దేవుడిని చూడగలమా? - అచ్చంగా తెలుగు

దేవుడిని చూడగలమా?

Share This

దేవుడిని చూడగలమా?

- అక్కిరాజు ప్రసాద్ 


మానవజాతిని యుగయుగాలుగా వేధిస్తున్న ప్రశ్నే. ఎందరో మహానుభావులు ఎన్నో మార్లు అవును అవును అని వివరించి సమాధానం చెప్పినా అందరికీ కళ్ల ఎదుట కనబడడు కదా అన్న వాదనతో మళ్లీ మళ్లీ ఈ ప్రశ్న తల ఎత్తుతూనే ఉంది. మరో మారు అవును అన్న సమాధానాన్ని ఒక చిన్న కథ ద్వారా గ్రహించే ప్రయత్నం చేద్దాం.
ఒకసారి అక్బర్ చక్రవర్తి బీర్బల్ తో "బీర్బల్! నీవు దేవుడు అన్నిటా ఉన్నాడు అని నిరంతరం చెబుతూ ఉంటావు కదా? ఈ ఉంగరంలో ఉన్నాడా?" అని తన వజ్రపుటుంగరాన్ని తీసి చూపిస్తూ అతనిని ప్రశ్నిస్తాడు. "అవును జహాపనా! ఈ ఉంగరంలో ఉన్నాడు" అని బీర్బల్ సమాధానమిస్తాడు. అక్బర్ వెంటనే "ఏదీ ఎక్కడ? నాకు దేవుడిని ఈ ఉంగరంలో చూపించు" అని అడుగుతాడు. బీర్బల్ సమాధానం ఏమి చెపాలో తెలియక కొంత గడువు అడుగుతాడు. అక్బర్ చక్రవర్తి అతనికి ఆరు నెలల సమయమిచ్చి ఆలోపల ఆ ఉంగరంలో తనకు దేవుడిని చూపించాలి అని ఆదేశిస్తాడు.
బీర్బల్ ఇంటికి వెళ్లి అయోమయంలో పడతాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఉందని తెలుసు కానీ, ఆ సమాధానమేమిటో తెలియదు. సమాధానం లేకుండా ప్రభువును ఎదుర్కొనే ధైర్యం లేక అతడు కళావిహీనుడై ఆందోళన చెందుతాడు.
ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే బీర్బల్ ఇంటికి ఒక బాలకుడైన యాచకుడు భిక్ష కోసం వస్తాడు. "మహాశయా! ఎందుకు మీరు ఇంత ఆందోళనలో ఉన్నారు? మిమ్మల్ని ఇంతగా అశాంతికి గురి చేసిన విషయం ఏమిటి? మీరు జ్ఞానులే? జ్ఞానులను ఏ విషయము కూడా కలవరపరచ కూడదే?" అని బీర్బల్ ను ప్రశ్నిస్తాడు. బీర్బల్ అతనితో "అవును. నిజమే. మనసుకు సమాధానం తెలుసు. కానీ, దానిని సరైన పదాలలో వ్యక్తపరచలేక పోతున్నాను" అని అక్బర్ చక్రవర్తి దగ్గర జరిగిన సంఘటన మొత్తం వివరిస్తాడు.
ఆ బాలుడు "దీనికా మీరు కలవరపడుతున్నది? దీనికి సమాధానం నాకు తెలుసు. కాకపోతే, నేనే స్వయంగా ప్రభువులకు వివరిస్తాను" అని అంటాడు. బీర్బల్ అంగీకరించి అతనిని అక్బర్ గారి కొలువులోకి తీసుకొని వెళ్లి "ప్రభూ! మీ ప్రశ్నకు ఈ చిన్ని బాలుడు కూడా సమాధానం చెప్పగలడు" అని అంటాడు.
అక్బర్ ఆ బాలుని ధైర్యానికి చకితుడై అతనితో "భగవంతుడు సర్వాంతర్యామి అయితే ఈ ఉంగరంలో చూపగలవా?" అని ప్రశ్నిస్తాడు. అప్పుడా బాలుడు "రాజా! క్షణంలో చూపించ గలను. కానీ, నాకు దాహంగా ఉంది. కాబట్టి కాస్త మజ్జిగ ఇప్పించండి" అని అడుగుతాడు.  అక్బర్ అతనికి ఒక పాత్రలో పెరుగు ఇప్పిస్తాడు. బాలుడు ప్రభువుతో "రాజా! నాకు వెన్న ఉన్న పెరుగంటే చాలా ఇష్టం. కానీ, దీనిలో వెన్న లేదు" అని అంటాడు. అప్పుడు రాజు గారు "ఈ పెరుగు అత్యుత్తమమైనది. స్వయంగా మా పాడినుండి లభ్యమైన ఉత్పత్తి ఇది" అని చెబుతాడు. బాలుడు వెంటనే "ప్రభూ! మీరు అంత ఖచ్చితంగా చెబుతున్నప్పుడు మరి ఈ పెరుగులో వెన్నను చూపించండి" అని అడుగుతాడు. అక్బర్ చక్రవర్తి వెంటనే నవ్వి "ఓ మూర్ఖ బాలుడా! పెరుగును చిలికితే కానీ వెన్న లభ్యం కాదు అన్న విషయం తెలియదా నీకు? ఇంతటి అజ్ఞానివైన నీకు దేవుని చూపుతాను అని ఇంతవరకు రావటానికి ఎంత ధైర్యం" అని గద్దిస్తాడు.
"ప్రభూ! నేను మూర్ఖుడను కాను. మీ ప్రశ్నకు సమాధానం ఇందులోనే ఉంది" అంటాడు బాలుడు. రాజు ఆశ్చర్యచకితుడవుతాడు. "ప్రభూ! పెరుగులో వెన్నలానే భగవంతుడు అన్నిటా ఉన్నాడు. అన్నిటిలోని శక్తి భగవంతుడు. అన్ని దీపాలకు కాంతి దేవుడు. అన్నిటిలోని ఆత్మ తాను. అయినా ఈ కళ్లకు కనిపించడు. ఈ కర్మేంద్రియములైన కళ్లతో భగవంతుని చూడలేము. జ్ఞానమనే చక్షువుతో భగవంతుని తప్పక చూడగలము. దానికి ముందు మనలో అంతర్మథనం జరిపి సత్యమనే వెన్నను నామ రూపములనే పెరుగునుండి విడదీయాలి" అని చెబుతాడు.
ఆ విధంగా ప్రభువు ప్రశ్నకు బాలుడు సమాధానం చెప్పగా ఆయన ఎంతో ముచ్చటపడి బాలుని మళ్లీ ప్రశ్నిస్తాడు " అయితే నీ ప్రభువు నిరంతరం ఏమి చేస్తాడు?". "ప్రభూ! మన ఇంద్రియములకు శక్తిని, మనసుకు అవగాహనను, బుద్ధికి వివేచనను, అంగములకు బలమును ఇస్తాడు. అతని సంకల్పం వలననే మన జీవనము మరియు మరణము. కానీ మానవుడు అన్నీ తానే అని విర్రవీగుతాడు. పరమాత్మ ముందు మానవుడు పరమాణువు. సమస్త విశ్వం యొక్క సృష్టి స్థితి లయములకు కారణము పరమాత్మ" అని చెబుతాడు.
"రెప్పపాటు కాలంలో సామ్రాజ్యాలు ఉద్భవించి కనుమరుగవుతాయి. క్షణ కాలంలో భూమి, నీరు, పర్వతాలు పెరిగి క్షీణిస్తాయి. రాజులు పేదవారవుతారు, పేదవారు రాజులవుతారు. గ్రహాలు ఏర్పడి వినాశనమవుతాయి. ఈ అసాధారణమైన పరిణామాల వెనుకు శక్తి ఏమిటి? అది పరమాత్మే. పరమాత్మ కాక వేరేదీ కాదు. పరమాత్మను కనుగొనటానికి అహంకారాన్ని వీడాలి, కర్తను అన్న గర్వాన్ని వీడాలి. శరణాగతితో పరమాత్మ యొక్క సంకల్పానికి దాసులం కావాలి.  పరమాత్మను శుద్ధ అంతఃకరణముతో, పరిణతితో, నమ్మకంతో మాత్రమే తెలుసుకోగలము.  పరమాత్మ యొక్క సంకల్పానికి మనం ఒక సాధనం మాత్రమే అని గ్రహించినపుడే ఈ సత్యం బోధ పడుతుంది."
ఆ బాలునిలో గల జ్ఞానానికి, మనో వికాసానికి అక్బర్ చక్రవర్తి ముగ్ధుడై అతనిని ఎంతో గౌరవిస్తాడు. బీర్బల్ ఆ బాలునికి తన కృతజ్ఞతలు తెలుపుతాడు.
ఈ కథ ద్వారా ఏమి తెలుసుకున్నాము? భగవంతుడు ఉన్నాడు అన్నది సత్యము. ఆ సత్యాన్ని దర్శించటానికి మన సాధన కావాలి. దేహము దానికి గొప్ప సాధనం. సరే, దేవుడున్నాడని నమ్ముతున్నాను. మరి చేయవలసింది ఏమిటి? "పరమాత్మను తెలుసుకోవటానికి సాధన చేయాలి. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువుల కన్నా పరమాత్మ సత్యము. దానికి మానవజాతికి సేవ చేయాలి.భగవంతుని ప్రేమించాలి. బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేయాలి. నామ సంకీర్తన చేయాలి.జపం చేయాలి. ధర్మపరాయణతో జీవించాలి. ఎందుకంటే మన ఆలోచనలకు, మాటలకు, కర్మలకు పరమాత్మ సాక్షి. సత్యాన్ని ఆచరించాలి. ఇతరులను దూషించకూడదు. అందరినీ ప్రేమించాలి. ఎవరికీ అపకారం చేయకూడదు. జీవరాశుల పట్ల దయ చూపాలి. ఎందుకంటే పరమాత్మ అన్నిటా ఉన్నాడు.
దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్సనాతనః - దేహమే దేవాలయము. అందులోని జీవుడే సనాతనమైన దైవము.
దేవాలయం వంటి దేహాన్ని అందులో భాగమైన ఆలోచనలను, మాటలను, తద్జనితమైన కర్మలను శుద్ధిగా ఉంచుకోగలిగితే దేహియే పరమాత్మ అని గ్రహించవచ్చు.

No comments:

Post a Comment

Pages