శివం – 14 - అచ్చంగా తెలుగు

శివం – 14

Share This

 శివం – 14

(శివుడే చెబుతున్న కధలు )

రాజ కార్తీక్

9290523901

( జరిగిన కధ : సాంబయ్య కధను చెబుతూ ఉంటాడు శివుడు...)

నేను “ చెప్పు సాంబయ్య కానీ”, సాంబయ్య “స్వామీ, నీకు చేతకానిది ఏదయ్యా? ఇన్ని లోకాలను సృష్టించావు, కనబడే నక్షత్రాలు ఏ ఆధారంతో ఉన్నాయి, అలాంటిది నీకు ఈ జత చెప్పులు కుట్టడం లెక్కా, మరి”, నేను “సాంబయ్య, నువ్వు అనుకున్న విధంగా ఆ చెప్పుల మీద సాంబయ్య అని కూడా రాసినట్టు కుట్టు ఉంది, చూడు “. సాంబయ్య అది చూసుకొని “శివయ్యా, ఎన్నోసార్లు నిన్ను దూషించా నన్ను క్షమించు, మహామహా తపస్సు చేసినవారికి కనిపించవు కదా స్వామి, మరి నాకు కనిపిచావు, నా మీద నీకు ఏ కోపం లేనట్లేగా, అన్నాడు అమాయకంగా “కోపం ఎందుకు సాంబయ్య, నీవు అన్న ఏ మాటలోను తప్పు లేదు, నేవు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఇక వెళ్లు సాంబయ్య నీ మ్రొక్కు తీర్చుకో, ఉత్త్సవానికి వేళయ్యింది”, సాంబయ్య” నీవు యాడికి పోవుగా ఈడనే ఉంటావుగా, ”నేను” ఇక మీద నిన్ను నన్ను ఎవరూ వేరు చేయలేరు, వెళ్లి  నీ స్వహస్తాలతో నాకు చెప్పులు తొడుగు. నిన్ను ఎవరూ ఆపరు,”సాంబయ్య” శివుడు వచ్చే, మ్రొక్కు తీర్చే” అనుకుంటూ పాడుతున్నాడు. ఉత్సవం జరిగే చోటు రాజుగారు “ఏడి చెప్పుల శివ? అతగాడి పుణ్యమా అని నేను శివవాణి విన్నాను”.  భటులను పంపండి, సాంబ కోసం”, ఆలయంలో వేరొక అధికారి “ఊరేగింపు మొదలెడదాము, మళ్ళీ వేళ దాటుతుంది, సాంబయ్య ఎట్లాగో వచ్చినప్పుడూ చెప్పులు వేస్తాడు. ఆ తంతుకి సమయం ఉంది కదా?”, రాజుగారు మాత్రము “సాంబయ్య వచ్చే దాకా ఉత్సవం మొదలైన ఊరేగింపు మొదలు కాదు” అన్నాడు ఆజ్ఞ వేసినట్లు. సాంబయ్య ఆ జత చెప్పులను తీసుకొని, ఇక శివయ్య చెప్పులు వేసుకుంటాడు. ఆ చెప్పులో సాంబయ్య అని కూడా నా పేరు ఉంది, నా మ్రొక్కు తీర్చుకున్నా అని ఆనందపడుతున్నాడు. కానీ శివయ్య నువ్వే నిజమైన నేస్తానివి. సాంబయ్యకి మాత్రము జ్వరం అంతే  ఉంది తనలో ఓపిక క్షీనించుకొని పోతుంది. అతికష్టం మీద అడుగు పడుతుంది. కళ్ళు మూతపడుతున్నాయి. సాంబయ్య తూలుతున్నాడు, కిందపడుతున్నాడు. అతని లక్ష్యం నన్ను చేరుకోవడమే అదే నాకు చెప్పులు వెయ్యడమే. సాంబయ్య “స్వామి ఇక నీవు స్మశానంలో తిరిగిన నాకు ఏమి కాదు, ఎందుకంటే నీకు చెప్పులున్నాయిగా, ఈ రోజు నీకు పెళ్ళి కదా, పార్వతి మాత కూడా సంతోషిస్తుంది, ఎంతోమంది దణ్ణం పెట్టుకునే నీ పాదాలకు ఇక ఏ గాయాలు కావు. శివుని ఆజ్ఞ లేనిదే చెప్పులు కూడా కుట్టలేము” అంటూ గానం చేస్తున్నాడు. కానీ సాంబయ్యకి స్పృహ తప్పుతుంది, దూరం నుండి సాంబయ్యకి ఉత్సవం జరిగే చోటు కనబడుతుంది. అక్కడ ఎవరికీ తోచిన వారు పండగలాగా బాణాసంచాలు,పాటలు,నృత్యాలలో మునిగి ఉన్నారు. సాంబయ్య అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి  కూలబడ్డాడు. మళ్లీ లేచి “శివయ్యా చెప్పులు కుట్టింది కూడా నీవే, కనీసం, నీకు చెప్పులు వేసి అయిన నా మ్రొక్కు తీర్చుకుంటా అంటూ ఎంతో ఓపిక చేసుకొని నడుస్తున్నాడు. మొత్తానికి ఉత్సవం మొదలయ్యింది. అక్కడ కొంతమంది “శివయ్యకి పూజచేస్తే ఇష్టము, నృత్యం అన్నా మరీ ఇష్టము, అందుకే అయన ముందు ఆనందంగా నర్తిద్దాము” అంటూ నృత్యం చేస్తున్నారు.  “శివరాత్రి పండుగ చూడాలంటే మన ఊరిలోనేరా” అంటూ అక్కడి జనాలు వాళ్ళ ఊరు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎలాగో సాంబయ్య ఉత్సవం ముందుకు వచ్చాడు. చెప్పులసాంబ వచ్చాడు అని అక్కడ భటులు ఆ వార్తని రాజుగారికి చేరవేశారు. కాని సాంబయ్య కళ్ళు నా ఉత్సవ విగ్రహం కోసం వెదుకుతున్నాయి.
          రాజు, పంతులుగారు చెప్పులసాంబ దగ్గరికి వచ్చారు. సాంబయ్య మాత్రం స్పృహ తప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజుగారు “సాంబయ్యా నీ పుణ్యమా అని శివుడు నాకు కలలో “ అని మొత్తం చెప్పాడు. సాంబయ్యకి అర్ధం అయ్యింది. ఇప్పుడు తన చేతులతోనే నాకు చెప్పులు తొడగవచ్చు అని. సాంబయ్య ఎవరితో ఏమి మాట్లాడలేకపోతున్నాడు. ఎదురుగా కనబడింది సాంబయ్యకి నా విగ్రహం. అందరికీ విగ్రహం ఐతే సాంబయ్యకి మాత్రము సాక్షాత్తు నేనే కనబడుతున్నాను. సాంబయ్య గుండె “హరహర” అని అంటుంది. సాంబయ్యకి అడుగులో తడబాటు వల్ల నడవలేకపోతున్నాడు. కిందబడిన సాంబయ్య నన్ను చూసి “శివయ్యా, ఇంత వరము ఇచ్చావా? నేను ఏనాడు నీపూజ జేసి ఎరుగను, ఏనాడు నీమీద స్తుతి చేసి ఎరగను, అంటూ ముందుకు నేలమీద దేకుతూ వస్తున్నాడు. శివయ్యా నేను నీవద్దకు వస్తాను అని నేల మీదనుండి వస్తున్నాడు. అందరికి ఏమి అర్ధం కావట్లేదు. చూసేవారు అందరూ సాంబయ్యకి మహాదేవుడు కనబడ్డాడా? అని అనుకుంటున్నారు. రాజుగారు మాత్రము ఉత్సవ విగ్రహం వైపు చూస్తున్నారు, కానీ వారికి విగ్రహమే కనబడుతుంది. సాంబయ్య చిన్నగా నా దగ్గరికి వస్తున్నాడు, వచ్చాడు.. సాంబయ్య “స్వామీ, ఉత్సవంకి ఆలస్యం అయ్యింది, నన్ను క్షమించు స్వామీ?”  నేను “తప్పుచేసిన వారిని క్షమించాలి, నీవు ఏమి తప్పు చేశావు?” సాంబయ్య ఏదో వెతుకుతున్నట్లు తన దగ్గర దాచిన ఏదో పొట్లం బయటకు తీశాడు. ఆ పొట్లంలో నుండి గాజులు బయటకు తీశాడు. ఇంకా పసుపు, కుంకుమ కూడా ఉంది. సాంబయ్య “స్వామి మనం మగపెళ్ళి వారము కదా, ఉత్తచేతులతో ఆడపెళ్లి వారి దగ్గరకు వెళ్ళకూడదు, ఇది నీ చేత్తో అమ్మగారికి ఇచ్చి, గాజులు తొడుగు”. నేను “తప్పకుండా సాంబయ్య, ఇవి లేకుండా ఆలస్యం అంటే ఎలా, వీటి కోసమే చూస్తున్నా”
సాంబయ్య “ఆ ....ఆ ..అవును”
నేను “సాంబయ్య చెప్పులు ఏవి”
సాంబయ్య “ఇదిగో స్వామి, అంటూ రెండు చెప్పులు తీసి నా పాదాలను పట్టుకొని నమస్కారం చేసి ఒక్కఒక్క పాదానికి చెప్పులు తొడిగాడు.
నేను “సాంబయ్యా నీ మ్రొక్కు తీరిందిగా”
          సాంబయ్య “తీరింది స్వామి, మహేశా, సురేశా, పాపవినాశ” అంటూ పాడుతూ తలను నా పాదాలపై వాల్చాడు. “చల్లని స్వామి, ఏది ఎందుకు చేస్తావు, ఈ నిమ్నభక్తుడి మీద ఎందుకు అంత దయ, అంటూ భోరున ఏడ్చి, ఒక్కసారి తలపైకి ఎత్తి, నా మొహాన్ని చూశాడు.
          నేను “చెప్పు సాంబయ్య ఏమికావాలి”
          సాంబయ్య “నాకు ఏమి వద్దు, నీ దగ్గర ఉంటే చాలు” అంటూ నన్ను చూస్తూ నా పాదాలపై తలవాల్చాడు. సాంబయ్య భౌతికంగా చనిపోయాడు. అందరూ ఆ సంఘటనని హృదయ విదారకంగా భావించి సాంబయ్యని తలుచుకున్నారు. ఆటంకం వచ్చినా ఉత్సవం జరపండి అన్న నా మాట రాజుగారికి అర్ధం అయ్యి, ఉత్సవం మొదలుచేసి ఊరేగింపు కొనసాగించారు. సాంబయ్య పార్థివ దేహాన్ని జాగ్రత్త చేశారు రాజు మరియు అతని భటులు. “మహాదేవుడి దర్శనం చేసుకున్న సాంబయ్య ధన్యుడు” అంటున్నారు రాజు మరియు అందరూ....
(కధ కొనసాగుతుంది...)

No comments:

Post a Comment

Pages