వనమయూరి - అచ్చంగా తెలుగు

వనమయూరి

భావరాజు పద్మిని 


ఆ ఐదడుగుల మనిషిని నా కళ్ళు ఎన్నిసార్లు ఆరాధనగా చూసాయో ! ఇప్పుడు కొన్ని వందల జతల కళ్ళు, రెప్ప వెయ్యటం కూడా మరిచిపోయి, మంత్రముగ్ధులైనట్లు ఆమెనే చూస్తున్నాయి. నాట్యమా అది... ఆనందలాస్యం. తనువులోని అణువణువూ పరవశంతో లయబద్ధంగా నర్తిస్తూ ఉంటే, పాటకు తగ్గ భావం వదనంలో ప్రదర్శిస్తూ, శరీరాన్ని మెరుపుతీగలా తిప్పుతూ ఉంటే, ఆ భావంలో లీనమవ్వని మనసు ఉంటుందా ? అంత అందంగా డాన్స్ చేసేవాళ్ళను నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. వనమయూరి నీలిమబ్బులని చూసి పులకించి, నాట్యం చేస్తుంటే, యెంత అద్భుతంగా ఉంటుందో, ఆమె నాట్యం కూడా అంతకంటే అత్యద్భుతంగా ఉంటుంది. ఐదు నిముషాల తర్వాత, ఆమె నాట్యం ముగిసి, అందరికీ నమస్కరించగానే, వీక్షకులు ఆమె నాట్య మాయాజాలం నుంచి బయటపడి, ఆపకుండా పది నిముషాలపాటు చప్పట్లతో తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. ఆమెను అభినందించేందుకు నేనూ స్టేజి వెనక్కు వెళ్లాను. ఆమె ఆనందంగా నన్ను కౌగలించుకుని, కళ్ళనీళ్ళు పెట్టుకుని, ‘ ఇదంతా నీవల్లే అయ్యింది. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ నా అందెలు మ్రోగాయంటే, నీవల్లే. నీకు ఎప్పటికీ ఋణపడిఉంటాను.’ అంది. నేను ఆమెను పొదువుకుని, ఆర్ద్రంగా నుదుటిపై చుంబించి, కళ్ళతోనే ఆమె నాట్యాన్ని, మరొక్కసారి మెచ్చుకున్నాను. ఆమె డ్రెస్ మార్చుకునేందుకు లోనికి వెళ్ళింది. కాసేపట్లో నా నృత్యప్రదర్శన ఉంది, అప్పటిదాకా వేచి ఉండాల్సిందే ! అలా ఆలోచిస్తూ తలపుల్లోకి జారిపోయాను.
రవిగాంచనిది కవిగాంచును, కవిగాంచనిది కాంత గాంచును అని నా బలమైన నమ్మకం. ఎందుకంటే...ఒక స్త్రీని మరొక స్త్రీ మాత్రమే సంపూర్ణంగా అర్ధం చేసుకోగలదు అన్నది పచ్చి నిజం ! ‘స్త్రీ కి స్త్రీ శత్రువు’ అంటారు. మా కధను వింటే, స్ర్తీకి స్త్రీ ప్రేరణ కూడా, కాగలదు అని మీరు తెలుసుకుంటారు.
************
ఉత్తరభారతంలో లంకంత పెద్ద అపార్ట్ మెంట్ సముదాం అది. సుమారు మూడు ఎకరాల్లో కట్టారు, భవంతి లోపలే అన్ని దుకాణాలు, వసతులు ఉన్నాయి. సుమారు ఒక రెండువేల కుటుంబాలు అందులో నివాసం ఉంటున్నాయి.
ఆ రోజున మా పాప ఫ్రెండ్ పుట్టినరోజని, వేరే బ్లాక్ లో ఉన్న వాళ్ళింట్లో దీన్ని దింపేందుకు వెళ్తున్నాను. అటుగా వెళ్తూ ఉండగా, మాంచి ఏసుదాస్ కీర్తన, దానివెంట లయబద్ధమైన గజ్జెల సవ్వడి వినవచ్చింది. నాకు ఆశ్చర్యం కలిగింది. ‘ఇక్కడ ఇటువంటి పాట, మువ్వల సవ్వడా ? ఎవరో చూడాలి,’ అనుకుంటూ, పాపను అక్కడ దింపి, గజ్జెల సవ్వడి వినవచ్చిన ఫ్లాట్ బెల్ కొట్టాను. ఒక నడివయసు స్త్రీ తలుపు తీసింది. విరిసిన కలువల వంటి చక్కటి కళ్ళు, ప్రత్యేకమైన ముక్కు, ముక్కున చిన్న నత్తు, ఐదడుగుల పొడవుతో, చున్నీ నడుం చుట్టూ కట్టుకుని ఉంది. ఛామనఛాయలో  చక్కటి అందం ఆమెది, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని ఉంది, వెనుక ఏడాది పసిపాప.
“నమస్కారమండి. నా పేరు స్వాతి. మాది హైదరాబాద్. ఇక్కడే మరో బ్లాక్ లో ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి అంటే ప్రాణం. అందెల సవ్వడి విని వచ్చాను... డాన్స్ చేస్తున్నది మీరేనా ?” అని అడిగాను.
ఆమె పలకరింపుగా నవ్వి, లోనికి రమ్మంది. “మాది కలకత్తా. నా పేరు రూప. మేము ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళు అవుతోంది. భరతనాట్యం నేర్చుకున్నాను. ఇక్కడ ఇటువంటి నాట్యం పట్ల ఎవరికీ అభిరుచి ఉండదు కదా. విద్య పట్టుతప్పకూడదని సాధన చేస్తున్నాను. “ అంది ఆమె.
“మీకు అభ్యంతరం లేకపోతే, నేనూ మీ నాట్యం చూడవచ్చా ? మీ సాధన కొనసాగించండి...” అన్నాను అభ్యర్ధిస్తూ. ఆమె నాట్యం చెయ్యసాగింది. ముగియగానే, అప్రయత్నంగా లేచి నిలబడి, చప్పట్లు చరిచాను. “అద్భుతం, ఇటువంటి నాట్యం ఇంతవరకూ చూడలేదు. మీకు అభ్యంతరం లేకపోతే మా పాపకి నేర్పిస్తారా ?”
“నేను నేర్పే ముందు వాళ్లకు డాన్స్ పట్ల అవగాహన, మక్కువ ఉన్నాయో లేవో గమనిస్తాను. మీకు భరతనాట్యం గురించి తెలుసా ?”
“నేర్చుకున్నానండి. చిన్నప్పుడు కూచిపూడి, భరతనాట్యం రెండూ నేర్చుకున్నాను. నాకు డాన్స్ అంటే ప్రాణం. పదవ తరగతి ముగిసాకా, కళాక్షేత్ర వెళ్లాలని ఆశ పడేదాన్ని. కాని, మా వాళ్ళు 9 వ తరగతిలోనే డాన్స్ మాన్పించేసారు. తర్వాత ఎలాగో మభ్యపెట్టి, చదువుల్లో పడేసారు. తర్వాత తెలిసింది... డాన్సులు చేసుకునే వాళ్లకి పెళ్లి సంబంధాలు రావని వాళ్లకు ఒక శంక. నాట్యం పట్ల చులకన భావం అన్నమాట. అలా... నా ఆశల్ని అట్టడుగున పాతేసి, వాళ్లకు కావల్సినట్టే చేసాను. చివరికి ఉన్నత విద్యలు చదివి, ఇలా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ గడుపుతున్నాను. మీరు సరేనంటే, కనీసం మా పాపకైనా నేర్పించి, దాన్ని చూసి, ఆనందిస్తాను.”
“మా ప్రాంతాల్లోనూ ఈ మూఢ నమ్మకాలు ఉన్నాయి. కధక్ నృత్యమంటే, ఒకప్పుడు వేశ్యలే నేర్చుకుంటారు అన్న నమ్మకం ఉండేది. అందుకే, ఎవరూ ఆడపిల్లల్ని డాన్స్ నేర్చుకునేందుకు పంపేవారు కాదు. నాది భరతనాట్యం కనుక పంపారు. చిన్నప్పటినుంచీ నేను సంగీతం వింటే, లయబద్ధంగా అడుగులేస్తూ, మెలికెలు తిరిగిపోయే దాన్నట! డాన్స్ నేర్పమన్న నా గోల పడలేక మా అమ్మ డాన్స్ లో వేసింది. అంతే, ఇక మానలేదు.
నాకు డాన్స్ ఒక్కటే లోకం. చదువు, డాన్స్ ఇతర ధ్యాసలు లేవు. నా ఫ్రెండ్స్ అంతా మగపిల్లలే. వాళ్ళతో మగరాయుడి లాగా తిరిగేదాన్ని. డిగ్రీ తర్వాత డాన్స్ కోసం పెళ్లి వద్దన్నాను. ఇక తప్పనిసరి అయినప్పుడు, పెళ్ళిచూపులకి వచ్చే వారికి ఖచ్చితంగా, ‘నేను డాన్స్ మానను. మీకు ఇష్టమైతేనే చేసుకోండి...’ అని చెప్పేదాన్ని. ఎన్నో సంబంధాలు పోయాయి, మా అమ్మ నా పెళ్లి కోసం ముక్కోటి దేవుళ్ళకూ మొక్కేసుకుంది. చివరికి వీళ్ళు ఒప్పుకున్నారు. కాని, మా అమ్మకి చివరి దాకా సందేహమే... నేను పెళ్లి పీటల మీది నుంచి పారిపోతానేమోనని. మా చుట్టాలు ఎవరికీ నా పెళ్లి సంగతి చివరిదాకా చెప్పలేదు, చాలామందిని పిలవలేదు కూడా !”
ఎందుకో నవ్వాగలేదు నాకు. “మీరు భలేవారండి. ఐతే పెళ్లి తర్వాత మీ నాట్యం ఎవరూ ఆపలేదా ?”
“మావారు ముందే మాటిచ్చారు కదా ! కాని, అత్తగారింట్లో వారు వ్యతిరేకించారు. నన్ను ఆపడానికి ప్రయత్నించారు. నేను ఆగలేదు. వాళ్ళే అలసిపోయి వదిలేసారు. ఇప్పటికీ చురకలు అంటిస్తూనే ఉంటారనుకోండి...”
“తమ కాలికింద పడి ఉండాలనే కోరిక వాళ్ళది. కాని, బంతి కాలికింద తొక్కినంతవరకూ అణిగినట్లే ఉంటుంది. ఒక్కసారి కాలు తియ్యగానే, యెంత బలంగా అణిచారో, అంత ఎత్తుకు పైకి లేస్తుంది. స్త్రీ కూడా అంతేనేమో. మెడ ఒంచాలని యెంత చూస్తారో, ఆమెలో అంతర్లీనంగా అంతే కసి, తపన పెరుగుతాయేమో. చెప్పకపోయినా, నాదీ అదే స్థితి. కాని, వాళ్ళే నాలో ఏదైనా చేసి చూపాలన్న తపన పెంచారు, అందుకు వాళ్లకు ఎప్పటికీ ఋణపడే ఉండాలి. ఇంతకీ, మీరు ఇప్పుడు డాన్స్ క్లాసులు చెబుతున్నారా ?”
“లేదండి, ఇలా నాట్యసాధన కొనసాగిస్తూ ఉన్నాను. ఇక్కడి వాళ్లకు ఫాస్ట్ బీట్ సినిమా పాటలు తప్ప నచ్చవు. సగం సర్కస్, సగం డాన్స్... ఇదే ఇప్పటి పధ్ధతి. ఒకరిద్దరు అడిగారు, కాని వాళ్లకు నిజంగా ఆసక్తి లేదు. అందుకే చెప్పట్లేదు. ఒక డాన్స్ స్కూల్ లో, ఎవరైనా పిల్లలు ఒస్తే డబ్బులు ఇస్తామని, నన్ను పెట్టుకున్నారు. ఎవరూ రాలేదు. అందుకే, జీతమూ ఇవ్వలేదు, వెనక్కి వచ్చేసాను. ఇదంతా మా పాప పుట్టకముందు సంగతి. ఇక ఇప్పుడు - నిజంగా మీ పాపకి ఆసక్తి, అభిరుచి ఉంటేనే చెప్తాను. గౌరవం లేనిచోట కళ రాణించదు. అందుకే ఒక రెండు రోజులు తనని గమనించి, అప్పుడు చెప్తాను. “
“మా పాపకు చాలా ఆసక్తి ఉందండి. మరి నేర్పుతారా ?”
“ఒక్క మీ పాపకే ఎందుకు, మీరూ రండి, మళ్ళీ మొదలుపెట్టండి...”
“నిజంగానా ? నేను చెయ్యగలనా ? ఇద్దరు పిల్లల తర్వాత నా దేహం నా అదుపు తప్పిపోయింది. ఇంత కష్టపడి, పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి పోషించి, చాలా ముద్దుగా పెంచాను దీన్ని. ప్రస్తుతం, గుండ్రాయిలా ఉన్నాను. దొర్లడమే తప్ప, ఎగరగలనా ? ఎగిరినా మీ భవంతి తట్టుకోగలదా ?”
“జోక్స్ ఆపండి. మీరు కాస్త బొద్దుగా ఉన్నారంతే ! లావుగా లేరు. రేపు సాయంత్రం మీపాపను తీసుకురండి. మీకూ, నాకూ కూడా ఇది మరోజన్మ. ప్రయత్నిద్దాము, ఆపై దైవానుగ్రహం.” అంది రూప.
మర్నాటి నుంచి మా సాధన మొదలయ్యింది. అతి కష్టం మీద పెంచిన నా దేహం మొదట్లో గట్టిగా మొరాయించినా, క్రమంగా అదుపులోకి రాసాగింది. ఇదివరకు నేర్చుకుని ఉండడంతో... అంచెలంచలుగా... ఆరు నెలల్లోనే 75 అడుగులూ దాటి... తిల్లానా వరకూ సాగింది నా పయనం. నాట్యంతో పాటే, చిన్న చిన్న పాటలు కూడా నేర్పసాగింది రూప. మా ఇద్దరి మధ్య బాగా చనువు పెరిగింది. వాళ్ళ పాప అయితే, ఏదో హక్కు ఉన్నట్లు, నేను రాగానే నా చెయ్యి పట్టి లాగి, కూర్చోపెట్టి, నా ఒళ్ళో ఎక్కి కూర్చునేది. దాని బోసినవ్వులు, నాకు ఆటవిడుపుగా మారాయి. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు, తనకు, నాకూ డాన్స్ డ్రెస్ లు కుట్టించుకు వచ్చాను. ఆభరణాలు కూడా కొన్నాను.
ఒకరోజు న్యూస్ పేపర్ లో మాకు స్థానికంగా జరగబోయే ఒక డాన్స్ పోటీల గురించి వేసారు. “వెళ్దామా, సరదాగా ?” అని అడిగాను నేను. “వద్దు, నాకు భయం,” అంది రూప.
“మీ పాప కూడా పాకడం నుంచి తప్పటడుగులు భయంగానే వేసింది, ఇప్పుడు నడుస్తోంది కదా ! తర్వాత పరుగెత్తడం, మెట్లు దిగడం భయంగానే నేర్చుకుంటుంది... ఈ లోకంలో ప్రతి విజయం భయంతోనే మొదలవుతుంది.”
“ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ చెయ్యగలనా ? దానికి డ్రెస్, నగలు కావాలి, మేక్ అప్ ఉండాలి, మీకు తెల్సుగా మావారికి అసలు డ్రైవింగ్ రాదు. నన్నూ, పాపను ఎవరైనా తీసుకెళ్ళాలి. “
“అన్నిటికీ నేనున్నాను. ఇక డ్రెస్ అవీ ముందే ఏర్పాటు చేసాను కదా !”
“ఎవరైనా చుస్తారంటారా ? లేకపోతే టమాటోలు, కోడిగుడ్లూ పడతాయా ?”
“అవొక్కటే ఏం ఖర్మ, ఖరీదు ఎక్కువగా ఉన్నాయిగా, అన్ని కూరలతో పాటు, ఉల్లిపాయలు కూడా వెయ్యమందాం. డాన్స్ చేసి, కష్టపడి సంపాదించుకున్న ఉల్లిపాయలు కూడా తెచ్చుకుందాం. ఏం ?”
చల్లగా నవ్వేసింది రూప. కల్మషం లేని మనిషి రూపంలో, మాటలో, నవ్వులో అంత అందం ఉంటుందేమో, అనుకుంటూ అలాగే చూడసాగాను నేను.
“కానీ...” అంటూ మళ్ళీ ఏదో చెప్పబోయింది రూప.
 “ఇక మీకు ఛాయస్ లేదు టీచర్... పదండి...” అంటూ అప్పుడే ఫోన్ చేసి, పేర్లు ఇచ్చాను. ఇదిగో, అక్కడి నుంచి ఇక్కడికి ఇలా వచ్చాము. నా పేరు స్టేజి పై పిలవడంతో, ఈ లోకంలోకి వచ్చాను నేను.
*********
23 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాట్యం చెయ్యడం అంటే మాటలు కాదు. ఆ సంగతి నాకూ తెలుసు. కానీ, శక్తివంచన లేకుండా ప్రయత్నించాను. చప్పట్లు మారుమ్రోగాయి. నా లోపాలు నాకు తెలుసు... వరమో, శాపమో కాని, ప్రతి కళాకారుడికి, తన కళలో ఉన్న లోపాలు తెలుస్తాయి. అసలు ఒక కళాకారుడికి ఉండే నిరంతర అసంతృప్తే, వారిని ముందుకు నడిపిస్తుందట !
“ఈ చప్పట్లన్నీ మీవే !” అన్నాను బాగాచేసావు, అంటున్న రూపతో.
“చాలా ఆనందంగా ఉంది. నెమలికి నాట్యం సహజంగానే అలవడుతుంది. అలాగే మనవంటివారికి కూడా ! కాని అదే  నెమలిని మనిషి జూ లో, ఇంట్లో బంధించినప్పుడు, దాని మనసు నలిగిపోతుంది, అంత స్వేచ్చగా నాట్యం చెయ్యలేదు. మళ్ళీ దాన్ని తిరిగి అడవిలో వదిలేస్తే, ఆ వనమయూరి మరింత ఆనందంగా నర్తిస్తుంది. ఇవాళ మన ప్రదర్శన కూడా చెర నుంచి విడివడిన వనమయూరి ఆటలాగే అనిపించింది నాకు. “ అంది రూప ఉత్సాహంగా.
“నిజమే... ఇది అంతం కాదు, ఆరంభం. పిక్చర్ అభీభీ బాకీ హై మేరా దోస్త్...” అన్నాను నేను ఆనందంగా అప్పుడే పత్రిక కోసం ఫోటో తీసేందుకు వచ్చిన కెమెరామెన్ కి పోస్ ఇస్తూ.
**********

No comments:

Post a Comment

Pages