రచయత ఇటువంటి పాటను రచించడం జరిగింది, అంటూ పాట వివరాలు చెప్పేదాన్ని. నాకు తెలిసినంతవరకు తెలుగులో ఇదే మొట్టమొదట ఒక ఆంకర్ ని పెట్టి చేసినటువంటి షో. తర్వాత నెమ్మదినెమ్మదిగా ఇవాల్వ్ అయ్యాయి. సాటిలైట్ చానల్స్ వచ్చాకా మేము అందరం ఆంకరింగ్ చేస్తూ, ఈ దశకు చేరుకున్నాము.
సినీరంగ ప్రవేశం ఎలా జరిగిందండి ?
‘ఎగిరే పావురమా’ అనే సినిమాకి నాకు మొదట ఆఫర్ ఇచ్చారు కృష్ణారెడ్డి గారు. అందులో ‘థిస్ ఇస్ ద రిథం ఆఫ్ లైఫ్’ అనే పాటని ఝాన్సీ పద్ధతిలో పాడడం ఉంటుంది. దానితో మంచి గుర్తింపు వచ్చింది. మీర్ గారు నేను కామెడీ చెయ్యగలను అని గుర్తించారు. ఆయన తొలి తరం సీరియల్స్ కి , కార్యక్రమాల నిర్వహణకు ఆయన సుప్రసిద్ధులు. ఆయన నాతోటి ‘టాప్ ఆఫ్ ది టాప్స్’ అనే ఒక కార్యక్రమం చేయించారు. ఇందులో మీర్ గారు నాతో చాలా ప్రయోగాలు చేయించారు. ఏ ఆక్టర్ గురించి మాట్లాడుతున్నామో వారి డిక్షన్, డైలాగ్ డెలివరీ అనుకరించాలి. వాణిశ్రీ గారి గురించి మాట్లాడితే ఆవిడని, కోటా శ్రీనివాస రావు గారి గురించి మాట్లాడితే వారినీ అనుకరించాలి. అది చేస్తున్నప్పుడే, నాలో కూడా అనుకరించే శక్తి ఉందని, వేషాలు వెయ్యడానికి నేను రకరకాల యాసలు మాట్లాడగలనని ఆయన గుర్తించారు. అది నాకు టాక్ ఆఫ్ ది టౌన్ కు పనికి వచ్చింది. ఆ తర్వాత నేను వేషాలు, యాసలు చెయ్యగలనని తెలిసాకా, సినిమా ఇండస్ట్రీ గుర్తించింది. అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వేసిన నాకు కమెడియన్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. టిపికల్ యాస ఉన్న వాటికి, కామెడీ ఉన్నవాటికీ ఈ అమ్మాయిని పెట్టుకోవచ్చు అన్న ముద్ర పడిపోయింది. అమ్మగానో, అక్కగానో, వదినగానో కాక, ఈ అమ్మాయి ఉందంటే, ఏదో ఆశించవచ్చు, అన్న పేరు తెచ్చుకున్నాను. టీవీ లో చేస్తున్నప్పుడే, అవి సినిమాలకు కూడా ఉపయోగపడ్డాయి. టాక్ ఆఫ్ ది టౌన్ నుంచే చాలా క్యారెక్టర్స్ పుట్టాయి. ‘నిన్నే ఇష్టపడ్డాను’ అనే సినిమాలో డైరెక్టర్ కొండా గారిచ్చిన బేబక్కాయ్ అనే క్యారెక్టర్ చేసాను. అది కూడా టాక్ ఆఫ్ ది టౌన్ నుంచే వచ్చింది. ప్రతి ప్రాంతపు భాషలో ఒక స్టైల్ ఉంటుంది. అది మనుషుల్ని కలిసి, వారితో ప్రయాణం చేసి, నేర్చుకున్న ఒక ఫ్లేవర్. అది బాగా సక్సెస్ అయ్యింది.
ఆంకర్ కి ముఖ్యంగా ఉండాల్సింది సమయస్పూర్తి, నేర్పు అంటారు కదా ! మీరు ఆంకరింగ్ చేసినప్పుడు జరిగిన ఒక వినోదాత్మకమైన సంఘటన చెప్పండి.
సాధారణంగా నా పంధా ఆంకరింగ్ లో కాస్త స్ట్రెస్ ఫుల్ గానే ఉంటాయి. సుమ అటువంటి సందర్భాలను చాలా లాఘవంగా మేనేజ్ చెయ్యగలదు. ఒకసారి, కాదు రెండు సార్లు అటువంటి ఒత్తిడిలో ఒక పొరపాటు చేసాను. ‘అశోక్’ అని ఎన్.టి.ఆర్. గారి సినిమా, ఆడియో లాంచ్ అవుతోంది. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లలో ఓడిపోయి ఉన్నారు. నందమూరి వారందరినీ స్టేజి మీదకు పిలిచాము. చివరికి చీఫ్ గెస్ట్ అని చంద్రబాబు గారిని పిలవబోతూ, నందమూరి చంద్రబాబునాయుడు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము, అనేసాను. జనం పెద్ద పెట్టున ‘ఓ’ అని అరుస్తున్నారు. ‘ఓహో, ఓడిపోయినా, చంద్రబాబు గారికి ఫాలోయింగ్ బానే ఉందే’ అనుకున్నాను. అప్పటికీ నేను చేసిన పొరపాటు నాకు తెలియలేదు. కింద నుంచి పరచూరి గోపాలకృష్ణ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ‘అమ్మాయ్... నందమూరి అన్నావ్...’ అంటున్నారు... అయినా నాకు అర్ధం కాలేదు. ఈ లోపు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకు వచ్చి, ‘అమ్మాయ్, నా పేరు మార్చేసావ్...’ అన్నారు. అప్పుడు చేసిన పొరపాటు గుర్తించి, సారీ చెప్పాను. దీన్ని ఇంకేమీ కామెడీ చేసేందుకు వీల్లేని పరిస్థితి. కాని, మా సుమ ఉంటే మటుకు, దాన్ని ఎలాగో వినోదాత్మకంగా మార్చేసేది.
మరోసారి బాలకృష్ణ గారి సినిమా ఆడియో లాంచ్ కి వెళ్తుండగా, పరచూరి గోపాలకృష్ణ గారు కనిపించి, ‘అమ్మాయ్... పోయినసారి, నందమూరి చంద్రబాబునాయుడు అన్నావ్, ఈ సారి అలా అనకే !’ అన్నారు. ‘భలే వారండి, ప్రతిసారి ఎందుకు అంటాను, ‘ అనేసి, ‘నందమూరి అనకూడదు... నందమూరి అనకూడదు...’ అనుకుంటూ స్టేజి ఎక్కి, మళ్ళీ నందమూరి చంద్రబాబునాయుడు గారిని ఆహ్వానిస్తున్నాను, అనేసాను. అంతా ఘొల్లున నవ్వారు. చంద్రబాబు గారు స్టేజి పైకి వచ్చి, ‘మొత్తానికి మా ఇంటిపేరు మార్చుకోవాలేమో అమ్మాయ్’, అన్నారు. ఏ తప్పైతే చెయ్యకూడదు అనుకుంటామో దాని గురించి కాన్షియస్ గా ఉండకూడదు అని, చెయ్యద్దు అనుకున్నది తొందరలో చేసే ప్రమాదం ఉందనీ, అప్పటినుంచి నేర్చుకున్నాను. మీరు చేసిన సూపర్ హిట్ టీవీ షోస్ గురించి చెప్పండి.
నా జీవితంలో అప్పట్లో జరిగిన కార్యక్రమాలు అన్నింటిలో, సింగల్ ఆంకర్ 650 వేషాలు వెయ్యడం, ఆ కార్యక్రమం పదేళ్ళ పాటు కొనసాగడం పరంగా ‘టాక్ ఆఫ్ ది టౌన్ ‘ ప్రోగ్రాం దేశంలోనే ఒక రికార్డు ను సృష్టించింది. దాన్లో నన్ను నేను ఎక్ష్ప్లొర్ చేసుకున్నాను. ప్రోగ్రాం కేవలం నావల్లే హిట్ అయింది అనను కాని, దాన్లో సినిమా గురించిన సమాచార సేకరణ తో పాటు, సోషల్ ఇష్యూస్ కు కనెక్ట్ చెయ్యడం వల్ల ఆ విషయాలకి కనెక్ట్ అయినవారు ఉన్నారు. మలేరియా, డెంగు లాంటి వ్యాధులు, కూరగాయలు, ఉల్లి ధరల పెరుగుదల, పండగ సీజన్లో బస్సులలో రద్దీలు, ఆటో డ్రైవర్ ల దాష్టికాలు వంటివాటితో కలిపి, సినిమా గురించి మాట్లాడాను. దానితో అంతా రెండిటికీ బాగా కనెక్ట్ అయ్యారు.
తర్వాత రకరకాల కార్యక్రమాలు చేసాను, సందడే సందడి అన్న కార్యక్రమం చేసాను. అదీ బాగా హిట్ అయింది. తర్వాతి దశలో ‘బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర ‘ నాకొక గొప్ప టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ షో చేసాకా, నాకు ఒక ఇంటెలిజెంట్ ఆంకర్ గా పేరొచ్చింది. ఈ క్రమంలో నాలో పరిణమించిన వ్యక్తిత్వం ‘నవీన’ కు ఉపయోగపడింది. నవీన నా దృష్టిలో కేవలం ఒక ప్రోగ్రాం కాదు, నా వ్యక్తిత్వం కూడా. సున్నితమైన అంశాల గురించి మాట్లాడాలి అంటే, అన్ని రకాల అంశాలపై నాకు తగిన సమాచారం, పట్టు ఉండాలి. ఇవన్నీ నా 15 ఏళ్ళ కెరీర్ నాకు ఇచ్చింది. నవీన మొదలుపెట్టాకా నా కెరీర్ పట్ల దృక్పధం మారింది. ఈ పదేళ్ళలో నన్ను మెయిన్ స్ట్రీమ్ ఎంటర్టైనర్ గా చూడడం మానేశారు. ఒక రకంగా ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో నన్ను ఆర్ధికంగా దెబ్బ కొట్టింది. కాని, దాన్ని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ప్రతి దానికి సక్సెస్, టి.ఆర్.పి అనే కొలమానం ఉండదు, అంతకు మించిన తృప్తిని నాకు నవీన ఇచ్చింది. నవీనలో మేము బధిరుల గురించి మాట్లాడుతూ, హియరింగ్ ఇంపైర్డ్ గురించి మాట్లాడితే, ఒక్క రోజులో SAHI అనే ఆఫీస్ కి ఎన్నడూ లేని విధంగా 10,000 కాల్స్ వచ్చాయి. టీవీ లో ఇంపాక్ట్ మెసర్మెంట్ కేవలం టి.ఆర్.పి లు మాత్రమే చెయ్యలేవు అనేందుకు నవీన ఒక నిదర్శనం. అవసరమున్న వాళ్ళు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు ఈ ప్రోగ్రాం చూస్తేనే కదా, ఫోన్ నెంబర్ తెలుసుకుంటేనే కదా, ఆ ఒక్క రోజులో పదివేల కాల్స్ వచ్చాయి. ఫైనాన్సు, పాపులారిటీ, అవసరంలో ఉన్నవాళ్ళను చేరుకోగలుగుతున్నాను అన్ననమ్మకం నాకుంది. అదే సిద్ధాంతం నన్ను నడిపిస్తోంది.
నవీనలో జనరల్ ఇష్యూస్ తో మొదలుపెట్టి, మేము ఇప్పటివరకు అనేక బోల్డ్ ఇష్యూస్ కూడా మాట్లాడాము. మెయిన్ స్ట్రీమ్ టీవీ లో ఇటువంటి కంటెంట్ ఉన్న షో ఇన్నాళ్ళు తెలుగులో నడపడం ఒక సంచలనం అయితే, ఈ షో నడిపిస్తున్న టీవీ 9 వారు, రవిప్రకాష్ గారు, శీతల్ మోచార్య గారిని నిజంగా అభినందించాలి. ఆ ప్రోగ్రాం నడుస్తోంది అంటే, నా ప్రొడ్యూసర్ కి అన్ని అంశాలపై అంత పట్టు ఉండడం, మా ఇద్దరి కాంబినేషన్ బాగా వర్క్ అవుట్ అవడం కారణం. అదే రవిప్రకాష్ గారి ఆలోచన ‘చేతన’, ముంబై లో టీవీ 9 వారు ‘శాఖా 9 ‘ అనే పేరుతో ప్రోగ్రామ్స్ చేస్తారు. స్లమ్స్ లో ఉన్న సమస్యల్ని హైలైట్ చెయ్యడం ఇందులోని ఉద్దేశం. అయితే, శాఖా 9 కార్యక్రమం ఒక ఉద్యమంలా కనిపిస్తుంది, మా చేతన పరిష్కారం దిశగా కనిపిస్తుంది. ఈ ఏడాదితో చేతన ఐదేళ్ళు కంప్లీట్ చేసుకుంది. కొందరు అంటారు – ప్రతివారం ఒకటే సమస్య, స్లమ్స్ లోకే వెళ్తావు, ఇక వెరైటీ ఏముంటుంది అంటారు. ఇబ్బందులు ఒకటే కావచ్చు, కాని వాటి గ్రావిటీ వేరుగా ఉంటుంది. ఉద్వేగపరంగా వారు గురౌతున్న ఒత్తిడి వేరుగా ఉంటుంది. ఉదాహరణకు మనింట్లో ఏదైనా చిన్న జ్వరం వచ్చి , పర్వాలేదు. కాని అంత చిన్న ఇంట్లో ఉండేవారికి ఏవైనా జ్వరాలు వచ్చి తగ్గితే, ఆ ఖర్చుకు ఆ కుటుంబం అంతా కొన్నేళ్ళ పాటు కుదేలైపోతుంది. ఎందుకంటే, ఆ ఒక్క రెక్కల కష్టం మీద మొత్తం కుటుంబం ఆధారపడి ఉంటుంది. మురుగు మీద చేసే పోరాటం ఒకరకంగా ఉంటే, ఇంకో స్లం లో సమస్య, దానికి వారు ఎన్నుకునే పరిష్కారం మరో రకంగా ఉంటుంది. అందుకే, ప్రతి ఎపిసోడ్ డిఫరెంట్ అని నేను భావిస్తాను.
మేము వాళ్ళ వెనకాల ఉండి, సంబంధిత అధికారులతో మాట్లాడి, వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తాము. ఇందుకు ఒక సోషల్ వర్కర్, ముగ్గురు కో-ఆర్డినేటర్ లు మాతో కలిసి పనిచేస్తారు. అంతకుముందు ఆ ప్రాంతంలోని ప్రజలు ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా స్పందించనివారు, ఇప్పుడు మా అందరినీ చూసి, స్పందిస్తారు. అప్పుడు వారి మాట కూడా వినని అధికారులు ఉంటే, నేనే వెళ్లి వారిని కలుస్తాను. నా మాటన్నా వింటారు. నామాట కూడా విననివారు, పొలిటికల్ ప్రెసర్ తెచ్చేవాళ్ళు కూడా ఉంటారనుకోండి. అప్పుడు కొన్నిసార్లు మేము ఓడిపోతాము.
కాని, ఒక పైప్ లైన్ తెచ్చుకోవడం, కరెంటు కనెక్షన్ తెచ్చుకోవడం ఇలాంటివాటి అన్నిటికీ మేము వాళ్ళ వెనకాల ఉంటాము. ఈ క్రమంలో కొంత ఎంటర్టైన్మెంట్ కు దూరమైనది నిజమే అయినా, మధ్యమధ్యలో కొన్ని చేస్తూనే ఉన్నాను. ‘లక్కు కిక్కు’ అనేది నా కం-బ్యాక్ షో. జీ తెలుగులో ఈ షోలో కొంచెం చేసిన అల్లరికే 6-6.5 టి.ఆర్.పి లు వస్తే, అంతా ఆశ్చర్యపోయారు. అలాగే జగపతి బాబు గారి నుంచి నేను టేక్ ఆఫ్ చేసిన షో ‘కో అంటే కోటి’ అనేది ఒకటి ఉంది. లాస్ట్ 30 ఎపిసోడ్స్ నేను చేసాను.
‘బ్లాక్’ అనే షో గురించి చెప్పుకోవాలండి. మొదటిసారి అంధ గాయకుల కోసం చేసిన అద్భుతమైన కార్యక్రమం. ఇది కూడా నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండడంతో, బాగా హిట్ అయ్యింది.
సాహిత్యం పట్ల మీకు అభిరుచి ఎలా కలిగింది ? మీరు ఏవైనా కధలు రాసారా ?
కధలు రాయలేదండి. కాని, కధలు విపరీతంగా చదువుతాను. సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. ఊహిస్తూ కధలోకి నేను వెళ్ళిపోతాను. నాకు తెలుగు సాహిత్య పరిచయం చేసిన ఘనత మాత్రం తనికెళ్ళ భరణి గారికి, బ్నిం గారికి దక్కుతుంది. అంతవరకూ ఇంగ్లీష్ సాహిత్యం చదివాను. చిన్నప్పుడు చిన్న కధలు చదివినా, యువవాణికి రాసినా, అసలైన తెలుగు కధల పరిచయం వీరి వల్లే జరిగింది. 96 లో నా పుట్టినరోజున బ్నిం గారు ‘అమరావతి కధలు’ పుస్తకం ‘ బంగారుతల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని రాసి, నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చినా, ఇది ఎప్పటికీ నేను పదిలంగా దాచుకునే, చదువుకునే అపురూపమైన పుస్తకం. అది నలిగిపోయినా, చిరిగిపోయినా దిండు కింద పెట్టుకుంటాను. మా అమ్మాయి కూడా ,’అమ్మా, ఇవాళ అమారావతి వెళ్దామా’ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇద్దరం అమరావతి వెళ్లి, అమరావతి వీరుల్లా కాసేపు తిరిగేసి వస్తాము.
అలా నేను కధల్లోంచి అమరావతిని చూసి, ఒక్కోసారి బాపు గారి బొమ్మల్ని చూసి, ఒక్కోసారి రమణ గారి ముందు మాటలు చదువుతాను, ఒక్కోసారి మనసును స్పృశించే కధలోని చివరి వాక్యాల్ని చదువుతాను. ఇంతటి గొప్ప పుస్తకాన్ని పరిచయం చేసిన బ్నిం గారికి కృతఙ్ఞతలు.
ఇంతమంది ప్రముఖులు మిమ్మల్ని ఇష్టపడడానికి కారణం ఏమిటండి ?
అయ్యయ్యో, ఇది చాలా పెద్దమాట అవుతుందండి. ప్రముఖులు నన్ను ఇష్టపడడం కాదు, నాకే వారి పరిచయ భాగ్యం కలిగింది. వాళ్లకు ఉడత సాయం లాగానో, తోక లాగానో, పిల్లిపిల్ల లాగానో వెనకాల వెళ్ళిపోతూ ఉండడమే తప్ప, ఇంకా అంత గొప్ప దాన్నని నేను భావించను. భరణి గారి ఇంట్లో సాహిత్య గోష్టులు జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల ఒక రచయతనో, సంగీత దర్శకుడినో, ఎవరో ఒకరిని తీసుకువచ్చి, మాట్లాడుకుంటూ ఉంటారు, లేక భరణి గారే మాట్లాడతారు. అప్పుడు ఎక్కడో ఒకమూల స్థంభానికి ఆనుకుని కూర్చుని, వారిని చూడడం, వాళ్ళ మాటలు వింటూ ఉండడం నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ‘సిరా’ లో భరణి గారితో నటించినా, నేను గొప్ప నటిని అని నేను అనుకోలేదు. ఆ టీం లో నేను ఉన్నాను, అలాగే మిథునానికి అది తీసేముందు చాలా ఏళ్ళు జరిగిన చర్చల్లో పాల్గొన్నాను. అలా బ్నిం గారు, భరణి గారు ఇద్దరూ నన్ను నడిపించే శక్తులు, నా గురువులు. ‘ఝాన్సీ కీ రాణి’ అన్న పేరుతో మీరు రాసిన శీర్షిక గురించి చెప్పండి.
ఇది ఆక్సిడెంటల్ గా బయటపడింది. సాక్షిలో ఫ్యామిలీ హెడ్, రచయత అయిన చలపతిరావు గారు అనేవారు ఉన్నారండి. ఆయనకు ఎందుకో నేను రాయగలనని అనిపించింది. మీరు రాయండి, మా టీం ఎడిట్ చేసుకుంటారు, అని ముజీద్ గారు, నాగరాజు గారిని నాకు అప్పజెప్పారు. మొట్టమొదట రాసినదాన్ని ముజీద్ గారు ఎడిట్ చేసి, నేను ఒరిజినల్ గా రాసినదాన్ని, ఆయన ఎడిట్ చేసిన దాన్ని చలపతి గారికి చూపారు. వారు 600 పదాలు ఇస్తే, నేను 2-3 వేల పదాలు రాసేసాను. అవి చూసాకా, చలపతి గారు, ‘ఆ అమ్మాయి చక్కటి ఫ్లోతో రాస్తే, ఎందుకయ్యా ఎడిట్ చేసావు, ఆమెకు రెండు వేల పదాలు ఇచ్చేయ్ అన్నారు. అప్పటినుంచి, వారు నేను పంపిన దాన్ని మంచి టైటిల్స్, కాప్షన్ లతో  వేసేసేవారు. ఫొటోస్ ఠాకూర్ అనేవారు తీసేవారు. ఇది 8 నెలలు సాగిన ఒక ప్రయాణం. ఇందులో రాసేటప్పుడు నన్ను నా రచనలకు డబ్బు తీసుకోమన్నారు. నాకు ఏం చెయ్యాలో తెలీక భరణి గారిని అడిగితే, ‘తల్లీ, అక్షరం అక్షరానికి ఒక విలువ ఉంటుంది. ఇది నీకు దక్కిన గౌరవం కాదు, అక్షరానికి దక్కేది, కనుక వందలు ఇచ్చినా తీసుకో’ మన్నారు. నేను ‘మీరు అందరికీ ఎలా ఇస్తారో అలాగే ఇవ్వండి, కాని నా పేరుతో కాదు, స్వచ్చంద సంస్థలు ఒక 2,3 ఉన్నాయి, వారికి ఇవ్వండి అన్నాను. వారు మామూలుగా ఇచ్చేదానికి రెట్టింపు సొమ్ము జత చేసి, ఆ సంస్థలకు పంపారు. ఆ కార్యక్రమం చేసిన సొమ్ముతో 4 పిల్లలకు పూర్తి స్థాయి విద్యాభ్యాసం జరిగింది, రాజమండ్రి లోని ఒక సంస్థకు ఫర్నిచర్ సమకూరింది. అది నాకొక గొప్ప తృప్తి, అది ఎప్పటికీ మిగిలిపోతుంది.
స్టేజి నాటకాలకి మళ్ళీ జీవం పోయ్యాలనే ఉద్దేశంతో మీరు చేసిన ‘కన్యాశుల్కం’ గురించి చెప్పండి.
ఇది కూడా అనుకోకుండానే జరిగిందండి. దీక్షిత్ మాష్టారు గారు కన్యాశుల్కం చేద్దాము అన్నాకా, చేసాను. నాటకం అనేది చాలా వైవిధ్యం అయిన మాధ్యమం అని తెలుసుకున్నాను. లొట్టిపిట్ట నవ్వుల సీన్, అప్పుడు కాళ్ళు వణికాయి. జనం ఆ నవ్వు అంటే, సావిత్రి గారిని గుర్తుకు తెచ్చుకుని, పోల్చుకుంటారు. ఆ సీన్ అప్పుడు హాల్ అంతా సైలెంట్ అయిపోయారు. నేను నవ్వుతున్నాను, ప్రతి చూపు నన్ను గుచ్చుకుని, పోల్చుకుంటోంది, సీన్ అంతా అయ్యాకా, చప్పట్లు మార్మ్రోగాయి. ఇదొక్కటే నాటకం నేను వేసాను.
ఒకవ్యక్తికి సామాజిక బాధ్యత యెంత ఉండాలి అని మీరు అనుకుంటారు ?
వ్యక్తి సమాజం నుంచే వచ్చినవాడు కనుక, ప్రతి వ్యక్తికీ సమాజం పట్ల సమాన బాధ్యత ఉండాలని నేను నమ్ముతాను. అన్నీ, అందరికీ సమానంగా ఉండవు అని నేను పెరుగుతూ గమనించాను. అలా ఎవరికైనా అన్యాయం జరిగితే, ప్రశ్నిస్తాను. ప్రశ్న మీ చేతిలో అస్త్రం అని నేను నమ్ముతాను. మౌనం గా ఉండడమే ఒక పెద్ద తప్పు, జబ్బు. ప్రశ్నించాలి అనేది నా దృక్పధం, దానితోనే నేను కొన్ని కాంపైన్ లు మొదలుపెట్టాను. నేను స్కూల్స్, కాలేజీలు, స్వచ్చంద సంస్థలు వీరితో ఎక్కువ కాంటాక్ట్ లో ఉంటాను. వీరే నా సైన్యం, మిత్రులు. వాళ్లకు నేను సపోర్ట్ చెయ్యడం, వాళ్ళు నాకు సపోర్ట్ చెయ్యడం జరుగుతుంది. ప్రస్తుతం ‘బకెట్ నిమజ్జనం ‘ అన్న కాంపైన్ చేస్తున్నాను.
మీరు పొందిన అవార్డులు, భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పండి.
ఇంట్లో 8 నందులు ఉన్నాయండి, ఈ సం. అవి 9 అవ్వాలి అని నా కోరిక. ఇవే నాకు అపురూపమైనవి. ‘మౌనం వీడమనే’ ఒక కొత్త కాంపైన్ చెయ్యాలని ఉంది. ఫిలిం ప్రొడక్షన్, డిరెక్షన్ చెయ్యాలి. రాయాలి... ఇవీ నా ప్రణాళికలు.
చాలా సంతోషం ఝాన్సీ గారు, మరో నంది మీ ఇంటికి చేరాలని, మరెన్నో విజయాలను సాధించాలని మనసారా  ఆశిస్తూ, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మా పాఠకులు అందరి తరఫునా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. నమస్కారం.
థాంక్స్ అండి. నమస్కారం.
ఝాన్సీ గారితో నా పూర్తి ఇంటర్వ్యూ ని క్రింది లింక్ లో వినండి.

No comments:

Post a Comment

Pages