దైవబలంతో ముందుకు సాగండి - అచ్చంగా తెలుగు

దైవబలంతో ముందుకు సాగండి

Share This

దైవబలంతో ముందుకు సాగండి 

మన జీవితంలోని క్షణాలు కదిలే మబ్బుల్లా దొర్లిపోతూ ఉంటాయి. ఈ మబ్బుల పయనంలో ఎన్నెన్ని మలుపులో. గట్టిగా దైవేచ్చ అనే గాలి వీస్తే, వెళ్తున్న దారి మరలి అటుగా వెళ్ళిపోతాయి. ఒక మబ్బు మరొక మబ్బును కలిసినప్పుడు, ఒక్కోసారి అవిరెండూ తమ అస్తిత్వాన్ని మరచి, కలగలిసిపోతాయి. మరికొంత సమయం గడిచాకా, విడివడి, స్వరూపం మారి మరలా పయనం కొనసాగిస్తాయి. ఎప్పుడో దైవానుగ్రహం అనే బలమైన కొండను డీ కొన్నప్పుడు ఈ మబ్బు పూర్తిగా కరిగిపోతుంది, కాలం కడుపులో కరిగిపోతుంది.

అలాగే ఒక చెట్టు మీద చీమలు, చిన్న పురుగులు, పక్షులు వంటి ఎన్నో జీవరాశులు నివాసం ఉంటాయి. చెట్టుకు తుఫాను, గాలి, ఎండ, వాన, అన్నీ సవాలుగా మారినా, అది కదలకుండా స్థిరంగా తపస్సు చేస్తున్నట్టు అక్కడే ఉండిపోతుంది. తన జీవితాంతం ఇతరులకు ఆసరా ఇచ్చి, తాను  ఏ గొడ్డలి వేటుకో బలై కూడా, ఇంటికి కలపను, వంటచెరుకును అందించి, బ్రతికినా చచ్చినా కూడా జన్మను చరితార్ధం చేసుకుంటుంది.
ఒక నదీ గమనం చిన్న పాయలా మొదలవుతుంది. బిందువూ, బిందువును కలుపుకుంటూ, కొత్త పాయలను స్వాగతిస్తూ సాగుతుంది. కొన్ని పాయలు నదిని వీడి పోతాయి. అయినా, దారిలో ఎన్నో కొండలూ, గుట్టలూ అడ్డుగా నవ్వితే, మలుపు తిరిగి, దారి మార్చుకుని పయనం కొనసాగిస్తుంది. తన కడుపులో ఎన్నో జీవరాశులకు ఆశ్రయం ఇస్తూ, చివరికి సాగరగర్భంలో చేరి హాయిగా విశ్రమిస్తుంది.
అయితే, పై మూడు అంశాల్లో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మబ్బు మరో మబ్బు కలిసిందని మురిసిపోదు, దాన్నుంచి విడివడి వెళ్ళే సమయంలో బాధపడదు. చెట్టు వచ్చే జీవాలను చూసి ఎగిరి గెంతెయ్యదు, వెళ్ళిన ప్రాణులను తల్చుకుని, పాతాళంలోకి కూరుకుపోదు. నది కొత్తనీరు వచ్చిందని పొంగిపోదూ, కొంత నీరు పోయిందని కుమిలిపోదు. ఇదొక నిరంతర జీవ స్రవంతి, నిశితంగా గమనిస్తే, వీటన్నింటిలో ఒక సమతుల్యత ఉంది.
ఈ సమతుల్యతనే, మనిషి కూడా అలవర్చుకోవాలి. ఈ ప్రపంచంలోని ఏ బంధమైనా, దైవేచ్చ ఉన్నంతవరకే నిలబడుతుంది. మన ఋణం తీరేదాకే కొనసాగుతుంది. అందుకే, బంధువులు, స్నేహితులు స్పర్ధలతో దూరమైన క్షణంలో మనం మనసు కష్టపెట్టుకోకూడదు. ఆ బంధం అంతవరకే, అంతే, అని అంగీకరించాలి. అశాశ్వతమైన జీవితంలో శాశ్వతమైన బంధాలు ఏమీ ఉండవని తెలుసుకోవాలి. ఈ విశ్వంలో మనకున్న అన్ని బంధాల కంటే, గొప్ప బంధాన్ని ఏర్పరచుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ.
సిసలైన ఆత్మబంధువు, మీతోనే, మీలోనే ఉంటూ, మిమ్మల్ని పర్యవేక్షిస్తున్నారు. మీ చూపు, మాట, పాట, ఆట, ప్రేమ కోసం ఆయన వేచి ఉన్నారు. మీరు పిలవగానే పరుగెత్తుకు వచ్చేందుకు, మీకోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనే దైవం. కులమతాలకు అతీతంగా, ఒక వ్యక్తి వక్తులతో అనుబంధం కోసం, వారిని మెప్పించడం కోసం కాక, దైవాన్ని మెప్పించడం కోసం, ఆయన ప్రేమ కోసం తపించిన క్షణాన, అతని జన్మ చరితార్ధం అయినట్లే ! దైవబలం ఉన్నవారికి ఎందులోనూ తిరుగుండదు. దైవప్రేమ వారికి ఒక కవచంలా కాపాడుతుంది. అందుకే దైవబలం సమకూర్చుకుని, అందరినీ సమభావనతో దైవస్వరూపాలుగా భావించి ప్రేమిస్తూ, సమతుల్యతతో ముందుకు సాగండి.
పరిపూర్ణ దైవానుగ్రహానికి నిలువెత్తు దర్పణంలా వచ్చిన ఈ ‘అచ్చంగా తెలుగు’ అంతర్జాల మాస పత్రిక 18 వ  సంచికలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారితో ముఖాముఖి, గాయకులు శ్రీరామచంద్ర గారితో ముఖాముఖి, విలక్షణ చిత్రకారులు బాలి గారితో ముఖాముఖి వంటి అంశాలు ఉన్నాయి. ఈసారి వచ్చిన 7 కధలు వేటికవే ప్రత్యేకం. అలాగే విభిన్నమైన ధారావాహికలు, సంగీత ప్రపంచపు దిగ్గజాల విశేషాలతో సాగే వ్యాసాలు, ఆధ్యాత్మిక అంశాలు, సూక్తులు, హితోక్తులు, ఇలా ఎన్నో అంశాలు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటిలాగే చదివి, మీ దీవెనలను కామెంట్స్ రూపంలో అందిస్తారని, ఆకాంక్షిస్తూ...

భావరాజు పద్మిని.

No comments:

Post a Comment

Pages